అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్‌లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.

అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్‌లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. అధికారం చేపట్టిన వెంటనే అమలు చేసేలా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌; భారత సంతతికి చెందిన బయోటెక్‌ కంపెనీ సీఈవో, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు వివేక్‌ రామస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ-డోగ్‌) ప్రత్యేకంగా ఏర్పాటైంది. ప్రభుత్వ విభాగాల్లో సామర్థ్యం పెంచడమంటే భారీగా ఉద్యోగాల్లో కోత విధించడమేనని ఈ ఇరువురు సీఈవోలు భావిస్తున్నారు. ఇటీవల ట్రంప్‌ సొంత ఎస్టేట్‌ అయిన మార్‌ ఎ లాగోలో జరిగిన సన్మాన సభలో వివేక్‌ ప్రసంగిస్తూ ‘‘మస్క్‌, నేను కలిసి వాషింగ్టన్‌లోని అధికార యంత్రాంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ‘ఎన్నిక ద్వారా నియమితులుకాని ఉద్యోగుల’ను బయటకు పంపి వేస్తాం.మేం ఆ పొజిషన్‌లో ఉన్నాంఅని చెప్పారు.

మస్క్‌ గురించి మీకు పూర్తిగా తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించడానికి ఆయన పెద్ద కరెంటు రంపమే తెస్తున్నారు. చాలా సరదాగా ఉంటుందిలే’’ అని వ్యాఖ్యానించారు. ఈ ‘కరెంటు రంపం’ ఆలోచనను అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్‌ మిలేయి నుంచి తీసుకున్నట్టు కనిపిస్తోంది. అధికారం చేపట్టిన వెంటనే సాహసోపేత పొదుపు చర్యలు తీసుకుంటానని మిలేయి ప్రకటించారు. ఆర్థిక పోకిరీ అరాచక పెట్టుబడిదారుడు’నని స్వయంగా చెప్పుకొన్నారు. అధికార యంత్రాంగం, ఆర్థిక లోటును తగ్గించేందుకు ‘కరెంటు రంపాన్ని’ ఉపయోగిస్తానని ప్రకటించారు. ఆ భావననే వివేక్‌ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ‘క్షవరం’ చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సైజును షేవింగ్‌ చేయడం మా లక్ష్యం. ఇది మాత్రం సాధ్యమైనంత వరకు పారదర్శంగా జరగాలి’’అని పేర్కొన్నారు. ఈ కసరత్తును ఆయన ‘ఆధునిక మాన్‌హట్టన్‌ ప్రాజెక్టు’ అని అభివర్ణించారు.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులు తయారు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ‘మన్‌హట్టన్‌ ప్రాజెక్టు’ను నిర్వహించింది. ప్రస్తుతం భారీగా ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించేందుకు చేపట్టే ప్రాజెక్టు కూడా అంత తీవ్రమైనదేనని తెలిపారు. ఇందుకోసం దేశంలోని మేధావులను ఒక్క దగ్గర చేర్చుతున్నామని చెప్పారు. జీతం తీసుకోకుండా వారానికి 80 గంటలపాటు అంకితభావంతో పనిచేసేవారు కావాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చారు కూడా.

ఉద్యోగుల తొలగింపు కారణంగా కీలకమైన ప్రభుత్వ విధులు కుంటుపడుతాయన్న హెచ్చరికలకు వివేక్‌ సమాఽధానమిస్తూ ‘నూతన ఆవిష్కరణలు, వ్యయం అదుపునకు కోతలు తప్పనిసరి’ అన్నారు. ‘‘మనం క్షీణదశలో ఉన్న దేశం అంటూ నిరాశ భావనను ఇంతవరకు మనకు కలిగించారు. అది తప్పని ఎన్నికల్లో రుజువైంది. దేశ నిర్మాతలు గర్వపడేలా తగిన సైజ్‌, లక్ష్యం ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ‘డోగ్‌’ పని అని అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతివారం ఎక్స్‌లో ‘డోగ్‌కాస్ట్‌’ ప్రసారం చేసి మస్క్‌, వివేక్‌లు తమ అభిప్రాయాలను తెలుపుతారు.

అరెస్ట్ చేయొద్దని వర్మ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఓ కేసు విషయంలో వర్మ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మకు చుక్కెదురైంది. కేసు విషయంలో వర్మ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి కాపాడాలని హైకోర్టు ధర్మసనాన్ని కోరారు. సదరు కేసులో వర్మ అరెస్ట్ అవుతారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా కాంట్రవర్సీకి దారితీసింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు చేశారు. ఆ అంశంపై అప్పట్లో పెను దుమారం చెలరేగింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది.

మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆ కేసులో తనను అరెస్ట్ చేస్తారని వర్మ భావించారు. ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ చేయొద్దని ధర్మసనాన్ని కోరగా తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారని భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

వర్మ కేసుకు సంబంధించి రేపు (మంగళవారం) విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు వర్మ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. మరింత సమయం ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. సమయానికి సంబంధించిన అంశాన్ని పోలీసుల ముందు తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

అలాంటి అభ్యర్థనలు తమ ముందుద చేయొద్దని తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించి వర్మకు హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో ఆయన రేపు విచారణకు హాజరవుతారా..? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వర్మ విచారణకు హాజరుకాకుంటే నేరుగా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

రేవంత్ ను టార్గెట్ చేసిన పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తన రూటు మార్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఆరెస్సెస్ కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేసారు. శినసేన - జనసేన సిద్దాంతం ఒకటేనని చెప్పుకొచ్చారు. బీజేపీ గెలుపు అవసరం గురించి వివరించారు. అదే సమయంలో తొలి సారి తెలంగాణ సీఎం రేవంత్ ను టార్గెట్ చేసారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. పవన్ విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక మలుపుగా కనిపిస్తోంది.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు రోజులు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిందీ, మరాఠీ భాషల్లో తన ప్రచారం కొనసాగించారు. తనకు మరాఠా ప్రజలు.. ఛత్రపతి శివాజీ, బాలాసాహెబ్ థాక్రే పైన తన అభిమానం ఎలాంటిదో వివరించారు. శివసేన - జనసేన రెండు ప్రజలకు న్యాయం చేసేందుకు సిద్దంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. సనాతన హిందూ ధర్మం గురించి ప్రస్తావించారు. మహారాష్ట్ర భవిష్యత్ కు బీజేపీ కూటమి గెలుపు అవసరమని పేర్కొన్నారు. తాను ఏపీలో వైసీపీని ఓడించిన అంశాన్ని ప్రతీ సభలోనూ వివరించారు.

తెలంగాణ రాజకీయాల గురించి పవన్ తన ప్రచారంలో ప్రస్తావన చేసారు. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ సైతం మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ తన హయాంలో అమలు చేసిన పథకాలను వివరించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్ గా పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ అంటే తన గుండె ఎలా కొట్టుకుంటుందో అంటూ వివరించారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి తనకు ఇష్టమైన పాట అని చెప్పుకొచ్చారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని పేర్కొన్న పవన్.. అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతీ నెలా ఇస్తామని చెప్పిన ఆర్దిక సాయం ఇవ్వటం లేదని పవన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకోవటం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

అటు రేవంత్ తన ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో తన ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు. కేంద్రం, ప్రధాని మోదీ పైన విమర్శలు గుప్పించారు. గుజరాత్ నుంచి ప్రధాని, అదానీ ముంబైను దోచుకోవడానికి వస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని రేవంత్ తన ప్రచారంలో పిలుపునిచ్చారు. పవన్ తన ప్రచారంలో భాగంగా ఓవైసీ మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. ఇక, పవన్ ఇప్పుడు రేవంత్ హామీలు అమలు చేయటం లేదంటూ చేసిన విమర్శల పైన కాంగ్రెస్ నేతలు కౌంటర్ కు సిద్దం అవుతున్నారు. ఇప్పుడు ఈ పరిణామాలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంటున్నాయి.

తెలంగాణలో అదానీ సామ్రాజ్యం

ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం చేస్తున్న వ్యాఖ్యలకు, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరడం లేదు. రాహుల్‌గాంధీ నిత్యం అదానీ లక్ష్యంగా కేంద్రంపై దాడి చేస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారు మాత్రం అదానీకి రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నది. సిమెంట్‌ పరిశ్రమలో గుత్తాధిపత్యం సాధించాలన్న అదానీ ప్రణాళికలకు రాష్ట్ర సర్కారు బాసటగా నిలుస్తూ తనవంతు సహకారం అందిస్తున్నది.

ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం చేస్తున్న వ్యాఖ్యలకు, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరడం లేదు. రాహుల్‌గాంధీ నిత్యం అదానీ లక్ష్యంగా కేంద్రంపై దాడి చేస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారు మాత్రం అదానీకి రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నది. సిమెంట్‌ పరిశ్రమలో గుత్తాధిపత్యం సాధించాలన్న అదానీ ప్రణాళికలకు రాష్ట్ర సర్కారు బాసటగా నిలుస్తూ తనవంతు సహకారం అందిస్తున్నది. తాజాగా అదానీ గ్రూప్‌కు చెందిన సిమెంట్‌ పరిశ్రమ కోసం నల్లగొండ జిల్లాలో సున్నపురాయి గనులను విస్తరించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నది.

ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అదానీ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజలు ఆం దోళన చేస్తుండగా, తాజాగా నల్లగొండ జిల్లా లో సున్నపురాయి గనిని విస్తరించేందుకు స న్నాహాలు చేస్తుంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గగన్‌పహాడ్‌లో ఉన్న పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన చాణక్య సిమెం ట్స్‌ లైమ్‌స్టోన్‌ మైన్‌ విస్తరణపై 29న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు పీసీబీ తెలిసింది. పెన్నా సిమెంట్‌ కంపెనీని ఆగస్టులో అదానీ గ్రూపు రూ.10,422 కోట్లకు టేకోవర్‌ చేసింది. అదానీకి చెందిన అంబుజా సిమెంట్‌ కు పెన్నా అనుబంధ కంపెనీగా మారిపోయిం ది. 875 ఎకరాల చాణక్య సిమెంట్‌ సున్నపురాయి గనిని విస్తరించాలని నిర్ణయించింది.

తెలంగాణలో సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఇప్పటికే అదానీ గ్రూపు ప్రకటించింది. ఇందు లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 70 ఎకరాల్లో వచ్చే ఐదేండ్లలో సంవత్సరానికి ఆరు మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల సిమెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేయాలని కంపెనీ నిర్ణయించింది. అంబుజా సిమెంట్‌ కంపెనీ ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ కోసం ఇటీవల పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. సిమెంట్‌ కంపెనీతో తమ జీవితాలు బుగ్గిపాలవుతాయని, ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించేది లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అదానీతో బంధం బలపడుతున్నట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ర్పాటు చేస్తున్న స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ గ్రూపు రూ.100 కోట్లు విరాళం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్తు, సిమెంట్‌, డాటా సెంటర్లు తదితర రంగాల్లో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, సీఎం రేవంత్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

డాటా సెంట ర్‌ ఏర్పాటుకు రూ.ఐదు వేల కోట్లు, గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించిన రెండు పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు(పీఎస్‌పీ)ల ఏర్పాటుకు ఐదు వేల కోట్లు, రక్షణ రంగంలో ఆర్‌అండ్‌డీ ఎకోసిస్టం ఏర్పాటుకు రూ.1,000 కోట్లు, సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే పెన్నా సిమెంట్‌ను సొంతం చేసుకున్న అదానీ గ్రూ ప్‌.. రామన్నపేటలో సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పా టుకు సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు, రా ష్ట్రంలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థను ఇప్పటికే అదానీకి అప్పగించినట్టు వార్తలొస్తున్నాయి. ఇటీవల పాతబస్తీలో కరెంట్‌ మీటర్ల వివరాల ను ఆ గ్రూప్‌కు చెందిన సిబ్బంది సేకరించడంతో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.

2028 నాటికి ఏటా 140 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం (ఎంటీపీఏ) సాధించాలని అంబుజా సిమెంట్స్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. ఇప్పటికే గుజరాత్‌లో పలు సిమెంట్‌ పరిశ్రమలను కొ నుగోలు చేయడం, పలు కంపెనీల్లో వా టాలు కొనుగోలు చేయడం ద్వారా ఉత్ప త్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నది. అపార సున్నపురాయి గనులు ఉన్న పెన్నా సిమెంట్‌ను కూడా అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. దీంతోపాటు రామన్నపేటలో కొత్తగా సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా ఇటు దక్షిణాది రాష్ర్టాలతోపాటు తూర్పు ప్రాంతానికి, అటు సీపోర్టు ద్వారా శ్రీలంకకు సిమెంట్‌ ఎగుమతి చేయవచ్చని అదానీ గ్రూప్‌ భావిస్తున్నది. ఇటీవలే బీహార్‌లో గ్రైండింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు 1,600 కోట్లు పెట్టుబడి పెట్టింది. బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్‌ను అధిగమించి ప్రథమ స్థానానికి ఎగబాకేందుకు అదానీ గ్రూప్‌ అడుగులు వేస్తున్నది.

ముంబై ఓటు ఎటువైపు

ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకూ కీలకం కానుంది.

 ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకూ కీలకం కానుంది. ముంబైలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి అభ్యర్థులతో కాంగ్రెస్‌, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం శివసేన, శరద్‌ పవార్‌ వర్గం ఎన్సీపీతో కూడిన మహావికాస్‌ అఘాడీ(ఎంవిఏ) కూటమి అభ్యర్థులు తలపడుతున్నారు. వీరికి తోడు రాజ్‌థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(ఎంఎన్‌ఎ్‌స), ప్రకాశ్‌ అంబేడ్కర్‌ సారథ్యంలోని వించిత్‌ బహుజన్‌ అఘాడీ, అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని మజ్లి్‌స అభ్యర్థులు కూడా ముంబైలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 36 సీట్లకు గాను బీజేపీ, ఉమ్మడి శివసేన ఎన్డీయే కూటమిగా 30 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇందులో బీజేపీ 16, శివసేన 14 స్థానాలు గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో మహాయుతి కూటమిలోని బీజేపీ 18, షిండే శివసేన 16, అజిత్‌ పవార్‌ ఎన్సీపీ 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించాయి. ఎంవిఏ కూటమిలోని యూబీటీ 22, కాంగ్రెస్‌ 11, శరద్‌ పవార్‌ వర్గం ఎన్సీపీ 2 చోట్ల అభ్యర్థులను పోటీకి దించాయి. శివసేన రెండు ముక్కలై పరస్పరం పోటీపడుతుండటంతో తాజా ఎన్నికల్లో ముంబై ఓటర్లు ఏ వర్గాన్ని ఆదరిస్తారనేది ఉత్కంఠగా మారింది.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ముంబైలోని ఆరు ఎంపీ సీట్లకు గాను బీజేపీ రెండింటినే గెలుచుకోగలిగింది. మిగతా నాలుగింటిలో మూడింటిని ఉద్ధవ్‌ శివసేన గెలుచుకోగా ఎంవిఏ కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ మరో స్థానాన్ని గెలుచుకుంది. మెజార్టీ నియోజకవర్గాలను గెలుచుకున్న ఎంవీఏ అదే ఊపు తో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతోంది.

మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరే ముంబైలో 25 నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దించారు. దీంతో సంప్రదాయ ఓట్లు చీలే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబైలో సంప్రదాయ ఓట్లను నమ్ముకున్న బీజేపీ, శివసేనలకు ఎం ఎన్‌ఎ్‌స సవాలుగా మారనుంది. వర్లీలో ఉద్ధవ్‌ థాకరే తనయుడు, సిటింగ్‌ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే పోటీ చేస్తున్నారు. శివసేన తరఫున మిలింద్‌ దేవరా బరిలో ఉండగా, ఎంఎన్‌ఎ్‌స సందీప్‌ దేశ్‌పాండేను పోటీకి దించింది. దీంతో ముక్కోణపు పోటీ ఏర్పడింది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటి మూడ్‌లోనే ఓటర్లు కొనసాగి తే ముంబైలో 4 సీట్లు గెలుచుకున్న ఎంవిఏ కూటమి మరోసారి స్వీప్‌ చేసే అవకాశం ఉంది. అయితే తాము అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ముంబై నగర వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పట్టం కడతారని మహాయుతి కూటమి ఆశాభావంగా ఉంది.

మజ్లిస్‌ అభ్యర్థులు బరిలో నిలుస్తోన్న వెర్సోవా, శివాజీనగర్‌ తదితర నియోజకవర్గాల్లో ఎంవీఏ కూటమికి దక్కే ముస్లిం ఓట్లలో చీలిక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఎంవీఏ కూటమికి మింగుడు పడని విషయంగా మారనుంది. గత ఎన్నికల్లో 44 చోట్ల పోటీ చేసిన మజ్లిస్‌ డజనుకు పైగా నియోజకవర్గాల్లో కాంగ్రె్‌స-ఎన్సీపీ కూటమి అభ్యర్థులను ఓడించడంలో కీలకంగా మారింది.

ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు పొగ మంచు రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం నగరాన్ని పొగమంచు కమ్మేయడంతో సమీప వాహనాలు కూడా కనిపించని దుస్థితి నెలకొంది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే, నగరంలో వాయునాణ్యత సూచీ 428కి చేరడంతో.. ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరుగుతుండటంతో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించినప్పటికీ.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయబోతుంది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌- 4 కింద మరిన్ని నిబంధనలను ఈరోజు (సోమవారం) ఉదయం 8గంటల నుంచి అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఢిల్లీ నగరంలోకి నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా ఇతర (భారీ) వాహనాలకు ప్రవేశాన్ని నిలిపివేయాలని సీఏక్యూఎం ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్‌-4 డీజిల్‌ ట్రక్కులకే పర్మిషన్ ఇవ్వాలని పేర్కొనింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్‌ వంతెనలు, పవర్‌ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పింది.

ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని సూచించినప్పటికి.. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు దాన్ని వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం ఆతిశీ వెల్లడించారు.

అలాగే, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఆఫీసులన్నీ 50శాతం ఆక్యూపెన్సీతో పని చేసేలా చూడాలని.. మిగతా వారికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని సీఏక్యూఎం సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ ఇవ్వొచ్చని చెప్పుకొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వాలు కాలేజీలను మూసివేయడంతో పాటు సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ ఆదేశాలు జారీ చేస్తుంది.

ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే వైసీపీ హయాంలో అనుసరించిన పలు విధానాలు మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎక్కడినుంచైనా తమ ఆస్తులు, భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ విధానం అమల్లోకి తెచ్చారు. అయితే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల విధానంలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న ప్రభుత్వం.. ఇందులో మార్పులు చేయనున్నట్లు తెలిసింది. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ఆనుసరించిన పలు విధానాల్లో మార్పులు చేసిన టీడీపీ కూటమి సర్కారు.. తాజాగా రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న ప్రభుత్వం.. వాటికి చెక్ పట్టేలా మార్పులు చేయనున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్రంలో ఎక్కడినుంచైనా తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ప్రజలకు కల్పించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో అక్రమాలు జరిగాయని కూటమి సర్కారు భావిస్తోంది. గతంలో ఎవరైనా భూములను, ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే.. ఆ ఆస్తి ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయం సబ్ రిజిస్ట్రార్ నివేదిక వచ్చిన తర్వాతే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో మరో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేవారు. అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ జరిగేది. అయితే వైసీపీ హయాంలో ఈ విధానంలో అక్రమాలు జరిగాయని టీడీపీ పలుసార్లు ఆరోపించింది.

ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు తేవాలని భావిస్తోంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని కేవలం 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే అమలు చేయాలని భావిస్తోంది. దీనికి కూడా మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం లభిస్తే.. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు అమల్లోకి వస్తాయి.

మరోవైపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల మార్కెట్ ధరలు కూడా పెంచనున్నట్లు తెలిసింది. భూముల మార్కెట్ రేట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పెరిగే అవకాశం ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి ఒకటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి తేనున్నట్లు సమాచారం.

మిస్ యూనివర్శ్‌గా డెన్మార్క్ యువతి

 ఈ సంవత్సరం విశ్వసుందరిగా డెన్మార్క్ బ్యూటీ నిలిచింది. భారత్ నుంచి బరిలో నిలిచిన రియా సింఘా.. ప్రిలిమినరీ రౌండ్స్‌లో మాత్రమే మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది.

డెన్మార్క్ చరిత్ర సృష్టించింది. 73వ మిస్ యూనివర్శ్ 2024 పేజెంట్‌లో ఆ దేశానికి చెందిన 21 ఏళ్ల విక్టోరియా జాయిర్ (Victoria Kjaer)ని అందాల కిరీటం వరించింది. ఇప్పటివరకూ డెన్మార్క్‌కి ఇలాంటిది రాలేదు. మొదటిసారి ఆ దేశ బ్యూటీ దీన్ని దక్కించుకుంది.

మెక్సికోకి చెందిన మర్లా ఫెర్నాండా బెల్ట్రాన్ (Marla Fernanda Beltran) మొదటి రన్నరప్‌గా నిలవగా.. నైజీరియాకి చెందిన స్నిడిమ్మా అడెత్‌షిన్హా (Cnidimma Adetshina) రెండో రన్నరప్ పొజిషన్‌లో నిలిచింది.

రేపు నవంబర్ 18న బ్యాంకులు విద్యాసంస్థలకు సెలవు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఈ నవంబర్‌లో పెద్దగా సెలవులు లేకపోయినా ప్రాంతీయ సెలవులున్నాయి. దేశమంతా కాకపోయినా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. అదే విధంగా రేపు అంటే నవంబర్ 18వ తేదీన ఈ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుందని గమనించగలరు.

బ్యాంకులకు ప్రతి నెలా సెలవులుంటాయి. ఆర్బీఐ ఎప్పటికప్పుడు జారీ చేస్తుంటుంది. ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాలు, నాలుగు ఆదివారాలు కలిపి 6 సెలవులు కచ్చితంగా ఉంటాయి. ఇవి కాకుండా జాతీయ, ప్రాంతీయ సెలవులుంటాయి. ప్రాంతీయ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. అదే విధంగా రేపు నవంబర్ 18న కర్ణాటకలో అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి.

కనకదాస్ జయంతి పురస్కరించుకుని కర్ణాటకలో రేపు ప్రభుత్వ , ప్రైవేట్ బ్యాంకులకు సెలవు ఉంది. అందుకే రేపు ఒకవేళ బ్యాంకు పనుంటే వాయిదా వేసుకోగలరు. లేకపోతే ఇబ్బంది ఎదురుకావచ్చు. 

కనకదాస్ జయంతి సందర్భంగా రేపు నవంబర్ 18న కర్ణాటకలో బ్యాంకులే కాకుండా స్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుంది. కనకదాస్ జయంత్రి రాష్ట్రంలో అతిపెద్ద పండుగ.

మహా కవి, సాధువైన కనకదాస్ జయంతిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. కర్ణాటకలో ఈరోజు పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తుంటారు. అందుకే విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. 

నవంబర్ నెలలో ఇవాళ అంటే నవంబర్ 17 ఆదివారం సెలవు కాగా నవంబర్ 18 కనకదాస్ జయంతి సెలవుంది. ఇక నవంబర్ 23 నాలుగో శనివారం, నవంబర్ 24 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుంది.

దొరికిపోయిన రైల్వే ఉన్నతాధికారి

లంచం తీసుకుంటూ దొరికిపోయిన రైల్వే ఉన్నతాధికారి

లంచం తీసుకుంటూ దొరికిపోయిన రైల్వే ఉన్నతాధికారి

కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

ముంబైలోని తన నివాసంలో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న డీఆర్ఎం

విశాఖ డీఆర్ఎం బంగ్లాలో సోదాలు జరిపిన సీబీఐ అధికారులు

విశాఖ జిల్లా వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎంగా పనిచేస్తున్న సౌరబ్ ప్రసాద్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం సెలవులో ఉన్న సౌరభ్ ప్రసాద్ లంచం డబ్బును ముంబైలో తన ఇంటికి వచ్చి ఇవ్వాలని సూచించాడు. దాంతో కాంట్రాక్టర్ ముంబై వెళ్లి రూ.25 లక్షలు లంచం ఇస్తుండగా, సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఇదే క్రమంలో ఇటు విశాఖలోని డీఆర్ఎం బంగ్లాలో సీబీఐ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సీబీఐ సోదాలు జరిపింది. ఢిల్లీ, విశాఖకు చెందిన రెండు బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.