ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే వైసీపీ హయాంలో అనుసరించిన పలు విధానాలు మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎక్కడినుంచైనా తమ ఆస్తులు, భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ విధానం అమల్లోకి తెచ్చారు. అయితే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల విధానంలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న ప్రభుత్వం.. ఇందులో మార్పులు చేయనున్నట్లు తెలిసింది. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ఆనుసరించిన పలు విధానాల్లో మార్పులు చేసిన టీడీపీ కూటమి సర్కారు.. తాజాగా రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న ప్రభుత్వం.. వాటికి చెక్ పట్టేలా మార్పులు చేయనున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్రంలో ఎక్కడినుంచైనా తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ప్రజలకు కల్పించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో అక్రమాలు జరిగాయని కూటమి సర్కారు భావిస్తోంది. గతంలో ఎవరైనా భూములను, ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే.. ఆ ఆస్తి ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయం సబ్ రిజిస్ట్రార్ నివేదిక వచ్చిన తర్వాతే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో మరో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేవారు. అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ జరిగేది. అయితే వైసీపీ హయాంలో ఈ విధానంలో అక్రమాలు జరిగాయని టీడీపీ పలుసార్లు ఆరోపించింది.
ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు తేవాలని భావిస్తోంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని కేవలం 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే అమలు చేయాలని భావిస్తోంది. దీనికి కూడా మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం లభిస్తే.. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు అమల్లోకి వస్తాయి.
మరోవైపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల మార్కెట్ ధరలు కూడా పెంచనున్నట్లు తెలిసింది. భూముల మార్కెట్ రేట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పెరిగే అవకాశం ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి ఒకటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి తేనున్నట్లు సమాచారం.
Nov 18 2024, 09:33