ఒడిశా నుంచి హైదరాబాద్‏కు హ్యాష్‌ ఆయిల్‌

ఒడిషా నుంచి హైదరాబాద్‌కు హ్యాష్‌ ఆయిల్‌(Hash oil)ను గుట్టుగా సరఫరా చేస్తున్న నిందితున్ని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన 1.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన 1.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకు చెందిన కొండె మల్లికార్జున్‌, హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన మహ్మద్‌ రహమాన్‌ ఖాన్‌ ఒడిశాలో హ్యాష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ టీమ్‌ పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. గురువారం తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్‌ రైల్వేస్టేషన్‌(Chandanagar Railway Station) సమీపంలో దాడిచేసి కారులో తరలిస్తున్న హ్యాష్‌ ఆయిల్‌ను, కారును స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌టీఎఫ్‌ టీమ్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇదే టీమ్‌ పురాణాపూల్‌ ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు దాడిచేసి 1.1 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది వార్డుబాయ్‌ల దందా

ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి కేరాఫ్ గా మారుతున్నాయి. చాలా దవాఖానల్లో పైసలిస్తే గానీ పనులు జరగడం లేదు. రోగి అడ్మిషన్‌ మొదలు డిశ్ఛార్జి అయ్యే వసూళ్ల పర్వం జోరుగా సాగుతోంది.

ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి కేరాఫ్ గా మారుతున్నాయి. చాలా దవాఖానల్లో పైసలిస్తే గానీ పనులు జరగడం లేదు. రోగి అడ్మిషన్‌ మొదలు డిశ్ఛార్జి అయ్యే వసూళ్ల పర్వం జోరుగా సాగుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, సుల్తాన్‌బజార్‌(Osmania, Gandhi, Nilofer, Sultanbazar) ప్రసూతి ఆస్పత్రి, ఎంఎన్‌జే, సరోజనీదేవి కంటి ఆస్పత్రుల్లో సిబ్బందికి ముడుపులు అందితే కాని పనులు జరగడం లేదని రోగులు వాపోతున్నారు.

ఇటీవల పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోగుల వద్ద నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిపై వేటు వేశారు. ‘ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా సిబ్బంది రోగులు, వారి కుటుంబీకుల నుంచి డబ్బులు అడిగితే ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి. లంచం తీసుకోవడం నేరం’ అంటూ ఆస్పత్రి గోడలపై మూడు భాషల్లో పోస్టర్లు అంటించారు. ఈ తరహా సమస్య దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఉంది.

ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది ఎంతడిగితే అంత ముట్టజెప్పాల్సిందే. ఎలాంటి బేరసారాలు ఉండవు. అడిగినంత ఇవ్వకుంటే త్వరగా వైద్యసేవలు అందవు. సిబ్బంది డ్యూటీ మారినా చేయి తడిపితేనే సేవలందుతాయి. ఇవ్వకుంటే అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్‌, ఆటోలు తీసుకొచ్చిన రోగికి వెంటనే స్ర్టెచర్‌, వీల్‌చైర్లను ఏర్పాటు చేయరు. క్యాజువాలిటీలో అడ్మిషన్‌ ఇచ్చిన తర్వాత వార్డు తరలింపునకూ ఎంతోకొంత ముట్టజెప్పాలి. లేకపోతే రోగిని ఎత్తుకొని వార్డులోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మంచి పడక ఏర్పాటు చేయడం, దానిపై బెడ్‌షీట్‌ మార్చాలంటే కూడా పైసలియ్యాల్సిందే. శస్త్రచికిత్స తర్వాత వార్డు, గదుల తరలింపునకు సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో రోగికి ఆక్సిజన్‌ ఏర్పాటు చేయాలంటే రూ.200-300 సమర్పించుకోవాల్సిందే. ఆపరేషన్‌ చేయించుకున్న వారికి, గాయాలైన రోగులకు డ్రెస్సింగ్‌ సమయంలో డబ్బులడుగుతున్నారు. ఎక్స్‌రే, సీటీస్కాన్‌ త్వరగా కావాలంటే రూ.50 నుంచి రూ.100 ఇవ్వాలి. నడవలేని రోగిని ల్యాబ్‌ వద్దకు తీసుకెళ్లాలంటే చేతిలో పైసలు పడాల్సిందే.

ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నా వాటిని సకాలంలో అందించడంలో సిబ్బంది రోగులకు నరకం చూపిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోవడంతో సిలిండర్‌ అమర్చడం ఆలస్యం చేస్తుంటారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో రెండు ప్రభుత్వాస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అడిగినంత ఇవ్వకపోడంతో ఓ రోగికి వార్డుబాయ్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ అమర్చకపోవడంతో ప్రాణాలు పోయాయనే ఫిర్యాదులలు అందాయి. నగరంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంటోంది.

పీఎస్‌ఎల్‌వీ సీ-59 సూపర్ సక్సెస్

పీఎస్ఎల్‌వి సి-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోట నుంచి ఇస్రో ఈ రాకెట్‌ను ప్రయోగించింది. ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతోంది ఇస్రో.

పీఎస్ఎల్‌వి సి-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోట నుంచి ఇస్రో చేసిన ఈ రాకెట్‌ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రోబా-3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. సూర్యుడిపై పరిశోధలనకు గానూ ఈ ప్రోబా-3 ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహాలు సూర్యకిరణాలపై మరింత డెప్త్‌గా అధ్యయనం చేయనున్నాయి. కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ఈ ఉపగ్రహాలను రూపొందించారు శాస్త్రవేత్తలు.

వాస్తవానికి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు ప్రయోగించాల్సిన పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. నిన్న మధ్యాహ్నం 2:38 నిమిషాలకు శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లో దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగాన్ని గురువారానికి వాయిదా వేశారు. గురువారం సాయంత్రం 4:12 గంటలకు ఇస్రో ఈ రాకెట్‌ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సి-59 ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది.

యూరోపియన్ స్పేష్ ఏజెన్సీ.. ప్రోబా-3ని రూపొందించంది. ఈ మిషన్ ద్వారా రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. వీటిని ఒకే కక్ష్యంలో ఏర్పాటు చేశారు. ఇది భూమి నుంచి 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యడి బాహ్య వాతావరణమైన కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు. దీనిపై నిఘా పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో ఒకే భూ కక్ష్యలో పయనిస్తుంటాయి. భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడిని సృష్టించడం వంటి ప్రయోగాలకు కూడా ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి.

ప్రధాని మోదీ సమక్షంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

ఎట్టకేలకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తదితర నాయకులు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్స్, బిజినెస్ టైకూన్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ముంబైలోని ఆజాద్ మైదానంలో గురువారం జరిగిన భారీ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఫడ్నవీస్ కు ఇది మూడోసారి.

ఆజాద్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇతర మంత్రులు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రశ్నకు బీజేపీ (bjp) నేత సుధీర్ ముంగంటివార్ సమాధానమిస్తూ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే కొత్త మంత్రివర్గం ఏర్పాటు అవుతుందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమిలోని పార్టీల మధ్య రెండు వారాల తీవ్ర చర్చల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన శివసేన, ఎన్సీపీలతో కలిసి బీజేపీ నేతృత్వంలోని మహాకూటమికి 230 సీట్లు సాధించింది. బీజేపీ ఒంటరిగా 132 సీట్లు గెలుచుకుంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారానికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో పలువరు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాగే, బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, మాధురి దీక్షిత్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సకుటుంబ సపరివారంగా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి సుమారు 40 వేల మంది బీజేపీ మద్దతుదారులు, మతపెద్దలు హాజరయ్యారు.

రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్ రెండోసారి 2014 నుంచి 2019 వరకు బీజేపీ-శివసేన ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 2019 ఎన్నికల తరువాత, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన సిఎం పదవి కోసం బిజెపితో సంబంధాలు తెంచుకున్నప్పుడు, ఫడ్నవీస్ తిరిగి అజిత్ పవార్ మద్ధతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్సీపీ ఎమ్మెల్యేల నుంచి తగినంత మద్దతు పొందడంలో అజిత్ పవార్ విఫలం కావడంతో ఈ ప్రభుత్వం కేవలం 72 గంటలు మాత్రమే కొనసాగింది. అనంతరం, శివసేనలో చీలిక రావడంతో షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు.

తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్‌కు షాక్

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బిగ్ షాక్ తలిగింది. ఆ పార్టీలకు చెందిన ముఖ్య నేతలిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకరు మాజీ ఎంపీ అయితే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే. మరి కాంగ్రెస్‌లో చేరిన వీరిద్దరు ఎవరో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు గురువారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ సోయం బాబురావు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మహేష్ గౌడ్.

ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. చేరికల అంశంపై హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరుతామంటూ సంప్రదింపులు చేస్తున్నారని తెలిపారు. శుభ ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని మహేష్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అని చెప్పిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఫిరాయింపులకు, ఇప్పటి ఫిరాయింపులకు తేడా ఉందన్నారు. నాడు కేసీఆర్‌కి పూర్తి మెజార్టీ ఇచ్చినా ఫిరాయింపులు చేశారని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడుతాం అంటే బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు తమ పార్టీలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలన పట్ల ఆకర్షితులవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు

ఇదే సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు అరెస్ట్‌పై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరని చెప్పారు. తాము ఎన్నో సార్లు గృహ నిర్బంధాలకు గురయ్యామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో నిర్బంధం ఎలా ఉండేదో హరీష్ రావు గుర్తు చేసుకోవాలని సూచించారు. అడ్డమైన బాష మాట్లాడుతాం.. అధికారులను తిడుతామంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుందన్నారాయన. నిరసన తెలిపే హక్కును అడ్డుకోబోమన్నారు. హరీష్ రావు నానా యాగీ చేయాల్సిన అవసరం ఏముందని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటికైనా ఆ పార్టీ అల్లరి మూకలను కంట్రోల్ చేయాలని హితవు చెప్పారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

ఈ సందర్భంగా సోయం బాబురావు మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి తన అభిమాన నాయకుడు అని చెప్పారు. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యలన్నింటినీ రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన విమర్శలకు చింతిస్తున్నానని బాబురావు ప్రకటించారు. ఇక ఆత్రం సక్కు మాట్లాడుతూ.. ఆదివాసీల సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. మైదాన ప్రాంతంతో పాటు.. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందని, అందుకే పార్టీలోకి చేరుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను గడపగడపకి తీసుకెళ్తానని చెప్పారు.

సీఎం సెన్సేషనల్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతామన్నారు.

ఆరు గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. కేసీఆర్ ఆనాడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినా పరామర్శించని పరిస్థితి లేదని విమర్శలు గుప్పించారు. ఈనాడు కీలకమైన అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా 5 నుంచి 7 వేలు ఆదా చేయగలుగుతున్నారన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలను రూ.500లకే గ్యాస్ సిలిండర్.. పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రతీ నెలా ఒక కుటుంబానికి 10వేలు ప్రయోజనం పొందేలా పథకాల అమలు జరుగుతోందని వెల్లడించారు.

రాష్ట్రంలో 25లక్షల 35 వేల రైతు కుటుంబాలకు మొదటి ఏడాదిలోనే 21కోట్లతో రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. వరి వేసిన వారికి గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు. 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదని.. అందుకే రైతులు సన్నాలు పండించండి అని కోరారు. అలా చేస్తే తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో, రేషన్ షాపుల్లో, మధ్యాహ్న భోజనాలకూ సన్నబియ్యం అందిస్తామన్నారు. ఈ నేలలో పండిన పంటనే మన బిడ్డలకు అందిస్తామన్నారు. బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పేకలిద్దామని అన్నారు.

నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా? అని ప్రశ్నించారు. ఏ లక్ష్యం కోసం అమరులు ప్రాణ త్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ఇందులో ఒక్క తల తగ్గినా తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

నగరంలో కాలుష్య నియంత్రణలో రవాణా శాఖది కీలక పాత్ర అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉందని.. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతామన్నారు.

హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకునేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించాలన్నారు. నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చాల్సిన బాధ్యత మనపై ఉందని.. మూసీకి గోదావరిని అనుసంధానం చేసి మూసీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అవసరమైతే కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకునైనా సరే హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని పారదోలుతామని వివరించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు.

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన భారతీయ రైల్వే

ప్రయాణానికి కొద్దిరోజులు ముందుగానే రిజర్వేషన్ కోసం ప్రయత్నించినప్పటికీ టికెట్లు దొరుకుతాయనే నమ్మకం ఉండదు. అయితే కొంతమందికి మాత్రం ఎలాగోలా ఆర్ఏసీ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. దీన్ని రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ అని వ్యవహరిస్తారు. ఒక బెర్తును ఇద్దరు పంచుకోవాలి. డబ్బులు మాత్రం పూర్తి టికెట్ కు వసూలు చేస్తారు. నిబంధనల ప్రకారమే అలా చేస్తామని అధికారులు చెబుతుంటారు. ఏసీ బోగీల్లో ప్రయాణించేటప్పుడు ఇటీవలికాలం వరకు ప్రయాణికులు రైలబాగా ఇబ్బంది పడేవారు.

అందుకు కారణం.. వారికి పూర్తి బెడ్ రోల్ కిట్ ను ఇచ్చేవారు కాదు. కానీ ఇకనుంచి ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా పూర్తి బెడ్ రోల్ కిట్ ను ఇస్తున్నారు. దీనికి సంబంధించి రైల్వే అధికారికంగా ప్రకటన చేసింది. పూర్తి టికెట్ డబ్బులు తీసుకోవడంతోపాటు అందులోనే బెడ్ రోల్ కిట్ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపే టికెట్ ధర ఉంటుంది. దీంతో పూర్తి బెడ్ రోల్ కిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2017 నుంచి భారతీయ రైల్వే ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి బెడ్ రోల్స్ ఇవ్వడం ప్రారంభించింది. రెండు బెడ్ షీట్లు, కప్పుకోవడానికి ఒక రగ్గు, దిండు, టవల్ ఇస్తున్నారు. వాస్తవానికి ఏసీ బోగీలో ప్రయాణించడంవల్ల జర్నీ చేసి బాగా అలసిపోయామనే భావన కలగదు. అందుకే చాలామంది ఏసీవైపు మొగ్గుచూపుతుంటారు.

దీంతో భారతీయ రైల్వే కూడా స్లీపర్ బోగీల సంఖ్య తగ్గించి ఏసీ బోగీల సంఖ్య, ముఖ్యంగా థర్డ్ ఏసీ బోగీల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. దీనిపై విమర్శలు వస్తుండటంతో ఇప్పుడు స్లీపర్ బోగీలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ప్రతి రైలుకు ఇకనుంచి నాలుగు జనరల్ బోగీలు ఉండేలా చూస్తోంది. ఇప్పటివరకు ముందు ఒకటి, వెనక ఒకటి జనరల్ బోగీ ఉండేది. ప్రయాణికులు వీటిల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారికైతే నరకం కనపడుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న రైల్వే కొత్తగా ఎల్ హెచ్ బీ బోగీలను అందుబాటులోకి తెచ్చింది. వచ్చే రెండు సంవత్సరాల్లో దాదాపు అన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు నాలుగు జనరల్ బోగీలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.

భోజనం వికటించిన ఘటనల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఏజీ కోర్టుకు తెలిపారు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40శాతం పెంచామని వెల్లడించారు. అయితే, పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలుండాలని పిటీషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కమిటీలు సరిగ్గా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరగా అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని ఏఏజీ తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌ పీఎస్‌లో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు చేరుకుని ఆయనను అరెస్ట్‌ చేశారు. అనంతరం అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.

అంతకు ముందు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించేందుకు హరీశ్‌రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీశ్‌రావును తరలిస్తున్న వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు, కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వం కూలుస్తున్న పేదవారి ఇండ్లకు అడ్డుపడితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలోని వ్యవస్తలను వాడుకొని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్నారన్నారు. కాసులు మీకు కేసులు మాకు అన్నారు. సూటుకేసులు మీకు..అరెస్టులు మాకా అని ప్రశ్నించారు. మా నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నేటితో ప్రజాస్వామ్యం మరణించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించినందుకు తనను అరెస్టు చేశారని ఎక్స్ వేదికగా స్ఫందించన హరీశ్ రావు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా లేక ఎమ్మర్జెన్సీనా అంటూ ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాపింగ్కి గురైందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పైనే తిరిగి కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ మండిపడ్డారు.

ఎమ్మెల్యే అరెస్టును ప్రశ్నించినందుకు తమను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. సీఎం పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరన్న హరీశ్ రావు.. తెలంగాణ సమాజమే మీకు బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు.

జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. అదానీ నుంచి ఆయన తీసుకున్న ముడుపుల వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అదానీతో డీల్‌ రద్దు చేయడానికి సీఎం చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ‘అదానీ’తో జగన్‌ సర్కారు చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఈఆర్‌సీకి లేఖ రాశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం షర్మిల విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌ రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకున్నారు. ఈ అంశంపై అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అదానీ పేరును చంద్రబాబు ఎత్తడమే లేదు. తన పేరెక్కడుందని ప్రశ్నిస్తున్న జగన్‌కు.. అప్పటి సీఎం తానేనని తెలియదా? రాష్ట్రానికి 25 ఏళ్ల పాటు అదానీ పవర్‌ భారమే.

పక్క రాష్ట్రాల్లో యూనిట్‌ రూ. 1.99కు అమ్ముతుంటే.. ఏపీలో 50 పైసలు ఎక్కువగా రూ. 2.49కు ఎందుకు కొన్నారు? జగన్‌ అధికారంలోనికి వచ్చిన వెంటనే చంద్రబాబు చేసిన ఒప్పందాలను రద్దు చేశారు. లాంగ్‌ టర్మ్‌ ఒప్పందాలు ఉండకూడదని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన జగన్‌.. అధికారంలోనికి వచ్చాక సెకీతో 25 ఏళ్లకు ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. పచ్చ కామెర్లు వచ్చిన వాడిలా బొత్స తీరు ఉంది. నేను వ్యక్తిగత అంశాలు మాట్లాడితే జగన్‌ ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టలేడు. జగన్‌ నిర్లక్ష్యాన్ని, అవినీతిని మాత్రమే నేను ప్రశ్నించాను. అదానీ నుంచి ముడుపుల సంగతి అడిగితే, వివేకా హత్య గురించి మాట్లాడితే గంగవరం పోర్టును ఎందుకమ్మేశారని ప్రశ్నిస్తే పర్సనల్‌ అవుతుందా జగన్‌ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు. కూటమి అధికారం చేపట్టి ఆరు నెలలు అయింది. సూపర్‌ సిక్స్‌ ఎక్కడ’’ అని షర్మిల ప్రశ్నించారు.