చెరువులోకి దూసుకెళ్లిన కారు ఐదుగురు యువకులు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ చెరువు వద్ద విషాదం చోటు చేసుకుంది. కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు యువకులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారులో మెుత్తం ఆరుగురు ఉండగా.. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లినన ఘటనలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ చెరువు వద్ద ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. మృతులు వంశీగౌడ్, దినేష్, హర్ష, బాలు, వినయ్‌గా గుర్తించారు. చనిపోయిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో కారులో మెుత్తం ఆరుగురు యువకులు ఉండగా.. మణికంఠ అనే యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.

యువకులు హైదరాబాద్ హయత్ నగర్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. మిగతా నలుగురు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సెకీతో విద్యుత్‌ ఒప్పందం ఆపొద్దు

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ)తో చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని ఆపరాదని డిస్కమ్‌లు నిర్ణయించాయి.

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ)తో చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని ఆపరాదని డిస్కమ్‌లు నిర్ణయించాయి. సెకీ నుంచి కొనుగోలు చేస్తున్న 7,000 మెగావాట్ల విద్యుత్తును రాజస్థాన్‌, గుజరాత్‌ విద్యుదుత్పత్తి సంస్థల నుంచి సేకరించనున్నట్టు స్పష్టం చేశాయి.

2021 డిసెంబరు 1న చేసుకున్న ఒప్పందం మేరకు ఈ ఏడాది 3,000 మెగావాట్లు, 2025లో మరో 3,000 మెగావాట్లు, 2026లో మిగిలిన 1000 మెగావాట్లను సరఫరా చేస్తామని పేర్కొందని తెలిపాయి. 2025-26కి గాను ఈఆర్‌సీకి సమర్పించిన వాస్తవాదాయ నివేదికలో డిస్కమ్‌లు ఈ మేరకు పేర్కొన్నాయి. కడపలో సెకీ నిర్మిస్తున్న 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్‌ నుంచి కొనుగోలు చేసేందుకు నిరాకరించాయి. యూనిట్‌ను రూ.2.78, రూ.2.77 చొప్పున అందిస్తామంటూ సెకీ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో సెకీ నుంచి విద్యుత్తు కొనుగోలుకు డిస్కమ్‌లు నిరాకరించాయి.

సీఐడీ కేసులో హైకోర్టుకు విక్రాంత్‌రెడ్డి

తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ బాబాయి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ బాబాయి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. వాటాల బదలాయింపు వ్యవహారంలో తనకెలాంటి పాత్రా లేదని అందులో తెలిపారు. తన తండ్రి జగన్మోహన్‌రెడ్డి బంధువు, ఎంపీ అయినందున ఆయన రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసం తనపై ఫిర్యాదు చేశారని.. కేసు కూడా పెట్టారని పేర్కొన్నారు. ‘జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన్ను అపఖ్యాతిపాల్జేసేందుకే ఫిర్యాదు చేసినట్లు కనపడుతోంది

ఘటన జరిగిన నాలుగున్నరేళ్ల తర్వాత ఎందుకు కేసు పెట్టారో కారణాలను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదు. ఫిర్యాదులో కేవీరావు చేసిన ఆరోపణలకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లేవు. ప్రాథమిక విచారణ జరిపి ఫిర్యాదు వాస్తవికతను నిర్ధారించకుండానే సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. షేర్‌ హోల్డింగ్‌ కంపెనీలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.

షేర్ల బదలాయింపు ప్రక్రియ మొత్తం అక్కడే జరిగింది. కేసు నమోదు చేసేందుకు మంగళగిరి సీఐడీ పోలీసులకు ఎలాంటి అధికార పరిధీ లేదు. ఇది నేర విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. కేసు నమోదు వెనుక అధికార పార్టీ ప్రోద్బలం ఉంది. ప్రభుత్వానికి రూ.1,000 కోట్లు ఎగ్గొట్టారంటూ తప్పుడు ఆడిట్‌ రిపోర్ట్‌ ఇచ్చారని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఆడిట్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు ఎలాంటి కంప్లయింటూ ఇవ్వలేదు. వాటాల బదలాయింపు కోసం తనను, కుటుంబ సభ్యులను బెదిరించారని చేసిన ఆరోపణకు కేవీరావు ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదు. బీఎన్‌ఎస్‌ చట్టం సెక్షన్‌ 111 (వ్యవస్థీకృత నేరం) కింద నాపై కేసు నమోదు చెల్లుబాటు కాదు. నాకెలాంటి పూర్వ నేరచరిత్రా లేదు. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధం.

కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటాను. నన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లుకవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు అరెస్టు చేస్తే పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది. నా పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించేంతవరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండి అని పిటిషన్‌లో అభ్యర్థించారు. తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా అరబిందోకు బదలాయింపు చేశారని కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కేవీఆర్‌ గ్రూపులకు చెందిన కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 2న మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏ-1గా వై విక్రాంత్‌రెడ్డి, ఏ-2గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏ-3గా శరత్‌చంద్రారెడ్డి, ఏ-4గా పీకేఎఫ్‌ శ్రీఽధర్‌ అండ్‌ సంతానం ఆడిట్‌ కంపెనీ, ఏ-5గా అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను చేర్చారు.

పుష్ప-2 పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

అల్లుఅర్జున్ హీరోగా విడుదలైన పుష్ప-2 సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద మహిళ మృతి చెందిన ఘటన వ్యవహారం ఎన్‌హెచ్‌ఆర్సీకి వెళ్లింది.

పుష్ప-2’ సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో తెలిపారు. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్టు పిటిషనర్ ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై దర్యాప్తు జరపనుంది.

భారత్‌లో కొత్తగా 32 మంది బిలియనీర్లు

దేశంలో బిలియనీర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కొత్తంగా 32 మంది బిలియనీర్ల క్లబ్‌లో చేరడంతో ఈ సంఖ్య 185కు చేరింది. వీరి వద్ద ఉన్న మొత్తం సంపద ఏకంగా రూ.76 లక్షల కోట్లుగా ఉంటుందని స్విస్ బ్యాంక్ ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లపై కీలక విషయాలు తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలినీయర్ల సంపద గణనీయంగా పెరుకుతోంది. కరోనా వైరస్ వంటి మహమ్మారులు, దేశాల మధ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ బిలియనీర్ల సంపద నానాటికీ పెరుగుతుండడం గమనార్హం. గడచిన 10 ఏళ్ల కాలంలో వీరి సంపద ఏకంగా 121 శాతం పెరిగింది. దీంతో వారి వద్ద ఉన్న మొత్తం సంపద 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ బ్యాంక్ స్విస్ బ్యాంక్‌గా పేరుగాంచిన యూబీసీ ఓ నివేదిక వెల్లడించింది.

స్విస్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా 32 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. దీంతో 153గా ఉన్న బిలియనీర్ల సంఖ్య 185కు పెరిగింది. దీంతో భారత్‌లో కుబేరుల మొత్తం సంపద విలువ ఏడాది 42.1 శాతం పెరిగి 905.6 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే భారత దేశ కరెన్సీలో దీని విలువ రూ. 76 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా వ్యాపారస్థులు, టెక్ దిగ్గజాలు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

2015లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1757 మంది బిలియనీర్లు ఉండగా.. వారి సంఖ్య ప్రస్తుతం 2682కు పెరిగింది. ఈ పదేళ్ల కాలంలో వీరి మొత్తం సంపద విలువ 6.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో టెక్ బిలియనీర్ల సంపద శర వేగంగా పెరిగింది. 2015లో వీరి సంపద 788.9 బిలియన్ డాలర్లు ఉండగా ఈ ఏడాది 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. వారి తర్వాత పారిశ్రామికవేత్తల సంపద వేగంగా పెరిగింది. మరోవైపు.. 2015- 20 మధ్య చైనా బిలియనీర్ల సంపద 887.3 బిలియన్ డాలర్ల నుంచి 2.1 ట్రిలియన్ డాలర్లకుపెరిగి.. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 1.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది కొత్తగా 268 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. ఇందులో దాదాపు 60 శాతం మంది వ్యాపారస్థులే ఉండడం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికాలో కుబేరుల సంపద ఈ ఏడాది 27.6 సాతం పెరిగి 5.8 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 2024లో చైనా, హాంకాంగ్‌లో బిలియనీర్ల సంఖ్య 588 నుంచి 501కి తగ్గింది. ఇక యూఏఈలో బిలియనీర్ల ఆస్తులు 39.5 శాతం పెరిగి 138.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వరుసగా 11వ సారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. మూడు రోజుల సుదీర్ఘ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం తర్వాత, RBI గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం డిసెంబర్ 6, 2024న వడ్డీ రేట్లను ప్రకటించారు.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (RBI) శక్తికాంత దాస్ తన పదవీ కాలం చివరి ఎంపీసీ సమావేశంలో మరోసారి సామాన్యుల అంచనాలను తలకిందులు చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శుక్రవారం ప్రజల ముందుంచారు. ఈసారి కూడా రెపో రేటు పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది గత 10 సమావేశాల నుంచి ఎటువంటి మార్పు లేకుండానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, నగదు నిల్వల నిష్పత్తిని ఇప్పుడు 0.50 శాతం తగ్గించారు.

RBI గత 10 సార్లు ప్రధాన పాలసీ వడ్డీ రేటు రెపో రేటును 6.5 శాతం వద్ద మార్చకుండా కొనసాగిస్తోంది. RBI ఈ చర్య కారణంగా గృహ రుణ EMIలలో ఎటువంటి తగ్గింపు ఉండదు. శుక్రవారం ద్వైమాసిక ద్రవ్య సమీక్షను సమర్పిస్తూ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ మేరకు ప్రకటించారు. ధరల స్థిరత్వం ప్రజలకు చాలా ముఖ్యమని, అయితే వృద్ధి కూడా ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలకు ద్రవ్యోల్బణం అంతిమ గమ్యం కష్టతరంగా మారుతుందని ఆయన అన్నారు. పాలసీ రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ 4:2 మెజారిటీతో నిర్ణయించిందని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు.

ఇది రిజర్వ్ బ్యాంక్ 11వ MPC సమావేశం. దీనిలో రెపో రేటు విషయంలో ఎటువంటి మార్పు చేయలేదు. 6 MPC సభ్యులలో 4 మంది మరోసారి దానిని 6.50 శాతం వద్ద కొనసాగించడానికి అనుకూలంగా ఓటు వేశారు. అంటే సామాన్యుడి రుణంలో ఎలాంటి ఉపశమనం ఉండదని, ఈఎంఐ యథాతథంగా ఉంటుందన్నమాట. గత నెలలో విడుదల చేసిన వృద్ధి రేటు గణాంకాలను చూసిన తర్వాత, ఈసారి జరిగే MPC సమావేశంలో CRR తగ్గింపుపై నిర్ణయం తీసుకోవచ్చని ఊహాగానాలు వచ్చాయి. గవర్నర్ కూడా అలాగే చేసి సీఆర్‌ఆర్‌ను 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు. దీంతో బ్యాంకుల వద్ద అదనంగా రూ.1.20 లక్షల కోట్లు ఉంటాయని, వీటిని రుణాల పంపిణీకి వినియోగించుకోవచ్చని సూచించారు.

MPC ఇప్పుడు తన అభిప్రాయాన్ని తటస్థంగా ఉంచింది. అంటే పర్యావరణం ప్రకారం, రెపో రేటు లేదా బ్యాంకుల రుణ రేట్లు తదనుగుణంగా తగ్గించబడతాయి. మూడో త్రైమాసికంలో కూడా ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కనిపించడం లేదని, నాలుగో త్రైమాసికం నుంచి మాత్రమే కొంత మోడరేషన్ ఉంటుందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ను 50 బేసిస్ పాయింట్లు (BPS) అంటే 0.5 శాతం తగ్గించింది. దీని వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.1.1 లక్షల కోట్ల నుంచి రూ. 1.2 లక్షల కోట్ల మొత్తం ఉచితం. అంటే బ్యాంకులు తమ నిల్వల్లో ఉంచిన మొత్తంలో ఈ భాగాన్ని రుణాలుగా ఖర్చు చేస్తాయి. ఇది నేరుగా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ఎక్కువ రుణాల పంపిణీ అంటే వినియోగం కూడా పెరుగుతుంది. ఇది తయారీని వేగవంతం చేస్తుంది. తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థ చక్రం వేగంగా ప్రారంభమవుతుంది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ద్రవ్యోల్బణం ఒత్తిడితో రిజర్వ్ బ్యాంక్ వృద్ధి రేటు అంచనాను తగ్గించాల్సి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని ముందుగా అంచనా వేయగా, ఇప్పుడు 6.6 శాతానికి తగ్గింది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026 మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనా కూడా 7.3 నుంచి 6.9 శాతానికి తగ్గించబడింది. రెండో త్రైమాసిక అంచనాను 7.3 శాతంగా కొనసాగించింది.

భారత్-చైనా సరిహద్దులో శాంతికి మరో ముందడుగు

భారత్-చైనా సరిహద్దులో శాంతికి మరో ముందడుగు పడింది. ఇరుదేశాల సరిహద్దులో శాంతియుత పరిస్థితులు కొనసాగేలా చూడటమే లక్ష్యంగా భారత్, చైనా దౌత్య చర్యలు జరిగాయి. ఇప్పటికే ఉన్న ద్వౌపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు నియంత్రణ చర్యలు కొనసాగించాలని ఇరు దేశాలు తీర్మానించాయి.

గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఇటీవల కుదిరిన బలంగాల ఉపసంహరణ ఒప్పందం అమలుపై భారత్, చైనా ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం భారత విదేశాంగ శాఖ మేరకు వెల్లడించింది.

2020లో జరిగిన ఘర్షణలు, ఆ తర్వాత తలెత్తిన పరిణామాలపై భారత్, చైనా ప్రతినిధులు చర్చలు జరిపారు. ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను సమీక్షించారు. సరిహద్దులో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించాయి.

సరిహద్దు ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించడం, అవి పునరావృతం కాకుండా నిరోధించడానికి గత సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవడంపై సమావేశం దృష్టి సారించింది. శాంతిని నిర్ధారించడానికి ఏర్పాటు చేసిన యంత్రాంగాల ద్వారా దౌత్య, సైనిక మార్పిడిని క్రమం తప్పకుండా నిర్వహించడం ప్రాముఖ్యతను రెండు పార్టీలు నొక్కిచెప్పాయి.

భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ (తూర్పు ఆసియా) గౌరంగలాల్ దాస్ నాయకత్వం వహించగా.. చైనా ప్రతినిధి బృందానికి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సరిహద్దు, సముద్ర వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ హాంగ్ లియాంగ్ నేతృత్వం వహించారు. ఈ తాజా రౌండ్ చర్చలు సరిహద్దు వెంట శాంతి, సహకారానికి, విస్తృత ఇండో-చైనా సంబంధాలకు కొనసాగుతున్న నిబద్ధతను సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సుస్థిరతను నిర్ధారించేందుకు మరింత దౌత్య ప్రయత్నాలకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి.

చర్చలు గతంలో ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్‌లకు చర్చలు గతంలో ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్‌లకు అనుగుణంగా శాంతి, ప్రశాంతత నిర్వహణతో పాటు సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ అవసరాన్ని నొక్కిచెప్పాయి. ఈ చర్యలకు కొనసాగింపుగా భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు త్వరలోనే మరోసారి భేటీ కావాలని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది.

ఒడిశా నుంచి హైదరాబాద్‏కు హ్యాష్‌ ఆయిల్‌

ఒడిషా నుంచి హైదరాబాద్‌కు హ్యాష్‌ ఆయిల్‌(Hash oil)ను గుట్టుగా సరఫరా చేస్తున్న నిందితున్ని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన 1.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన 1.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకు చెందిన కొండె మల్లికార్జున్‌, హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన మహ్మద్‌ రహమాన్‌ ఖాన్‌ ఒడిశాలో హ్యాష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ టీమ్‌ పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. గురువారం తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్‌ రైల్వేస్టేషన్‌(Chandanagar Railway Station) సమీపంలో దాడిచేసి కారులో తరలిస్తున్న హ్యాష్‌ ఆయిల్‌ను, కారును స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌టీఎఫ్‌ టీమ్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇదే టీమ్‌ పురాణాపూల్‌ ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు దాడిచేసి 1.1 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది వార్డుబాయ్‌ల దందా

ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి కేరాఫ్ గా మారుతున్నాయి. చాలా దవాఖానల్లో పైసలిస్తే గానీ పనులు జరగడం లేదు. రోగి అడ్మిషన్‌ మొదలు డిశ్ఛార్జి అయ్యే వసూళ్ల పర్వం జోరుగా సాగుతోంది.

ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి కేరాఫ్ గా మారుతున్నాయి. చాలా దవాఖానల్లో పైసలిస్తే గానీ పనులు జరగడం లేదు. రోగి అడ్మిషన్‌ మొదలు డిశ్ఛార్జి అయ్యే వసూళ్ల పర్వం జోరుగా సాగుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, సుల్తాన్‌బజార్‌(Osmania, Gandhi, Nilofer, Sultanbazar) ప్రసూతి ఆస్పత్రి, ఎంఎన్‌జే, సరోజనీదేవి కంటి ఆస్పత్రుల్లో సిబ్బందికి ముడుపులు అందితే కాని పనులు జరగడం లేదని రోగులు వాపోతున్నారు.

ఇటీవల పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోగుల వద్ద నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిపై వేటు వేశారు. ‘ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా సిబ్బంది రోగులు, వారి కుటుంబీకుల నుంచి డబ్బులు అడిగితే ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి. లంచం తీసుకోవడం నేరం’ అంటూ ఆస్పత్రి గోడలపై మూడు భాషల్లో పోస్టర్లు అంటించారు. ఈ తరహా సమస్య దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఉంది.

ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది ఎంతడిగితే అంత ముట్టజెప్పాల్సిందే. ఎలాంటి బేరసారాలు ఉండవు. అడిగినంత ఇవ్వకుంటే త్వరగా వైద్యసేవలు అందవు. సిబ్బంది డ్యూటీ మారినా చేయి తడిపితేనే సేవలందుతాయి. ఇవ్వకుంటే అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్‌, ఆటోలు తీసుకొచ్చిన రోగికి వెంటనే స్ర్టెచర్‌, వీల్‌చైర్లను ఏర్పాటు చేయరు. క్యాజువాలిటీలో అడ్మిషన్‌ ఇచ్చిన తర్వాత వార్డు తరలింపునకూ ఎంతోకొంత ముట్టజెప్పాలి. లేకపోతే రోగిని ఎత్తుకొని వార్డులోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మంచి పడక ఏర్పాటు చేయడం, దానిపై బెడ్‌షీట్‌ మార్చాలంటే కూడా పైసలియ్యాల్సిందే. శస్త్రచికిత్స తర్వాత వార్డు, గదుల తరలింపునకు సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో రోగికి ఆక్సిజన్‌ ఏర్పాటు చేయాలంటే రూ.200-300 సమర్పించుకోవాల్సిందే. ఆపరేషన్‌ చేయించుకున్న వారికి, గాయాలైన రోగులకు డ్రెస్సింగ్‌ సమయంలో డబ్బులడుగుతున్నారు. ఎక్స్‌రే, సీటీస్కాన్‌ త్వరగా కావాలంటే రూ.50 నుంచి రూ.100 ఇవ్వాలి. నడవలేని రోగిని ల్యాబ్‌ వద్దకు తీసుకెళ్లాలంటే చేతిలో పైసలు పడాల్సిందే.

ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నా వాటిని సకాలంలో అందించడంలో సిబ్బంది రోగులకు నరకం చూపిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోవడంతో సిలిండర్‌ అమర్చడం ఆలస్యం చేస్తుంటారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో రెండు ప్రభుత్వాస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అడిగినంత ఇవ్వకపోడంతో ఓ రోగికి వార్డుబాయ్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ అమర్చకపోవడంతో ప్రాణాలు పోయాయనే ఫిర్యాదులలు అందాయి. నగరంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంటోంది.

పీఎస్‌ఎల్‌వీ సీ-59 సూపర్ సక్సెస్

పీఎస్ఎల్‌వి సి-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోట నుంచి ఇస్రో ఈ రాకెట్‌ను ప్రయోగించింది. ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతోంది ఇస్రో.

పీఎస్ఎల్‌వి సి-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోట నుంచి ఇస్రో చేసిన ఈ రాకెట్‌ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రోబా-3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. సూర్యుడిపై పరిశోధలనకు గానూ ఈ ప్రోబా-3 ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహాలు సూర్యకిరణాలపై మరింత డెప్త్‌గా అధ్యయనం చేయనున్నాయి. కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ఈ ఉపగ్రహాలను రూపొందించారు శాస్త్రవేత్తలు.

వాస్తవానికి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు ప్రయోగించాల్సిన పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. నిన్న మధ్యాహ్నం 2:38 నిమిషాలకు శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లో దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగాన్ని గురువారానికి వాయిదా వేశారు. గురువారం సాయంత్రం 4:12 గంటలకు ఇస్రో ఈ రాకెట్‌ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సి-59 ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది.

యూరోపియన్ స్పేష్ ఏజెన్సీ.. ప్రోబా-3ని రూపొందించంది. ఈ మిషన్ ద్వారా రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. వీటిని ఒకే కక్ష్యంలో ఏర్పాటు చేశారు. ఇది భూమి నుంచి 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యడి బాహ్య వాతావరణమైన కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు. దీనిపై నిఘా పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో ఒకే భూ కక్ష్యలో పయనిస్తుంటాయి. భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడిని సృష్టించడం వంటి ప్రయోగాలకు కూడా ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి.