డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈనెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసారు. తొమ్మిదో తేదీ ఉదయం పదిన్నర గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోన్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్‌ప్లాంట్లపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్‌ట్యాపింగ్ తదితర అంశాలను చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈ నెల 7 నుంచి 9 వరకు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. చివరి మూడు రోజుల్లో ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి పీవీ మార్గ్ వరకు ఐదుచోట్ల ప్రత్యేక వేదికలపై భిన్న రీతుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, డ్వాక్రా సంఘాల వారు ఏర్పాటు చేయనున్న 120 ఫుడ్, హస్తకళల స్టాళ్లు 3 రోజులపాటు కొనసాగుతాయన్నారు. ఐమాక్స్ HMDA గ్రౌండ్స్‌లో 7న వందేమాతరం శ్రీనివాస్ బృందంతో, 8న రాహుల్ సిప్లిగంజ్‌తో, 9న తమన్‌తో సినీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. చివరిరోజు సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ వెల్లడించారు.
ఉత్సవాల ముంగిపు సందర్బంగా భారీ ఎత్తున డ్రోన్, లేజర్, కాక్రర్స్ ప్రదర్శనలు ఉంటాయని అన్నారు. ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు లక్ష మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సంబంధిత డిపార్ట్‌మెంట్ అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.
Dec 05 2024, 10:45