బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం
కొద్దిరోజుల కిందటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. యానాం, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆశించిన స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది.
నెల్లూరు, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
అటు తమిళనాడులో చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలు- చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, తిరుపత్తూర్, కడలూర్, దక్షిణ ప్రాంత జిల్లాలైన విల్లుపురం, తంజావూరు, తిరువరూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుక్కోట్టై, రామనాథపురం, కాళ్లకురిచ్చి, తూత్తుకూడి, దిండిగల్, మధురై, విరుధ్‌నగర్, థేని, తెన్ కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
ఇదే పరిస్థితులు మరోసారి తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం నాటికి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోంది. అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణ దిశ, దాని పరిసన ప్రాంతాల గగనతలంపై సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున ఈ ఆవర్తనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
క్రమంగా ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో నవంబర్ 23వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. అల్పపీడనంగా మారిన అనంతరం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడతుందని పేర్కొంది.
దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీతో పాటు తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది.
Nov 20 2024, 09:26