కేసీఆర్‌ హరీశ్‌కు హైకోర్టులో ఊరట

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. జిల్లా కోర్టు తన అధికార పరిధిని మీరి వ్యవహరించిందని పేర్కొంది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్‌ తదితరుల అవినీతే కారణమని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి మొదట భూపాలపల్లి మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దాన్ని విచారించే పరిధి తమకు లేదంటూ ఆ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఫిర్యాదుదారు భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించే అధికార పరిధి జిల్లా కం సెషన్స్‌ కోర్టుకు లేదని కోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది.

అయితే ఈ అభ్యంతరాలను పరిశీలించిన జిల్లా కోర్టు... పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ వివరణ ఇవ్వాలని కేసీఆర్‌, హరీశ్‌రావు, అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు హరిరామ్‌, శ్రీధర్‌, మేఘా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌, హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది టీవీ రమణారావు వాదిస్తూ సీఆర్పీసీకి విరుద్ధంగా రివిజన్‌ పిటిషన్‌ను జిల్లా కోర్టు స్వీకరించిందని తెలిపారు. జిల్లా కోర్టు జూలై 10న ఇచ్చిన ఆదేశాలను, నోటీసులను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇది పిటిషనర్లకు ప్రైవేటు ఫిర్యాదుదారుకు మధ్య వ్యవహారమని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని వ్యాఖ్యానించింది. రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేస్తూ విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.

అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల పిటిషన్

సంధ్య థియేటర్ ఘటనపై కేసులో పోలీసులు దర్యాప్తు ను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

అయితే, అల్లు అర్జున్ మీడి యా సమావేశం ఏర్పాటు చేసి సంధ్య థియేటర్ ఘటనలో తన తప్పు ఏమీలేదని చెప్పాడు. దీంతో అర్జున్ మీడియా సమావేశం పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలు ఉల్లంఘిం చారని పేర్కొంటున్నారు. 

ఈ క్రమంలో ఆయన బెయిల్ రద్దుపై పోలీసులు అప్పీల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తీరుపైనా పోలీసులు అసంతృప్తితో ఉన్నారు. 

రేవతి మృతి తెలిసి కూడా తెలియదని అల్లు అర్జున్ చెప్పడం ఆయన విచక్షణకే వదిలేయాలని ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. థియేటర్లో ఉన్న అల్లు అర్జున్ కు పోలీసులు విషయం చెప్పారని కానీ, రేవంతి మృతి మరుసటి రోజు తెలిసిందని అల్లు అర్జున్ మాట మార్చా డంటూ సీపీ పేర్కొన్నారు

మీడియా సమావేశంలో సంధ్య థియేటర్ ఘటన సమయంలో వీడియోలను ప్రదర్శిస్తూ సీపీ ప్రజెంటేషన్ ఇచ్చారు. న్యాయపరంగా అల్లు అర్జున్ కేసును ఎదుర్కొంటామని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. 

ఈ క్రమంలో పోలీసులు ఆరుగురు ఓయూ జేఏసీ నేతలను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్జున్ నివాసం వద్ద జరిగిన ఘటనపై డీజీపీకి ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి, ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు.

బీజేపీ ఎంపీని నెట్టేసినందుకు రాహుల్ గాంధీ జైలుకు వెళ్తారా

రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినప్పుడు సారంగి తనను నెట్టారని ఆరోపించారు. అయితే పార్లమెంటు ఆవరణలో ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు విషయానికి వస్తే రూల్ ఏం చెబుతోంది

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ తమ పార్టీ ఎంపీలను తనపై నెట్టడం వల్లే తాను మెట్లపై పడిపోయానని.. తనకు గాయలయ్యాయని బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగి ఆరోపించారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లోకి వెళ్లే క్రమంలో తనను నెట్టారని సారంగి ఆరోపించారు. అయితే పార్లమెంటు ఆవరణలో ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు విషయానికి వస్తే రూల్ ఏం చెబుతున్నాయి

పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల తోపులాట మధ్య బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగీ కిందపడటం, ఆయనకు గాయలవడంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే నిబంధనల ప్రకారం ఈ కేసులో వీడియో సాక్ష్యం లేకపోతే సారంగి మాటలు రాహుల్ గాంధీ చెబుతున్నదానికి వ్యతిరేకంగా మాత్రమే అవుతుందంటున్నారు. అందుకే ఈ కేసులో పక్కా ఆధారాలు ఉండాలి. ఈవిషయంపై లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి పిడిటి ఆచార్య మాట్లాడుతూ ఇక్కడ అత్యంత ముఖ్యమైన వీడియో సాక్ష్యం ఉండాలని లేకపోతే ఒక ఎంపీ ఆరోపణలతో మరో ఎంపీ కౌంటర్ ఇవ్వడమే అవుతుంది తప్ప నేరం నిరూపించలేమన్నారు.

కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు

గత ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్

నిధుల దుర్వినియోగం జరిగిందంటున్న రేవంత్ సర్కారు

కేసు నమోదు చేసిన ఏసీబీ... ఏ1గా కేటీఆర్

దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలన్న హరీశ్ రావు

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ సందర్భంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం మంచి పనులు చేస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రేవంత్ రెడ్డి గానీ ఈ ప్రభుత్వం గానీ మేమేదైనా ప్రశ్నిస్తే. మమ్మల్ని దబాయించడం ఎంక్వైరీ పేరిట అక్రమ కేసులు పెట్టడం... ఇదే కదా మీరు చేసేది అంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ తో హైదరాబాద్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయికి పెంచిన వ్యక్తి కేటీఆర్ అని కొనియాడారు. అటువంటి వ్యక్తిపై మీరు పెట్టిన కేసులో నిజం ఉందని అనుకుంటే... దమ్ముంటే ఆ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రానికి మంచి పేరు రావాలనే కేటీఆర్ ఈ-కార్ రేసింగ్ జరపాలని నిర్ణయం తీసుకున్నారని, రేవంత్ ప్రభుత్వానికి భయం లేకపోతే ఈ శాసనసభలో రేపు గానీ ఎల్లుండి గానీ చర్చ చేపట్టాలని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో ఇక‌పై వారికి నో ఎంట్రీ మీడియాపై కూడా ఆంక్ష‌లు

అసెంబ్లీ ఇన్న‌ర్ లాబీలోకి మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల ప్ర‌వేశంపై నిషేధం

మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు ఇన్న‌ర్ లాబీలోకి నో ఎంట్రీ అంటూ బోర్డులు

అలాగే అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఎలాంటి వీడియో తీయ‌రాద‌ని మీడియాకు ఆదేశాల జారీ

తెలంగాణ అసెంబ్లీలో సోమ‌వారం నుంచి ప‌లు ఆంక్ష‌లు విధించారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఇన్న‌ర్ లాబీలోకి మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ ప్రవేశంపై నిషేధం విధించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు ఇన్న‌ర్ లాబీలోకి నో ఎంట్రీ అంటూ బోర్డులు వెలిశాయి. 

అలాగే మీడియాపై కూడా ప‌లు ఆంక్ష‌లు విధించారు. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఎలాంటి వీడియో తీయ‌రాద‌ని ఆదేశాలు జారీ చేశారు. కాగా, అసెంబ్లీలో కాంగ్రెస్ స‌ర్కార్ ఆంక్ష‌లు విధించ‌డం ప‌ట్ల మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ చరిత్ర‌లోనే తొలిసారి మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఇన్న‌ర్ లాబీలోకి అనుమ‌తించ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

హైదరాబాద్ గజగజ - ఆరేళ్ల రికార్డు బిగ్ అలర్ట్

హైదరాబాద్ నగరం గజగజ వణుకుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దాదాపు ఆరేళ్ల తరువాత ఈ స్థాయిలో చలి వణికిస్తోంది. నగరంలోని శివారు ప్రాంతాలతో పాటుగా పలు జిల్లాల్లోనూ ఇదే విధంగా చలి గాలులు వీస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. చలి గాలుల తీవ్రత పైన వాతావరణ శాఖ తాజా అంచనాలు వెల్లడించింది. ఈ సమయంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అలర్ట్ చేస్తున్నారు.

తెలంగాణలో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో ఉదయం వేళ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలి గాలులు భయపెడుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని బేలాలో అత్యంత కనిష్ఠంగా 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ లో ఆరేళ్ల తరువాత ఈ స్థాయిలో చలి భయపెడుతోంది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే నమోదయ్యాయి. మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

అదే విధంగా హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట, కూకట్‌పల్లి, గోల్కొండ, సఫిల్‌గూడ, హయ త్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, ఆదర్శనగర్ తదితర ప్రాంతాల్లో 13 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. తిరుమలగిరిలో 13.6 డిగ్రీల సెల్సియస్‌, చెర్లపల్లిలో 13.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (నిర్మల్) తాండ్రలో 6.3 డిగ్రీలు, (ఆదిలాబాద్) పొచ్చర 6.4, జైనథ్ (ఆదిలాబాద్) 6.5, అర్లి (టి) (ఆదిలాబాద్) 6.6, చాప్రాల్ (ఆదిలాబాద్) 6.6, సత్వార్ (సంగారెడ్డి) 6.6, బంట్వారం (వికారాబాద్‌) 6.7సంగారెడ్డి ) 6.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలి పంజా విసురుతోంది. ఎలిమినేడు (రంగారెడ్డి) 6.7, సిర్పూర్ (యు) (ఆసిఫాబాద్) 6.7, చందనవల్లి (రంగారెడ్డి) 6.7, కోహీర్ (సంగారెడ్డి) 6.7, మర్పల్లి (వికారాబాద్) 6.8, నాగారం (టి) (వికారాబాద్) 6.8, మన్నెగూడ (వికారాబాద్) 6.8 (వికారాబాద్) సంగారెడ్డి) 6.8, పోతారెడ్డిపేట (సిద్దిపేట)లో 6.9 డిగ్రీల సెల్సియస్, జహీరాబాద్ (సంగారెడ్డి) 6.9 డిగ్రీల సెల్సియస్, మేనూరు (కామారెడ్డి)లో 6.9 డిగ్రీల సెల్సియస్, రాఘవపేటలో (జగిత్యాల) 7.3 డిగ్రీల సెల్సియస్, కెరమెరిలో (ఆసిఫాబాద్) 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ సమయంలో వృద్ధులు.. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

నేడు భూమికి సమీపం నుంచి దూసుకుపోనున్న రెండు గ్రహశకలాలు

ఇవాళ (సోమవారం) రెండు భారీ గ్రహశకలాలు భూమికి సమీపం నుంచి ప్రయాణించనున్నాయి. ఒకదాని పేరు ‘2024 ఎక్స్‌వై5’ కాగా, రెండవది ‘2024 ఎక్స్‌బీ6’ అని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్ధారించింది. ఈ రెండు డిసెంబర్ 16న భూమి వైపు దూసుకురానున్నాయని తెలిపింది. అయితే, భూమికి ఎలాంటి ముప్పులేదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రహశకలాల ట్రాకింగ్, అప్రమత్తత విషయంలో అవగాహన పొందవచ్చని వివరించారు.

భూమి సమీపానికి రానున్న రెండు గ్రహశకలాల్లో ఒకటైన ‘2024 ఎక్స్‌వై5’ పరిమాణం 71 అడుగుల వెడల్పు ఉంది. గంటకు 10,805 మైళ్ల వేగంతో వెళ్లే ఈ గ్రహ శకలం, భూమికి దాదాపు 2,180,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. చంద్రుడి దూరం కంటే 16 రెట్లు ఎక్కువ దూరం నుంచి ఈ గ్రహశకలం వెళ్లనుంది. 

ఇక ‘2024 ఎక్స్‌వై’ కంటే ‘2024 ఎక్స్‌బీ6’ గ్రహశకలం కొంచెం చిన్నది. దీని వ్యాసం 56 అడుగులుగా ఉంది. గంటకు 14,780 మైళ్ల వేగంతో భూమికి దాదాపు 4,150,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుందని నాసా తెలిపింది. ఇలాంటి గ్రహశకలాలు సౌర వ్యవస్థ ఆరంభానికి సంబంధించినవని, ఇవి సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇలాంటి గ్రహశకలాలను అధ్యయనం చేస్తే భూమి మూలాలు, విశ్వం చరిత్రకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని నాసా శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, భూమికి సమీపంలో ఉన్న వస్తువులను పర్యవేక్షించడానికి అధునాతన వ్యవస్థలను నాసా ఉపయోగిస్తుంది.

మోహన్ బాబు అరెస్ట్‌పై పోలీసుల క్లారిటీ

జర్నలిస్ట్‌పై దాడి నేపథ్యంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆయన ఆశ్రయించారు. కాని బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఎపిసోడ్‌లో ట్విస్ట్ కాదు బిగ్ ట్విస్ట్ కొనసాగుతోంది. మంచు ఫ్యామిలీలో ఇటీవల వరసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ వ్యవహార శైలితో.. ఆ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నట్లు స్పష్టమైంది. దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ క్రమంలో చిన్న కుమారుడు మనోజ్‌ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు.

మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని..దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎక్కడ ఆలస్యం లేదని స్పష్టం చేశారు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలని చెప్పారు.మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చామని.. ఈ నెల 24 వ తేదీ వరకు సమయం అడిగారని తెలిపారు. 24వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు కూడా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. 24వ తేదీ లోపు ఎగ్జామిన్ చేయొచ్చా లేదా అనే విషయం గురించి కోర్టును అడుగుతామని అన్నారు.రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్ లేవని తేల్చిచెప్పారు. మోహన్ బాబు వద్ద రెండు గన్స్ ఉన్నాయన్నారు. డబుల్ బ్యారెల్ ఒకటి .స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉందని వివరించారు. మోహన్ బాబుకు మరోసారి నోటీస్ ఇస్తామని తెలిపారు. 126 BNSS ద్వారా ఆయన సమయం అడగవచ్చు అని అన్నారు. మరోవైపు నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.

మంచు ఫ్యామిలీలో ఇటీవల ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఏదో జరుగుతుందంటూ ప్రచారం జరిగింది. దీంతో శంషాబాద్ మండలంలోని జల్‌పల్లిలో మోహన్ బాబు నివాసంలోకి మంచు మనోజ్ బలవంతంగా వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో క్లిప్ విడుదల చేశారు. అదే సమయంలో మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు.. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు.

ఇంతలో విలేకర్ల సమావేశంలో మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారు. ఆ క్రమంలో ఓ మీడియా ఛానెల్ జర్నలిస్ట్‌పై ఆయన దాడి చేశారు. ఈ ఘటనపై జర్నలిస్ట్‌లు నిరసన బాట చేపట్టారు. ఈ నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు అయింది. ఇంతలో మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి..బుధవారం సాయంత్రం.. అంటే డిసెంబర్ 11వ తేదీ మీడియా ముందుకు వచ్చి.. అన్ని విషయాలు వివరిస్తానని ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు అయింది.

హత్యాయత్నం కేసు నమోదు కావడంతో.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కానీ మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్‌కు సంబంధించిన విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకోనేందుకు మోహన్ బాబు అజ్జాతంలోకి వెళ్లారంటూ ఓ చర్చ అయితే వాడి వేడిగా జరుగుతోంది. అలాంటి వేళ.. తాను ఎక్కడికి వెళ్లలేదంటూ మోహన్ బాబు ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. అనంతరం ఆయన్ని పోలీసులు విచారిస్తున్నారు.

వారంలో 70 గంటలు పనిచేయాల్సిందే

భారతదేశ యువత కచ్చితంగా వారంలో 70 గంటలు పని చేయాలని గతంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు రాజకీయ, వ్యాపారవేత్తలు, టెకీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు మరోసారి మూర్తి.. తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు.

ఇన్ఫోసిస్ సహ- వ్యవస్థాపకులు, దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎన్ఆర్ నారాయణ మూర్తి.. ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్నారని చెప్పొచ్చు. ఆ మధ్య భారత యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు మాత్రమే భారతదేశం.. అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ మాదిరిగా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీనిపై పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, టెకీలు స్పందించారు. వీరి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పొచ్చు. ఇక యువత నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

దీనిపై మళ్లీ మళ్లీ నారాయణ మూర్తి.. తన వ్యాఖ్యల్ని సమర్థించుకోగా ఆయన సతీమణి సుధా మూర్తి కూడా ఆయన వ్యాఖ్యలకు పూర్తి అర్థం వివరించారు. ఆయన అప్పట్లో అలానే పనిచేసేవారని.. ఇప్పుడూ అదే నమ్ముతారని అన్నారు. ఈ క్రమంలోనే మరోసారి పని వేళల అంశంపై నారాయణ మూర్తి మాట్లాడారు. తన వ్యాఖ్యల్ని మరోసారి సమర్థించుకున్నారు. వారంలో కనీసం 70 గంటలు పని చేయకుంటే.. మన దేశంలో పేదరికాన్ని ఎలా అధిగమిస్తామని ప్రశ్నించారు.

కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ మూర్తి.. 'ఇన్ఫోసిస్‌ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. ఇలా పోల్చుకుంటేనే భారతీయులు చేయాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తుంది. భారత్‌లో ఇంకా 80 కోట్ల మంది ఫ్రీ రేషన్ అందుకుంటున్నారు. అంటే ఇంకా 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా.' అని వ్యాఖ్యానించిన మూర్తి.. అందుకే ఆశలు, ఆకాంక్షల్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోవాలని.. వారంలో 70 గంటలు పనిచేయకుంటే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలమని అన్నారు. అందుకే.. భవిష్యత్తు కోసమే అంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ హోస్ట్‌గా వ్యవహరించిన ది రికార్డ్ అనే ఒక పాడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్‌లో నారాయణ మూర్తి పాల్గొన్నారు. అక్కడే ఈ పని గంటలపై తొలిసారి మాట్లాడారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో చూస్తే.. భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉందని.. అందుకే భారత యువత మరికొన్ని గంటలు ఎక్కువగా శ్రమించాలన్నారు. ఆ దేశాలతో పోటీపడాలంటే భారత్‌లో యువత ఇకపై వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు. ఇక కొందరు దీనిపై ఉద్యోగ జీవితంలోని ఇబ్బందుల్ని లేవనెత్తగా.. ఇంకొందరు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగిందంటూ అవాస్తవ ఆరోపణలతో ఆయన దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)పై పోక్సో కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద తనపై పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగిందంటూ అవాస్తవ ఆరోపణలతో ఆయన దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రావారిపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వాస్తవానికి బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినా పోలీసులు వివరాలు బహిర్గతం చేయలేదు. వివరాల్లోకి వెళ్తే.. పదో తరగతి చదువుతున్న దళిత మైనర్‌ బాలిక స్కూలు నుంచి ఇంటికి వచ్చే దారిలో గాయాలతో పడి ఉండటం సంచలనంగా మారింది. ఆ బాలికపై అత్యాచారం జరిగిందంటూ వైసీపీకి చెందిన మాజీ మంత్రి రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు హడావుడి చేశారు.

అసత్యాలు ప్రచారం చేసి తన బిడ్డ భవిష్యత్‌ను పాడు చేయవద్దని బాలిక తండ్రి వేడుకున్నా లాభం లేకపోయింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. బాలికను తొలుత పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది అమ్మాయికి చికిత్స చేస్తుండగా ఆ గదిలోకి మండల వైసీపీ కన్వీనర్‌ దేవపట్ల నాగార్జునరెడ్డి వంద మందికిపైగా అనుచరులతో వచ్చారు. చికిత్స చేయకుండా అడ్డుకున్నారు. బాలికపై అత్యాచారం జరిగిందని, తాము అండగా ఉంటామని హడావుడి చేశారు.

కాసేపటికే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులతో కలసి అక్కడకు చేరుకుని బాలిక తండ్రితో ఏమీ మాట్లాడకుండానే.. అత్యాచారం జరిగినట్లు రాసేయాలని చెప్పారు. అత్యాచారం జరగలేదని తండ్రి చెబుతున్నా వినిపించుకోలేదు. బాలికను మెరుగైన వైద్యం కోసం అదే రోజు రాత్రి తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసు, రెవెన్యూ అధికారుల ఎదుట ఆ బాలిక తనపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేసింది. అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చారు. వారి ప్రకటనల ఆధారంగా బాలికపై అత్యాచారం జరిగిందని ఓ పత్రికలో, వైసీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. తన కుమార్తెను వేధించిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా వైసీపీ నాయకులు, ఓ పత్రిక, వారికి సంబంధించిన సోషల్‌ మీడియా వాస్తవాలు తెలుసుకోకుండా తమ పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వ్యవహరించారని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలతో తమ గ్రామంలో తమ కులానికే చెందిన రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

తాము దళితులమని తెలిసి కూడా తమ వివరాలను బహిర్గతం చేసి సమాజంలో తలెత్తుకోనివ్వకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మైనర్‌ బాలిక అని తెలిసినా తన కుమార్తె ఆస్పత్రిలో చిరిగిన బట్టలతో చికిత్స చేయించుకుంటున్న ఫొటోలు తీసి మీడియాలో చూపించడం ద్వారా తమ గోప్యతను దెబ్బతీశారని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మైనర్‌ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎర్రావారిపాలెం పోలీసులు కేసు (క్రైమ్‌ నంబరు 58/2024) నమోదు చేసి ఏ-1గా ఎర్రావారిపాలెం మండలం వైసీపీ కన్వీనర్‌ దేవపట్ల నాగార్జున రెడ్డి, ఏ-2గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్లు చేర్చారు. ఎంపీ గురుమూర్తి, రోజా, భూమన, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డిని కూడా నిందితులుగా చేర్చే అవకాశాలు ఉన్నాయి.