మెట్రోస్టేషన్ల వద్ద ఆకతాయిలు
నగరంలోని కొన్ని మెట్రో రైల్వేస్టేషన్ల వద్ద ఆకతాయిల బెడద ఎక్కువవుతోంది. దీంతో ప్రయాణికులు తీవంగా ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఈ ఆకతాయిల వల్ల ప్రధానంగా మహిళా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా వారు సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.
నగరంలోని పలు మెట్రోస్టేషన్ల(Metro stations) వద్ద ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రాత్రి పదిన్నర గంటల తర్వాత మద్యం తాగి పోకిరీలు, యాచకులు రైలుదిగి ఇంటికి వెళ్తున్న వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని ఎల్‌బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్(LB Nagar-Miyapur, JBS-MGBS), నాగోలు-రాయదుర్గం కారిడార్ల పరిధిలో 57 స్టేషన్లు ఉన్నాయి.
ఆయా స్టేషన్ల మీదుగా ప్రతినిత్యం 1028 సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు తిరుగుతూనే ఉంటాయి. రాత్రివేళల్లో మెట్రోస్టేషన్ల కింద కొంతమంది యువకులు గుంపులుగా చేరి మద్యం, సిగరెట్లు తాగుతూ హల్‌చల్ చేస్తున్నారు. మెట్రో, పోలీసుల అధికారుల నిఘా లోపం వల్లే ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్(Ameerpet, SR Nagar, Kukatpally, Khairatabad), గాంధీభవన్, మలక్‌పేట, విక్టోరియా, సికింద్రాబాద్ వెస్ట్, ఉప్పల్ స్టేషన్ల కింద రాత్రి 10.30 గంటలు దాటిన తర్వాత ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. కొంతమంది యువకులు బైక్‌లు పార్క్ చేసి మద్యం తాగుతున్నారని వాపోతున్నారు.
కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ స్టేషన్ల సమీపంలో రాత్రి 11 దాటిన తర్వాత కొంతమంది యువతీ, యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Nov 20 2024, 19:06