అల్లు అర్జున్ టీం రూ 2 కోట్ల ఆర్దిక సాయం
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి పుష్ఫ -2 టీం ఆర్దిక సాయం ప్రకటించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ .. దిల్ రాజుతో కలిసి పరామర్శించారు. శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే పుష్ప తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి మూవీ టీం రూ.2 కోట్ల పరిహారం ప్రకటించారు. హీరో అల్లు అర్జున్ తో పాటుగా సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ మొత్తం సాయంగా ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ తోనూ సమావేశం కానున్నట్లు దిల్ రాజు వెల్లడించారు.
పుష్ప -2 ప్రీమియర్ షో వేళ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట లో మరణించిన రేవతి కుటుంబానికి సినిమా టీం రూ 2 కోట్ల ఆర్దిక సాయం ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ చికిత్స చూసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో అల్లు అర్జున్ రూ 25 లక్షల సాయం ప్రకటించారు. కాగా, అల్లు అరవింద్ ఇప్పుడు దిల్ రాజుతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పై వైద్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని.. కానీ, క్రమేణా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.
ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ 25 లక్షల సాయం అందించారు. ఇక, ఇప్పుడు అల్లు అరవింద్ ఆస్పత్రికి వచ్చి పుష్ఫ -2 టీం నుంచి రూ 2 కోట్లు బాధిత కుటుంబానికి ఇస్తున్న ట్లు వెల్లడించారు. ప్రకటించిన ఆర్దిక సాయం లో అల్లు అర్జున్ రూ. కోటి, సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఇస్తున్నట్లు వివరించారు. సుకుమార్ ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు. బాలుడి తండ్రి సైతం తమకు అందిన సాయం గురించి వివరించారు. బాలుడు కోలుకోవాలని కోరుకుంటున్నట్లు అల్లు అరవింద్ ఆకాంక్షించారు. ఇటు, దిల్ రాజు ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
అందులో భాగంగా త్వరలోనే సీఎం రేవంత్ ను సినీ పెద్దలు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ తండ్రికి సినీ ఇండస్ట్రీలో ఉపాధి కల్పిస్తామని ఇప్పటికే దిల్ రాజు హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదం పైన సినీ పెద్దలు ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ తో సినీ పరిశ్రమ పెద్దలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జరిగిన ఘటన పైన చర్చతో పాటుగా ప్రభుత్వం ప్రకటించిన బెనిఫిట్ షో రద్దు .. టికెట్ ధరల పెంపు ఉండదనే నిర్ణయం పైనా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో, సీఎం రేవంత్ స్పందన కీలకంగా మారనుంది.
Dec 25 2024, 15:24