గ్రూప్-1 పిటిష‌న్ల‌పై విచార‌ణ న‌వంబ‌ర్ 26కు వాయిదా

గ్రూప్-1 నోటిఫికేష‌న్‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌ను హైకోర్టు బుధ‌వారం విచారించింది. విచార‌ణ అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 26వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

 గ్రూప్-1 నోటిఫికేష‌న్‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌ను హైకోర్టు బుధ‌వారం విచారించింది. విచార‌ణ అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 26వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. జీవో-29, ట్రాన్స్‌జెండ‌ర్ రిజ‌ర్వేష‌న్లు, లోక‌ల్, నాన్ లోక‌ల్ అంశాల‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌ను హైకోర్టు డివిజ‌న్ బెంచ్ విచారించింది.

కోర్టు తీర్పు వెలువ‌డే వ‌ర‌కు గ్రూప్-1 ఫ‌లితాలు విడుద‌ల చేయొద్ద‌ని పిటిష‌న్ల త‌రపు అడ్వ‌కేట్స్ డివిజ‌న్ బెంచ్‌ను కోరారు. ఇందుకు జ‌డ్జిలు అంగీక‌రించారు. అయితే అన్ని కేసులు కలిపి వింటామ‌ని జ‌డ్జిలు చెప్పారు.

అన్ని పిటిష‌న్ల‌ను అదే వారంలో కంప్లీట్ చేద్దామ‌ని జ‌డ్జిలు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ పిటిష‌న్ల‌పై కౌంట‌ర్‌ల‌కు ప్ర‌భుత్వ త‌ర‌పు అడ్వ‌కేట్లు సిద్ధంగా ఉండాల‌ని జ‌డ్జిలు చెప్పారు. వాద‌న‌ల‌కు పిటిష‌న‌ర్ల త‌ర‌పు అడ్వ‌కేట్ సుధీర్‌కు కూడా అవ‌కాశం ఇస్తామ‌ని జ‌డ్జిలు వెల్ల‌డించారు.

మెట్రోస్టేషన్ల వద్ద ఆకతాయిలు

నగరంలోని కొన్ని మెట్రో రైల్వేస్టేషన్ల వద్ద ఆకతాయిల బెడద ఎక్కువవుతోంది. దీంతో ప్రయాణికులు తీవంగా ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఈ ఆకతాయిల వల్ల ప్రధానంగా మహిళా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా వారు సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.

నగరంలోని పలు మెట్రోస్టేషన్ల(Metro stations) వద్ద ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రాత్రి పదిన్నర గంటల తర్వాత మద్యం తాగి పోకిరీలు, యాచకులు రైలుదిగి ఇంటికి వెళ్తున్న వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్‌(LB Nagar-Miyapur, JBS-MGBS), నాగోలు-రాయదుర్గం కారిడార్ల పరిధిలో 57 స్టేషన్లు ఉన్నాయి.

ఆయా స్టేషన్ల మీదుగా ప్రతినిత్యం 1028 సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు తిరుగుతూనే ఉంటాయి. రాత్రివేళల్లో మెట్రోస్టేషన్ల కింద కొంతమంది యువకులు గుంపులుగా చేరి మద్యం, సిగరెట్లు తాగుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. మెట్రో, పోలీసుల అధికారుల నిఘా లోపం వల్లే ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌(Ameerpet, SR Nagar, Kukatpally, Khairatabad), గాంధీభవన్‌, మలక్‌పేట, విక్టోరియా, సికింద్రాబాద్‌ వెస్ట్‌, ఉప్పల్‌ స్టేషన్ల కింద రాత్రి 10.30 గంటలు దాటిన తర్వాత ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. కొంతమంది యువకులు బైక్‌లు పార్క్‌ చేసి మద్యం తాగుతున్నారని వాపోతున్నారు.

కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్‌ స్టేషన్ల సమీపంలో రాత్రి 11 దాటిన తర్వాత కొంతమంది యువతీ, యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ వరాలజల్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు, పూజలు చేయనున్నారు. ముందుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వరాల జల్లు కురిపించారు. జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, భూమి పూజలు చేయనున్నారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం రూ.694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు సీఎం. రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేయనున్నారు.

రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ చేస్తారు. రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేస్తారు.

మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. సిరిసిల్ల లో రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంధాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారుర. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేయనున్నారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు రూ.102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును సీఎం రేవంత్ పంపిణీ చేయనున్నారు

ఉదయం వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆపై శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ముఖ్యమంత్రి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయంలో దర్శనానంతరం సీఎం రేవంత్ ప్రజా విజయోత్సవం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమర్ శ్రీధర్ బాబు దామోదర రాజానర్సింహా పొంగులేటి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన సచిన్

భారత దిగ్గజ క్రికెటర్ (Sachin Tendulkar)సచిన్ టెండూల్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ ముంబైలోని పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు వేశారు.

టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి పోలింగ్ స్టేషన్‌కు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. తోటి పౌరులను ఓటు వేయాలని.. వారి ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరారు.

నేను చాలా కాలంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI)కి ఐకాన్‌గా ఉన్నాను. ఓటు హక్కు ఉన్నవారు ఓటు వేయండి. ఇది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేయాలని నేను కోరుతున్నాను అని టెండూల్కర్ పేర్కొన్నారు. తన పోలింగ్‌లో అధికారులు చేసిన ఏర్పాట్లను సచిన్ మెచ్చుకున్నారు. ఓటు వేసిన తర్వాత, టెండూల్కర్, అంజలి, సారా తమ సిరా వేళ్లను మీడియాకు చూపారు. ప్రస్తుతం టెండూల్కర్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు.

బ్యాటింగ్ లెజెండ్ తరచుగా తన వ్యక్తిగత జీవిత విషయాలను అభిమానులు, అనుచరులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటాడు.ముంబై ఇండియన్స్‌కు మెంటార్, ఐకాన్‌గా, టెండూల్కర్ ఈ వారాంతంలో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ముంబై తరుఫున పాల్గొనే అవకాశం ఉంది. సచిన్ చివరగా 2022 వరకు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడాడు.

జార్ఖండ్‌లో జెండా పాతేది ఎవరో

జార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటివరకు ఎవరికీ మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. ఒకరు తప్ప మిగిలిన ముఖ్యమంత్రులు అంతా ఐదేళ్ల కాలం పూర్తిగా పని చేయలేదు.

బీహార్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటికీ రాజకీయంగా జార్ఖండ్‌లో ఎప్పుడు ఆసక్తికర విషయాలు జరుగుతూనే ఉంటాయి. జార్ఖండ్‌లో సోరెన్ కుటుంబం రాజకీయంగా బలంగా ఉంది. ఇక్కడ ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఇప్పటివరకు ఎవరికీ మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ మూడుసార్లు, జార్ఖండ్ ముక్తి మోర్చా రెండుసార్లు అధికారంలోకి వచ్చాయి. శిబు సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చాకు కాంగ్రెస్, ఆర్జేడీ వంటి మిత్రపక్షాలు ఉండగా, బీజేపీ, జేడీయూవంటి పార్టీలు కలిసి పోటీలో ఉన్నాయి.

2000లో బీహార్ నుండి రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ఏడుగురు రాజకీయ నాయకులు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఒక్క రఘుబర్ దాస్ మాత్రమే వరుసగా ఐదు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. మిగిలినవారు రోజుల వ్యవధిలోనే సీఎం పీఠం దిగుతూ.. మళ్లీ ఎక్కుతూ నెట్టుకురావాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికైన ఐదు అసెంబ్లీల్లో ఏ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించలేదు. రాష్ట్రంలో బీజేపీ, జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) ఆధిపత్య రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి.

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కావాలనే పోరాటంతో శిబు సోరెన్ నిరంతర పోరాటాల ద్వారా ఎదిగారు. సొంత పార్టీతో అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసిన తర్వాత మూడుసార్లు జార్ఖండ్ సీఎంగా పనిచేశారు. కానీ ఆయనకు కూడా పూర్తి స్థాయి అధికారం ఎప్పుడూ దక్కలేదు.

ఆయన తర్వాత కుమారుడు హేమంత్ సోరెన్ కూడా మూడుసార్లు సీఎంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో సీఎంగా ఉండగానే జైలుకు వెళ్లడంతో రాజీనామా చేసి మళ్లీ ఇప్పుడు సీఎం అయ్యారు. జైలులో ఉన్న సమయంలో సీఎంగా ఉన్న చంపై సోరెన్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

మరోవైపు ఇక్కడ బీజేపీ కూడా అత్యంత శక్తివంతమైన పార్టీ. బాబూలాల్ మరాండీ జార్ఖండ్‌కు తొలి సీఎం. ఆ తర్వాత బీజేపీ నుంచి అర్జున ముండా మూడు సార్లు సీఎం అయ్యి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా ఉన్నారు. మధు కోడా సీఎంగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి అరెస్ట్ అయ్యారు.

గతంలో సీఎంగా ఉన్న రఘుబర్ దాస్ ఇప్పుడు గవర్నర్‌గా ఉన్నారు. ఈసారి బాబూలాల్ మరాండీ నేతృత్వంలో బీజేపీ మళ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. రెండో దశ పోలింగ్‌లో ప్రధాన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ధన్వర్ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, చందన్కియారీ నుండి బీజేపీకి చెందిన అమర్ కుమార్ బౌరి, సిల్లీ నుండి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU) అధ్యక్షుడు సుధేష్ మహలాంటి వారు రంగంలో ఉన్నారు.

మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జార్ఖండ్‌లో అధికారం చేపట్టాలంటే 41 స్థానాల మెజారిటీ అవసరం. ఈసారి అధికారాన్ని పొందాలని బీజేపీ భావిస్తుండగా, జేఎంఎం కూడా మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. నవంబర్ 23న జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికారం ఎవరికి వస్తుందో చూడాలిక..

పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు తెలిపారు. హత్యాయత్నం కేస్ తప్ప మిగిలిన సెక్షన్‌లన్నీ 5 సంవత్సరాలలోపు శిక్ష పడేవే అని తెలిపారు.

లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (BRS Former MLA Patnam Narender Reddy) వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టులో (Telangana high court) విచారణ జరిగింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు తెలిపారు.

హత్యాయత్నం కేస్ తప్ప మిగిలిన సెక్షన్‌లన్నీ 5 సంవత్సరాలలోపు శిక్ష పడేవే అని తెలిపారు. ఘటన జరిగిన రోజు సురేష్‌‌తో పట్నం నరేందర్ ఎన్ని కాల్స్ మాట్లాడారు హైకోర్ట్ ప్రశ్నించారు. 71 డేస్‌లో 84 కాల్స్ ఉన్నందుకు అరెస్ట్ చేయడం సరికాదని న్యాయవాది తెలిపారు. అరెస్టు విషయాన్ని కనీసం కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పులను కింది కోర్ట్ కనీసం పరిగణలోకి తీసుకోలేదని.. అరెస్ట్ గ్రౌండ్స్‌ను చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారని తెలిపారు.

పట్నం నరేందర్ ది అక్రమ అరెస్ట్ అని న్యాయవాది వాదించారు. ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారన్నారు. 11వ తేదీ సంఘటన జరిగినప్పుడు నరేందర్ రెడ్డి అక్కడ లేరని.. సురేష్ అనే నిందితుడి కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారన్నారు. 11వ తేదీ కేవలం ఒకే ఒక సారి సురేష్‌తో నరేందర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు.

లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిర పరించేందుకు కుట్ర చేశారని తెలిపారు. కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేయించారని.. అన్నింటికీ ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని వాదించారు. నరేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని కోర్టుకు పీపీ తెలియజేశారు. ఎవరు అనుచరులు.. అతని హోదా ఏంటి అని ధర్మాసనం మరో ప్రశ్న వేయగా.. సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని తెలిపారు. సంఘటన జరిగిన రోజు సురేష్ ... నరేందర్ కాల్స్ మాట్లాడుకున్నారని చెప్పారు. అరెస్ట్ సందర్బంగా ఎలాంటి నియమాలు పాటించారని పీపీని హైకోర్టు అడిగింది.

కేబీఆర్‌ పార్క్‌లో ఒక మాజీ ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే కేబీఆర్‌ పార్క్‌లో అరెస్ట్ చేయలేదని తన ఇంట్లో అరెస్ట్ చేశామని కోర్టుకు పీపీ తెలిపారు. సుప్రీం తీర్పులను ఎందుకు పాటించలేదని హైకోర్టు అడుగగా... ఈ కేసులో కుట్ర కోణం ఉందని.. చాలా విషయాలు బయటకు వచ్చాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం... ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్‌ను సబ్మిట్ చేయాలని పోలీసులకు ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

ఫ్రీ బస్సు అమలు వాలంటీర్ల పై కీలక నిర్ణయం

ఏపీ మంత్రివర్గ భేటీ ఈ రోజు జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం లో జరుగుతున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి న టెండర్ల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి నుంచి జన్మభూమి.. కొత్త రేషన్ కార్డులు పెన్షన్లతో పాటుగా మహిళకు ఉచిత బస్సు అమలు కు ఆమోద ముద్ర వేయనుంది. రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఏపీ మంత్రివర్గ సమావేశంలో అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో పెట్టుబడులు ప్రధాన అంశాలు గా చర్చకు రానున్నాయి. అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో కేటాయించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. సాంకేతిక కారణాలతో రద్దు చేస్తూ.. తాజా ప్రణాళికలకు అనుగుణం గా కొత్త టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మేరకు నిర్మాణాల ఖర్చు.. టెండర్ల విధానంలో అనుసరించాల్సిన మార్గదర్శకాల పైన కేబినెట్ లో చర్చించి ఫైనల్ చేయనున్నారు. జనవరి నుంచి అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో అమరావతికి సంబంధించి చర్చకు వచ్చిన అంశాలను సీఎం చంద్రబాబు సహచర మంత్రులకు వివరించనున్నారు.

తాజాగా రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్‌ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి తాజా బడ్జెట్ లో ప్రభుత్వం చేసిన కేటాయింపుల పైన వైసీపీ విమర్శలు చేస్తోంది. హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తోంది. దీంతో, వచ్చే జనవరి నుంచి జన్మభూమి - 2 ప్రారంభంచాలని డిసైడ్ అయింది. ఆ సమయంలోనే కొత్త రేషన్ కార్డులు.. కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అదే విధంగా సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం అమలు గురించి ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

దీంతో పాటుగా అయిదు నెలల కాలంగా చర్చనీయాంశంగా మారిన వాలంటీర్ల అంం పైన నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సచివాలయాలను పంచాయితీలకు అనుసంధానం చేయటంతో పాటుగా అవసరం మేరకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ అంశం పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, విశాఖ రుషికొండ భవనాల వినియోగం పైన నేటి మంత్రివర్గంలో చర్చకు రానుంది. భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశం పైన చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా.. విద్యుత్ ఛార్జీలు అంశం పైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు ఉండటంతో..సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

మరికొద్ది సేపట్లో ఆ భవనాన్ని కూల్చివేయనున్న అధికారులు

కొండాపూర్‌ డివిజన్‌ సిద్ధిక్‌నగర్‌లో పక్కకు ఒరిగిన భవనాన్ని మరికొద్ది సేపట్లో హైడ్రాలిక్‌ మిషన్‌తో అధికారులు కూల్చివేయనున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అధికారులు అందుకు తగిన చర్యలు చేపట్టారు.

కొండాపూర్‌ డివిజన్‌ సిద్ధిక్‌నగర్‌లో పక్కకు ఒరిగిన భవనాన్ని మరికొద్ది సేపట్లో హైడ్రాలిక్‌ మిషన్‌తో అధికారులు కూల్చివేయనున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అధికారులు అందుకు తగిన చర్యలు చేపట్టారు. కాగా, ఐటీ కారిడార్‌కు కేరాఫ్‌గా ఉన్న గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొండాపూర్‌ డివిజన్‌ సిద్ధిక్‌నగర్‌లో ఓ నిర్మాణదారుడు కనీస ప్రమాణాలు పాటించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం పుట్టింగుల కోసం తీసిన గుంతల కారణంగా పక్కనే ఉన్న భవనాలను ప్రమాదంలో పడేసింది.

ఎటువంటి సెట్‌బ్యాక్‌ లేకుండా తీసిన గుంతలతో పక్కనే ఉన్న నాలుగంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది. శేరిలింగంపల్లి సర్కిల్‌ -20 పరిధి.. కొండాపూర్‌ డివిజన్‌ సిద్ధిక్‌నగర్‌ రోడ్డు నం.1లో ఓ బిల్డర్‌ 200ల గజాల స్థలంలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణ పనులు చేపట్టాడు. గత వారం రోజులుగా పుట్టింగుల నిర్మాణం కోసం గుంతలు తవ్వి పిల్లర్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా, కనీస సెట్‌బ్యాక్‌లు వదలకుండా గుంతలు తవ్వడంతో పక్కనే ఉన్న ప్లాట్‌ నంబర్‌ 1639లోని లక్ష్మణ్‌ అనే వ్యక్తికి చెందిన నాలుగంతస్తుల భవనం పిల్లర్లు బయటకు వచ్చి ఓ పక్కకు ఒరిగింది.

భవనంలో ఉంటున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందం, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు ఈ భవనం చుట్టు ప్రక్కల భవనాల ప్రజలను సైతం అధికారులు ఖాళీ చేయించారు. ఎలాంటి సెట్‌బ్యాక్‌ లేకుండా కేవలం 60గజాల స్థలంలో నాలుగంతస్తుల భవనం నిర్మించగా, దాని పక్కనే మరో వ్యక్తి 200ల గజాల స్థలంలో భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు గుంతలు తవ్వడంతో మొత్తం భవనాలకు ప్రమాదకరంగా మారింది.

హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్

గత ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించి ఆయనపై పోలీసు కేసు నమోదయింది. విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

నిన్న జరగాల్సిన పోలీసు విచారణకు వర్మ డుమ్మా కొట్టారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని... విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని... నాలుగు రోజుల సమయం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ మెసేజ్ పెట్టారు.

మరోవైపు పోలీసుల అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. విచారించిన హైకోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేయడం విదితమే. కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను మాత్రం విచారణకు స్వీకరించింది. పోలీసు విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. 

ఈ క్రమంలో హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో వర్మ పేర్కొన్నారు. ఎవరి పరువుకూ భంగం కలిగించేలా తాను పోస్టులు పెట్టలేదని... వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

మహారాష్ట్ర ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

మహారాష్ట్ర శాసనసభలోని 288 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే, మొత్తం 81 సీట్లున్న ఝార్ఖం్‌లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశలో 43 స్థానాలకు నవంబరు 13న పోలింగ్ ముగిసింది. రెండో దశలో 38 సీట్లలో పోలింగ్ జరుగుతోంది. ఇక, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం యావత్తు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటమిల మధ్య నువ్వా నేనా అన్న పోరు నెలకుంది.

తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే దశలో ఎన్నికలు జరగుతుండడగా.. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అలాగే, ఝార్ఖండ్‌లోనూ రెండో విడతలో 38 నియోజకవర్గాలకు ఈ రోజే పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అటు యూపీలోని 9, పంజాబ్‌లోని 4, కేరళలోని ఒక్క అసెంబ్లీ స్థానానికి నేడే ఉప ఎన్నిక జరుగుతోంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌తో పాటు ఈ ఉప-ఎన్నికల ఓట్లను 23న లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)ల కూటమి మహాయుతి.. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (ఎస్పీ)ల కూటమి మహా వికాస్‌ అఘాడీల (ఎంవీఏ) మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఎంవీఏలోని కాంగ్రెస్‌ 101, శివసేన (ఉద్ధవ్‌) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 చోట్ల బరిలో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ మహాయుతి దారుణంగా దెబ్బతింది. అయితే, ఈసారి ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని, అధికారం నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ, శివసేన, ఎన్సీపీలను చీల్చడం వారికి ప్రతికూలంగా మారింది. ఇది సానుభూతిగా మారి మహావికాస్ అఘాడీకి లబ్ది చేకూర్చతుందని భావిస్తున్నారు. దీంతో మహాయుతి లాడ్లీ బెహన్ వంటి సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుంది.

మొత్తం 288 స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రత కల్పించింది. ఒక్క ముంబయి నగరంలోనే 30వేల మందికిపైగా పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,70,25,119 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 1,00,186 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ పోలింగ్ స్టేషన్లలో 388 ‘పింక్ బూత్‌లు’ ప్రత్యేకంగా మహిళా సిబ్బందితో నిర్వహిస్తున్నారు. ఇక, ఝార్ఖండ్‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు జరుగుతోంది. రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 528 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లు పూర్తి ఉత్సాహంతో భాగస్వాములు కావాలని, ప్రజాస్వామ్య వేడుకల కార్యక్రమాన్ని మరింత పెంచాలని ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్)‌లో కోరారు. ఈ సందర్భంగా యువత, మహిళా ఓటర్లందరూ ఉత్సాహంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక, పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. హర్యానా ఎన్నికల్లో ఎగ్టిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కావడంతో ఈాసారి మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఫలితాలపై ఏం చెబుతాయోననే ఉత్కంఠ నెలకుంది. హర్యానాలో అన్ని సంస్థలూ కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పగా.. చివరకు ఎవరూ ఊహించని విజయాన్ని బీజేపీ అందుకుంది.