రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ వరాలజల్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు, పూజలు చేయనున్నారు. ముందుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వరాల జల్లు కురిపించారు. జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, భూమి పూజలు చేయనున్నారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం రూ.694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు సీఎం. రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేయనున్నారు.
రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ చేస్తారు. రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేస్తారు.
మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. సిరిసిల్ల లో రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంధాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారుర. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేయనున్నారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు రూ.102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును సీఎం రేవంత్ పంపిణీ చేయనున్నారు
ఉదయం వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆపై శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ముఖ్యమంత్రి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయంలో దర్శనానంతరం సీఎం రేవంత్ ప్రజా విజయోత్సవం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమర్ శ్రీధర్ బాబు దామోదర రాజానర్సింహా పొంగులేటి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు.
Nov 20 2024, 16:12