గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు..
భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు చేయాల్సిన పనులు కాకుండా చేయకూడని పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రియాశీల పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు నిష్క్రియంగా ఉంటారని అన్నారు.
భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు చేయాల్సిన పనులు కాకుండా చేయకూడని పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రియాశీల పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు నిష్క్రియంగా ఉంటారని అన్నారు. సుప్రీంకోర్టులో గవర్నర్ల అంశంపై ప్రస్తుతం నడుస్తున్న కేసులు విచారకరం అని పేర్కొన్నారామె.
తాజాగా బెంగళూరులో జరిగిన NLSIU-PACT సదస్సులో పాల్గొన్న జస్టిస్ నాగరత్న కీలక అంశాలపై ప్రసంగించారు. గవర్నర్ల తటస్థత గురించి రాజ్యాంగ సభ చర్చలలో జి దుర్గాబాయి చేసిన వ్యాఖ్యలను ఉటంకించిన జస్టిస్ నాగరత్న.. ‘గవర్నర్‌ను పార్టీ రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఉంచడమే పాలకవర్గం బాధ్యత. పార్టీ వ్యవహారాలకు లోబడి గవర్నర్ వ్యవస్థ ఉండకూడదు’ అని అన్నారు.
గవర్నర్ల తీరుపై జస్టిస్ నాగరత్న ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో నల్సార్ యూనివర్సిటీలో చేసిన ఉపన్యాసంలోనూ ఆమె ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘ఒక రాష్ట్రానికి సంబంధించి బిల్లులను ఆమోదించడంలో లేదా వాటిపై అభిప్రాయాన్ని తెలియజేయడంలో గవర్నర్లు ఆలస్యం వహిస్తున్నారని, నిర్లక్ష్యం వహిస్తున్నారనే వ్యాజ్యాలు కోర్టుల్లో అధికమవుతున్నాయి.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్.. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా తమ విధులను నిర్వర్తించాలి. తద్వారా న్యాయస్థానాల్లో ఇలాంటి వ్యాజ్యాలు తగ్గుతాయి. రాజ్యాంగం ప్రకారం వారి విధులను వారు నిర్వర్తించాలని చెప్పే సమయం ఆసన్నమైంది’ అని జస్టిస్ నాగరత్న అన్నారు.
పలు రాష్ట్రాల శాసన సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలిపేందుకు నిరాకరించడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇటీవల కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ గవర్నర్‌లు చాలా నెలలుగా బిల్లులకు ఆమోదం తెలుపడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
వీటిని స్వీకరించిన ధర్మాసం.. నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు సంబంధించిన మరో పిటిషన్‌లో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌కు మినహాయింపు పరిధిని పరిశీలించడానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించింది. తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గవర్నర్లు బిల్లులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని గతంలో సుప్రీంకోర్టు విమర్శించింది. ముఖ్యమంత్రి సిఫార్సు చేసినా మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించినందుకు తమిళనాడు గవర్నర్‌పై కూడా సుప్రీంకోర్టు ఫైర్ అయింది.
Aug 04 2024, 20:21