అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్

సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా గోస పెడుతున్నారని తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గవర్నర్‌ను వెళ్లి కలవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 19 గ్రామ పంచాయితీలకి అవార్డు తెచ్చిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. అయితే హరీష్ రావు ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly session) సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన తర్వాత సర్పంచుల పెండింగ్ బిల్లుల అంశం సభలో చర్చకు వచ్చింది. ఈ అంశంపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటీసీలకు పెండింగ్ బిల్లులు చెలించడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) వాకౌట్ చేశారు.

సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా గోస పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) అన్నారు. గవర్నర్‌ను వెళ్లి కలవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 19 గ్రామ పంచాయితీలకు అవార్డు తెచ్చిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. అయితే హరీష్ రావు ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అధ్యక్ష అంటూ హరిష్ రావు సెటైర్ విసిరారు. ఆ తరువాత మాజీ మంత్రి తిరిగి మాట్లాడుతూ.. తెలంగాణకు వెళ్తే చికెన్ గున్యా వస్తుందని అమెరికా ఆ దేశ పౌరులను హెచ్చరించిందని.. ఆ పరిస్థితికి పల్లెలను తెచ్చారని మండిపడ్డారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పెన్షన్స్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని తెలిపారు. పెన్షన్స్ ఏమో గాని అసలు వేతనాలే ఇవ్వడం లేదని హరీష్‌రావు విమర్శించారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి సర్పంచ్ బిల్లులు రాక ఇల్లును కుదువ పెట్టుకున్నారని తెలిపారు. బిల్లుల కోసం సర్పంచ్‌లు కలుద్దామని హైదరాబాద్‌కు వస్తే అరెస్టు చేస్తున్నారన్నారు. సర్పంచ్‌లు చేసిన పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

చెల్లింపుల్లో యూపీఐ కింగ్‌

నవంబరుతో ముగిసిన 11 నెలల కాలంలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ద్వారా రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల చెల్లింపుల లావాదేవీలు జరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ.

నవంబరుతో ముగిసిన 11 నెలల కాలంలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ద్వారా రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల చెల్లింపుల లావాదేవీలు జరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దేశంలో ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులకు ఇదే నిదర్శనమని పేర్కొంది. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ విషయాన్ని పోస్ట్‌ చేసింది. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) 2016లో యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ చెల్లింపులను వేగవంతం సురక్షితం సులభతరం చేయడంతో పాటు వ్యక్తులు చిరు వ్యాపారాలు వర్తకుల ఆర్థిక సాధికారతను పెంచింది. భారతదేశం నగదు రహిత చెల్లింపుల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు బాటలు వేసింది.

గూగుల్ మైక్రోసాఫ్ట్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఎలాన్ మస్క్ రెడీ

ఎక్స్ మెయిల్ గురించి ఆలోచించాలన్న ఎక్స్ యూజర్

సానుకూలంగా స్పందించిన మస్క్

ఎక్స్ ఫోన్ గురించి కూడా ఆలోచించాలంటున్న యూజర్లు

ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న యాపిల్ మెయిల్ రెండోస్థానంలో జీమెయిల్

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాక్ ఇచ్చేందుకు ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రెడీ అవుతున్నారు. ఎక్స్ మెయిల్ పేరుతో ఈమెయిల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ‘ఎక్స్‌ మెయిల్’ కూడా ఉంటే బాగుంటుందన్న ఓ ఎక్స్ యూజర్ సూచన మేరకు మస్క్ ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఎక్స్ మెయిల్ లాంచ్ అయితే అది నేరుగా జీమెయిల్, ఇతర ఈమెయిల్ సర్వీసులకు పోటీ ఇస్తుందని మస్క్ ఆ యూజర్‌కు సమాధానం ఇచ్చారు. 

సెప్టెంబర్ 2024 నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్‌లో యాపిల్ మెయిల్ ప్రస్తుతం 53.67 శాతంతో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 30.70 శాతంతో జీమెయిల్ రెండోస్థానంలో ఉండగా అవుట్‌లుక్ (4.38 శాతం), యాహూ మెయిల్ (2.64 శాతం), గూగుల్ ఆండ్రాయిడ్ (1.72 శాతం) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడీ విషయంలోనూ పోటీకి మస్క్ రెడీ అవుతున్నట్టు ఆయన కామెంట్‌ను బట్టి అర్థం అవుతోంది. దీంతో ఎక్స్ యూజర్లు మరింత ఉత్సాహంగా.ఎక్స్ ఫోన్ గురించి కూడా ఆలోచించాలని కోరుతున్నారు.

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేటి మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ భేటీ

కొత్త రెవెన్యూ చట్టం (ఆర్ఓఆర్) బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించనున్న కేబినెట్

మాజీ మంత్రి కేటిఆర్‌పై కేసు నమోదు చేసే అంశంపైనా కేబినెట్‌లో చర్చించే ఛాన్స్

తెలంగాణ కేబినెట్ భేటీ ఈ రోజు జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రి మండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో .. కొత్త రెవెన్యూ చట్టం (ఆర్ఓఆర్) బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం ఈ బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. అలాగే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి విధివిధానాలను మంత్రివర్గం ఖరారు చేయనుంది.

ఫార్ములా– ఈ రేసింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటిఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను కూడా కేబినెట్‌లో చర్చించి శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించనుంది.

చలిగాలులతో జర జాగ్రత్త తెలంగాణకు ఐఎండీ అలర్ట్

నేడు రేపు పలు రాష్ట్రాల్లో శీతల గాలులు వీస్తాయని హెచ్చరిక

తెలంగాణ సహా ఉత్తరాది, మధ్యభారతంలోని రాష్ట్రాలకు అప్రమత్తత 

రాత్రి సమయంలో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్

దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో చలి బాగా ముదిరింది. తీవ్రంగా వీస్తున్న చలిగాలులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, నైరుతి, మధ్య భారత రాష్ట్రాలలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన విడుదల చేసింది.

డిసెంబరు 16, 17 తేదీల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో శీతల గాలులు వీస్తాయని, దట్టమైన పొగమంచు పరిస్థితులకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అనేక రాష్ట్రాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని పౌరులను అప్రమత్తం చేసింది.

మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ (సోమవారం) చలిగాలుల నుంచి తీవ్రమైన చలిగాలుల పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అప్రమత్తం చేసింది. ఇక హర్యానా చండీగఢ్ ఢిల్లీ జమ్మూ కశ్మీర్ లడఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఒడిశా మధ్య మహారాష్ట్ర విదర్భ మరాఠ్వాడా సౌరాష్ట్ర, తెలంగాణ, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతాలలో చలి గాలులు ఎక్కువగా వీస్తాయని పేర్కొంది. ఇక కొన్ని దట్టమైన పొగమంచు పడనుందని తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం

గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ వాసులను వర్షాలు ఒదలడం లేదు. నిన్న ఆదివారం అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసాయి. సోమవారం (ఈ రోజు) ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది సమాచారం.  

 

వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటు ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 7న ఒకటి ఏర్పడగా.. అది తీవ్ర అల్పపీడనంగా బలపడింది.. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు పడ్డాయి. ఉమ్మడి నెల్లూరు,చిత్తూరు, తిరుపతి జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. మరోవైపు 17న అండమాన్‌ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని మరో అంచనా వేసింది వాతావరణ కేంద్రం. ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరోవైపు APలో చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 12 డిగ్రీల కంటే దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా చలి తీవ్రత కనిపిస్తోంది. చలి, పొగమంచు దెబ్బకు ఏజెన్సీ ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు ఏజెన్సీలో పొగమంచు కమ్మేస్తోంది. మరీ దారుణంగా సాయంత్రం మూడు, నాలుగు గంటల నుంచి చలి ప్రభావం కనిపిస్తోందంటున్నారు.

జాకీర్‌ హుస్సేన్‌ మృతి పట్ల వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి

ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్ మృతిపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేర‌కు వైయ‌స్ జగన్ త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మరణించటం బాధ కలిగించింది. సంగీత విద్వాంసుడు అయిన జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతంలో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా

వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని, గతంలో మాదిరిగా రైతులకు అన్ని రకాల పనిముట్లు రాయితీపై అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.

వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని, గతంలో మాదిరిగా రైతులకు అన్ని రకాల పనిముట్లు రాయితీపై అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. తెలంగాణలోని పంటల సాగు దేశంలోనే రికార్డని, ఇక్కడ పండించిన పంటలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రైతులు ఎదగాలని అన్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగి, కులకచర్ల మార్కెట్‌ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి సీతక్క, చీఫ్‌ విప్‌ మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో వ్యవసాయ రంగానికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంతృప్తి ఏ రంగంలో లేదన్నారు.

చదువుకున్న వారు పంటలు సాగు చేస్తే ఉద్యోగాల కంటే ఎక్కువగా సంపాదిస్తారని తెలిపారు. పంటల సాగులో రసాయనాలు లేకుండా సాగు చేస్తే ప్రపంచ దేశాలే మనవైపు చూస్తాయన్నారు. మహిళా సంఘాల్లోని మహిళా రైతు సభ్యులకు 80 శాతం రాయితీపై డ్రోన్‌ల పంపిణీ చేస్తామని తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. దేశంలోనే రుణమాఫీలో తెలంగాణ రికార్డని, ఇప్పటి వరకు రూ.21 వేలకోట్లు రుణమాఫీ చేశామన్నారు.

అలాగే మిగిలిన రైతులకు కూడా త్వరలో పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణలో రైతులే శాస్త్రవేత్తలుగా మారాలని సూచించారు. రైతులు పంటల మార్పిడి దిశగా పయనించాలని సూచించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రెండు కీలక బిల్లుల ఎంట్రీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ శాసనసభలో టూరిజం పాలసీపై సోమవారం స్వల్పకాలిక చర్చ జరగనుంది. డిసెంబర్ 9వ తేదీన మొదలైన సమావేశాలు 16వ తేదికి వాయిదా పడ్డాయి.

ఈ క్రమంలో సోమవారం నుంచి తిరిగి శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 21వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సోమవారం జరగనున్న బీఏసీ మీటింగ్‌లో ఎప్పటి వరకు సమావేశాలు కొనసాగుతాయో అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.

సోమవారం ఉదయం 10 గంటలకు శాసన సభ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి, రామచంద్రారెడ్డి, ఊకే అబ్బయ్యలకు శాసనసభ సంతాపం తెలపనుంది. అనంతరం ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. శాసన సభ్యులు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు జవాబులు ఇస్తారు.

ఇక యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్శిటీ-2024 బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల అమెండ్‌మెంట్‌ బిల్లు-2024ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రవేశపెడతారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలు, పరిణామాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదేసిందుకు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి.

మరోవైపు, ప్రభుత్వం కో-ఆపరేట్‌ చేస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు, స్టడీ టూర్లు నిర్వహిస్తామని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తెలిపారు. త్వరలో శాసనసభ, శాసనమండలి కమిటీలనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటన

2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సోమవారం పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పర్యటనకు (Visit) వెళ్లనున్నారు. భద్రత కారణాల రీత్యా పోలీసులు పాపికొండల విహారయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఆది, సోమవారం పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈరోజు పాపికొండల విహారయాత్ర కు వెళ్ళే 14 ప్రైవేట్ టూరిజం బోట్లు, ఒక టూరిజం బోటు తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

రెండోసారి పోలవరానికి..

2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళుతున్నారు. సీఎం అయ్యాక ఈ ఏడాది జూన్ 17న మెుదటిసారి ఆయన ఆ ప్రాజెక్టును సందర్శించారు. కాగా, తాజాగా మరోసారి పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు.

అయితే ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకోనున్నారు. ముఖ్యంగా డయాఫ్రం వాల్ నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజినీర్లతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సిబ్బందికి పలు సూచనలు చేశారు. చంద్రబాబు వచ్చిన సమయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్ నుంచి చంద్రబాబు పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. కాగా, సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీలతోపాటు స్థానిక అధికారులు, ఎంఈఐఎల్ సిబ్బంది పాల్గొన్నారు.