ఆలపాటి రాజా వర్సెస్ నాదెండ్ల మనోహర్ గుంటూరు టీడీపీలో ముసలం

గుంటూరు టీడీపీలో ముసలం మొదలైనట్లు కనపడుతోంది. మాజీమంత్రి ఆలపాటి రాజా తన నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది..
టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ కు సీటు కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది.
నాదెండ్లకు సీటు కేటాయిస్తే పార్టీ కేడర్ తలోదారి వెళ్తారని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. దీంతో ఆలపాటి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, అధిష్టానం చెప్పే వరకు వేచి చూడాలంటున్నారు ఆలపాటి రాజా..
వారం రోజుల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు మాజీమంత్రి ఆలపాటి రాజాతో భేటీ అవుతున్నారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తే కనుక అక్కడి నుంచి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఆలపాటి రాజా గత మూడుసార్లు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనుభవం ఉన్న నాయకుడు కూడా. దాదాపుగా 15 సంవత్సరాలుగా కేడర్ పని చేస్తోంది. ఆలపాటికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం తలోదారి వెళ్తామని కేడర్ చెబుతోంది. దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయి. తాజాగా ఆలపాటి రాజా నివాసంలో భేటీ జరిగింది.
తెనాలి నియోజకవర్గంలో మళ్లీ టీడీపీనే పోటీ చేయాలని, ఆలపాటి రాజాకే కచ్చితంగా టికెట్ ఇవ్వాలని కేడర్ కోరుతోంది. అలా కాదని పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తే, నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తే.. ఆయనకు మేము సహకరించేది లేదని స్థానిక నాయకులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా తెనాలి టికెట్ ను జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒకింత ఆందోళన చెందుతున్నారు
అయితే, అప్పుడే తొందరపడొద్దని, టీడీపీ హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూద్దామని కార్యకర్తలతో మాజీమంత్రి ఆలపాటి రాజా చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆలపాటి రాజాకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాల్సిందే అని ఆయనపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం
Jan 16 2024, 19:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.8k