ఎల్లుండి మళ్లీ అల్పపీడనం
ఫెంగల్ తుఫాను ప్రభావం నుంచి బాధితులు ఇంకా కోలుకోక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈనెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు మంగళవారం వెల్లడించారు.
ఫెంగల్ తుఫాను ప్రభావం నుంచి బాధితులు ఇంకా కోలుకోక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈనెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు మంగళవారం వెల్లడించారు. ఇది బలపడి శ్రీలంక తీరం దిశగా వెళుతుందని అంచనా వేశారు. రానున్న రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుందన్నారు. కాగా, మూడు రోజుల క్రితం తీరం దాటిన ఫెంగల్ తుఫాన్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి మంగళవారం అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. అయినప్పటికీ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు.
తుఫాన్ ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమ రావడంతో తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ప్రకాశం జిల్లా కనిగిరిలో 97, చిత్తూరు జిల్లా కటికిపల్లిలో 84, పెనుమూరులో 82, అనంతపురం జిల్లా ఈస్టు కందిపల్లిలో 82, తిరుపతి జిల్లాలో పాకాలలో 71, చిత్తూరు జిల్లా అరగొండలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగేంద్రపురంలో 73, శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో 71 మి.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. తరువాత రెండు, మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించారు.
Dec 05 2024, 10:30