తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తిరస్కరిస్తున్నాం

సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తాము తిరస్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం దారుణమన్నారు. బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగ అని, అలాంటి బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. గ్రాండ్‌గా ఉండే తెలంగాణ తల్లిని తీసి... బీద తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి గొప్పలకు పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. విగ్రహం నమూనాను మార్చినందుకు నిరసనగా పాలాభిషేకం చేస్తున్నట్లు చెప్పారు.

ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చడం సరికాదన్నారు. జొన్నలు, మక్కలు ఇతర రాష్ట్రాల్లో కూడా పండుతాయని... కానీ పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది అన్నారు. అలాంటి బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి తొలగించారన్నారు.

తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలని పేద తల్లి విగ్రహం పెట్టారా? అని ఎద్దేవా చేశారు. విగ్రహం పెట్టామనే పేరుతో సామాన్యులకు ఇచ్చే హామీలను ఎగ్గొడతారా? అని నిలదీశారు. తొమ్మిది మంది కళాకారులను సన్మానిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిందని, మరి ఆ జాబితాలో మహిళలకు స్థానం ఎందుకు లేదో చెప్పాలన్నారు.

ఐదు కంపెనీలపై హైడ్రా కమిషనర్‌కు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైదరాబాద్‌లోని బుద్ద భవన్‌లో కలిశారు. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న పలు కంపెనీలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఆయా కంపెనీల పేర్లు ఏమిటో కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి రెండు నెలల క్రితమే తాను మాట్లాడానని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. రెండు నెలల క్రితం తాను మాట్లాడానని, ఆ తర్వాత పది రోజులకు... అనుమతులు ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని గుర్తు చేశారు.

కానీ చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాను ఫిర్యాదు చేసిన ఐదు కంపెనీలకు అనుమతులు ఇచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం... గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు.

అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఈ ఐదు సంస్థలకు సంబంధించి అనుమతులిచ్చిన అధికారులు, అండగా ఉన్న ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూఆక్రమణలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి ఉందన్నారు.

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ

కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు. ఆయన పదవికాలం పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగించేవారు కానీ డీజీపీ పదవి కాలాన్ని పొడిగించిన సందర్భాలు లేవు. ద్వారకా తిరుమలరావు పదవి కాలం పొడిగింపునకు చంద్రబాబు ప్రయత్నం చేస్తారా మరొకరికి చాన్సిస్తారా అన్నది త్వరలో తెలియనుంది. ఇప్పటికే ఆయన రిటైర్మెంట్ డేట్ పై సీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారుల్లో అత్యంత సీనియర్ ద్వారకా తిరుమలరావు, ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా తప్పించింది.నిజానికి ఆయన సీనియార్టీలో టాప్ టెన్ లో లేరు.కానీ జగన్ రెడ్డి మనోజ్ అనుకుని ఆయనకు అందలం ఎక్కించారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆయనను తప్పించి సీనియర్టీలో మొదటిస్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావును కూడా కాదని హరీష్ కుమార్ గుప్తాకు చాన్సిచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తరవాత కొన్నాళ్లు గుప్తానే డీజీపీగానే ఉన్నారు కానీ తర్వాత ద్వారకా తిరుమలరావుకు చాన్సిచ్చారు.

చంద్రబాబు డీజీపీ విషయంలో నిబంధనల ప్రకారం వెళ్తారు. సీనియార్టీకి గౌరవం ఇస్తారు. అదేసమయంలో సమర్తత చూస్తారు. సీనియార్టీ ఉన్నా.. అంచనాలకు అనుగుణంగా పని చేస్తారని అనుకోకపోతే పదవి ఇవ్వరు. ద్వారకా తిరుమలరావు తర్వాత మళ్లీ హరీష్ గుప్తాకే చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరు డీజీపీగా ఉన్నా.. వైసీపీ హాయాంలో సవాంగ్, రాజేంద్రనాథ్ రెడ్డి తరహాలో విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం మాత్రం ఉండదని గుర్తు చేస్తున్నారు.

మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద మీడియా ప్రతినిధుల పైన బౌన్సర్లు దాడి

చంద్రగిరి మండలం ఏ. రంగంపేట మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధులు జర్నలిస్ట్ ఉమాశంకర్, కెమెరామెన్ నరసింహ ల పై విచక్షణ రహితంగా దాడి. గాయాలైన ఇరువురిని స్థానిక చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

మీడియా ప్రతినిధుల పై దాడి చేయాడాన‌్ని ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి ప్రెస్ క్లబ్ నాయకులు, సభ్యులు.

జర్నలిస్టులపై భౌతిక దాడి చేయడమే, కాక కెమెరాలను, సెల్ ఫోన్ లను లాక్కొని ధ్వంసం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టుల సంఘాలు 

దాడికి కారకులైన బౌన్సర్లు పిఆర్ఓ లపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డి కోరిన ప్రెస్ క్లబ్ నాయకులు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు

ప్రజాస్వామ్యంలో మీడియాపై దౌర్జన్యం చేయటం సహించరాని చర‌్య అని దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరిన మీడియా సంఘాల ప్రతినిధులు

మాజీ సీఎం SM కృష్ణ కన్నుమూత

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ ఈరోజు కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్‌ఎం కృష్ణ 92 ఏళ్ల వయస్సులో ఈరోజు తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు.

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ ఈరోజు కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్‌ఎం కృష్ణ 92 ఏళ్ల వయస్సులో ఈరోజు తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు.

వృద్ధాప్యం కారణంగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణను తొలుత వైదేహి ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. డా. సత్యనారాయణ మైసూర్, డా. సునీల్ కారంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందించింది.

SM కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రి. తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అతను డిసెంబర్ 1989 నుండి జనవరి 1993 వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశాడు. 1971 నుండి 2014 వరకు, అతను వివిధ సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

చాలా కాలంగా కాంగ్రెస్‌లో గుర్తింపు పొందిన ఎస్.ఎం.కృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా 2017 మార్చిలో బీజేపీలో చేరారు. ఆయన చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరినప్పుడు బహిరంగంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

మైసూర్‌లోని మహారాజా కళాశాలలో పట్టభద్రుడయ్యాక బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదివాడు. తరువాత, అతను USA లోని టెక్సాస్ రాష్ట్రంలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో చదివాడు. SM కృష్ణ వాషింగ్టన్‌లోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ను అందుకున్నారు.

2021 ఆగస్టులో మద్దూరు పట్టణాన్ని సందర్శించిన S.M. కృష్ణ రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి మాట్లాడారు. వయసు మీద పడడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటువ్నట్లు వెల్లడించారు. దాదాపు 55 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. ఇంకెన్నాళ్లు రాజకీయాల్లో ఉండగలనని అన్నారు.

గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

డిసెంబర్ 15, 16 తేదీల్లో రోజుకు రెండేసి సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనుంది. ఈరోజు ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది.

గ్రూప్‌-2 హాల్ టికెట్లను టీజీపీఎస్సీ ఇవాళ(సోమవారం) విడుదల చేసింది. అభ్యర్థులు ఈరోజు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో రోజుకు రెండేసి సెషన్ల చొప్పున పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. పరీక్షలకు ఒకరోజు ముందు.. అంటే.. వచ్చేనెల 14వ తేదీ వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ ఉంటుందని వివరించింది.

15వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1(జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌), మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2(చరిత్ర, పాలిటీ, సొసైటీ), 16వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-3(ఎకానమి అండ్‌ డెవల్‌పమెంట్‌) మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్‌-4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు.. మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లను మూసివేస్తారని.. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్షలకు అనుమతించబోరని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అన్ని పరీక్షలకు ఒకే హాల్‌టికెట్‌ను వినియోగించాలని తెలిపింది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 వరకు వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సభలో వెల్లడించారు. ఈ విగ్రహావిష్కరణకు అందరూ రావాలంటూ సభాముఖంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు, సభ్యులు తమ తమ అభిప్రాయాలను తెలిపారు. 

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం నమూనా అంశంపై వివరణ ఇచ్చారు. విగ్రహం నమూనా మార్పుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారికంగా జరుపుకోవాలని సభలో నిర్ణయించారు. అనంతరం సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్

ఏపీలో జాతీయ రహదారులతో సమానంగా రాష్ట్ర రహదారులు సైతం టోల్ బాదుడుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన రహదారులను అభివృద్ధి చేసి వాటిపై టోల్ మోత మోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ముందుగా 16 నగరాల్లో రోడ్లను ఎంపిక చేశారు. వాటిని అభివృద్ది చేసేందుకు అధికారులు రెడీ చేసిన ప్లాన్ కు త్వరలో ప్రభుత్వం ఆమోదముద్ర వేయబోతోంది. అనంతరం టెండర్లు పిలుస్తారు.

రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు పరిధిలో రోడ్లను పీపీపీ విధానంలో కాంట్రాక్టర్ రోడ్డు వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవడం అభివృద్ధి చేసేందుకు అధికారుల ప్లాన్ రెడీ చేశారు. ఇందులో భాగంగా 16 నగరాల్లో ఉన్న 642.90 కిలోమీటర్ల మేర రోడ్లను ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి, నిర్వహణకు త్వరలో టెండర్లు పిలుస్తారు. అనంతరం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పని ప్రారంభిస్తారు.

రాష్ట్రంలో ఇలా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన మొత్తం 642.90 కిలోమీటర్ల రోడ్లలో విశాఖపట్నంలోనే అత్యధికంగా 253.05 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఆ తర్వాత నెల్లూరులో 83 కిలోమీటర్లు గుంటూరులో 60 కిలోమీటర్లు కాకినాడలో 39 కిలోమీటర్లు విజయనగరంలో 33 కిలోమీటర్లు చిత్తూరులో 29 కిలోమీటర్లు కడపలో 28 కిలోమీటర్లు అనంతపురంలో 21 కిలోమీటర్లు తిరుపతిలో 19 కిలోమీటర్లు విజయవాడలో 17 కిలోమీటర్లు శ్రీకాకుళంలో 12 కిలోమీటర్లు మచిలీపట్నంలో 11 కిలోమీటర్లు ఉన్నాయి. అలాగే కర్నూలు రాజమండ్రిలో 7 కిలోమీటర్ల చొప్పున ఏలూరులో 5 కిలోమీటర్లు ఉన్నాయి.

వీటిని కాంట్రాక్టర్లకు టెండర్ విధానంలో కట్టబెడతారు. అనంతరం కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణంతో పాటు పదేళ్ల పాటు దాని నిర్వహణ చూడాల్సి ఉంటుంది. మధ్యలో రిపేర్లు వచ్చినా వారిదే బాధ్యత. అలాగే వీటిపై టోల్ ట్యాక్స్ తో పాటు ప్రకటనల ద్వారా కూడా ఆదాయం సంపాదించుకునే అవకాశం వారికి కల్పిస్తారు.

ఢిల్లీ ఎన్నికలకు రెండో జాబితా ప్రకటన

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు మూడు నెలలు ఉండగా.. ముందుగానే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. గత నెలలోనే మొదటి జాబితా ప్రకటించిన కేజ్రీవాల్.. తాజాగా, 20 మందితో కూడిన రెండో జాబితాను సోమవారం ప్రకటించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్.. జైల్లో ఉన్నప్పుడు సీఎంగానే కొనసాగారు. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత జైలుపై విడుదలైన కేజ్రీవాల్.. రాజీనామా చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 20 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను సోమవారం ప్రకటించారు. గత నెలలో 11 మందితో మొదటి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా జాబితాలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా పలు కీలక నేతలు రెండో జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ప్రతాపర్‌గంజ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మనీశ్ సిసోడియాకు జంగ్‌పుర నుంచి బరిలోకి దిగుతున్నారు. అవద్ ఓజాను ప్రతాపర్‌గంజ్ సీటు కేటాయించారు. రెండు జాబితాల్లో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో 39 సీట్లకు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

2010 నుంచి జంగ్‌పుర్‌లో ఆప్ విజయం సాధిస్తూ వస్తోంది. 2013 ఎన్నికల్లో అక్కడ నుంచి గెలిచిన ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మనీంద్ సింద్ ధిర్ బీజేపీలో చేరారు. దీంతో ప్రవీణ్ కుమార్‌కు కేజ్రీవాల్ అవకాశం ఇచ్చి 2015, 2020 ఎన్నికల్లో గెలిపించారు. ఈసారి అక్కడ నుంచి మనీశ్ సిసోడియా బరిలోకి దిగుతున్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంపై ఈడీ కేసులో మనీశ్ సిసోడియా అరెస్టై.. బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఇక, ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలతో ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయగా.. విడుదలైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. తన స్థానంలో అతీషిని ముఖ్యమంత్రిగా నియమించారు.

తనకు జంగ్‌పుర నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించిన కేజ్రీవాల్‌కు సిసోడియా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ‘ఢిల్లీలో విద్యా ఉద్యమానికి కేంద్రమైన ప్రతాపర్‌గంజ్‌.. విద్యావేత్త అవధ్ ఓజా ఆప్‌లో చేరగానే ఆయనకు ఆ సీటు ఉత్తమనని భావించాను... తాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దిన ప్రతాపర్‌గంజ్‌కు బదులు జంగ్‌పుర నుంచి నేను పోటీకి సిద్ధం. సిసోడియా ట్వీట్ చేశారు.

గత ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసందే. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీ విజయబావుటా ఎగురువేసింది. 2019, 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈనేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఎలాగైనా పాగావేయాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గెలుపు సాధించాలనే లక్ష్యం ఈసారైనా నేరవేరుతుందా లేదా అనేది మరికొద్ది నెలల్లో తేలిపోనుంది.

హైదరాబాదీలకు అలర్ట్ ఆ రూట్‌లన్నీ బంద్

నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలు, సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.

నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలు, సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేసింది. సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫింక్ ఆంక్షలు ఉంటాయిని ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలు, విపక్ష పార్టీల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలు సహా ప్రముఖులు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ పరిసర ప్రాంతాలు పోలీస్ పహారాతో ఉండనున్నాయి. ప్రముఖ రద్దీ నేపథ్యంలో.. సచివాలయం మార్గంలో వెళ్లే వాహనాలన్నింటినీ రూట్ మళ్లించనున్నారు.