రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు.. వాళ్ల కుట్రలను అర్థం చేసుకోవాలి: కేటీఆర్
హైదరాబాద్: ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు..
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ మహనీయుడు చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితో కేసీఆర్ లక్షలాది మందిని సమీకరించి 14 ఏళ్లు తెలంగాణ పోరాటాన్ని నడిపించారన్నారు.
రాష్ట్రంలో 1,022 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటి నుంచి బయటకు వచ్చిన లక్షల మంది ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని తెలిపారు..
''హైదరాబాద్‌లో 125 అడుగుల బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అది విగ్రహం కాదు విప్లవం అనే మాట కేసీఆర్ చెప్పారు. సచివాలయానికి ఆ మహనీయుడి పేరు పెట్టాం. మహాత్మా గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు అంబేడ్కర్.
బడుగు బలహీన వర్గాల కోసం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా.. అవన్నీ ఆయన ఆలోచన నుంచి వచ్చినవే. సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి'' అని కేటీఆర్ అన్నారు..
Apr 14 2024, 21:43