Andrapradesh

Aug 08 2019, 14:11

వైద్యులపై దాడి చేస్తారా?: పవన్‌ 


అమరావతి: జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. జూనియర్ డాక్టర్లను కాలితో తన్నడం, చేయి చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతపై ఇలా చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి తగదన్నారు. జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఎన్నో సేవలందిస్తున్నారని, వారి డిమాండ్‌పై స్పందించకపోగా దాడి చేయడం సబబుకాదన్నారు. ఎన్‌ఎంసీ బిల్లుపై జూనియర్ డాక్టర్లు, వైద్యులు ఆందోళన చేయడంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ తెలిపారు. విజయవాడ, తిరుపతిల్లో చోటు చేసుకున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టి యువ వైద్యుల్లో, వైద్య విద్యార్థుల్లో స్థైర్యాన్ని నింపాలని ప్రకటనలో కోరారు.

Andrapradesh

Aug 08 2019, 14:11

అర్హులైన వారందరికీ ఇళ్లు దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్అర్హులైన పేదలందరికీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం  కింద ఇల్లు పంపిణీ చేసేందుకు అవకాశాలు పరిశీలించవలసిందిగా హౌసింగ్ బోర్డు అధికారులను ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్..

గురువారం పశ్చిమ నియోజకవర్గంలో 41 వ డివిజన్ బాప్టిస్ట్ పాలెం, ఫిలిం గూడెం వీధి తదితర ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు ..
ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు...
పూర్ణానంద పేట కెనాల్ వెంబడి రోడ్డు పక్కన చెక్క పెట్టెలు తయారు చేసి జీవనం సాగించేవారు... మంత్రిని కలిసి ఇల్లు లేక నిలువ నీడ లేక పలు ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డు వెంబడి మీము పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హౌసింగ్ బోర్డు అధికారులతో మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కేటాయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించవలసిందిగా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కత్తి రామయ్య, పొన్నూరు వారి వీధి, లక్ష్మణ్ రావు వీధి, సాయిబాబు గుడి ప్రాంతం, గంటి వారి వీధి ప్రాంతాల్లోని సిసి రోడ్ల నిర్మాణం చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు, అంబేద్కర్ విగ్రహం వద్దన్న మున్సిపల్ హై స్కూల్ శిధిలము కావడంతో ఆందోళన చెందుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి వివరించడంతో త్వరలో స్కూల్ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు ..
పర్యటనలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, 
వైఎస్ఆర్సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్య శిల, మాజీ కార్పొరేటర్ అప్పాజీ,41 డివిజన్ వైఎస్ఆర్ సీపీ నాయకులు కిషోర్, బలసాని కిరణ్, పొలిమెట్ల శరత్, బండి,రాజ్ కుమార్, శంకర్ రెడ్డి మరియు నగర పాలక సంస్థ అధికారులు ఈ ఈ కోటేశ్వరరావు ae, హెల్త్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Andrapradesh

Aug 08 2019, 14:04

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక


రాజమహేంద్రవరం: ఎగువ ప్రాంతాల్లో కురుసున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద నీరు పోటెత్తుతోంది. గంటగంటకూ నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. డెల్టాకాల్వలకు 7000క్యసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వరద నిలకడగా ఉంది. పోలవరం, వేలేరుపాడు మండలంలోని 36 గ్రామాలు ముంపులోనే ఉన్నాయి.

Andrapradesh

Aug 08 2019, 14:03

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి

 తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయం వద్ద విశేషంగా విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ చేపట్టారు. రూ.500/- చెల్లించి వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు(ఇద్దరు) ఒక ఉత్తరియం, ఒక రవికె, రెండు లడ్డూలు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెల్లవారుజామున 1.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మెల్కొలిపి, సహస్రనామ అర్చన, నిత్యఅర్చన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 3.30 నుంచి 5 గంటల వరకు అమ్మవారి మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.00 నుండి 12.00 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 గంటలకు భక్తుల భజనలు, కోలాటాల నడుమ అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్సేవలను రద్దు చేశారు.

Andrapradesh

Aug 08 2019, 14:02

మహిళా భద్రత కోసం మహిళా మిత్ర సేవలను ప్రారంభించిన హోం మంత్రి

విశాఖపట్నం : మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఒక్క బటన్ నొక్కితే చాలు.. పోలీసులకు చేరే విధంగా త్వరలోనే యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శత్రువు ఎక్కడో లేడు.. మన పక్కనే సెల్ఫోన్ రూపంలో ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నారుల రక్షణకై ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మిత్రలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా హోం మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనితతో కలిసి విశాఖపట్నంలో మహిళా మిత్ర సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ..‘ టెక్నాలజీ అభివృద్ధి తో పాటు సమస్యలు ఎక్కువయ్యాయని అభిప్రాయపడ్డారు. సెల్ఫోన్ ద్వారా మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారం మొత్తం నేరస్తులకు వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా నేరస్తుల బెదిరింపులు... బ్లాక్మెయిల్కు దారితీసి, చివరకు మహిళల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలొనే మహిళల భద్రత కోసం సైబర్ మిత్రను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళా భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను మహిళలకు కేటాయించి ప్రాధాన్యమిచ్చారని సుచరిత గుర్తు చేశారు.
వారి కోసమే సైబర్ మిత్ర, మహిళా మిత్ర : అధిక సంఖ్యలో మహిళలు, యువతులు, విద్యార్ధినులు సైబర్ స్పేస్లో సమస్యలు ఎదురుకొంటున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. తమకు తెలియకుండానే నేరస్తుల నుంచి మెసేజ్లు, బెదిరింపులు ఎదుర్కోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోతూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మహిళల భద్రతకై రాష్ట్ర ప్రభుత్వం సైబర్ మిత్ర, మహిళా మిత్ర సేవలను అమల్లోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

Andrapradesh

Aug 08 2019, 14:00

బిల్లు ఉపసంహరించుకోకపోతే ఉద్యమం ఉధృతం :జూడాలు

వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగుల పడిగాపులు
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ విజయవాడ బిఆర్టీఎస్‌ రోడ్డులో జూనియర్‌ డాక్టర్లు భారీ ర్యాలీ చేపట్టారు.ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) పిలుపు మేరకు నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుప్రతుల్లో గురువారం వైద్య సేవలు నిలిపివేశారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేవిధంగా ఎన్‌ఎంసీ బిల్లు ఉందని తెలిపారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో 50 శాతం సీట్ల కేటాయింపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బిల్లును ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
బిల్లులోని లోపాలను సవరించాలి: 
నెల్లూరు: నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ నగరంలోని కలెక్టరేట్‌ ముందు జూనియర్‌ డాక్టర్లు ధర్నానిర్వహించారు. కేంద్రం జోక్యం చేసుకుని ఎన్‌ఎంసీ బిల్లులోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
తిరుపతి రుయా ఆసుప్రతిలో రోగుల పడిగాపులు:
తిరుపతి: ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్‌ వైద్యులు సమ్మె చేపట్టడంతో తిరుపతి రుయా ఆసుప్రతిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. బిల్లును వెంటనే రద్దు చేయాలని జూడాలు డిమాండ్‌ చేశారు. గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లతో పాటు ప్రవేట్ వైద్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. గురువారం వైద్య సేవలను నిలిపి వేశారు. జూడాలు సమ్మెకు దిగడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా.. ఆర్థిక స్తోమత లేనివారు ఆసుపత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు కేంద్రానికి వ్యతిరేకంగా జూడాలు తమ నిరసన కొనసాగిస్తున్నారు

Andrapradesh

Aug 08 2019, 13:59

శ్రీశైలం డ్యామ్ కు భారీగా చేరుతున్న వరద నీరు

నాగార్జున సాగర్‌ జలాశయాలకు నీరు విడుదల
కర్నూలు: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 3,04,097 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా, శ్రీశైలం డ్యామ్ కు 3,47,199 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. మొత్తం ఔట్‌ ఫ్లో 96,210 గా నమోదయింది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.30 అడుగులు కొనసాగుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 165.1436 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం 96,210 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ జలాశయాలకు విడుదల చేస్తున్నారు.

Andrapradesh

Aug 08 2019, 13:58

మనస్ఫూర్తిగా కియాను అభినందిస్తున్నా: చంద్రబాబు  

గుంటూరు: దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియ పరిశ్రమ మేడిన్‌ ఇండియా పేరుతో తయారు చేసిన తొలి కారును గురువారం ప్రారంభించనుంది. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కియా మొదటి కార్ ఇవాళ రోడ్డుపైకి వస్తున్న సందర్భంగా మనస్ఫూర్తిగా కియాను అభినందిస్తున్నానని అన్నారు. ఆటో మొబైల్ రంగంలో కియా ఒక నూతన ట్రెండ్ తీసుకురావాలని ఆకాంక్షించారు. కియా కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కియా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని, కియా సంస్థ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.

Andrapradesh

Aug 08 2019, 09:23

పోలవరంపై ఏపీకి కేంద్రం షోకాజ్‌ నోటీసులుజారి 

 

 
ఢిల్లీ: పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా కేంద్రం వివరణ కోరింది. 2005లో పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించినట్లు కేంద్రం నిర్థారించింది. అలాగే పోలవరం, అనుబంధ ప్రాజెక్ట్‌లపై కేంద్ర పర్యావరణశాఖ తనిఖీలు నిర్వహించింది. పోలవరం ప్రాజెక్ట్‌లో పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించారంటూ చెన్నై పర్యావరణశాఖ అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఇటీవలే స్టాప్‌వర్క్ ఆర్డర్లపై స్టేను కేంద్రం రెండేళ్లు పొడిగించింది. కానీ మళ్లీ అనూహ్యంగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Andrapradesh

Aug 07 2019, 19:25

ముగిసిన సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు  

విదేశాంగ శాఖ మాజీ మంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ పార్ధివదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ .. లోధి రోడ్డులోని స్మశాన వాటికలో సుష్మాస్వరాజ్ అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఆమె భర్త స్వరాజ్ కౌశల్ సమక్షంలో…  ఆమె కూతురు బన్సూరీ అంజలి .. సుష్మాస్వరాజ్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

వెంకయ్య భావోద్వేగం

లోథి స్మశాన వాటికలో సుష్మా స్వరాజ్ కు ప్రధాని మోడీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య, అగ్రనేత అద్వానీ, హోంశాఖ మంత్రి అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ సహా.. కేంద్రమంత్రులు చివరిసారి నివాళులు అర్పించారు. సుష్మ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచిన వెంకయ్య.. మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు.

ఢిల్లీ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. పోలీసుల గౌరవ వందనం తర్వాత సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఎలక్ట్రిక్ క్రీమేషన్ పద్ధతిలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు పూర్తిచేశారు.