రైతుల కళ్ల ముందే తూకంలో భారీ మోసం
అన్నం పెట్టే రైతులను వ్యాపారులు, దళారులు అన్ని విధాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నో ఘటనలు బయట పడుతూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్లూ చాటుమాటుగా రైతులను దోచుకున్న వారు, ఇప్పుడు నేరుగా కళ్ల ముందే మోసానికి తెగించారు. చూస్తుండగానే అందినంత లాగేస్తున్నారు. ఓ రైతుకు అనుమానం రావడంతో హనుమకొండ జిల్లాలో ఈ వ్యవహారం బయటపడింది.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పత్తి రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి గింజలు నాటడం మొదలు, పత్తి తీత వరకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పై మందు, అడుగు మందు అంటూ ఎన్నో ఎరువులు, పురుగు మందులు పంటకు అందించాల్సి వస్తోంది. ఆ తర్వాత పంటను మార్కెట్కు తరలించడం మరో ఖర్చుగా మారింది. ఈ ఖర్చులు భరించలేక చాలా మంది పత్తిని దళారులకు గ్రామాల్లోనే విక్రయిస్తున్నారు.
క్వింటా పత్తికి మార్కెట్ ధర కంటే రూ.100 నుంచి రూ.200 ఎక్కువగానే చెల్లిస్తామని దళారులు చెబుతుండటం, చెల్లింపులు కూడా సరిగానే చేస్తుండటంతో రైతులు చాలా మంది వీరికే పంటను అమ్ముతున్నారు. అంతేకాదు పంటను తమ వద్దకు తీసుకురావాల్సిన అవసరం లేదని, తామే రైతుల పొలాలు, ఇళ్ల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో అన్నదాతలు మరింత ఉపశమనంగా భావిస్తున్నారు. కానీ ఇందులో మతలబు ఉందన్న విషయాన్ని మాత్రం చాలామంది గుర్తించలేకపోతున్నారు.
పత్తి బస్తాలను తూకం వేసేందుకు గతంలో కాటాను మాత్రమే వినియోగించే వారు. కానీ ఇప్పుడు చాలా చోట్ల డిజిటల్ యంత్రాలను వినియోగిస్తున్నారు. రైతుల పంట కొనుగోలు చేసేందుకు వస్తున్నప్పుడు దళారులు తమ వెంట ఈ యంత్రాలను తీసుకొస్తున్నారు. రైతుల కళ్ల ముందే పత్తి బస్తాలను యంత్రంపై ఉంచి, బరువు చూస్తున్నారు. బయటికి అంతా సవ్యంగానే సాగుతున్నట్టు అనిపించడంతో సహజంగానే సందేహం వచ్చే అవకాశం తక్కువ. అయితే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన రైతు కుమార స్వామికి ఎందుకో డౌట్ వచ్చింది.
చాలా కాలంగా పత్తి పండిస్తున్న రైతులకు, పత్తిని బస్తాల్లో నింపిన తర్వాత ఎంత బరువు ఉంటుందనే విషయంలో ఒక అవగాహన ఉంటుంది. వారి అంచనాకు మూడ్నాలుగు కిలోలు మాత్రమే అటూ ఇటుగా బస్తా బరువు తూగుతుంది. ఈ లెక్క ప్రకారం తన పత్తి బస్తాలు 40 నుంచి 45 కిలోల బరువు తూగుతాయని కుమార స్వామి అంచనా వేశాడు. కానీ కాంటాపై పెడితే బరువు 35 కిలోలే చూపించింది. పలు బస్తాల బరువు ఊహించిన దానికన్నా తక్కువ తూగడంతో ఆ రైతుకు అనుమానం వచ్చింది. దీంతో అదే యంత్రంపై ఒక మనిషిని నిలబెట్టాడు. ఆయన బరువు 90 కిలోలు. కానీ ఆ యంత్రం మాత్రం 68 కిలోలు మాత్రమే చూపింది. దీంతో వారి అనుమానం నిజమైంది.
మరి దీన్ని ఎలా నియంత్రిస్తున్నారని పరిశీలించగా, ఒక వ్యక్తి దూరంగా నిలబడి, తన జేబులో ఉన్న రిమోట్తో యంత్రాన్ని ఆపరేట్ చేస్తున్నాడని గుర్తించారు. బరువు తూచే యంత్రంలో ఒక చిప్ పెడుతున్నారు. ఈ చిప్ను 100 మీటర్ల దూరం నుంచి రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. ఆ రిమోట్లోని బటన్ ఒకసారి నొక్కితే 5 కేజీలు, రెండుసార్లు ప్రెస్ చేస్తే 10 కిలోలు తగ్గేలా సెట్ చేస్కున్నారట. మరికొందరు వ్యాపారులైతే ముందుగానే తమ యంత్రాల్లో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గించి రైతుల వద్దకు తీసుకొస్తున్నట్టు సమాచారం. తాము పట్టుకున్న మోసగాళ్లను పోలీసులకు అప్పగించినట్టు రైతు కుమార స్వామి తెలిపారు. కాబట్టి రైతన్నలూ అలర్ట్గా ఉండండి. మీ కష్టాన్ని తన్నుకుపోయే గద్దలను ఓ కంట కనిపెట్టండి.
Dec 02 2024, 19:11