బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం

కొద్దిరోజుల కిందటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. యానాం, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆశించిన స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది.

నెల్లూరు, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

అటు తమిళనాడులో చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలు- చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, తిరుపత్తూర్, కడలూర్‌, దక్షిణ ప్రాంత జిల్లాలైన విల్లుపురం, తంజావూరు, తిరువరూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుక్కోట్టై, రామనాథపురం, కాళ్లకురిచ్చి, తూత్తుకూడి, దిండిగల్, మధురై, విరుధ్‌నగర్, థేని, తెన్ కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

ఇదే పరిస్థితులు మరోసారి తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం నాటికి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోంది. అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణ దిశ, దాని పరిసన ప్రాంతాల గగనతలంపై సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున ఈ ఆవర్తనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

క్రమంగా ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో నవంబర్ 23వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. అల్పపీడనంగా మారిన అనంతరం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడతుందని పేర్కొంది.

దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీతో పాటు తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది.

రామ్‌రాజ్ కాటన్‌కు కొత్త అంబాసిడర్

రామ్‌రాజ్ కాటన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ దుస్తుల్లో రామ్‌రాజ్ కాటన్ ఒక బ్రాండ్. తెల్లని కాటన్ షర్టులు, లుంగీలు, ధోతీల విక్రయాల్లో రామ్‌రాజ్ కాటన్‌కు ప్రజాదరణ ఎంతగానో ఉంది.

సాధారణంగా వ్యాపార వాణిజ్య సంస్థలు తమ వ్యాపార ఉత్పత్తుల విక్రయాల ప్రొమోషన్‌కు సెలబ్రెటీలను బ్రాండ్ అంబాసిడర్‌ (ప్రచారకర్త)గా నియమించుకుంటుంటారు. 

అదే క్రమంలో రామ్‌రాజ్ కాటన్‌కు ఇకపై ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

అభిషేక్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడంపై సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. కంపెనీ మార్కెట్ విస్తరణకు, దుస్తుల విభాగంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు ఈ నియామకం ఉపయోగపడుతుందని తెలిపింది. 

రామ్‌రాజ్ కుటుంబంలోకి అభిషేక్ బచ్చన్‌ను స్వాగతించడం ఆనందంగా ఉందని రామ్‌రాజ్ కాటన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కేఆర్ నాగరాజన్ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధంతో అభిషేక్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు. మరో పక్క రామ్‌రాజ్‌తో భాగస్వామ్యం పట్ల అభిషేక్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేశారు. సంస్థతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.

డాలర్‌తో పోల్చితే డేంజర్ జోన్‌లో రూపాయి

అగ్రరాజ్యం అమెరికా డాలర్ బలపడటం, చైనా కరెన్సీ యువాన్ బలహీనపడటం వల్ల దేశీయ కరెన్సీ ఒత్తిడిలో ఉండవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ నాటికి రూపాయి విలువ మరింత తగ్గుతుందని భావిస్తున్నారు.

ఈ సంవత్సరం చివరి నాటికి డాలర్‌తో పోల్చితే రూపాయి (rupee) విలువ మరింత బలహీనపడవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. డాలర్(Dollar) బలపడటం, చైనా కరెన్సీ యువాన్ బలహీనపడటం వల్ల స్థానిక కరెన్సీ ఒత్తిడిలో ఉండవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూపాయికి మద్దతు ఇవ్వడానికి కరెన్సీ మార్కెట్లో చురుకుగా ఉంటుందని భావిస్తున్నారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ప్రకారం ఈ సంవత్సరాంతానికి రూపాయి డాలర్‌కు 85 స్థాయిని తాకవచ్చన్నారు. గురువారం నాడు రూపాయి 84.41 వద్ద ముగిసింది. కరెన్సీ మార్కెట్ శుక్రవారం మూసివేయబడింది.

నవంబర్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇప్పటికే 0.33 శాతం క్షీణించింది. సెప్టెంబరు వరకు చాలా వరకు స్థిరంగా ఉన్న స్థానిక కరెన్సీ, US ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, USలో డొనాల్డ్ ట్రంప్ విజయంతో రేటు తగ్గింపు తర్వాత ఒత్తిడి మొదలైంది. తక్కువ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మిగులు డాలర్‌ను బలోపేతం చేస్తాయని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ గౌరా సేన్ గుప్తా అన్నారు. యువాన్ బలహీనపడటం వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో రూపాయిపై ఒత్తిడిని ఉంటుందన్నారు. అక్టోబరు నుంచి నవంబర్ 8 వరకు రూపాయి క్షీణత వేగాన్ని పరిమితం చేయడానికి RBI $ 15.5 బిలియన్ల నికర విక్రయాన్ని చేసింది.

నవంబర్ 8తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 675.7 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రూపాయి పతనాన్ని ఆపడానికి, కరెన్సీ మార్కెట్‌లో RBI జోక్యం చేసుకుంది. ఈ క్రమంలో గత ఆరు వారాల్లో విదేశీ మారక నిల్వలు 29 బిలియన్ డాలర్లు తగ్గాయి. విదేశీ మారకపు మార్కెట్‌లో ఆర్‌బీఐ జోక్యం సాధారణం కంటే ఎక్కువగా ఉందని, డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయికి సెంట్రల్ బ్యాంక్ మద్దతునిస్తుందని మార్కెట్ పార్టిసిపెంట్లు చెబుతున్నారు. మరోవైపు విదేశీ మారకపు మార్కెట్‌లో సెంట్రల్ బ్యాంక్ జోక్యం అసాధారణమైన అస్థిరతను నిరోధించడమేనని, పరిమితిని లక్ష్యంగా చేసుకోలేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల చెప్పారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 84.50 స్థాయిలో పరీక్షించబడుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ అన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత డాలర్ బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల ఉపసంహరణ సహజమేనని గుర్తు చేశారు. రూపాయి 84 స్థాయిని దాటిన తర్వాత పరిమిత జోక్యాన్ని చూశామన్నారు. కాబట్టి RBI చర్యలు కూడా కీలకమని ప్రస్తావించారు. నవంబర్‌లో ఇప్పటివరకు 10 సంవత్సరాల US బాండ్లపై రాబడి 20 బేసిస్ పాయింట్లు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు డాలర్‌తో రూపాయి మారకం విలువ 1.2 శాతం క్షీణించగా, ఈ ఏడాది రూపాయి 1.5 శాతం బలహీనపడింది.

యూకే రాజభవనంలో చోరీ

బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ నివాసంలో దొంగలు పడ్డారు. ఓ ట్రక్కు, మరో క్వాడ్ బైకు (నాలుగు చక్రాల బైకు)ను ఎత్తుకెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్యాలెస్ లో చోరీ జరగడం కలకలం రేపింది. భద్రతా వైఫల్యంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ లో జరిగిన ఈ చోరీకి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. 

అధికార వర్గాల సమాచారం ప్రకారం... ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు వారంలో రెండురోజులు విండ్సర్ ప్యాలెస్ లో గడుపుతుంటారు. ఈ భవనానికి జస్ట్ 5 నిమిషాల నడక దూరంలో యువరాజు ప్రిన్స్ విలియమ్ దంపతుల నివాసం అడిలైడ్ కాటేజీ ఉంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 13న విండ్సర్ క్యాజిల్ లో దొంగతనం జరిగింది.

అర్ధరాత్రి ప్రాంతంలో ఇద్దరు దొంగలు ఫెన్సింగ్ దూకి విండ్సర్ క్యాజిల్ ఎస్టేట్ లోకి ప్రవేశించారు. నేరుగా సెక్యూరిటీ జోన్ లోని ఓ ఫామ్ వద్దకు వెళ్లి అక్కడున్న ట్రక్కును, బైక్ ను ఎత్తుకెళ్లారు. ట్రక్కుతో గేటును ఢీ కొట్టి పారిపోయారు. ఆ సమయంలో రాజదంపతులు క్యాజిల్ లో లేరని తెలుస్తోంది. 

అయినప్పటికీ తరచూ రాజదంపతులు వచ్చిపోయే భవనం కావడంతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. రాత్రి పగలు తేడా లేకుండా సిబ్బంది పహారా కాస్తుంటారు. ఎస్టేట్ లో సెక్యూరిటీ అలారం కూడా ఉంటుంది. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే అలారం మోగుతుంది. ఇంత భద్రత ఉన్నప్పటికీ దొంగతనం జరగడంపై అధికారుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 

దొంగలు ట్రక్కును తీసుకెళుతుంటే అలారం ఎందుకు మోగలేదు... దొంగలు ఫెన్సింగ్ దూకినా సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై భద్రతా సిబ్బంది విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

దేశంలో అతిపెద్ద బ్యాంక్ నుంచి కస్టమర్లకు షాక్

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో రుణ రేట్లు పెరగనున్నాయి. అయితే ఎలాంటి లోన్స్ పెరిగే అవకాశం ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే బ్యాంక్ MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్)ని ఇటివల 0.05% పెంచింది. ఈ కొత్త మార్పు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఒక సంవత్సరం MCLR ఇప్పుడు 9%కి చేరుకుంది. ఇది దీర్ఘకాలిక గృహ రుణాలు, ఇతర ప్రధాన రుణాలకు ముఖ్యమైనది. ఎస్‌బీఐ (ఎస్‌బీఐ హోమ్ లోన్) ఎమ్‌సీఎల్‌ఆర్‌ని పెంచడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. బ్యాంక్ ప్రకారం ఈ నిర్ణయానికి కారణం ఖర్చులు, మార్కెట్లో పోటీ పెరగడమేనని పేర్కొన్నారు.

MCLR పెరుగుదల వల్ల ఇప్పుడు SBI లోన్స్ తీసుకున్న కస్టమర్లు మరింత వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. వారి రుణాలు MCLR ఆధారిత వడ్డీ రేట్లపై నిర్ణయించబడతాయి. SBI మొత్తం రుణ పుస్తకంలో 42% MCLRకి సంబంధించినదని బ్యాంక్ ఛైర్మన్ CS శెట్టి తెలిపారు. రుణాలు రెపో రేటు వంటి బాహ్య బెంచ్‌మార్క్ రేట్లతో అనుసంధానించబడి ఉన్నాయన్నారు. MCLRలో మార్పు వల్ల నేరుగా ఇల్లు, కారు, వ్యక్తిగత రుణాలు వంటి సేవలను ఉపయోగిస్తున్న వినియోగదారులపై ప్రభావం పడుతుంది.

SBI (SBI హోమ్ లోన్) మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం MCLRని 0.05% పెంచింది. అయితే ఓవర్‌నైట్, ఒక నెల, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల పదవీకాలానికి MCLR రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు.

కొత్త - పాత వడ్డీ రేట్లు

ముందు వడ్డీ రేటు (%) - ఇప్పుడు వడ్డీ రేటు (%)

ఒక నెల 8.20 - 8.20

మూడు నెలలు 8.50 - 8.55

ఆరు నెలలు 8.85 - 8.90

ఒక సంవత్సరం 8.95 - 9.0

రెండు సంవత్సరాలు 9.05 - 9.05

మూడు సంవత్సరం 9.10 - 9.10

MCLR అనేది బ్యాంకులు తమ ఖాతాదారులకు రుణాలు ఇచ్చే కనీస వడ్డీ రేటు. రుణ వడ్డీ (SBI హోమ్ లోన్) రేట్లను పారదర్శక పద్ధతిలో నిర్ణయించడానికి వీలుగా RBI ఏప్రిల్ 2016లో ఈ విధానాన్ని అమలు చేసింది. బ్యాంకుల నిధుల ఖర్చులు, నగదు నిర్వహణ, ఇతర ఖర్చుల ఆధారంగా MCLR నిర్ణయించబడుతుంది. ఈ విధానంలో RBI నుంచి ప్రత్యేక అనుమతి లేని పక్షంలో బ్యాంకులు కస్టమర్‌కు స్థిర రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు రుణం ఇవ్వలేవు. ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం RBI చేసిన వడ్డీ రేటు తగ్గింపుల ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడం.

MCLRలో పెరుగుదల ఆధారంగా రుణాలు పొందిన వినియోగదారుల EMIలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయితే రెపో రేటు వంటి బాహ్య బెంచ్‌మార్క్ రేట్లపై ఆధారపడి రుణాలు పొందిన కస్టమర్‌లపై వెంటనే ప్రభావం చూపకపోవచ్చు. ఉదాహరణకు మీరు గృహ రుణం తీసుకుంటూ MCLR 9% అయినట్లయితే, మీ నెలవారీ వాయిదా పెరగవచ్చు. అయితే ఈ మార్పు లోన్ కాలవ్యవధి, అసలు మొత్తంపై కూడా ఆధారపడి ఉంటుంది.

13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలోకి

13 ఏళ్లు.. సాధారణంగా ఈ వయసు పిల్లలు అప్పుడే కోచింగ్ సెంటర్లకు క్రికెట్ అకాడమీలకు వెళ్తుంటారు... లేదా పోటీ పరీక్షలకు ముందస్తుగానే సిద్ధం అవుతుంటారు.. కానీ, అతడు రంజీ క్రికెట్ ఆడేశాడు.. అండర్ 19 ప్రపంచ కప్ కూడా ఆడేశాడు.. మిగిలింది టీమ్ ఇండియా గడప తొక్కడమే.. ఆ దిశగా మొదటి అడుగు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వైపు అడుగేశాడు.

భారత క్రికెట్ లో సహజంగా ముంబై డామినేషన్ ఉంటుంది. లేదా నార్త్ ఇండియా ప్రభావం కనిపిస్తుంది.. కానీ, ప్రతిభ ఉంటే ఇవేవీ అడ్డుకోలేవు. దీనికి నిదర్శనమే బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రం నుంచి ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరు మార్మోగుతున్న వైభవ్ సూర్య వంశీ. 13 ఏళ్ల సూర్య వంశీ భవిష్యత్ క్రికెట్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అతడు కష్టపడి, క్రమశిక్షణతో ఉంటే ఇది సాధ్యమే.

బిహార్‌ రాష్ట్రం తాజ్‌పుర్ గ్రామానికి చెందినవాడు వైభవ్ సూర్యవంశీ. 2011లో పుట్టిన ఇతడు నాలుగేళ్ల వయసుకే బ్యాట్‌ పట్టాడు. దీంతో వైభవ్ కు క్రికెట్ అంటే ఆసక్తి ఉందని గమనించిన అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఏకంగా సొంత మైదానమే సిద్ధం చేశాడు. 2019 నాటికి.. అంటే 8 ఏళ్లు వచ్చేసరికి సమస్తిపుర్‌ లోని క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. రెండేళ్ల శిక్షణలోనే వైభవ్ బిహార్ అండర్-16 జట్టులోకి ఎంటర్ అయ్యాడు. అంటే 10 ఏళ్లకే 16 ఏళ్ల విభాగంలో ఆడాడు.

ఓపెనర్ అయిన వైభవ్ సూర్యవంశీ దూకుడైన ఎడమ చేతివాటం బ్యాట్స్ మన్. బౌలింగ్‌ కూడా వేస్తాడు. ఈ ఏడాదిలోనే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ లు ఆడాడు. తనదైన శైలిలో.. ఫీల్డర్ల మధ్యలోంచి బౌండరీలు కొట్టడం వైభవ్ కు ఉన్న ప్రత్యేకత. వైభవ్ పేరును తాజాగా మెగా వేలం షార్ట్ లిస్ట్ లో పెట్టింది ఐపీఎల్ మేనేజ్ మెంట్.

రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌ తో పేరును ఎంట్రీ చేయించిన వైభవన్ ను ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా సంచలనమే. కాగా, 1988లో 16 ఏళ్ల వయసులో టీమ్ ఇండియాలో వచ్చాడు సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత అతడు వెనక్కు తిరిగిచూసుకోలేదు. ఎవరూ అందుకోలేని రికార్డులను నెలకొల్పాడు. మరి వైభవ్..మరో రెండేళ్లకు టీమ్ ఇండియాలోకి వచ్చినా అది రికార్డే.

కొణతం దిలీప్ అరెస్ట్

ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న వారిపై చర్యలకు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ కొణతం దిలీప్‌ను సోమవారం హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కొణతం దిలీప్‌ను సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా హెడ్‌గా కొణతం దిలీప్ వ్యవహారించారు.

అయితే గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో కొణతం దిలీప్.. ఆ పదవి నుంచి తప్పుకున్నారు. నాటి నుంచి రేవంత్ సర్కారే లక్ష్యంగా ఆయన సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా రంగంలోకి దిగడంతోపాటు లగచర్ల ఘటనలపై సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరిగింది.

దీనిని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఆ క్రమంలో చర్యలు చేపట్టింది. ఇలాంటి పోస్టులు పెట్టిన.. పెడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కొణతం దిలీప్ సోషల్ మీడియా హెడ్‌గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.

మరోవైపు కొణతం దిలీప్ అరెస్ట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. కొణతం దిలీప్ అరెస్ట్‌ను ఆయన ఖండించారు. కక్షపూరిత, ప్రతీకార చర్యలు మానుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన హితవు పలికారు. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ.. అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.

ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హరీశ్ రావు స్పందించారు.

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు

తెలంగాణ సచివాలయంలో మార్పులు జరుగుతున్నాయి. తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని (బాహుబలి గేటు) మూసేస్తున్నారు. ఇందులో భాగంగా తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులను ఏర్పాటు చేశారు.

ఈశాన్యం గేటుకు తూర్పు వైపుకు ప్రధాన ద్వారం రానుంది. ఇక్కడ మరో గేటును ఏర్పాటు చేయనున్నారు. మిగతా గేట్లను యథావిధిగా ఉంచనున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉండటంతో ఆ లోపు వాస్తు మార్పులు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

దాదాపు రూ.3.20 కోట్లతో ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. సచివాలయానికి ప్రస్తుతం నాలుగు వైపుల ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ రాకపోకలు జరిపేవారు.

ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలను కొంతకాలం నిలిపేశారు. ఆ దారిలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డును కూడా వేస్తున్నారు.

పశ్చిమం వైపు మింట్ కాంపౌండ్ ఉంది. ఈ ద్వారాన్ని ఎక్కువగా ఉపయోగించడం లేదు. ఇక్కడ ఎలాంటి మార్పులూ చేయడం లేదు. సచివాలయం నిర్మాణం తర్వాత మార్పులు చేయడం ఇదే తొలిసారి. కొత్త సచివాలయ భవనాన్ని నాటి సీఎం కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించారు.

అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్‌లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.

అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్‌లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. అధికారం చేపట్టిన వెంటనే అమలు చేసేలా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌; భారత సంతతికి చెందిన బయోటెక్‌ కంపెనీ సీఈవో, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు వివేక్‌ రామస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ-డోగ్‌) ప్రత్యేకంగా ఏర్పాటైంది. ప్రభుత్వ విభాగాల్లో సామర్థ్యం పెంచడమంటే భారీగా ఉద్యోగాల్లో కోత విధించడమేనని ఈ ఇరువురు సీఈవోలు భావిస్తున్నారు. ఇటీవల ట్రంప్‌ సొంత ఎస్టేట్‌ అయిన మార్‌ ఎ లాగోలో జరిగిన సన్మాన సభలో వివేక్‌ ప్రసంగిస్తూ ‘‘మస్క్‌, నేను కలిసి వాషింగ్టన్‌లోని అధికార యంత్రాంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ‘ఎన్నిక ద్వారా నియమితులుకాని ఉద్యోగుల’ను బయటకు పంపి వేస్తాం.మేం ఆ పొజిషన్‌లో ఉన్నాంఅని చెప్పారు.

మస్క్‌ గురించి మీకు పూర్తిగా తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించడానికి ఆయన పెద్ద కరెంటు రంపమే తెస్తున్నారు. చాలా సరదాగా ఉంటుందిలే’’ అని వ్యాఖ్యానించారు. ఈ ‘కరెంటు రంపం’ ఆలోచనను అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్‌ మిలేయి నుంచి తీసుకున్నట్టు కనిపిస్తోంది. అధికారం చేపట్టిన వెంటనే సాహసోపేత పొదుపు చర్యలు తీసుకుంటానని మిలేయి ప్రకటించారు. ఆర్థిక పోకిరీ అరాచక పెట్టుబడిదారుడు’నని స్వయంగా చెప్పుకొన్నారు. అధికార యంత్రాంగం, ఆర్థిక లోటును తగ్గించేందుకు ‘కరెంటు రంపాన్ని’ ఉపయోగిస్తానని ప్రకటించారు. ఆ భావననే వివేక్‌ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ‘క్షవరం’ చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సైజును షేవింగ్‌ చేయడం మా లక్ష్యం. ఇది మాత్రం సాధ్యమైనంత వరకు పారదర్శంగా జరగాలి’’అని పేర్కొన్నారు. ఈ కసరత్తును ఆయన ‘ఆధునిక మాన్‌హట్టన్‌ ప్రాజెక్టు’ అని అభివర్ణించారు.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులు తయారు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ‘మన్‌హట్టన్‌ ప్రాజెక్టు’ను నిర్వహించింది. ప్రస్తుతం భారీగా ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించేందుకు చేపట్టే ప్రాజెక్టు కూడా అంత తీవ్రమైనదేనని తెలిపారు. ఇందుకోసం దేశంలోని మేధావులను ఒక్క దగ్గర చేర్చుతున్నామని చెప్పారు. జీతం తీసుకోకుండా వారానికి 80 గంటలపాటు అంకితభావంతో పనిచేసేవారు కావాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చారు కూడా.

ఉద్యోగుల తొలగింపు కారణంగా కీలకమైన ప్రభుత్వ విధులు కుంటుపడుతాయన్న హెచ్చరికలకు వివేక్‌ సమాఽధానమిస్తూ ‘నూతన ఆవిష్కరణలు, వ్యయం అదుపునకు కోతలు తప్పనిసరి’ అన్నారు. ‘‘మనం క్షీణదశలో ఉన్న దేశం అంటూ నిరాశ భావనను ఇంతవరకు మనకు కలిగించారు. అది తప్పని ఎన్నికల్లో రుజువైంది. దేశ నిర్మాతలు గర్వపడేలా తగిన సైజ్‌, లక్ష్యం ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ‘డోగ్‌’ పని అని అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతివారం ఎక్స్‌లో ‘డోగ్‌కాస్ట్‌’ ప్రసారం చేసి మస్క్‌, వివేక్‌లు తమ అభిప్రాయాలను తెలుపుతారు.

అరెస్ట్ చేయొద్దని వర్మ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఓ కేసు విషయంలో వర్మ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మకు చుక్కెదురైంది. కేసు విషయంలో వర్మ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి కాపాడాలని హైకోర్టు ధర్మసనాన్ని కోరారు. సదరు కేసులో వర్మ అరెస్ట్ అవుతారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా కాంట్రవర్సీకి దారితీసింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు చేశారు. ఆ అంశంపై అప్పట్లో పెను దుమారం చెలరేగింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది.

మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆ కేసులో తనను అరెస్ట్ చేస్తారని వర్మ భావించారు. ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ చేయొద్దని ధర్మసనాన్ని కోరగా తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారని భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

వర్మ కేసుకు సంబంధించి రేపు (మంగళవారం) విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు వర్మ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. మరింత సమయం ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. సమయానికి సంబంధించిన అంశాన్ని పోలీసుల ముందు తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

అలాంటి అభ్యర్థనలు తమ ముందుద చేయొద్దని తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించి వర్మకు హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో ఆయన రేపు విచారణకు హాజరవుతారా..? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వర్మ విచారణకు హాజరుకాకుంటే నేరుగా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.