ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు మరోసారి పొడిగింపు

పౌరుల గుర్తింపు కోసం ప్రామాణికంగా ఉన్న ఆధార్ కార్డు

ఇప్పటికే పలుమార్లు ఉచిత అప్ డేట్ గడువు పొడిగించిన కేంద్రం

తాజాగా మరో ఆర్నెల్ల పాటు గడువు పెంపు

దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా ఎలాంటి గుర్తింపుకైనా ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఆధార్ కార్డుల్లో సవరణలు, అప్ డేట్ చేసుకోవడం కోసం కేంద్రం ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. 

తాజాగా మరోసారి గడువు పెంచింది. వచ్చే ఏడాది జూన్ 25 వరకు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేకుండానే ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది. గతంలో పొడిగించిన గడువు నేటితో ముగియడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్ వివరాలు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూహెచ్ సీ) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజ్ మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సీడబ్ల్యూహెచ్ సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 179 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో జనవరి 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

పోస్టులు: మేనేజ్ మెంట్ ట్రెయినీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్

ఖాళీల సంఖ్య: 179

అర్హతలు: పోస్టును బట్టి డిగ్రీ, బీకాం, సీఏ, పీజీ, ఎంబీఏ

వయసు: గరిష్ఠంగా 30 ఏళ్లకు మించకూడదు

ఎంపిక చేసేదిలా..: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1350... ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.500

జీతం: నెలకు రూ.29,000 నుంచి రూ.1,80,000 వరకు

https://cewacor.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

రేవంత్ బెదిరింపులకు పాల్పడటం సరైనది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బ్యాగు నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన తర్వాత, అందరూ అదే జీవితం అనుభవించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందని అనిపిస్తోందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసికస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘బ్యాగు నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన తర్వాత, అందరూ అదే అనుభవించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందని అనిపిస్తోంది. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పైన, తమ కంపెనీ కార్యకలాపాలపైన ఆ పథకం ప్రభావాన్ని వ్యక్తపరిచినందుకు L&T వంటి ప్రముఖ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ని జైలుకు పంపిస్తాను అంటూ ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడరు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల అధిపతులను జైలుకు పంపిస్తానంటూ రేవంత్ బెదిరింపులకు పాల్పడటం సరైనది కాదు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు దిగజారుతున్న ఆయన మానసిక స్థితికి అర్ధం పడుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలతో రేవంత్ పరిశ్రమలకు ఏ సందేశం పంపుతున్నారు. ఇదేనా రాహుల్ గాంధీ దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ పార్టీ ముఖ్యమంత్రులకు నేర్పించిన గొప్ప వ్యూహం అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

రేవంత్ పాలనలో సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు రేపారని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ చేపట్టిన గురుకులాల బాటతో ఎట్టకేలకు కాంగ్రెస్‌ సర్కారులో చలనం వచ్చిందని.. ఇప్పుడు గురుకులాలకు వెళ్తున్నారని అన్నారు. కెమెరాల ముందు హంగామా కాకుండా గురుకులాల బిడ్డల గుండెచప్పుడు వినాలని అన్నారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని విమ ర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో గురుకులాల విద్యార్థులు ఎవరెస్టు వంటి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తే ఏడాది కాంగ్రెస్‌ పాలనలో ఆస్పత్రి ఎక్కించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

గురుకులాల్లో మొక్కుబడి సందర్శన వద్దని, ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని కోరారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ నియోజకవర్గంలో మంత్రి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే అనీల్‌ జాదవ్‌ను పోలీస్‌లు అడ్డుకోవడం సరికాదని కేటీఆర్‌ అన్నారు. ప్రజాపాలనలో ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మరోవైపు శనివారం ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని ఆయన ఇంట్లో కేటీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి నగదు పారితోషికం ప్లాట్‌ను సిధారెడ్డి తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.

జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది.

జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం చివరి నిమిషంలో వెనక్కి తగ్గిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదింప చేసేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులోభాగంగా లోక్‌సభ బిజినెస్‌లో సైతం సదరు బిల్లుతోపాటు మరో బిల్లు ఆమోదింప చేసుకొనేందుకు కేంద్రం పొందు పరిచింది. కానీ చివరి నిమిషంలో లోక్‌సభ బిజినెస్‌లో నుంచి ఆ రెండు బిల్లులను తొలగించింది. దీనిపై పలు సందేహాలు వ్యక్తమవుతోన్నాయి.

ఈ బిల్లుపై మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20వ తేదీతో ముగియనున్నాయి. అంటే.. వచ్చే శుక్రవారంతో సభ దీర్ఘ కాలం పాటు వాయిదా పడనుంది. ఈ నేపథ్యంలో ఈ కాలవ్యవధిలోనే బిల్లులు ఆమోదింప చేసుకొనేందుకు మోదీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. అలాంటి వేళ.. ఇలా చివరి నిమిషంలో బిల్లు ఆమోదంపై వెనక్కి తగ్గడంపై పలు సందేహాలకు తావిస్తోంది.

నవంబర్ 25వ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేందుకు మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లోక్‌సభ ముందుకు ఈ బిల్లును సోమవారం అంటే డిసెంబర్ 16వ తేదీ తీసుకు వచ్చేందుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ఆ క్రమంలో లోక్‌సభ బిజినెస్‌లో సైతం దీనిని పొందు పరిచింది.

ఈ బిల్లుతో పాటు మరో బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సభలో ప్రవేశపెడతారని ఇప్పటికే కేంద్రం సైతం ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. అయితే లోక్‌సభలో బిజినెస్ జాబితా నుంచి ఈ రెండు బిల్లులను తొలగించింది. రివైజ్ చేసిన లోకసభ బిజినెస్‌లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులు లేవు. ఈ సమావేశాల్లోనే జమిలి బిల్లులు పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. అలాంటి వేళ.. ఈ బిల్లు ఆమోదింప చేసుకొనేందుకు మోదీ ప్రభుత్వం సందిగ్దంలో పడడంపై సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతోన్నాయి.

సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకోసం జమిలి ఎన్నికల నిర్వహించాలని భావిస్తోంది. ఎందుకంటే.. ప్రతి ఏటా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడ..ఎప్పుడో అప్పుడు ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరుగుతునే ఉంటాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం.. అలాగే వివిధ రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం అంతా ఆయా ఎన్నికల క్రతువులో పాల్గొంటున్నాయి.

దాంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతోన్నాయి. ఈ తరహా సమస్యల నుంచి బయట పడేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం ఈ బిల్లును ఆమోదింప చేసుకొనేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాంటి వేళ.. ఇలా చివరి నిమిషంలో మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం పట్ల పలు సందేహాలకు తావిస్తోంది.

అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.

అమరావతి నుంచి శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మదాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, నటుడు నాగబాబు.. బన్నీ ఇంటికి చేరుకుని పరామర్శించారు. అల్లు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

సినీనటుడు, పుష్ప చిత్రం కథానాయకుడు అల్లు అర్జున్‌ 13 గంటలు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అరెస్టయిన రోజు రాత్రి జైలు క్యాంటిన్‌లో వండిన ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ తిన్నారు. రాత్రిపూట చలితో ఇబ్బందిపడ్డారు. చాలాసేపు మెలకువగానే ఉన్న ఆయన, అర్ధరాత్రి తర్వాత నిద్రపోయారు. ఎక్స్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి కేసులో శుక్రవారం అరెస్టయి రిమాండ్‌ ఖైదీగా సాయంత్రం 5:30 గంటలకు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. శనివారం ఉదయం 6:30 గంటలకు మధ్యంతర బెయిల్‌ మీద జైలు నుంచి విడుదలయ్యారు. అల్లు అర్జున్‌ అరెస్టయిన గంటలోనే హై కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ.. బెయిల్‌ పత్రాలు సమయానికి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో విడుదల జాప్యమైంది. జైల్లో అల్లు అర్జున్‌ను అధికారులు అండర్‌ ట్రైయల్‌ ఖైదీ నంబర్‌ 7697 కేటాయించి మంజీరా బ్యారక్‌లో గట్టి బందోబస్తు మద్య ఉంచారు. జైలు అధికారులు అల్లు అర్జున్‌కు తొలుత చాయ్‌, బిస్కెట్లు ఇచ్చారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందన్న సమాచారం మేరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పెషల్‌ కేటగిరి సదుపాయాలు కల్పించాల్సి ఉండటంతో ఆయనకు ఒక బెడ్‌, కుర్చీ ఏర్పాటు చేశారు.

రాత్రి ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ తిన్నారు. వాస్తవానికి డిన్నర్‌ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఏదైనా తినాలి కదా? బయట నుంచైనా భోజనం తెప్పించుకుంటారా? అని జైలు అధికారులు ఆయన్ను అడిగినట్లు తెలిసింది. దీనికి అల్లు అర్జున్‌.. ఇక్కడే ఏదైనా దొరుకుతుందా? అని అడగడంతో క్యాంటిన్‌లో ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌ చేయిస్తామని అధికారులు చెప్పారు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉండటంతో అధికారులు అల్లు అర్జున్‌కు కొత్త రగ్గు, దుప్పట్లను అందజేశారు. అర్ధరాత్రి చాలాసేపటి వరకు మెలకువగా ఉన్న అల్లు అర్జున్‌ ఆ తర్వాత తనకు కేటాయించిన బెడ్‌పై నిద్రపోయారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ఆయ న్ను జైలు సిబ్బంది నిద్రలేపి విడుదలకు సిద్ధం చేసినట్లు తెలిసింది. విడుదల సమయంలో ఆయన తండ్రి అల్లు అరవింద్‌, మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి జైలు వద్దకు చేరుకున్నారు. ఉదయం 6.30 గంటలకు అల్లు అర్జున్‌ జైలు బయకొచ్చారు. ఈ సందర్భంగా జైలు సిబ్బంది ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెక్యూరిటీ కారణంగా పోలీసుల ఆదేశాలతో అల్లు అర్జున్‌ను జైలు వెనుక మార్గం నుంచి పంపించారు. అక్కడి నుంచి తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి ఆయన వెళ్లిపోయారు. ఇదే కేసులో అరెస్టుయిన నిందితుల్లో ఇద్దరు.. థియేటర్‌ పార్టనర్స్‌ అగమాటి పెద్ద రామారెడ్డి, ఆగమాటి చిన్న రామారెడ్డికి బెయిల్‌ మంజూరైంది.

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తన ప్రమేయం లేదని, 20 ఏళ్ల నుంచి ప్రేక్షకులతో కలిసి ఆ థియేటర్‌లో సినిమా చూస్తున్నానని సినీ నటుడు అల్లు అర్జున్‌ అన్నారు. థియేటర్‌లో మహిళ మృతిచెందడం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, అది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని, త్వరలోనే ఆ కుటుంబసభ్యులను పరామర్శిస్తానని చెప్పారు. తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన అభిమానులు, సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మహిళ మృతి ఘటనలో తన కుమారుడికి సంబంధం లేదని, ఆ ఘటన దురదృష్టకరం అని అల్లు అరవింద్‌ అన్నారు. బన్నీని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.

16న లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

డిసెంబర్ 16న లోక్సభ ముందుకు ఒకే దేశం - ఒకే ఎన్నికలు బిల్లు - 129వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్

ఒకే దేశం - ఒకే ఎన్నికలు' బిల్లు ఈ నెల 16న లోక్‌సభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2024ను కూడామేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు.లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఈ నెల 12న కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటు మూడు కేంద్రపాలిత ప్రాంతాలను అసెంబ్లీలతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు సహా రెండు ముసాయిదా చట్టాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలి ఎన్నికల అమలులో ఓ కీలక ముందడుగు పడినట్లు అయింది.

అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీల ఏకకాల ఎన్నికలపై మాత్రమే కేంద్రం దృష్టి సారించింది. స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధిచి ప్రస్తుతానికి దూరంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ జమిలి ఎన్నికలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. "ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోయినా లేదా మెజారిటీ కోల్పోతే- ఆ రాష్ట్రం, ప్రభుత్వం లేకుండా మిగతా నాలుగున్నర సంవత్సరాలు ఉంటుందా? అది ఈ దేశంలో సాధ్యం కాదు. ఇప్పటివరకు ప్రభుత్వాలు తమ ఐదేళ్ల కాలాన్ని ఉపయోగించుకున్నాయి. కానీ ఇక ముందు కొన్ని ప్రభుత్వాలు రెండున్నరేళ్లకు, కొన్ని చోట్ల మూడేళ్లకు కూలిపోతాయి. 6 నెలల కన్నా ఎక్కువ సమయం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు వాయిదా వేయకూడదు అని సింగ్ అన్నారు. జమిలి ఎన్నికల బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని, దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ- జేపీసీకి పంపించాలని మరో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు."జిమిలి ఎన్నికల బిల్లును జేపీసీక సిఫారసు చేయాలి. అక్కడి దీనిపై చర్చలు జరుగుతాయి. ఈ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్లు గతేడాదే మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. అని జైరాం రమేశ్ తెలిపారు.

ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత అపోలో ఆస్పత్రిలో చికిత్స

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ మరోసారి ఆస్పత్రిపాలయ్యారు. తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన్ని కుటుంబీకులు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా గతంలో కూడా అద్వానీ వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ చాలాసార్లు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 97 ఏళ్లు. రెండు రోజుల క్రితం అద్వానీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు.

దేశ విభజనకు ముందు ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగంలోని కరాచీలో 1927 నవంబరు 08న అద్వానీ జన్మించారు. జాతీయ పార్టీకి బీజేపీ నిర్మాణంలో అద్వానీ అత్యంత కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ ఆవిర్భావం మొదలుకుని ఆ పార్టీకి సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. 1986 నుంచి 1990 వరకు, 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు అద్వానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980 -1990 మధ్య కాలంలో బీజేపీని బలమైన జాతీయ శక్తిగా తీర్చిదిద్దడంలో అద్వానీ సఫలీకృతమయ్యారు. 1984లో కేవలం 2 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. 1989లో 86 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది.

1992లో 121 స్థానాలు, 1996లో 161 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. దేశ స్వాతంత్ర చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నాటి ఎన్నికల్లో రెండో స్థానానికి పడిపోయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అద్వానీ చేపట్టిన ఉద్యమం బీజేపీ నిర్మాణానికి ఎంతో దోహదపడింది. 1999 నుంచి 2004 మధ్య కాలంలో నాటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో అద్వానా కేంద్ర హోం మంత్రిగా.. ఆ తర్వాత డిప్యూటీ ప్రధానిగా సేవలందించారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు అద్వానీ పార్లమెంటు సభ్యుడిగా సేవలందించారు.

వారికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు

సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని, జత్వానీ అక్రమ అరెస్టు వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీయాలంటే నిందితులను అదుపులోకి తీసుకొని విచారించాల్సి ఉందంటూ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో శుక్రవారం వాదనలు వినిపించారు. తనను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారంటూ జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్‌లు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, విజయవాడ వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం మాజీ సీఐ ఎం. సత్యనారాయణలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ చట్ట నిబంధనలు పాటించాల్సిన పోలీస్ ఉన్నతాధికారులే ఉల్లంఘనలకు పాల్పడినందున వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. 

జత్వానీ తరపున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభుదాస్, నర్రా శ్రీనివాసరావులు వాదనలు వినిపిస్తూ .. జత్వానీపై తప్పుడు కేసు నమోదు, అరెస్టు వెనుక నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులుది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఆయన మౌఖిక ఆదేశాలతో ముంబయి వెళ్లి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేసి విజయవాడ తీసుకువచ్చారని వివరించారు. జత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నట్లు ప్రాధమిక ఆధారాలున్నాయని తెలిపారు. 

పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, వినోద్ కుమార్, దేశ్‌పాండే, పట్టాభి తదితరులు వాదనలు వినిపించారు. ఫోర్జరీ దస్త్రాలతో భూమిని విక్రయించేందుకు జత్వానీ ప్రయత్నించారని కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఫిబ్రవరిలో కేసు నమోదైందని తెలిపారు. దీనిపై నమోదైన కేసు విచారణ పూర్తి కాకుండానే జత్వానీ ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేయడం చెల్లదని పేర్కొన్నారు. 

ఈ కేసులో ఏ 1 విద్యాసాగర్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యిందని, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. బాధితురాలు జత్వానీ తరపు న్యాయవాదుల వాదనలు కొనసాగింపుకు, పిటిషనర్ల ప్రతివాదనల కోసం కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ విఆర్‌కే కృపాసాగర్ ప్రకటించారు. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు.

మరో అల్పపీడనం

దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో పలు జిల్లాలను రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు వానలు ముంచెత్తాయి.

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో పలు జిల్లాలను రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు వానలు ముంచెత్తాయి. ఈ నెల 11, 12 తేదీల్లో కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే 16 నుంచి అల్పపీడనం ప్రభావంతో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఈసారి కోస్తాలోని మధ్య ప్రాంతాల వరకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న అల్పపీడనం శనివారం నాటికి బలహీనపడనుండగా, ఆదివారం మరొకటి ఏర్పడనుంది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఇప్పటికే రెండు తుఫాన్‌లు రాగా, మూడు రోజుల క్రితం ఒక అల్పపీడనం వచ్చింది. ఈ నెల 15న మరొకటి రానుంది. ప్రస్తుతం ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రత్యేకించి బంగాళాఖాతంలో అల్పపీడనాలు తుఫాన్‌లకు అనువుగా ఉపరితల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు విశ్లేషించారు. సముద్రం మీదుగా వచ్చే తూర్పుగాలులతో తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడులో కొన్నిచోట్ల 50 సెం.మీ. భారీ వర్షపాతం నమోదవగా, ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనంతో శుక్రవారం తమిళనాడులోని ఒక ప్రాంతంలో 54 సెం.మీ. వర్షపాతం నమోదైందని, అనేకచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురిశాయని వివరించారు.

గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌లో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో అల్పపీడనంగా బలహీనపడి శుక్రవారం నాటికి లక్షద్వీప్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది శనివారం నాటికి పూర్తిగా బలహీనపడనుంది. అయితే శనివారం నాటికి దక్షిణ అండమాన్‌ పరిసరాల్లో ఉపరితల ఆవవర్తనం ఆవరించనున్నది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 17 కల్లా తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ అల్పపీడనం మధ్య ఉత్తర తమిళనాడు వైపు వస్తుందని కొన్ని మోడళ్లు చెబుతున్నాయి. దీని ప్రభావంతో ఈ నెల 16 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. 17 నుంచి 19 వరకూ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలో గుంటూరు జిల్లా వరకు వర్షాలు విస్తరిస్తాయని కొన్ని మోడళ్లు చెబుతుండగా, ఉత్తర కోస్తాలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని మరికొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నాయి. కాగా, శుక్రవారం ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.

డాక్టర్‌ ప్రభావతికి ముందస్తు బెయిల్‌ నో

ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును ఎంపీగా ఉన్న సమయంలో కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన కేసులో 5వ నిందితురాలుగా ఉన్న డాక్టర్‌ ప్రభావతికి గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది.

ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును ఎంపీగా ఉన్న సమయంలో కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన కేసులో 5వ నిందితురాలుగా ఉన్న డాక్టర్‌ ప్రభావతికి గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. ఆమె దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు గుంటూరు రెండవ అదనపు జిల్లా జడ్జి వై. నాగరాజు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ డాక్టర్‌ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. మెడికల్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్న తాను ఈ కేసుకు సంబంధించిన బోర్డులోని ఇతర వైద్యులిచ్చిన రిపోర్టుల ఆధారంగా నివేదిక ఇచ్చానని ఆమె పేర్కొన్నారు. తాను నిర్దోషినని అనారోగ్యంతో ఉన్నానని తెలిపారు. 

ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. కాగా, బాధితుడైన రఘురామ తన న్యాయవాదులు వినాలని ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాదులు వీవీ లక్ష్మీ నారాయణ, కావూరి గోపీనాథ్‌ వాదనలు వినిపించారు. కస్టడీలో తనపై జరిగిన హత్యాయత్నం కేసులో డాక్టర్‌ ప్రభావతి భాగస్వామి అయ్యారని, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య బృందం ఇచ్చిన నివేదికను ఆమె దురుద్దేశంతో ట్యాంపరింగ్‌ చేశారని పేర్కొన్నారు. ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయరాదని కోర్టును కోరారు. మరోవైపు, ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున ప్రాసిక్యూషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభావతి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి మిగిలిన నిందితులతో కుమ్మక్కయ్యారని కోర్టుకు తెలిపారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభావతికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది.