తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ అవసరమా
తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ అవసరమా అని విమలక్క ప్రశ్నించారు. తెలంగాణ తల్లిపై చర్చ జరగడం బాధగా ఉందన్నారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Talli Statue) అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రజా గాయకురాలు విమలక్క (Vimalakka) శనివారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లిపై చర్చ జరగడం బాధగా ఉందన్నారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించడం లేదన్నారు. ప్రభుత్వంపై నిరసన మొదలైందన్నారు. ఎక్కడ విజయం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన పనితీరుపై సమీక్షించుకోవాలని హితవుపలికారు. ఏం హామీలు ఇచ్చాం.. ఏం చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలన్నారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ కావాలని పోరాడితే వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం సమీక్షించుకోవాలని విమలక్క వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం దొరసానిలా ఉందని.. తాము అధికారంలోకి రాగానే అసలైన తెలంగాణ విగ్రహాన్ని రూపొందిస్తామని ఎన్నికల్లో చెప్పిన విధంగానే నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది కాంగ్రెస్ సర్కార్. అలాగే విగ్రహ ఆవిష్కరణకు కూడా అంతా సిద్ధమైంది. ఈ విగ్రహావిష్కరణకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించాలని కూడా సర్కార్ నిర్ణయించింది. కాగా.. తెలంగాణ తల్లి రూపం మార్పు రాజకీయంగా చర్చకు దారి తీసింది.
3 అడుగుల గద్దెపై 17 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి కాంస్య విగ్రహ నమూనాను తెలంగాణ ప్రభుత్వం నిన్న( శుక్రవారం) విడుదల చేసింది. బంగారు రంగు అంచుతో ఆకుపచ్చ చీర! రెండు చేతులకు ఎరుపు, ఆకు పచ్చ రంగు గాజులు! ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకులు! కాళ్లకు మెట్టెలు, పట్టీలు! మెడలో బంగారపు గొలుసులు! నుదుట రూపాయి కాసంత ఎర్రటి బొట్టుతో నిండైన గ్రామీణ మహిళ రూపంతో తెలంగాణ తల్లి తాజా విగ్రహాన్నిరేవంత్ ప్రభుత్వం రూపొందించింది. సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విగ్రహం రూపుదిద్దుకుంది.
మరోవైపు ఈనెల 9న సెక్రటేరియట్ ఆవరణలో ఆవిష్కరణ కానున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను ఆపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జూలూరి గౌరీ శంకర్.. హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిల్ వేశారు.
Dec 08 2024, 09:26