వారంలో 70 గంటలు పనిచేయాల్సిందే
భారతదేశ యువత కచ్చితంగా వారంలో 70 గంటలు పని చేయాలని గతంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు రాజకీయ, వ్యాపారవేత్తలు, టెకీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు మరోసారి మూర్తి.. తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు.
ఇన్ఫోసిస్ సహ- వ్యవస్థాపకులు, దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎన్ఆర్ నారాయణ మూర్తి.. ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్నారని చెప్పొచ్చు. ఆ మధ్య భారత యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు మాత్రమే భారతదేశం.. అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ మాదిరిగా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీనిపై పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, టెకీలు స్పందించారు. వీరి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పొచ్చు. ఇక యువత నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
దీనిపై మళ్లీ మళ్లీ నారాయణ మూర్తి.. తన వ్యాఖ్యల్ని సమర్థించుకోగా ఆయన సతీమణి సుధా మూర్తి కూడా ఆయన వ్యాఖ్యలకు పూర్తి అర్థం వివరించారు. ఆయన అప్పట్లో అలానే పనిచేసేవారని.. ఇప్పుడూ అదే నమ్ముతారని అన్నారు. ఈ క్రమంలోనే మరోసారి పని వేళల అంశంపై నారాయణ మూర్తి మాట్లాడారు. తన వ్యాఖ్యల్ని మరోసారి సమర్థించుకున్నారు. వారంలో కనీసం 70 గంటలు పని చేయకుంటే.. మన దేశంలో పేదరికాన్ని ఎలా అధిగమిస్తామని ప్రశ్నించారు.
కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ మూర్తి.. 'ఇన్ఫోసిస్‌ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. ఇలా పోల్చుకుంటేనే భారతీయులు చేయాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తుంది. భారత్‌లో ఇంకా 80 కోట్ల మంది ఫ్రీ రేషన్ అందుకుంటున్నారు. అంటే ఇంకా 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా.' అని వ్యాఖ్యానించిన మూర్తి.. అందుకే ఆశలు, ఆకాంక్షల్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోవాలని.. వారంలో 70 గంటలు పనిచేయకుంటే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలమని అన్నారు. అందుకే.. భవిష్యత్తు కోసమే అంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ హోస్ట్‌గా వ్యవహరించిన ది రికార్డ్ అనే ఒక పాడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్‌లో నారాయణ మూర్తి పాల్గొన్నారు. అక్కడే ఈ పని గంటలపై తొలిసారి మాట్లాడారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో చూస్తే.. భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉందని.. అందుకే భారత యువత మరికొన్ని గంటలు ఎక్కువగా శ్రమించాలన్నారు. ఆ దేశాలతో పోటీపడాలంటే భారత్‌లో యువత ఇకపై వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు. ఇక కొందరు దీనిపై ఉద్యోగ జీవితంలోని ఇబ్బందుల్ని లేవనెత్తగా.. ఇంకొందరు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.
Dec 16 2024, 15:15