కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు
గత ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్
నిధుల దుర్వినియోగం జరిగిందంటున్న రేవంత్ సర్కారు
కేసు నమోదు చేసిన ఏసీబీ... ఏ1గా కేటీఆర్
దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలన్న హరీశ్ రావు
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ సందర్భంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం మంచి పనులు చేస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి గానీ ఈ ప్రభుత్వం గానీ మేమేదైనా ప్రశ్నిస్తే. మమ్మల్ని దబాయించడం ఎంక్వైరీ పేరిట అక్రమ కేసులు పెట్టడం... ఇదే కదా మీరు చేసేది అంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ తో హైదరాబాద్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయికి పెంచిన వ్యక్తి కేటీఆర్ అని కొనియాడారు. అటువంటి వ్యక్తిపై మీరు పెట్టిన కేసులో నిజం ఉందని అనుకుంటే... దమ్ముంటే ఆ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రానికి మంచి పేరు రావాలనే కేటీఆర్ ఈ-కార్ రేసింగ్ జరపాలని నిర్ణయం తీసుకున్నారని, రేవంత్ ప్రభుత్వానికి భయం లేకపోతే ఈ శాసనసభలో రేపు గానీ ఎల్లుండి గానీ చర్చ చేపట్టాలని అన్నారు.
Dec 19 2024, 20:27