ఫెంగల్ అలజడి
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి.
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా కుంభవృష్టి వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి మహాబలిపురం, కారైక్కాల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కి.మీ. వేగంతో గాలులు వీచినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. విశాఖ, తిరుపతిత్లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తడ మండలం భీములివారిపాలెంలో 131.5 మిల్లీమీటర్లు, సూళ్లూరుపేట మండలం మన్నార్‌పోలూరులో 128.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే పుత్తూరు మండలం కేఎం అగ్రహారంలో 116, దొరవారిసత్రంలోని పూలతోటలో 114, తడలో 108, చిత్తమూరు మండలం మల్లంలో 103, నగరిలో 92 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు మల్లంలో 111.5, అల్లంపాడులో 103.5, విద్యానగర్‌లో 98.5 మి.మీ. వర్షం కురిసింది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది.
ఉదయం నుంచి ఎడతెరపిలేని వర్షం కురవడంతో కాలువలు, రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షానికితోడు చలితీవ్రత పెరగడంతో వృద్ధులు, పిల్లలు వణికిపోతున్నారు. ఆది, సోమవారాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది.
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం గోవర్థనపురం సమీపంలో నేరేడు కాలువ పొంగి ప్రవహిస్తోంది. 40మంది ప్రయాణికులతో వచ్చిన ఆర్టీసీ బస్సు కాజ్‌వేపై నీటి ఉధృతిలో చిక్కుకుని ఆగిపోయింది. బస్సులో ఉన్నవారిని గ్రామస్థులు క్షేమంగా గట్టుకు చేర్చారు.
ఆది సోమవారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో అనేకచోట్ల ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. కృష్ణపట్నం ఓడరేవులో 6వ నంబరు డేంజర్ సిగ్నల్ నిజాంపట్నం మచిలీపట్నం విశాఖపట్నం కాకినాడ గంగవరం భీమునిపట్నంలో మూడో నంబరు హెచ్చరిక ఎగురవేశారు
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఉప్పొంగుతోంది. ఈదురుగాలులతో పాటు హోరున వర్షం కురుస్తోంది. సముద్రంలో కెరటాలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో దూసుకొస్తున్నాయి. కెరటాలు భూమిలోపల నుంచి కోరుకుంటూ రావడంతో ఉప్పాడ పాత బజారు, మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనబాద్, కొత్తపట్నం తదితర తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు చెందిన ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. తిరుపతి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. 30 విద్యుత్ స్తంభాలు, రెండు ఇళ్లు కూలిపోయాయి. రేణిగుంట మండలంలోని మల్లిమడుగు రిజర్వాయర్, కేవీబీపురం మండలంలోని కాళంగి రిజర్వాయర్ నిండిపోయాయి. వాగులు, వంకల్లో ప్రవాహాలు మొదలయ్యాయి. 30 చెరువులు నిండిపోయి కలుజులు పారుతున్నాయి.
పలు మండలాల్లో వరి పొలాలు నీట మునిగాయి. 15 చోట్ల కాజ్‌వేలపై నీటి ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిపివేశారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా 62 ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ అలయెన్స్, స్టార్ ఎయిర్ లైన్స్ సంస్థలకు చెందిన 11 విమాన సర్వీసులు రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం రేణిగుంటలో ల్యాండ్ కాలేకపోవడంతో బెంగళూరుకు మళ్లించారు. విశాఖపట్నంలోనూ వాతావరణం అనుకూలించక పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమాన సర్వీసులను రద్దు చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి తిరుపతి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా వరి కోతలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లాలో అక్కడక్కడ రహదారులపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.
విశాఖపట్నం నగరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ సముద్రంలోకి చేరుతున్నాయి. తుఫాన్‌తో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఆ వ్యర్థాలన్నీ తీరానికి కొట్టుకువచ్చాయి. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకునేవారు సంచులు పట్టుకొని తీరంవైపు పరుగు తీస్తున్నారు. వారి సంచులు క్షణాల్లో నిండిపోతున్నాయి. జోడుగుళ్లపాలెం బీచ్‌లో శనివారం ఉదయం కనిపించిన దృశ్యమిది.
Dec 01 2024, 12:32