భారత్‌ను అస్థిరపరిచే కుట్ర
అమెరికా విదేశాంగ శాఖపై బీజేపీ నిప్పులు చెరిగింది. భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించింది.
అమెరికా విదేశాంగ శాఖపై బీజేపీ నిప్పులు చెరిగింది. భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. పరిశోధనాత్మక జర్నలిస్టులు సహా భారత విపక్ష నాయకుడు రాహుల్‌గాంధీతో కలిసి ఈ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ విమర్శలు రాజకీయంగా పెను సంచలనానికి దారి తీశాయి. అమెరికా-భారత్‌ల మధ్య రెండు దశాబ్దాలుగా సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ కేంద్రంగా అమెరికా దర్యాప్తు సంస్థ చేసిన ఆరోపణలు.. ప్రస్తుతం బీజేపీ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. ఆర్గనైజ్డ్ క్రైం, కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్‌పీ) కథనాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ అదానీ గ్రూపుపై ఏకపక్షంగా విమర్శలు చేస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. మోదీ ప్రభుత్వాన్ని అణిచివేయాలని భావిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూపుపై ఎఫ్‌బీఐ చేసిన లంచాల ఆరోపణలను బీజేపీ నిరాధారమైనవని కొట్టిపారేసింది.
అదేవిధంగా ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిని.. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు దుయ్యబడుతున్నారన్న ఓసీసీఆర్‌పీ కథనాలను కూడా ఖండించింది. తాజాగా ఓసీసీఆర్‌పీ, 92ఏళ్ల జార్జ్ సొరో్‌సలపై స్పందిస్తూ.. వీరికి అమెరికానే నేరుగా 50 శాతం నిధులు సమకూరుస్తోందని, ఈ విషయాన్ని ఫ్రెంచ్ మీడియా పేర్కొందని బీజేపీ తెలిపింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని భారత్‌ను అస్థిరపరిచేందుకు డీప్ స్టేట్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక.. అమెరికా విదేశాంగ శాఖ అజెండా స్పష్టంగా కనిపిస్తోంది అని బీజేపీ ఎక్స్‌లో పేర్కొంది. కాగా బీజేపీ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు.
వృత్తిపరమైన అభివృద్ధి కోసం జర్నలిస్టులకు అమెరికా ప్రభుత్వం మద్దతిస్తుందని పేర్కొన్నారు. దీనర్థం. ఆయా పత్రికల ఎడిటోరియల్ నిర్ణయాలను ప్రభావితం చేయడం కాదని తెలిపారు భారత అధికార పార్టీ(బీజేపీ) ఇలాంటి ఆరోపణలు చేయడం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది అని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్న దేశం తమదేనని తెలిపారు.
Dec 08 2024, 18:11