బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం- ఏపీలో భారీ వర్షాలు
వరుస అల్పపీడనాలు, తుఫాన్లు తాకిడి కొనసాగుతూ వస్తోంది. ఒకదాని వెంట ఒకటిగా అల్పపీడనాలు ఏర్పడుతూనే ఉన్నాయి దాదాపు రెండునెలల నుంచి. ప్రతి సంవత్సరం నవంబర్/డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటం సహజమే అయినప్పటికీ- ఇప్పుడు దీని తీవ్రత మరింత పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజాగా బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర అల్పపీడనంగా రూపు దాల్చింది. ఇది వాయుగుండంగా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వచ్చే 24 నుంచి 48 గంటల్లో వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది.
అనంతరం క్రమంగా వాయవ్య దిశగా కదులుతుందని, ఆ సమయంలో దీని వేగం గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. వచ్చే 48 గంటల వ్యవధిలో శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరి, తీరప్రాంతానికి సమీపించే అవకాశం ఉంది. తమిళనాడు మధ్య- దక్షిణ ప్రాంతం వద్ద తీరం దాటొచ్చు.
ఈ తాజా అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెన్నై రీజినల్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సాయంత్రం నుంచి నాలుగు రోజుల పాటు చెన్నై సహా కడలూరు, మైలాడుథురై, నాగపట్నం, కరైకల్, చెంగల్పట్టు, విల్లుపురంలల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
తిరువారూరు, తంజావూరు, కాళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబలూర్, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, రామనాథపురం, శివగంగ, తూత్తుకూడి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయి. కేప్ కొమొరిన్ ఏరియా పరిధిలోకి వచ్చే కన్యాకుమారి, భారత్- శ్రీలంక మధ్య భాగం అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై ఐఎండీ తెలిపింది.
దీని ప్రభావం ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమపైనా తీవ్రంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. నేడు నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల చిరుజల్లులు పడొచ్చు.
గురువారం నాడు నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Dec 11 2024, 08:22