ప్రధాని మోదీ సమక్షంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం
ఎట్టకేలకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తదితర నాయకులు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్స్, బిజినెస్ టైకూన్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ముంబైలోని ఆజాద్ మైదానంలో గురువారం జరిగిన భారీ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఫడ్నవీస్ కు ఇది మూడోసారి.
ఆజాద్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇతర మంత్రులు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రశ్నకు బీజేపీ (bjp) నేత సుధీర్ ముంగంటివార్ సమాధానమిస్తూ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే కొత్త మంత్రివర్గం ఏర్పాటు అవుతుందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమిలోని పార్టీల మధ్య రెండు వారాల తీవ్ర చర్చల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన శివసేన, ఎన్సీపీలతో కలిసి బీజేపీ నేతృత్వంలోని మహాకూటమికి 230 సీట్లు సాధించింది. బీజేపీ ఒంటరిగా 132 సీట్లు గెలుచుకుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారానికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో పలువరు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాగే, బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, మాధురి దీక్షిత్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సకుటుంబ సపరివారంగా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి సుమారు 40 వేల మంది బీజేపీ మద్దతుదారులు, మతపెద్దలు హాజరయ్యారు.
రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్ రెండోసారి 2014 నుంచి 2019 వరకు బీజేపీ-శివసేన ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 2019 ఎన్నికల తరువాత, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన సిఎం పదవి కోసం బిజెపితో సంబంధాలు తెంచుకున్నప్పుడు, ఫడ్నవీస్ తిరిగి అజిత్ పవార్ మద్ధతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్సీపీ ఎమ్మెల్యేల నుంచి తగినంత మద్దతు పొందడంలో అజిత్ పవార్ విఫలం కావడంతో ఈ ప్రభుత్వం కేవలం 72 గంటలు మాత్రమే కొనసాగింది. అనంతరం, శివసేనలో చీలిక రావడంతో షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు.
Dec 05 2024, 22:24