సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
రేవంత్ బెదిరింపులకు పాల్పడటం సరైనది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బ్యాగు నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన తర్వాత, అందరూ అదే జీవితం అనుభవించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందని అనిపిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసికస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘బ్యాగు నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన తర్వాత, అందరూ అదే అనుభవించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందని అనిపిస్తోంది. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పైన, తమ కంపెనీ కార్యకలాపాలపైన ఆ పథకం ప్రభావాన్ని వ్యక్తపరిచినందుకు L&T వంటి ప్రముఖ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ని జైలుకు పంపిస్తాను అంటూ ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడరు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల అధిపతులను జైలుకు పంపిస్తానంటూ రేవంత్ బెదిరింపులకు పాల్పడటం సరైనది కాదు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు దిగజారుతున్న ఆయన మానసిక స్థితికి అర్ధం పడుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలతో రేవంత్ పరిశ్రమలకు ఏ సందేశం పంపుతున్నారు. ఇదేనా రాహుల్ గాంధీ దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ పార్టీ ముఖ్యమంత్రులకు నేర్పించిన గొప్ప వ్యూహం అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రేవంత్ పాలనలో సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు రేపారని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ చేపట్టిన గురుకులాల బాటతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చిందని.. ఇప్పుడు గురుకులాలకు వెళ్తున్నారని అన్నారు. కెమెరాల ముందు హంగామా కాకుండా గురుకులాల బిడ్డల గుండెచప్పుడు వినాలని అన్నారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని విమ ర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో గురుకులాల విద్యార్థులు ఎవరెస్టు వంటి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తే ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రి ఎక్కించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
గురుకులాల్లో మొక్కుబడి సందర్శన వద్దని, ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని కోరారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో మంత్రి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే అనీల్ జాదవ్‌ను పోలీస్‌లు అడ్డుకోవడం సరికాదని కేటీఆర్ అన్నారు. ప్రజాపాలనలో ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మరోవైపు శనివారం ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని ఆయన ఇంట్లో కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి నగదు పారితోషికం ప్లాట్‌ను సిధారెడ్డి తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.
Dec 15 2024, 16:16