హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా అయితే జాగ్రత్త
కల్తీ ఆహారానికి కేరాఫ్ అడ్రస్‌గా భాగ్యనగరం మారిపోతోంది. రెస్టారెంట్లు, హోటళ్లలో తినే ఆహారంలో రోజుకో వస్తువు బయటపడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో బయట ఫుడ్ తినాలంటేనే భాగ్యనగర వాసులు భయపడే పరిస్థితికి దారితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రతీ ఒక్కరూ లొట్టలేసుకుని మరీ తింటుంటారు.
మీకు బిర్యానీ అంటే ఇష్టమా.. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ (Hyderabad Biryani) అంటే లొట్టలేసుకుంటారా.. అయితే మీరు కచ్చితంగా అనారోగ్యానికి గురికాక తప్పదు. ఇటీవల కాలంలో పలు రెస్టారెంట్లు, హోటళ్లలో బిర్యానీలో బయటపడుతున్న విస్తుపోయే విషయాలే ఇందుకు ప్రధాన కారణం. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. సెలబ్రటీల నుంచి సామాన్య ప్రజల వరకు హైదరాబాద్ బిర్యానీ ఫ్యాన్సే. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. అందుకు వ్యాపారస్తుల నిర్లక్ష్యమే కారణం. బిర్యానీ తయారు చేసే సమయంలో వారి నిర్లక్ష్యం కారణంగా అది కల్తీ అవుతోంది. హోటల్స్‌లోని వంటశాలలు పరిశుభ్రంగా ఉండకపోవడంతో బిర్యానీలో బొద్దింకలు ప్రత్యక్షమవుతున్నాయి. ఎంతో ఇష్టంగా బిర్యానీని తిందామని వచ్చిన కస్టమర్లకు బిర్యానీలో ఇలాంటి కనిపించడం మింగుడుపడని విషయం.
కల్తీ ఆహారానికి కేరాఫ్ అడ్రస్‌గా భాగ్యనగరం మారిపోతోంది. రెస్టారెంట్లు, హోటళ్లలో తినే ఆహారంలో రోజుకో వస్తువు బయటపడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో బయట ఫుడ్ తినాలంటేనే భాగ్యనగర వాసులు భయపడే పరిస్థితికి దారితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రతీ ఒక్కరూ లొట్టలేసుకుని మరీ తింటుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బిర్యానీలో పలు వస్తువులతో, అనేక జీవులు బయటపడటం కనిపిస్తోంది. దీంతో ఎంతో ఇష్టంగా భావించే హైదరాబాద్ బిర్యానీని తినాలంటే ప్రజలు ఆలోచించే స్థితి నెలకొంది. వామ్మో.. హైదరాబాద్ బిర్యానీనా అనే స్థాయికి వ్యాపారస్తులు తీసుకువస్తున్నారు.
తాజాగా ఆలు కర్రీలో ఇనుప ముక్కలు.. ధమ్ బిర్యానీలో టాబ్లెట్ పీసులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఒకేరోజు రెండు ప్రముఖ రెస్టారెంట్లలో కల్తీ నిర్వాకం బయటపడింది. దీంతో వ్యాపారుల నిర్లక్ష్యం బిర్యానీ ప్రియులను భయపెట్టేలా చేస్తోంది. కల్తీ ఆహారంతో హైదరాబాదీ బిర్యానీ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. చికెన్ పీసులకు బదులు బిర్యానీల్లో బొద్దింకలు, జర్రులు, సిగరెట్ పీకలు, బల్లులు దర్శనమిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా బయటపడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారుతున్నాయి. బిర్యానీలో బయటపడుతున్న వాటిని చూసి బిర్యానీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
అయితే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కూడా తూతూ మంత్రంగా ఉన్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఫుడ్ సేఫ్టీ అధికారుల దూకుడుకు బ్రేక్ పడింది. చలానాలకు మాత్రమే ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిమితమవుతున్నారు. గడిచిన ఆరు నెలలలో బావర్చిపై 10 కేసులు.. కృతుంగా రెస్టారెంట్‌పై 8 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ.. ప్రముఖ హోటల్స్ తీరు మారకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్న(శుక్రవారం) హైదరాబాద్‌లో బావర్చి హోటల్‌లో చికెన్ బిర్యానీలో ట్యాబ్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. చికెన్ బిర్యానీ తింటున్న కస్టమర్లకు అందులో ట్యాబ్లెట్లు ప్రత్యక్షం కావడంతో.. వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలో వీడియో తీస్తున్న కస్టమర్లుపై హోటల్ యాజమాన్యం ఆగ్రహంతో ఊగిపోయింది. దాంతో బావర్చి హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల ఇదే హోటల్‌లో చోటు చేసుకున్న ఇది రెండో ఘటన. పది రోజుల క్రితం.. ఇదే బావర్చి హోటల్లో బిర్యానీలో సిగరెట్ పీకలు ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి కస్టమర్లు తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఇదే విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం.
Dec 07 2024, 15:10