ప్రయాణికులకు శుభవార్త చెప్పిన భారతీయ రైల్వే
ప్రయాణానికి కొద్దిరోజులు ముందుగానే రిజర్వేషన్ కోసం ప్రయత్నించినప్పటికీ టికెట్లు దొరుకుతాయనే నమ్మకం ఉండదు. అయితే కొంతమందికి మాత్రం ఎలాగోలా ఆర్ఏసీ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. దీన్ని రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ అని వ్యవహరిస్తారు. ఒక బెర్తును ఇద్దరు పంచుకోవాలి. డబ్బులు మాత్రం పూర్తి టికెట్ కు వసూలు చేస్తారు. నిబంధనల ప్రకారమే అలా చేస్తామని అధికారులు చెబుతుంటారు. ఏసీ బోగీల్లో ప్రయాణించేటప్పుడు ఇటీవలికాలం వరకు ప్రయాణికులు రైలబాగా ఇబ్బంది పడేవారు.
అందుకు కారణం.. వారికి పూర్తి బెడ్ రోల్ కిట్ ను ఇచ్చేవారు కాదు. కానీ ఇకనుంచి ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా పూర్తి బెడ్ రోల్ కిట్ ను ఇస్తున్నారు. దీనికి సంబంధించి రైల్వే అధికారికంగా ప్రకటన చేసింది. పూర్తి టికెట్ డబ్బులు తీసుకోవడంతోపాటు అందులోనే బెడ్ రోల్ కిట్ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపే టికెట్ ధర ఉంటుంది. దీంతో పూర్తి బెడ్ రోల్ కిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2017 నుంచి భారతీయ రైల్వే ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి బెడ్ రోల్స్ ఇవ్వడం ప్రారంభించింది. రెండు బెడ్ షీట్లు, కప్పుకోవడానికి ఒక రగ్గు, దిండు, టవల్ ఇస్తున్నారు. వాస్తవానికి ఏసీ బోగీలో ప్రయాణించడంవల్ల జర్నీ చేసి బాగా అలసిపోయామనే భావన కలగదు. అందుకే చాలామంది ఏసీవైపు మొగ్గుచూపుతుంటారు.
దీంతో భారతీయ రైల్వే కూడా స్లీపర్ బోగీల సంఖ్య తగ్గించి ఏసీ బోగీల సంఖ్య, ముఖ్యంగా థర్డ్ ఏసీ బోగీల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. దీనిపై విమర్శలు వస్తుండటంతో ఇప్పుడు స్లీపర్ బోగీలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ప్రతి రైలుకు ఇకనుంచి నాలుగు జనరల్ బోగీలు ఉండేలా చూస్తోంది. ఇప్పటివరకు ముందు ఒకటి, వెనక ఒకటి జనరల్ బోగీ ఉండేది. ప్రయాణికులు వీటిల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారికైతే నరకం కనపడుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న రైల్వే కొత్తగా ఎల్ హెచ్ బీ బోగీలను అందుబాటులోకి తెచ్చింది. వచ్చే రెండు సంవత్సరాల్లో దాదాపు అన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు నాలుగు జనరల్ బోగీలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
Dec 05 2024, 22:02