సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌

సింగరేణి సీఎండీ పోస్టు కోసం పలువురు కీలక ఐఏఎ్‌సలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సింగరేణి సీఎండీ పోస్టు కోసం పలువురు కీలక ఐఏఎ్‌సలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్‌.బలరామ్‌ కేంద్ర సర్వీసులకు చెందిన అధికారి. రాష్ట్రంలో ఆయన డిప్యూటేషన్‌ కాలం ముగిసిపోవస్తోంది. డిప్యూటేషన్‌ను పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే వార్తలు రావడంతో ఆ పోస్టును దక్కించుకోవడానికి పలువురు కీలక ఐఏఎ్‌సలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శైల జా రామయ్యర్‌ ముందు వరుసలో ఉన్నారు. 1997 బ్యాచ్‌కు చెందిన ఆమె సీఎండీ పోస్టును కోరుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె చేనేత శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈమెకు కోల్‌బెల్ట్‌పై పూర్తి స్థాయిలో పట్టుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సతీమణి కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యధికకాలం ఎన్‌.శ్రీధర్‌ సీఎండీగా ఉన్నారు.

9 ఏళ్లకు పైగా ఆయన సీఎండీ పోస్టులో కొనసాగారు. పలు సందర్భాల్లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కూడా సింగరేణి పాలక మండలి సమావేశంలో ఆయన పదవీ కాలం పొడిగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీధర్‌ను కొనసాగించింది. గత ప్రభుత్వంలోని కీలక పెద్దలకు ఆప్తుడిగా శ్రీధర్‌కు పేరుండేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చీ రాగానే శ్రీధర్‌ను తప్పించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. తాజాగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. శ్రీధర్‌ను తప్పించిన నాటి నుంచి ఎన్‌.బలరామ్‌ ఇన్‌చార్జి సీఎండీగా ఉన్నారు. ఆర్థిక రంగంపై బలరామ్‌కు బలమైన పట్టు ఉంది. సింగరేణి ఆర్థిక పరపతి పెంచడంలోనూ ఆయన పాత్ర కీలకమని అధికారులు చెబుతుంటారు. నిధుల సమీకరణలోనూ బలరామ్‌ దిట్ట. రాష్ట్రంలోని మరే కార్పొరేట్‌ కంపెనీలో లేని విధంగా సింగరేణి కార్మికులకు రూ.కోటి బీమాను బ్యాంకుల నుంచి వర్తింపచేయడంలో బలరామ్‌దే కీలక పాత్ర. దాంతో కొత్త సీఎండీగా ఐఏఎ్‌సలకు అవకాశం ఇస్తారా? లేక కేంద్రాన్ని ఒప్పించైనా బలరామ్‌ను కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది.

త్వరలో లిక్కర్‌ ప్రీమియం స్టోర్లు

రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్‌ బ్రాండ్లు విక్రయించేందుకు ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి.

రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్‌ బ్రాండ్లు విక్రయించేందుకు ‘ప్రీమియం స్టోర్లు’ అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఒకట్రెండు రోజుల్లో ఎక్సైజ్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 12 ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ కార్పొరేషన్లు, ప్రధాన నగరాల్లో మాత్రమే ఉండే వీటికి దరఖాస్తు రుసుము రూ.15 లక్షలుగా ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. దరఖాస్తులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. లైసెన్స్‌ ఫీజు కింద ఏడాదికి రూ.కోటి చెల్లించాలి. దానిపై ఏటా 10శాతం చొప్పున ఫీజు పెరుగుతుంది.

అయితే ఈ స్టోర్లకు ఒకేసారి ఐదేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేస్తారు. కనీసం 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం చూపించినవారే దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తులు పరిశీలించి లైసెన్సీలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తుంది. సాధారణ మద్యం షాపుల తరహాలోనే ఈ స్టోర్ల పనివేళలు ఉంటాయి. ప్రీమియం స్టోర్లలో లిక్కర్‌, బీరు, వైన్‌తో పాటు లిక్కర్‌ చాక్లెట్లు, సిగార్స్‌, సిగరెట్లు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ కూడా విక్రయించవచ్చు.

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం- ఏపీలో భారీ వర్షాలు

వరుస అల్పపీడనాలు, తుఫాన్లు తాకిడి కొనసాగుతూ వస్తోంది. ఒకదాని వెంట ఒకటిగా అల్పపీడనాలు ఏర్పడుతూనే ఉన్నాయి దాదాపు రెండునెలల నుంచి. ప్రతి సంవత్సరం నవంబర్/డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటం సహజమే అయినప్పటికీ- ఇప్పుడు దీని తీవ్రత మరింత పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తాజాగా బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర అల్పపీడనంగా రూపు దాల్చింది. ఇది వాయుగుండంగా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వచ్చే 24 నుంచి 48 గంటల్లో వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది.

అనంతరం క్రమంగా వాయవ్య దిశగా కదులుతుందని, ఆ సమయంలో దీని వేగం గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. వచ్చే 48 గంటల వ్యవధిలో శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరి, తీరప్రాంతానికి సమీపించే అవకాశం ఉంది. తమిళనాడు మధ్య- దక్షిణ ప్రాంతం వద్ద తీరం దాటొచ్చు.

ఈ తాజా అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెన్నై రీజినల్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సాయంత్రం నుంచి నాలుగు రోజుల పాటు చెన్నై సహా కడలూరు, మైలాడుథురై, నాగపట్నం, కరైకల్, చెంగల్పట్టు, విల్లుపురంలల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

తిరువారూరు, తంజావూరు, కాళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబలూర్, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, రామనాథపురం, శివగంగ, తూత్తుకూడి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయి. కేప్ కొమొరిన్ ఏరియా పరిధిలోకి వచ్చే కన్యాకుమారి, భారత్- శ్రీలంక మధ్య భాగం అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై ఐఎండీ తెలిపింది.

దీని ప్రభావం ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమపైనా తీవ్రంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. నేడు నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల చిరుజల్లులు పడొచ్చు.

గురువారం నాడు నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

చరిత్రలో తొలిసారి రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం 70 మంది సంతకాలతో

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్‌పై.. ఇండియా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ మేరకు 70 మంది సభ్యులు సంతకాలు చేసిన నోటీసులును రాజ్యసభ సచివాలయానికి అందించారు. ఎగువసభలో ప్రతిపక్ష పార్టీల ఎంపీల గొంతును జగదీప్ ధన్‌ఖడ్‌ నొక్కుతున్నారని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. తాజాగా ఆయనపై అవిశ్వాస తీర్మానం సమర్పించాయి. దీంతో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లయింది.

భారత పార్లమెంటు చరిత్రలో తొలిసారి రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నమోదైంది. మంగళవారం ఉదయం రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం కావాల్సి ఉండగా.. దాదాపు 70 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకాలతో కూడిన నోటీసులను రాజ్యసభ సెక్రటేరియట్‌కు ఇండియా కూటమి నేతలు సమర్పించారు. ఇక రాజ్యసభ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

రాజ్యసభలో ఛైర్మన్‌ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ వ్యవ‌హ‌రిస్తున్న తీరు ఏక‌ప‌క్షంగా ఉంటుందని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇక జగదీప్ ధన్‌ఖడ్‌ వ్యవహార శైలి కారణంగా తాము తరచూ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేయాల్సిన పరిస్థితి వస్తోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక ఈ తీర్మానంపై ఇండియా కూటమిలోని వివిధ పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు. కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సమాజ్‌ వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ సహా పలు పార్టీలకు చెందిన 70 మందికిపైగా ఎంపీలు సంత‌కాలు చేశారు.

ఇక ఎంపీల సంతకాలతో కూడిన ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులను ఇండియా కూటమి నేతలు రాజ్యసభ సెక్రటేరియట్‌కు సమర్పించారు. రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి 50 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉండగా.. తమకు 70 మంది సభ్యుల మద్దతు ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రణజీత్‌ రంజన్‌ మీడియాకు వెల్లడించారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు లేచి నిలబడినపుడు.. రాజ్యసభ ఛైర్మన్‌ ఆయనకు అవకాశం ఇవ్వాలని.. కానీ మల్లికార్జున ఖర్గే లేచి నిలబడగానే మైక్రోఫోన్‌ను జగదీప్ ధన్‌ఖడ్ తరచూ కట్‌ చేస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు వాదిస్తున్నారు. పార్లమెంటరీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం రాజ్యసభ నడవాలి కానీ.. తాము ఫిర్యాదు చేసిన ప్రతిసారి తమను ఛాంబర్‌లోకి పిలిచి సర్దుబాటు చేసేందుకు ఛైర్మన్‌ ధన్‌ఖడ్ ప్రయత్నిస్తున్నారు తప్ప నిబంధనలను పాటించాలని ఆయన భావించడం లేదని సీనియర్‌ ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు.

తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తిరస్కరిస్తున్నాం

సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తాము తిరస్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం దారుణమన్నారు. బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగ అని, అలాంటి బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. గ్రాండ్‌గా ఉండే తెలంగాణ తల్లిని తీసి... బీద తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి గొప్పలకు పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. విగ్రహం నమూనాను మార్చినందుకు నిరసనగా పాలాభిషేకం చేస్తున్నట్లు చెప్పారు.

ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చడం సరికాదన్నారు. జొన్నలు, మక్కలు ఇతర రాష్ట్రాల్లో కూడా పండుతాయని... కానీ పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది అన్నారు. అలాంటి బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి తొలగించారన్నారు.

తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలని పేద తల్లి విగ్రహం పెట్టారా? అని ఎద్దేవా చేశారు. విగ్రహం పెట్టామనే పేరుతో సామాన్యులకు ఇచ్చే హామీలను ఎగ్గొడతారా? అని నిలదీశారు. తొమ్మిది మంది కళాకారులను సన్మానిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిందని, మరి ఆ జాబితాలో మహిళలకు స్థానం ఎందుకు లేదో చెప్పాలన్నారు.

ఐదు కంపెనీలపై హైడ్రా కమిషనర్‌కు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైదరాబాద్‌లోని బుద్ద భవన్‌లో కలిశారు. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న పలు కంపెనీలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఆయా కంపెనీల పేర్లు ఏమిటో కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి రెండు నెలల క్రితమే తాను మాట్లాడానని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. రెండు నెలల క్రితం తాను మాట్లాడానని, ఆ తర్వాత పది రోజులకు... అనుమతులు ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని గుర్తు చేశారు.

కానీ చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాను ఫిర్యాదు చేసిన ఐదు కంపెనీలకు అనుమతులు ఇచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం... గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు.

అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఈ ఐదు సంస్థలకు సంబంధించి అనుమతులిచ్చిన అధికారులు, అండగా ఉన్న ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూఆక్రమణలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి ఉందన్నారు.

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ

కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు. ఆయన పదవికాలం పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగించేవారు కానీ డీజీపీ పదవి కాలాన్ని పొడిగించిన సందర్భాలు లేవు. ద్వారకా తిరుమలరావు పదవి కాలం పొడిగింపునకు చంద్రబాబు ప్రయత్నం చేస్తారా మరొకరికి చాన్సిస్తారా అన్నది త్వరలో తెలియనుంది. ఇప్పటికే ఆయన రిటైర్మెంట్ డేట్ పై సీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారుల్లో అత్యంత సీనియర్ ద్వారకా తిరుమలరావు, ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా తప్పించింది.నిజానికి ఆయన సీనియార్టీలో టాప్ టెన్ లో లేరు.కానీ జగన్ రెడ్డి మనోజ్ అనుకుని ఆయనకు అందలం ఎక్కించారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆయనను తప్పించి సీనియర్టీలో మొదటిస్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావును కూడా కాదని హరీష్ కుమార్ గుప్తాకు చాన్సిచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తరవాత కొన్నాళ్లు గుప్తానే డీజీపీగానే ఉన్నారు కానీ తర్వాత ద్వారకా తిరుమలరావుకు చాన్సిచ్చారు.

చంద్రబాబు డీజీపీ విషయంలో నిబంధనల ప్రకారం వెళ్తారు. సీనియార్టీకి గౌరవం ఇస్తారు. అదేసమయంలో సమర్తత చూస్తారు. సీనియార్టీ ఉన్నా.. అంచనాలకు అనుగుణంగా పని చేస్తారని అనుకోకపోతే పదవి ఇవ్వరు. ద్వారకా తిరుమలరావు తర్వాత మళ్లీ హరీష్ గుప్తాకే చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరు డీజీపీగా ఉన్నా.. వైసీపీ హాయాంలో సవాంగ్, రాజేంద్రనాథ్ రెడ్డి తరహాలో విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం మాత్రం ఉండదని గుర్తు చేస్తున్నారు.

మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద మీడియా ప్రతినిధుల పైన బౌన్సర్లు దాడి

చంద్రగిరి మండలం ఏ. రంగంపేట మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధులు జర్నలిస్ట్ ఉమాశంకర్, కెమెరామెన్ నరసింహ ల పై విచక్షణ రహితంగా దాడి. గాయాలైన ఇరువురిని స్థానిక చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

మీడియా ప్రతినిధుల పై దాడి చేయాడాన‌్ని ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి ప్రెస్ క్లబ్ నాయకులు, సభ్యులు.

జర్నలిస్టులపై భౌతిక దాడి చేయడమే, కాక కెమెరాలను, సెల్ ఫోన్ లను లాక్కొని ధ్వంసం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టుల సంఘాలు 

దాడికి కారకులైన బౌన్సర్లు పిఆర్ఓ లపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డి కోరిన ప్రెస్ క్లబ్ నాయకులు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు

ప్రజాస్వామ్యంలో మీడియాపై దౌర్జన్యం చేయటం సహించరాని చర‌్య అని దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరిన మీడియా సంఘాల ప్రతినిధులు

మాజీ సీఎం SM కృష్ణ కన్నుమూత

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ ఈరోజు కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్‌ఎం కృష్ణ 92 ఏళ్ల వయస్సులో ఈరోజు తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు.

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ ఈరోజు కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్‌ఎం కృష్ణ 92 ఏళ్ల వయస్సులో ఈరోజు తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు.

వృద్ధాప్యం కారణంగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణను తొలుత వైదేహి ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. డా. సత్యనారాయణ మైసూర్, డా. సునీల్ కారంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందించింది.

SM కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రి. తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అతను డిసెంబర్ 1989 నుండి జనవరి 1993 వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశాడు. 1971 నుండి 2014 వరకు, అతను వివిధ సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

చాలా కాలంగా కాంగ్రెస్‌లో గుర్తింపు పొందిన ఎస్.ఎం.కృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా 2017 మార్చిలో బీజేపీలో చేరారు. ఆయన చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరినప్పుడు బహిరంగంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

మైసూర్‌లోని మహారాజా కళాశాలలో పట్టభద్రుడయ్యాక బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదివాడు. తరువాత, అతను USA లోని టెక్సాస్ రాష్ట్రంలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో చదివాడు. SM కృష్ణ వాషింగ్టన్‌లోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ను అందుకున్నారు.

2021 ఆగస్టులో మద్దూరు పట్టణాన్ని సందర్శించిన S.M. కృష్ణ రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి మాట్లాడారు. వయసు మీద పడడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటువ్నట్లు వెల్లడించారు. దాదాపు 55 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. ఇంకెన్నాళ్లు రాజకీయాల్లో ఉండగలనని అన్నారు.

గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

డిసెంబర్ 15, 16 తేదీల్లో రోజుకు రెండేసి సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనుంది. ఈరోజు ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది.

గ్రూప్‌-2 హాల్ టికెట్లను టీజీపీఎస్సీ ఇవాళ(సోమవారం) విడుదల చేసింది. అభ్యర్థులు ఈరోజు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో రోజుకు రెండేసి సెషన్ల చొప్పున పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. పరీక్షలకు ఒకరోజు ముందు.. అంటే.. వచ్చేనెల 14వ తేదీ వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ ఉంటుందని వివరించింది.

15వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1(జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌), మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2(చరిత్ర, పాలిటీ, సొసైటీ), 16వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-3(ఎకానమి అండ్‌ డెవల్‌పమెంట్‌) మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్‌-4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు.. మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లను మూసివేస్తారని.. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్షలకు అనుమతించబోరని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అన్ని పరీక్షలకు ఒకే హాల్‌టికెట్‌ను వినియోగించాలని తెలిపింది.