ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్

ఏపీలో జాతీయ రహదారులతో సమానంగా రాష్ట్ర రహదారులు సైతం టోల్ బాదుడుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన రహదారులను అభివృద్ధి చేసి వాటిపై టోల్ మోత మోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ముందుగా 16 నగరాల్లో రోడ్లను ఎంపిక చేశారు. వాటిని అభివృద్ది చేసేందుకు అధికారులు రెడీ చేసిన ప్లాన్ కు త్వరలో ప్రభుత్వం ఆమోదముద్ర వేయబోతోంది. అనంతరం టెండర్లు పిలుస్తారు.

రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు పరిధిలో రోడ్లను పీపీపీ విధానంలో కాంట్రాక్టర్ రోడ్డు వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవడం అభివృద్ధి చేసేందుకు అధికారుల ప్లాన్ రెడీ చేశారు. ఇందులో భాగంగా 16 నగరాల్లో ఉన్న 642.90 కిలోమీటర్ల మేర రోడ్లను ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి, నిర్వహణకు త్వరలో టెండర్లు పిలుస్తారు. అనంతరం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పని ప్రారంభిస్తారు.

రాష్ట్రంలో ఇలా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన మొత్తం 642.90 కిలోమీటర్ల రోడ్లలో విశాఖపట్నంలోనే అత్యధికంగా 253.05 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఆ తర్వాత నెల్లూరులో 83 కిలోమీటర్లు గుంటూరులో 60 కిలోమీటర్లు కాకినాడలో 39 కిలోమీటర్లు విజయనగరంలో 33 కిలోమీటర్లు చిత్తూరులో 29 కిలోమీటర్లు కడపలో 28 కిలోమీటర్లు అనంతపురంలో 21 కిలోమీటర్లు తిరుపతిలో 19 కిలోమీటర్లు విజయవాడలో 17 కిలోమీటర్లు శ్రీకాకుళంలో 12 కిలోమీటర్లు మచిలీపట్నంలో 11 కిలోమీటర్లు ఉన్నాయి. అలాగే కర్నూలు రాజమండ్రిలో 7 కిలోమీటర్ల చొప్పున ఏలూరులో 5 కిలోమీటర్లు ఉన్నాయి.

వీటిని కాంట్రాక్టర్లకు టెండర్ విధానంలో కట్టబెడతారు. అనంతరం కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణంతో పాటు పదేళ్ల పాటు దాని నిర్వహణ చూడాల్సి ఉంటుంది. మధ్యలో రిపేర్లు వచ్చినా వారిదే బాధ్యత. అలాగే వీటిపై టోల్ ట్యాక్స్ తో పాటు ప్రకటనల ద్వారా కూడా ఆదాయం సంపాదించుకునే అవకాశం వారికి కల్పిస్తారు.

ఢిల్లీ ఎన్నికలకు రెండో జాబితా ప్రకటన

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు మూడు నెలలు ఉండగా.. ముందుగానే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. గత నెలలోనే మొదటి జాబితా ప్రకటించిన కేజ్రీవాల్.. తాజాగా, 20 మందితో కూడిన రెండో జాబితాను సోమవారం ప్రకటించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్.. జైల్లో ఉన్నప్పుడు సీఎంగానే కొనసాగారు. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత జైలుపై విడుదలైన కేజ్రీవాల్.. రాజీనామా చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 20 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను సోమవారం ప్రకటించారు. గత నెలలో 11 మందితో మొదటి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా జాబితాలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా పలు కీలక నేతలు రెండో జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ప్రతాపర్‌గంజ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మనీశ్ సిసోడియాకు జంగ్‌పుర నుంచి బరిలోకి దిగుతున్నారు. అవద్ ఓజాను ప్రతాపర్‌గంజ్ సీటు కేటాయించారు. రెండు జాబితాల్లో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో 39 సీట్లకు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

2010 నుంచి జంగ్‌పుర్‌లో ఆప్ విజయం సాధిస్తూ వస్తోంది. 2013 ఎన్నికల్లో అక్కడ నుంచి గెలిచిన ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మనీంద్ సింద్ ధిర్ బీజేపీలో చేరారు. దీంతో ప్రవీణ్ కుమార్‌కు కేజ్రీవాల్ అవకాశం ఇచ్చి 2015, 2020 ఎన్నికల్లో గెలిపించారు. ఈసారి అక్కడ నుంచి మనీశ్ సిసోడియా బరిలోకి దిగుతున్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంపై ఈడీ కేసులో మనీశ్ సిసోడియా అరెస్టై.. బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఇక, ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలతో ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయగా.. విడుదలైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. తన స్థానంలో అతీషిని ముఖ్యమంత్రిగా నియమించారు.

తనకు జంగ్‌పుర నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించిన కేజ్రీవాల్‌కు సిసోడియా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ‘ఢిల్లీలో విద్యా ఉద్యమానికి కేంద్రమైన ప్రతాపర్‌గంజ్‌.. విద్యావేత్త అవధ్ ఓజా ఆప్‌లో చేరగానే ఆయనకు ఆ సీటు ఉత్తమనని భావించాను... తాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దిన ప్రతాపర్‌గంజ్‌కు బదులు జంగ్‌పుర నుంచి నేను పోటీకి సిద్ధం. సిసోడియా ట్వీట్ చేశారు.

గత ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసందే. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీ విజయబావుటా ఎగురువేసింది. 2019, 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈనేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఎలాగైనా పాగావేయాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గెలుపు సాధించాలనే లక్ష్యం ఈసారైనా నేరవేరుతుందా లేదా అనేది మరికొద్ది నెలల్లో తేలిపోనుంది.

హైదరాబాదీలకు అలర్ట్ ఆ రూట్‌లన్నీ బంద్

నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలు, సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.

నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలు, సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేసింది. సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫింక్ ఆంక్షలు ఉంటాయిని ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలు, విపక్ష పార్టీల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలు సహా ప్రముఖులు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ పరిసర ప్రాంతాలు పోలీస్ పహారాతో ఉండనున్నాయి. ప్రముఖ రద్దీ నేపథ్యంలో.. సచివాలయం మార్గంలో వెళ్లే వాహనాలన్నింటినీ రూట్ మళ్లించనున్నారు.

నటి జత్వాని కేసు విద్యాసాగర్ బెయిల్‌పై సోమవారం తీర్పు

నటి జత్వాని కేసులో నిందితుడు విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5న హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. సోమవారం (9వ తేదీ) తీర్పు వెల్లడించనున్నట్లు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వాని కేసు (Mumbai Actor Jethwani Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు, వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader) కుక్కల విద్యాసాగర్(Vidyasagar) బెయిల్‌ (Bail)పై సోమవారం హైకోర్టు (High Court) తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కుక్కల విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేశాడు. జత్వానీ, పోలీసుల తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీ నారాయణ కోర్టులో వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు కేసును ప్రభావితం చేస్తారని తెలిపారు. అలాగే నిందితుడు తరుపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడు ఇప్పటికే 76 రోజులుగా జైలులో ఉన్నాడని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. దీంతో ఈ కేసుపై తీర్పును హైకోర్టు సోమవారం నాటికి వాయిదా వేసింది.

విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5న సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. వరుసగా మంగళ, బుధవారాల్లో హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. సోమవారం బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

కాగా ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాదంబరి కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులు ముంబైలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్‌ వద్ద అరెస్టు చేశారు. అక్కడి మూడో అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చిన తర్వాత ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు.

తనపై తప్పుడు కేసు నమోదుచేసి మానసికంగా వేధించారని కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, పలువురు పోలీసు అధికారులపై జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఈ నెల 13న కేసు నమోదు చేశారు. ఇందులో కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. జెత్వానీ విజయవాడకు వచ్చి వాంగ్మూలం ఇచ్చినప్పటి నుంచి విద్యాసాగర్‌ పరారీలో ఉన్నారు. తాను నమోదు చేయించిన కేసుకు సంబంధించిన వివరాలు మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా కాదంబరి వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఉన్నతాధికారులు విచారణాధికారిని నియమించారు. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌లోని ఏసీపీ స్రవంతిరాయ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమె కాదంబరితో పాటు తండ్రి నరేంద్రకుమార్‌ జెత్వానీ, తల్లి ఆశా జెత్వానీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. 100 పేజీలతో విచారణ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. కాదంబరి మొత్తం నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మూడుసార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అజ్ఞాతంలోకి వెళ్లిన విద్యాసాగర్‌ను పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.

ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ముగ్గురి సస్పెన్షన్ ఫైల్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా వేటు పడింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 1590, 1591,1592 విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని వెబ్‌సైట్‌లో ప్రభుత్వం పేర్కొంది

అసెంబ్లీ గేట్టు వద్ద టీషర్ట్‌ రచ్చ బీఆర్ఎస్‌ నేతలు అరెస్ట్‌

అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. టీ షర్ట్స్‌ ధరించడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను అదుపులో తీసుకున్నారు. టీ షర్ట్స్‌ ధరించి రావద్దంటూ అడ్డుకున్నారు. ఎందుకు రాకూడదంటూ బీఆర్ఎస్ నేతలు వాదించారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాగా.. మొదటి రోజు శాసనసభ సమావేశానికి బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్కు దగ్గర నివాళులు అర్పించారు. అక్కడ నుంచి అసెంబ్లీ సమావేశాలకు బయలు దేరారు.

టీ షర్ట్ పై అదాని, రేవంత్ దోస్తీ అని ఉండటంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదాని, రేవంత్ భాయి భాయి అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టీ షర్ట్స్ ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారంటూ కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు చేశారు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ గేటు వద్దకు బీఆర్ఎస్ నేతలు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులో తీసుకున్నారు.

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు.

తెలంగాణ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు. అలాగే ఈరోజు శాసన సభ ముందుకు ఐదు ఆర్డినెన్సులు, రెండు వార్షిక నివేదికలు రానున్నాయి. ఉద్యోగుల జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్సును ముఖ్యమంత్రి సభలో ప్రవేశ పెట్టనున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (సవరణ) ఆర్డినెన్సు 2024 ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

అలాగే హైదరాబాదు మహానగర పాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్సు 2024, తెలంగాణ వస్తువుల సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్సు 2024ను మంత్రి సీతక్క సభలో ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక 2022-23 ప్రతిని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సభకు నివేధించనున్నారు. మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక 2021-22 ప్రతిని సభకు నివేదించనున్నారు.

నేడు రేపు వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమ మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ప్రభావం ఉంటుందని పేర్కొంది. వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని పేర్కొంది. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం దంచికొట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో 7.5, యాదరిగిగుట్లలో 6.3, మూతకొండూరులో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన వర్షానికి రహదారులు జలమయ్యాయి. ఆమనగల్లు, షాద్‌నగర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరోబోసిన ధాన్యం తడిచిపోయింది. రంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వికారాబాద్ యువకుడికి జాక్‌పాట్.. రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం

వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన యువకుడికి అరుదైన అవకాశం దక్కింది. గ్రామానికి చెందిన అర్బాజ్‌ ఖురేషీ అనే యువకుడు ప్రఖ్యాత అమెజాన్ సంస్థలో కళ్లుచెదిరే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. ఏడాదికి రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందాడు. దీంతో గ్రామస్తులు అతడిని అభినందిస్తున్నారు.

వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు తన ప్రతిభతో లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్ ఐటీ కంపెనీ అమెజాన్‌లో కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. జిల్లాలోని బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్‌ ఖురేషీ అమెజాన్‌లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అప్లైడ్‌ సైంటిస్ట్‌ ఉద్యోగానికి రూ. 2 కోట్ల ప్యాకేజీతో ఎంపికయ్యారు. ఇప్పటికే ఆఫర్ లెటర్ అందుకోగా.. నేడు ఉద్యోగంలో చేరనున్నారు.

ఐఐటీ పట్నా నుంచి 2019లో ఖురేషీ కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. బీటెక్ మూడో సంవత్సరంలో ఉండగానే.. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మెషిన్‌ లెర్నింగ్‌ ఎక్స్‌ఫర్ట్ గేల్‌ డయాస్‌ వద్ద 3 నెలలు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌లో రెండేళ్ల పాటు పనిచేశారు. 2023లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్‌ లెర్నింగ్‌లో ఎంఎస్‌ పట్టా అందుకున్నాడు. తాజాగా.. అమెజాన్ ఐటీ సంస్థలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఖురేషీ తండ్రి యాసిన్‌ ఖురేషీ ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌గా పని చేస్తున్నారు. కొడుకు ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించటం పట్ల తల్లిదండ్రులతో పాటుగా.. గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.

నిరుపేద విద్యార్థికి రూ.2 కోట్ల ప్యాకేజీతో గూగుల్‌లో ఉద్యోగంబీహార్‌‌కు చెందిన యువకుడు అభిషేక్‌ కుమార్‌ సైతం ఈ ఏడాది రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. గూగుల్‌ లండన్‌ ఆఫీస్‌లో అతడికి రూ.2 కోట్ల జీతంతో ఉద్యోగం ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్‌‌లోనే అతడు ఉద్యోగంలో చేరాడు. బీహార్‌లోని జముయి జిల్లాలోని జము ఖరియా అనే మారుమూల గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్ పట్నా ఎన్‌ఐటీలో బీటెక్‌ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబం, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అభిషేక్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. మొదట్నుంచి చదువులో ప్రతిభకనబరిచే అభిషేక్‌.. చాలా మంది డ్రీమ్‌ జాబ్‌ అయిన గూగుల్‌లో అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించి చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు.

తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకున్న రాజకీయం

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ మహిళా రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని.. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి పోటీగా సోమవారం మేడ్చల్‌లో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.

తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) హీటెక్కాయి. తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Thalli Statue) చుట్టూ రాజకీయాలు రాజకుంటున్నాయి. ప్రభుత్వం (Govt.), బీఆర్ఎస్ (BRS) పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సాధారణ మహిళా రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని.. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి పోటీగా సోమవారం మేడ్చల్‌లో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సచివాలయంలో దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొ ననున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. లక్ష మంది జనసమీకరణ నేపథ్యంలో సచివాలయం పరిసర ప్రాంతాల ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించనున్నారు. విగ్రహావిష్కరణ నుంచి రాత్రి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విగ్రహావిష్కరణ, బహిరంగ సభ తరువాత రాత్రి 7.30 గంటలకు ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద డ్రోన్‌ షో, 8గంటలకు బాణసంచా ప్రదర్శన ఉంటుంది. అనంతరం హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్‌ నేతృత్వంలో మ్యూజికల్‌ కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోని ప్రధాన ద్వారం ఎదురుగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విగ్రహావిష్కరణ నేపథ్యంలో విగ్రహానికి రెండువైపులా వేదికలను సిద్ధం చేశారు. ఎడమ వైపు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా ఒక వేది కను, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మరో వేదికను సిద్ధం చేశారు. ఈ రెండు వేదికలకు ఎదురుగా అతిథులు, ప్రముఖులతో పాటు మహిళలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన తెలంగాణ తల్లి విగ్రహం పలు వివాదాలు, ఆరోపణల నడుమ సోమవారం ఆవిష్కరణ కాబోతోంది. గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని, దొరసాని తరహాలో ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబరులో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహంపై దృష్టిపెట్టింది. విగ్రహం ఎలా ఉండాలనే దానిపై సమాలోచనలు జరిపి.. ప్రస్తుత విగ్రహాన్ని రూపొందించారు. అయితే కాంగ్రెస్‌ ఆవిష్కరించబోయే విగ్రహ నమూనాను విడుదల చేసినప్పటి నుంచి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తోంది. అధికార పార్టీ రూపొందించిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్‌ తల్లి అంటూ తీవ్రంగా విమర్శించారు. ఇక గత విగ్రహంలో ఉన్నట్లుగా కిరీటం ప్రస్తుత విగ్రహంలో ఎందుకు లేదంటూ కూడా ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ సోమవారంతో ముగియనున్నాయి.

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి నడుచుకుంటూ తన చాంబర్‌కు వెళ్లారు.

కాగా అధికార కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కౌంటర్ కార్యక్రమం చేపట్టింది. సోమవారం సచివాలయంలో ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించనుంది. ఈ విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టిస్తోంది తెలంగాణ తల్లి కాదుని.. కాంగ్రెస్ తల్లి అని అంటున్నారు. తెలంగాణ తల్లి పాత విగ్రహ రూపాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కౌంటర్‌గా మేడ్చల్‌లో తెలంగాణ తల్లి పాత రూపం విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రతిష్టిస్తోన్న సమయంలోనే.‌. మేడ్చల్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు.

మంచు మనోజ్‌కు గాయాలు

సినీ నటుడు, మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. మోహన్ బాబుతో జరిగిన ఘర్షణలో గాయాలవడంతో అతను ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.

సినీ నటుడు, మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. మోహన్ బాబుతో జరిగిన ఘర్షణలో గాయాలవడంతో అతను ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆస్తి విషయంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు అనుచరులు వినయ్ తనపై దాడి చేసినట్లు మనోజ్ ఆరోపించారు. వినయ్‌తో పాటు.. మరికొందరు కూడా తనను కొట్టారని మనోజ్ ఆరోపించారు. ఇప్పటికే ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

ఈ ఘర్షణలో మనోజ్‌ కాలికి బలమైన గాయాలయ్యాయట. దీంతో మనోజ్‌ను ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. బంజారాహిల్స్‌లోని టీఎక్స్ హాస్పిటల్‌లో మనోజ్‌ను చేర్పించారు. ఆయన భార్య భూమా మౌనిక మరికొంత మందితో ఆస్పత్రికి వచ్చిన ఆయన.. అడ్మిట్ అయ్యారు. కాళ్లకు బలమైన గాయం కావడంతో.. వైద్యులు మనోజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.