జార్ఖండ్‌లో జెండా పాతేది ఎవరో

జార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటివరకు ఎవరికీ మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. ఒకరు తప్ప మిగిలిన ముఖ్యమంత్రులు అంతా ఐదేళ్ల కాలం పూర్తిగా పని చేయలేదు.

బీహార్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటికీ రాజకీయంగా జార్ఖండ్‌లో ఎప్పుడు ఆసక్తికర విషయాలు జరుగుతూనే ఉంటాయి. జార్ఖండ్‌లో సోరెన్ కుటుంబం రాజకీయంగా బలంగా ఉంది. ఇక్కడ ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఇప్పటివరకు ఎవరికీ మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ మూడుసార్లు, జార్ఖండ్ ముక్తి మోర్చా రెండుసార్లు అధికారంలోకి వచ్చాయి. శిబు సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చాకు కాంగ్రెస్, ఆర్జేడీ వంటి మిత్రపక్షాలు ఉండగా, బీజేపీ, జేడీయూవంటి పార్టీలు కలిసి పోటీలో ఉన్నాయి.

2000లో బీహార్ నుండి రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ఏడుగురు రాజకీయ నాయకులు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఒక్క రఘుబర్ దాస్ మాత్రమే వరుసగా ఐదు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. మిగిలినవారు రోజుల వ్యవధిలోనే సీఎం పీఠం దిగుతూ.. మళ్లీ ఎక్కుతూ నెట్టుకురావాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికైన ఐదు అసెంబ్లీల్లో ఏ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించలేదు. రాష్ట్రంలో బీజేపీ, జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) ఆధిపత్య రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి.

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కావాలనే పోరాటంతో శిబు సోరెన్ నిరంతర పోరాటాల ద్వారా ఎదిగారు. సొంత పార్టీతో అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసిన తర్వాత మూడుసార్లు జార్ఖండ్ సీఎంగా పనిచేశారు. కానీ ఆయనకు కూడా పూర్తి స్థాయి అధికారం ఎప్పుడూ దక్కలేదు.

ఆయన తర్వాత కుమారుడు హేమంత్ సోరెన్ కూడా మూడుసార్లు సీఎంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో సీఎంగా ఉండగానే జైలుకు వెళ్లడంతో రాజీనామా చేసి మళ్లీ ఇప్పుడు సీఎం అయ్యారు. జైలులో ఉన్న సమయంలో సీఎంగా ఉన్న చంపై సోరెన్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

మరోవైపు ఇక్కడ బీజేపీ కూడా అత్యంత శక్తివంతమైన పార్టీ. బాబూలాల్ మరాండీ జార్ఖండ్‌కు తొలి సీఎం. ఆ తర్వాత బీజేపీ నుంచి అర్జున ముండా మూడు సార్లు సీఎం అయ్యి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా ఉన్నారు. మధు కోడా సీఎంగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి అరెస్ట్ అయ్యారు.

గతంలో సీఎంగా ఉన్న రఘుబర్ దాస్ ఇప్పుడు గవర్నర్‌గా ఉన్నారు. ఈసారి బాబూలాల్ మరాండీ నేతృత్వంలో బీజేపీ మళ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. రెండో దశ పోలింగ్‌లో ప్రధాన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ధన్వర్ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, చందన్కియారీ నుండి బీజేపీకి చెందిన అమర్ కుమార్ బౌరి, సిల్లీ నుండి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU) అధ్యక్షుడు సుధేష్ మహలాంటి వారు రంగంలో ఉన్నారు.

మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జార్ఖండ్‌లో అధికారం చేపట్టాలంటే 41 స్థానాల మెజారిటీ అవసరం. ఈసారి అధికారాన్ని పొందాలని బీజేపీ భావిస్తుండగా, జేఎంఎం కూడా మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. నవంబర్ 23న జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికారం ఎవరికి వస్తుందో చూడాలిక..

పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు తెలిపారు. హత్యాయత్నం కేస్ తప్ప మిగిలిన సెక్షన్‌లన్నీ 5 సంవత్సరాలలోపు శిక్ష పడేవే అని తెలిపారు.

లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (BRS Former MLA Patnam Narender Reddy) వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టులో (Telangana high court) విచారణ జరిగింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు తెలిపారు.

హత్యాయత్నం కేస్ తప్ప మిగిలిన సెక్షన్‌లన్నీ 5 సంవత్సరాలలోపు శిక్ష పడేవే అని తెలిపారు. ఘటన జరిగిన రోజు సురేష్‌‌తో పట్నం నరేందర్ ఎన్ని కాల్స్ మాట్లాడారు హైకోర్ట్ ప్రశ్నించారు. 71 డేస్‌లో 84 కాల్స్ ఉన్నందుకు అరెస్ట్ చేయడం సరికాదని న్యాయవాది తెలిపారు. అరెస్టు విషయాన్ని కనీసం కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పులను కింది కోర్ట్ కనీసం పరిగణలోకి తీసుకోలేదని.. అరెస్ట్ గ్రౌండ్స్‌ను చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారని తెలిపారు.

పట్నం నరేందర్ ది అక్రమ అరెస్ట్ అని న్యాయవాది వాదించారు. ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారన్నారు. 11వ తేదీ సంఘటన జరిగినప్పుడు నరేందర్ రెడ్డి అక్కడ లేరని.. సురేష్ అనే నిందితుడి కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారన్నారు. 11వ తేదీ కేవలం ఒకే ఒక సారి సురేష్‌తో నరేందర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు.

లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిర పరించేందుకు కుట్ర చేశారని తెలిపారు. కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేయించారని.. అన్నింటికీ ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని వాదించారు. నరేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని కోర్టుకు పీపీ తెలియజేశారు. ఎవరు అనుచరులు.. అతని హోదా ఏంటి అని ధర్మాసనం మరో ప్రశ్న వేయగా.. సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని తెలిపారు. సంఘటన జరిగిన రోజు సురేష్ ... నరేందర్ కాల్స్ మాట్లాడుకున్నారని చెప్పారు. అరెస్ట్ సందర్బంగా ఎలాంటి నియమాలు పాటించారని పీపీని హైకోర్టు అడిగింది.

కేబీఆర్‌ పార్క్‌లో ఒక మాజీ ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే కేబీఆర్‌ పార్క్‌లో అరెస్ట్ చేయలేదని తన ఇంట్లో అరెస్ట్ చేశామని కోర్టుకు పీపీ తెలిపారు. సుప్రీం తీర్పులను ఎందుకు పాటించలేదని హైకోర్టు అడుగగా... ఈ కేసులో కుట్ర కోణం ఉందని.. చాలా విషయాలు బయటకు వచ్చాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం... ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్‌ను సబ్మిట్ చేయాలని పోలీసులకు ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

ఫ్రీ బస్సు అమలు వాలంటీర్ల పై కీలక నిర్ణయం

ఏపీ మంత్రివర్గ భేటీ ఈ రోజు జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం లో జరుగుతున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి న టెండర్ల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి నుంచి జన్మభూమి.. కొత్త రేషన్ కార్డులు పెన్షన్లతో పాటుగా మహిళకు ఉచిత బస్సు అమలు కు ఆమోద ముద్ర వేయనుంది. రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఏపీ మంత్రివర్గ సమావేశంలో అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో పెట్టుబడులు ప్రధాన అంశాలు గా చర్చకు రానున్నాయి. అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో కేటాయించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. సాంకేతిక కారణాలతో రద్దు చేస్తూ.. తాజా ప్రణాళికలకు అనుగుణం గా కొత్త టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మేరకు నిర్మాణాల ఖర్చు.. టెండర్ల విధానంలో అనుసరించాల్సిన మార్గదర్శకాల పైన కేబినెట్ లో చర్చించి ఫైనల్ చేయనున్నారు. జనవరి నుంచి అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో అమరావతికి సంబంధించి చర్చకు వచ్చిన అంశాలను సీఎం చంద్రబాబు సహచర మంత్రులకు వివరించనున్నారు.

తాజాగా రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్‌ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి తాజా బడ్జెట్ లో ప్రభుత్వం చేసిన కేటాయింపుల పైన వైసీపీ విమర్శలు చేస్తోంది. హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తోంది. దీంతో, వచ్చే జనవరి నుంచి జన్మభూమి - 2 ప్రారంభంచాలని డిసైడ్ అయింది. ఆ సమయంలోనే కొత్త రేషన్ కార్డులు.. కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అదే విధంగా సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం అమలు గురించి ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

దీంతో పాటుగా అయిదు నెలల కాలంగా చర్చనీయాంశంగా మారిన వాలంటీర్ల అంం పైన నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సచివాలయాలను పంచాయితీలకు అనుసంధానం చేయటంతో పాటుగా అవసరం మేరకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ అంశం పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, విశాఖ రుషికొండ భవనాల వినియోగం పైన నేటి మంత్రివర్గంలో చర్చకు రానుంది. భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశం పైన చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా.. విద్యుత్ ఛార్జీలు అంశం పైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు ఉండటంతో..సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

మరికొద్ది సేపట్లో ఆ భవనాన్ని కూల్చివేయనున్న అధికారులు

కొండాపూర్‌ డివిజన్‌ సిద్ధిక్‌నగర్‌లో పక్కకు ఒరిగిన భవనాన్ని మరికొద్ది సేపట్లో హైడ్రాలిక్‌ మిషన్‌తో అధికారులు కూల్చివేయనున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అధికారులు అందుకు తగిన చర్యలు చేపట్టారు.

కొండాపూర్‌ డివిజన్‌ సిద్ధిక్‌నగర్‌లో పక్కకు ఒరిగిన భవనాన్ని మరికొద్ది సేపట్లో హైడ్రాలిక్‌ మిషన్‌తో అధికారులు కూల్చివేయనున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అధికారులు అందుకు తగిన చర్యలు చేపట్టారు. కాగా, ఐటీ కారిడార్‌కు కేరాఫ్‌గా ఉన్న గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొండాపూర్‌ డివిజన్‌ సిద్ధిక్‌నగర్‌లో ఓ నిర్మాణదారుడు కనీస ప్రమాణాలు పాటించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం పుట్టింగుల కోసం తీసిన గుంతల కారణంగా పక్కనే ఉన్న భవనాలను ప్రమాదంలో పడేసింది.

ఎటువంటి సెట్‌బ్యాక్‌ లేకుండా తీసిన గుంతలతో పక్కనే ఉన్న నాలుగంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది. శేరిలింగంపల్లి సర్కిల్‌ -20 పరిధి.. కొండాపూర్‌ డివిజన్‌ సిద్ధిక్‌నగర్‌ రోడ్డు నం.1లో ఓ బిల్డర్‌ 200ల గజాల స్థలంలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణ పనులు చేపట్టాడు. గత వారం రోజులుగా పుట్టింగుల నిర్మాణం కోసం గుంతలు తవ్వి పిల్లర్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా, కనీస సెట్‌బ్యాక్‌లు వదలకుండా గుంతలు తవ్వడంతో పక్కనే ఉన్న ప్లాట్‌ నంబర్‌ 1639లోని లక్ష్మణ్‌ అనే వ్యక్తికి చెందిన నాలుగంతస్తుల భవనం పిల్లర్లు బయటకు వచ్చి ఓ పక్కకు ఒరిగింది.

భవనంలో ఉంటున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందం, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు ఈ భవనం చుట్టు ప్రక్కల భవనాల ప్రజలను సైతం అధికారులు ఖాళీ చేయించారు. ఎలాంటి సెట్‌బ్యాక్‌ లేకుండా కేవలం 60గజాల స్థలంలో నాలుగంతస్తుల భవనం నిర్మించగా, దాని పక్కనే మరో వ్యక్తి 200ల గజాల స్థలంలో భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు గుంతలు తవ్వడంతో మొత్తం భవనాలకు ప్రమాదకరంగా మారింది.

హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్

గత ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించి ఆయనపై పోలీసు కేసు నమోదయింది. విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

నిన్న జరగాల్సిన పోలీసు విచారణకు వర్మ డుమ్మా కొట్టారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని... విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని... నాలుగు రోజుల సమయం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ మెసేజ్ పెట్టారు.

మరోవైపు పోలీసుల అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. విచారించిన హైకోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేయడం విదితమే. కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను మాత్రం విచారణకు స్వీకరించింది. పోలీసు విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. 

ఈ క్రమంలో హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో వర్మ పేర్కొన్నారు. ఎవరి పరువుకూ భంగం కలిగించేలా తాను పోస్టులు పెట్టలేదని... వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

మహారాష్ట్ర ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

మహారాష్ట్ర శాసనసభలోని 288 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే, మొత్తం 81 సీట్లున్న ఝార్ఖం్‌లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశలో 43 స్థానాలకు నవంబరు 13న పోలింగ్ ముగిసింది. రెండో దశలో 38 సీట్లలో పోలింగ్ జరుగుతోంది. ఇక, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం యావత్తు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటమిల మధ్య నువ్వా నేనా అన్న పోరు నెలకుంది.

తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే దశలో ఎన్నికలు జరగుతుండడగా.. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అలాగే, ఝార్ఖండ్‌లోనూ రెండో విడతలో 38 నియోజకవర్గాలకు ఈ రోజే పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అటు యూపీలోని 9, పంజాబ్‌లోని 4, కేరళలోని ఒక్క అసెంబ్లీ స్థానానికి నేడే ఉప ఎన్నిక జరుగుతోంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌తో పాటు ఈ ఉప-ఎన్నికల ఓట్లను 23న లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)ల కూటమి మహాయుతి.. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (ఎస్పీ)ల కూటమి మహా వికాస్‌ అఘాడీల (ఎంవీఏ) మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఎంవీఏలోని కాంగ్రెస్‌ 101, శివసేన (ఉద్ధవ్‌) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 చోట్ల బరిలో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ మహాయుతి దారుణంగా దెబ్బతింది. అయితే, ఈసారి ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని, అధికారం నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ, శివసేన, ఎన్సీపీలను చీల్చడం వారికి ప్రతికూలంగా మారింది. ఇది సానుభూతిగా మారి మహావికాస్ అఘాడీకి లబ్ది చేకూర్చతుందని భావిస్తున్నారు. దీంతో మహాయుతి లాడ్లీ బెహన్ వంటి సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుంది.

మొత్తం 288 స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రత కల్పించింది. ఒక్క ముంబయి నగరంలోనే 30వేల మందికిపైగా పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,70,25,119 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 1,00,186 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ పోలింగ్ స్టేషన్లలో 388 ‘పింక్ బూత్‌లు’ ప్రత్యేకంగా మహిళా సిబ్బందితో నిర్వహిస్తున్నారు. ఇక, ఝార్ఖండ్‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు జరుగుతోంది. రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 528 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లు పూర్తి ఉత్సాహంతో భాగస్వాములు కావాలని, ప్రజాస్వామ్య వేడుకల కార్యక్రమాన్ని మరింత పెంచాలని ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్)‌లో కోరారు. ఈ సందర్భంగా యువత, మహిళా ఓటర్లందరూ ఉత్సాహంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక, పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. హర్యానా ఎన్నికల్లో ఎగ్టిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కావడంతో ఈాసారి మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఫలితాలపై ఏం చెబుతాయోననే ఉత్కంఠ నెలకుంది. హర్యానాలో అన్ని సంస్థలూ కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పగా.. చివరకు ఎవరూ ఊహించని విజయాన్ని బీజేపీ అందుకుంది.

వ్యర్థాలు లేని గ్రామం ఆమె ధ్యేయం

గ్రామం ప్రకృతి సౌందర్యానికి నిలయం. లోయలో ఉన్న ఈ గ్రామాన్ని ఆనుకొని సంగ్తీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పేరుతోనే గ్రామాన్ని కూడా పిలుచుకుంటారు. అక్కడ నివసించే మోన్పా తెగ ప్రజలు టిబెటియన్‌ బౌద్ధాన్ని పాటిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తారు. కానీ ఆధునికత ప్రభావం ఆ గ్రామం మీద కూడా పడింది. ప్లాస్టిక్‌, ఇతర ఘన వ్యర్థాలు నదిలోకి చేరడం, తీరంలో పేరుకుపోవడం ప్రారంభమయింది. చూపరులకు కనువిందు చేసే ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. ప్రతియేటా ఈ గ్రామానికి వచ్చే నల్లమెడ కొంగల రాక కూడా తగ్గిపోయింది. గ్రామస్తుల ఆరోగ్యం మీద కూడా ఈ ప్రభావం పడింది. ఆ సమయంలో... ఆశాజ్యోతిలా ఆ గ్రామంలో అడుగుపెట్టారు ఇతిశా సారా. ఆమె స్వస్థలం అసోంలోని గువహటి. పుణేలో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. ఆ తరువాత ఢిల్లీ అంబేద్కర్‌ యూనివర్సిటీలో ఎండిఈస్‌ (సోషల్‌ డిజైన్‌) కోర్సులో చేరారు. తరగతి గది నుంచి బయటకు వెళ్ళి, ప్రజలను నేరుగా కలిసి, వాళ్ళు నిత్యం ఎదుర్కొనే సమస్యలకు ఆచరణాత్మకమైన పరిష్కారాలను గుర్తించడానికి ఆ కోర్సు నాకు అవకాశం కలిగించింది. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనేదాన్ని. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో విద్యుద్దీపాల ఏర్పాటుకోసం పాటుపడుతున్న ‘ఫర్దర్‌ అండ్‌ బియాండ్‌ ఫౌండేషన్‌’ చేపట్టిన ‘ది బట్టి ప్రాజెక్ట్‌’కు నిధుల సేకరణ కోసం ఢిల్లీ వచ్చిన మెర్విన్‌ కౌంటిన్హో నాకు పరిచయం అయ్యారు. అప్పట్లో నేను ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాల నిర్మూలన మీద యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నాను. తమ ప్రాంతంలోని గ్రామాల పరిస్థితుల గురించి మెర్విన్‌ వివరించారు. వారి ప్రాజెక్ట్‌ తరఫున ఢిల్లీలో పని చేయాలని నన్ను కోరారు. నేను సరేనన్నాను అని గుర్తు చేసుకున్నారు ఇతిశా.

తమ ప్రాంతాన్ని సందర్శించాలని ఇతిశాను మెర్విన్‌ తరచూ అడిగేవారు. దాదాపు ఏడాది తరువాత ఆమెకు ఆ అవకాశం వచ్చింది. నా స్నేహితుడొకరు కొత్తగా ట్రావెల్‌ కంపెనీ ప్రారంభించారు. తమ విద్యార్థులను వేసవి సెలవుల్లో విహార యాత్రలకు తీసుకువెళ్ళడానికి కొన్ని స్కూళ్ళు అతణ్ణి సంప్రతించాయి. దానికి తగిన సిబ్బంది లేకపోవడంతో.ఆ పిల్లలతో కలిసి టూర్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఎక్కడికైనా వెళ్ళగలవా?’’ అని అడిగారు. ఆ జాబితాలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాలు కూడా ఉన్నాయి. నేను సరే అన్నాను. అలా తొలిసారిగా .... 2018లో సంగ్తీలో అడుగుపెట్టాను అని చెప్పారు ఇతిశా. అక్కడ నది, లోయ, పొలాలు... ఇలా అన్నీ ఆమెకు ఎంతగానో నచ్చాయి. కానీ ఎక్కడ చూసినా చెత్తే. వీధుల్లో కుప్పలు కుప్పలుగా పడి ఉండేది. నదిలో ప్లాస్టిక్‌ కవర్లు, వ్యర్థాలు తేలుతూ ఉండేవి. అక్కడ మెర్విన్‌ నన్ను కలిసినప్పుడు ఆ సంగతే ప్రస్తావించాను. అప్పుడప్పుడు పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ మామూలే’’ అన్నారు. ఆయన మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. ఈ గ్రామాన్నే నా కార్యక్షేత్రంగా ఎందుకు ఎంచుకోకూడదనిపించింది అని అంటారు ఇతిశా. ఢిల్లీకి తిరిగి వెళ్ళిన ఆమె... ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మళ్ళీ సంగ్తీలో అడుగుపెట్టారు. ‘నార్త్‌ ఈస్ట్‌ వేస్ట్‌ కలెక్టివ్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశారు.. స్థానిక యువత సాయంతో ప్రజల్లో అవగాహన కలిగించడానికి సమావేశాలు ఏర్పాటు చేశారు.

మేము చేసిన కార్యక్రమాలతో... గ్రామస్తులలో మార్పు మొదలయింది. మొదట ప్రజలు తమ ఇళ్ళలోని చెత్తను ఇష్టానుసారం రోడ్ల మీదో, ఇళ్ళ పక్కనో పడెయ్యకుండా... ఒక నిర్దిష్టమైన చోట వేసేలా చేశాం. గ్రామపెద్దలు, అధికారులతో మాట్లాడి. లోయలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించేలా చేశాం. బౌద్ధుల చాంద్రమాన పంచాంగం ప్రకారం... మోన్పా తెగవారికి నెలకి నాలుగు నుంచి అయిదు పవిత్రమైన రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో వాళ్ళు పొలం పనులు చెయ్యరు, వాటిని సెలవులుగా పరిగణిస్తారు. ఆ రోజులను వ్యర్థాల నిర్వహణకోసం కేటాయించేలా ఒప్పించాం. ప్రతినెలా ఎనిమిదో రోజును సామాజికసేవా దినంగా నిర్ణయించాం. ఆ రోజు తమ వీధుల్ని శుభ్రపరిచే పనిలో ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి పాల్గొనాలి. కాలనీలవారీగా బాధ్యులను ఎంపిక చేశాం. వారు పనులు సజావుగా జరిగేలా వాళ్ళు పర్యవేక్షిస్తారు అని వివరించారు ఇతిశా. దానితోపాటు ప్రతిరోజూ నిర్దేశించిన చోట చెత్త వేయడం, వారానికి ఒకసారి తమ ప్రాంతాలను శుభ్రం చేయడం, ఎక్కడైనా చెత్త పేరుకుపోతే దాన్ని వెంటనే తొలగించడం లాంటి పనుల కోసం ఎక్కడికక్కడ కమిటీలు వేశారు. అలాగే విద్యార్థులకు పారిశుధ్యం ప్రాధాన్యాన్ని బోధించి, వారిని కూడా తమ కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు.పోగు చేసిన చెత్త అంతటినీ సంగ్తీ లోయలో దగ్గర్లోని నామ్‌డ్రోలింగ్‌ గ్రామంలో ఉన్న రెండు ప్రదేశాలకు తీసుకువెళ్తారు. అక్కడ స్వయం సహాయక సంఘాలకు చెందిన దాదాపు వందమంది మహిళలు వాటిని వేరు చేస్తారు. కంపోస్ట్‌ తయారు చెయ్యడానికి వీలైనవాటిని ఒక యార్డులోకి తరలిస్తారు.

ఇప్పుడు సంగ్తీ లోయ మునుపటి ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకుంటోంది. వ్యర్థాల రహిత గ్రామంగా రూపు దిద్దుకుంటోంది. ఇతిశా, ఆమె బృందం చేస్తున్న ప్రచారం కారణంగా పర్యాటకుల సంఖ్య పెరిగింది. దానితోపాటు సంగ్తీలో పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చే గ్రామస్తుల సంఖ్య పెరిగింది. దానితో వారికి మంచి ఆదాయం కూడా వస్తోంది. ‘‘పర్యాటక కేంద్రంగా ఇంకా ఎంతో అభివృద్ధి చెందే అర్హత, ఆస్కారం సంగ్తీ లోయకు ఉన్నాయి. అందుకోసం అవసరమైన సౌకర్యాల కల్పనకు గ్రామస్తులు, అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం అంటున్న ఇతిశా గ్రామస్తులకు మరింత దగ్గరగా ఉండడం కోసం, వాళ్ళకు మార్గనిర్దేశం చేయడం కోసం తన నివాసాన్ని సంగ్తీకి మార్చారు. ఇప్పుడు ఈ గ్రామస్తులందరూ నాకు ఆత్మీయులు అయిపోయారు. మరెక్కడున్నా ఈ అప్యాయత నాకు దొరకదని తెలుసు. అందుకే ఈ లోయలోనే స్థిరపడాలనుకుంటున్నాను. స్థానికులకు సాధికారత కల్పించడం, భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం నా ఆశయం’’ అని చెబుతున్నారు. ఇతిశా.

పర్యావరణానికీ ఎంత నష్టం అనేది గ్రామస్తులకు ఇతిశా బోధపరిచారు. మనం చెయ్యాల్సిన పని ఎవరో వచ్చి చేస్తూ ఉంటే... వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారా? అని ఎదురుచూస్తూ ఉండడం మానాలనీ, ప్రతి ఒక్కరూ పరిసరాల్ని శుభ్రంగా ఉంచే దీక్షలో భాగస్వాములు కావాలనీ చెప్పారు. వ్యర్థాలను సేకరించడం, వాటిని వేరు చేయడం, కంపోస్ట్‌ తయారు చేయడం... ఇలా అనేక అంశాలను ప్రజలకు వివరించారు.

రాబోయే వారం రోజుల పాటు ఎముకలు కొరికే చలి

హైదరాబాద్‌ వాసులకు హైఅలర్ట్ .. రాబోయే వారం రోజుల పాటు ఎముకలు కొరికే చలి గ్యారంటీ.. ఇప్పటికే గత రెండు మూడు రోజుల నుంచి సిటీతో పాటు నగర శివారుని కోల్డ్‌ వేవ్స్‌ కమ్మేశాయి. ఇదే వెదర్‌ మరో ఏడెనిమిది రోజుల పాటు ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇటు చలి..మరోవైపు సీజనల్‌ వ్యాధులు విజృంభించే ఛాన్స్‌ ఉండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.

హైదరాబాద్‌పై చలి పగబట్టింది. జంటనగరాల్లో చలి తీవ్రత పెరిగింది. నగరశివారులో గత రెండు, మూడు రోజుల నుంచి కోల్డ్‌ వేవ్స్‌ వణికిస్తున్నాయి. ఇది మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉదయం పూట మార్నింగ్‌ వాకర్స్‌, ఇంటి నుంచి బయటకి వెళ్లే ఉద్యోగస్తులు వణికిపోతున్నారు.

హైదరాబాద్‌ నగర శివారులోని ఇబ్రహీంపట్నంలో రికార్డ్‌ స్థాయిలో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్‌లో 12.4, BHELలో 12.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజుల్లో చలి తీవ్ర మరింత పెరిగే ఛాన్స్‌ ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించడంతో జనం వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలితో నరకం చూడటం గ్యారంటీ అని బెంబేలెత్తిపోతున్నారు.

హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు దక్షిణ తెలంగాణలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చలి పులి వణికిస్తుంది. సింగిల్ డిజిట్‌కు పడిపోయింది ఉష్ణోగ్రత. కొమురంభీం జిల్లా సిర్పూర్ యులో రికార్డ్ స్థాయిలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. గిన్నెదరి 10.3 , తిర్యాణి‌ 10.8, కెరమెరి 12.3, వాంకిడి 12.5, ఆసిపాబాద్ 12.7 , జైనూర్ 13.7 గా ఉష్ణోగ్రత నమోదయ్యింది. మంచిర్యాల‌ జిల్లా జన్నారంలో 13.5, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ 11.5, బేల 11.9, చాప్రాల 12.1, అర్లి టి 12.1 సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత నమోదయింది.

మరోవైపు శీతాకాలంలో సీజనల్‌ వ్యాధులు చుట్టుముడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వింటర్‌లో శ్వాసకి సంబంధించిన సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని, హెల్తీ ఫుడ్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.

వారం రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ఇటు హైదరాబాద్‌వాసులతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలు వణికిపోతున్నారు. సీజనల్‌ వ్యాధులు విజృంభించే అవకాశం ఉండటంతో భయంతో బెంబేలెత్తిపోతున్నారు.

బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం

కొద్దిరోజుల కిందటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. యానాం, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆశించిన స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది.

నెల్లూరు, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

అటు తమిళనాడులో చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలు- చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, తిరుపత్తూర్, కడలూర్‌, దక్షిణ ప్రాంత జిల్లాలైన విల్లుపురం, తంజావూరు, తిరువరూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుక్కోట్టై, రామనాథపురం, కాళ్లకురిచ్చి, తూత్తుకూడి, దిండిగల్, మధురై, విరుధ్‌నగర్, థేని, తెన్ కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

ఇదే పరిస్థితులు మరోసారి తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం నాటికి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోంది. అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణ దిశ, దాని పరిసన ప్రాంతాల గగనతలంపై సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున ఈ ఆవర్తనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

క్రమంగా ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో నవంబర్ 23వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. అల్పపీడనంగా మారిన అనంతరం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడతుందని పేర్కొంది.

దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీతో పాటు తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది.

రామ్‌రాజ్ కాటన్‌కు కొత్త అంబాసిడర్

రామ్‌రాజ్ కాటన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ దుస్తుల్లో రామ్‌రాజ్ కాటన్ ఒక బ్రాండ్. తెల్లని కాటన్ షర్టులు, లుంగీలు, ధోతీల విక్రయాల్లో రామ్‌రాజ్ కాటన్‌కు ప్రజాదరణ ఎంతగానో ఉంది.

సాధారణంగా వ్యాపార వాణిజ్య సంస్థలు తమ వ్యాపార ఉత్పత్తుల విక్రయాల ప్రొమోషన్‌కు సెలబ్రెటీలను బ్రాండ్ అంబాసిడర్‌ (ప్రచారకర్త)గా నియమించుకుంటుంటారు. 

అదే క్రమంలో రామ్‌రాజ్ కాటన్‌కు ఇకపై ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

అభిషేక్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడంపై సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. కంపెనీ మార్కెట్ విస్తరణకు, దుస్తుల విభాగంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు ఈ నియామకం ఉపయోగపడుతుందని తెలిపింది. 

రామ్‌రాజ్ కుటుంబంలోకి అభిషేక్ బచ్చన్‌ను స్వాగతించడం ఆనందంగా ఉందని రామ్‌రాజ్ కాటన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కేఆర్ నాగరాజన్ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధంతో అభిషేక్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు. మరో పక్క రామ్‌రాజ్‌తో భాగస్వామ్యం పట్ల అభిషేక్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేశారు. సంస్థతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.