తిరుమల ఘాట్ రోడ్డులో రన్నింగ్ కారులో అరుపులు కేకలు భయపడిపోయిన భక్తులు
తిరుమల ఘాట్ రోడ్డులో యువకులు హల్చల్ చేశారు. తిరుమలకు వెళ్ళే సమయంలో సన్ రూఫ్, విండోల నుంచి నిలబడి సెల్ఫీలు దిగిన ఈ యువకుల చేష్టలు చూసి, ఇతర భక్తులు భయపడ్డారు. పెద్దగా కేకలు, అరుపులతో రెచ్చిపోయారు. అసలే వర్షం పడుతోంది.. ఇదే సమయంలో కారులో చేసిన స్టంట్స్ భయపెట్టాయి. యువకుల చేష్టలకు అందరూ అవాక్కయ్యారు. కొంతమంది ఈ యువకుల చేష్టల్ని మొబైల్స్‌లో రికార్డు చేశారు.
తిరుమల ఘాట్ రోడ్డులో యువకులు రెచ్చిపోయారు. తిరుమల రెండో ఘాట్ రోడ్‌లో కార్ డోర్ తీసి సన్‌రూఫ్, సైడ్ విండోల నుంచి బయటకు నిలబడి పెద్దగా కేకలు వేస్తూ హంగామా చేశారు. వర్షంలో యువకులు కారులో బయటకు నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు.. దీంతో తిరుమలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. యువకుల చేష్టలు చూసి వాహనాల్లో వెళుతున్న భక్తులు అవాక్కయ్యారు.. ఈ యువకుల ఆగడాలను రికార్డ్ చేశారు. ఘాట్ రోడ్డులో హంగామా చేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిలు పాల్గొన్నారు. తిరుపతి మహతి ఆడిటోరియం ప్రాంగణంలో ఏడు దర్శన టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీటీడీ 2,500 టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. మరో 500టోకెన్లు తిరుమల బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో జారీ చేస్తున్నారు. తిరుపతితో పాటు తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట ప్రాంత వాసులకు టోకెన్లను జారీ చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులకు మంగళవారం తిరుమల శ్రీవారి దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తున్న టీటీడీకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
గత నెల 18న జరిగిన పాలకమండలి సమావేశంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ముఖ్మయంత్రి చంద్రబాబును కలిసి స్థానికులకు దర్శన విషయంపై చర్చించామన్నారు. తిరుపతితో పాటు తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట ప్రాంత వాసులకు దర్శన భాగ్యం కల్పించాలని సీఎం సూచించారని.. ఈ మేరకు స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నామన్నారు.
ఈ దర్శన టోకెన్లు ముందుగా వచ్చినవారికి తొలి ప్రాధాన్యతతో కేటాయిస్తారు. దర్శన టోకెన్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఫుట్ పాత్ హాల్(దివ్య దర్శనం) క్యూలైన్ లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఇతర దర్శనాల్లో ఇచ్చేవిధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందించబడుతుంది. స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జరుగనున్న గజవాహనసేవలో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని సోమవారం ఉదయం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకెళ్లనున్నారు.
ముందుగా తిరుమలలో శ్రీవారి ఆలయం నుండి ఈ హారాన్ని ఆలయ నాలుగు మాడవీధుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొస్తారు. తిరుచానూరులోని పసుపు మండపం వద్ద హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్తారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరిస్తారు.
Dec 02 2024, 14:43