కులగణనకు బీజేపి అనుకూలమే

కాంగ్రెసుకు చిత్తశుద్ది ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది..కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగడం లేదని ఎద్దేవచేస్తు కులగణనకు బిజేపీ అనుకూలమే అని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్ అన్నారు

బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కులగణన పై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు కులగణన చేస్తున్న అధికారులను ప్రజలు నిలదీయడానికి కారణం ఇదేనని అన్నారు..

బీసీ సంక్షేమంపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కులగనల పైన అనేక అనుమానాలు ఉన్నాయని అందుకే అధికారులపై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు కులగణన గురించి ప్రజలు అడిగితే అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు అని అన్నారు

కులగననకు బిజెపి వ్యతిరేకం కాదు అని కులగణలలో 75 ప్రశ్నలు పెట్టారు ప్రశ్నలు తగ్గిస్తే బాగుంటుంది కులం ఉపకులం అడిగితే సరిపోతుంది అంతేగాని ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ఏసి ఉందా మీకు రాజకీయ నాయకులు తెలుసా ఇలాంటి ప్రశ్నలు ఎందుకు ఏసీ ఫ్రిడ్జ్ లేకుంటే రేవంత్ రెడ్డి ఇస్తాడా ఇవన్నీ చెబితే సంక్షేమ పథకాలు ఏం చేస్తారో అని ప్రజలు అనుమానాలు కలుగుతున్నాయి అని అన్నారు.

ప్రభుత్వం అన్నింటి పైన స్పష్టత ఇయ్యాలి అని ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పై అధికారులపై ఉండాలి అని.. రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలపై ,అదేవిధంగా ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అని అయినప్పటికీ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని రవిగౌడ్ విమర్శించారు..

గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం

గాడిద పాల వ్యాపారం పేరుతో రైతులను డ్యాంకీ ప్యాలెస్ సంస్థ నట్టేట ముంచింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గాడిద పాల ఉత్పత్తి పేరిట తమిళనాడుకు చెందిన డ్యాంకీ ప్యాలెస్ సంస్థ రూ. 100 కోట్ల మోసానికి పాల్పడింది. లీటర్ గాడిద పాలు రూ. 1600 లకు కొనుగోలు చేస్తామంటూ దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రైతులను నమ్మించింది.

అందుకు వారితో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. ఆ క్రమంలో ఒక్కొ గాడిదను వారికి రూ. లక్షన్నరకు విక్రయించింది. ఒప్పందం ప్రకారం తొలి మూడు నెలలు రైతులకు సక్రమంగా సంస్థ నగదు చెల్లించింది. ఆ తర్వాత వారికి నగదు చెల్లింపులు నిలిపివేసింది. దీంతో సంస్థ యాజమాన్యాన్ని రైతులు నిలదీశారు.

దాంతో వారికి చెక్కులను అందజేసింది. అవి సైతం బౌన్స్ అయ్యాయి. తాము మోసపోయామని రైతులు భావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన బాధితులు శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్‌ క్లబ్‌లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమను న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. గత 18 నెలలుగా తమకు నగదు చెల్లించడం లేదని వారు తెలిపారు.

ఇటీవల కాలంలో గాడిద పాలు విక్రయం బాగా పెరిగింది. వీటికి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆవు పాలు, గేదె పాలు కంటే గాడిద పాలు శ్రేష్టమైనవని ఓ ప్రచారం అయితే జరుగుతుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు సైతం ఈ గాడిద పాలు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే ఈ గాడిద పాల ధర అధికంగా ఉంటుందని సమాచారం.

అయితే ఆరోగ్య దృష్ట్యా ఈ పాల వినియోగం అధికంగా ఉంది. దీంతో భారీగా లాభాలు ఆర్జించ వచ్చంటూ..రైతులను డాంకీ ప్యాలెస్ సంస్థ ఆశ చూపింది. ఆ క్రమంలో భారీగా నగదు వెచ్చించి.. గాడిదలను కొనుగోలు చేసేలా వ్యూహా రచన చేశారు. తొలి నాళ్లలో సజావుగా నగదు చెల్లించిన సదరు సంస్థ.. ఆ తర్వాత రైతులను నట్టేట ముంచేసింది. ఈ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాలను వారు అభ్యర్థిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ల నిలిపివేత అప్రజాస్వామ్యం

రిజిస్ట్రేషన్‌ల నిలిపివేత అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని వక్ఫ్‌ బోర్డు భూములని(Waqf Board Lands) కొన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయడంలో ప్రజలలో గందరగోళం ఏర్పడిందన్నారు.

రిజిస్ట్రేషన్‌ల నిలిపివేత అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్‌పల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే (MLA Rajasekhar Reddy) మాట్లాడుతూ.. మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని వక్ఫ్‌ బోర్డు భూములని(Waqf Board Lands) కొన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయడంలో ప్రజలలో గందరగోళం ఏర్పడిందన్నారు. కొన్ని దశాబ్దాలుగా అన్ని రకాల ప్రభుత్వ పన్నులు కట్టి 40గజాలు, 50గజాలు, 100గజాలలో పేదలు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం విద్యుత్‌ కనెక్షన్‌లు, సీసీ రోడ్లు, స్ట్రీట్‌ లైట్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాయి. పేదల కోసం వక్ఫ్‌ బోర్డు కొన్ని సవరణలు చేయాల్సిఉందని, లేదంటే ప్రజల పక్షాన నిలబడి వారికి చట్ట బద్దంగా న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని అన్నారు. వక్ఫ్‌ బోర్డు తమ భూమిఅని చెబుతున్న సర్వే నంబర్‌ 398, 399లో దాదాపు 20ఎకరాల ఖాళీగా ఉన్న భూమి రిజిస్ట్రేషన్‌ చట్టం సెక్షన్‌ 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న ఆ ఖాళీ భూమిని తమదంటూ ఇతరులు స్థానిక పోలీసుల సహకారంతో కబ్జాలో ఉన్నారని అన్నారు.

ఈ భూమిని కాపాడాల్సిన వక్ఫ్‌ బోర్డు సీఈఓ, జిల్లా ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఆడిటర్‌(వక్ఫ్‌), మూతవాలి వక్ఫ్‌ బోర్డు చట్టం సెక్షన్‌ 52ఎ కింద కేసులు నమోదు చేయడంలో విఫలమయరన్నారు. ఇప్పటికైనా ఆ భూమిని కాపాడాలని, కబ్జా చేసిన వారిపై వక్ఫ్‌ బోర్డు చట్టం సెక్షన్‌ 52ఎ కింద పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. పేద ప్రజల కోసం న్యాయపరంగా ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు.

గూగుల్ పే ఫోన్ పే ఎడాపెడా వాడేస్తున్నారా

ఒకప్పుడు నగదు చలామణి ఎక్కువ జరిగేది. కానీ ఇప్పుడు బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం, బయట నగదు ద్వారా లావాదేవీలు జరపడం బాగా తగ్గిపోయింది. కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర యూపీఐ చెల్లింపుల వ్యవస్థ వచ్చేసింది. డిజిటల్ చెల్లింపులు వచ్చిన తర్వాత ఇక జేబులో నగదును మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్లినా ఆన్లైన్ చెల్లింపుల ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటియం వంటి వాటిని ఎడాపెడా జనాలు వాడేస్తున్నారు. అయితే డిజిటల్ పేమెంట్ విధానం మంచిదే. అయినప్పటికీ ఇది ఒక రకంగా డేంజర్ కూడా అని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. రూపాయి దగ్గరనుంచి వేలల్లో, లక్షల్లో యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా రెండు, మూడు యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు.

ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా యూపీఐ ద్వారానే, ఎవరైనా తమకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా యూపీఐ ద్వారానే తీసుకుంటున్నారు. అయితే లెక్కా పత్రం లేకుండా ఇష్టం వచ్చినట్టు యూపీఐ ద్వారా ట్రాన్జక్షన్లు చేసే వారికి ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బ్యాంకుఖాతాలో పరిమితికి మించి నగదు జమవడం విత్ డ్రా చేసుకోవడం వంటి వాటిపైన ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిఘా పెడుతున్నారు.

బ్యాంకు ఖాతాలలో నగదు పరిమితి ఏడాదికి ఇదే

దీంతో పరిమితికి మించి డబ్బులు యూపీఐ చెల్లింపుల ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అనవసరమైన పన్నులు, పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇన్కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పొదుపు ఖాతాలలో 10 లక్షల రూపాయల వరకు పరిమితి ఉంటుంది. ఈ లిమిట్ దాటి సేవింగ్స్ ఖాతాలో డబ్బులు జమ అయినట్లయితే ఆ వివరాలు ఇన్కమ్ టాక్స్ విభాగానికి వెళ్తాయి.

నేరుగా బ్యాంకులో మీ వివరాలను ఇన్కమ్ టాక్స్ శాఖకు తెలియజేస్తాయి. దీంతో మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎడాపెడా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఉన్నాయని వాడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది .లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు తీసుకున్నా,డబ్బులు ఇచ్చినా తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఆ తేదీల్లో కాచిగూడ నుంచి 4 ప్రత్యేక రైళ్లు

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం నాలుగు ప్రత్యేక రైళ్లు - ఏయే తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయంటే

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. కడప మీదుగా కేరళలోని కొట్టాయం, కొల్లాంలకు ఈ నెలలోనే 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టరు ఎ.జనార్దన్‌ వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.ఈ నెల 14, 21, 28 తేదీల్లో 07133 నంబరు గల రైలు కాచిగూడలో మధ్యాహ్నం 3.40 గంటలకు బయల్దేరి, అదేరోజు రాత్రి 12.10 గంటలకు కడపకు చేరుకుంటుంది. తర్వాత రోజు సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07134 గల రైలు ఈనెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కొట్టాయం నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కడపకు, రాత్రి 11:40 నిమిషాలకు కాచిగూడకు చేరుకుంటుంది.హైదరాబాద్‌లో ఈ నెలలో 19, 26వ తేదీల్లో 07135 నంబరు గల రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి రాత్రి 10.25 గంటలకు కడపకు, మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07136 గల రైలు ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.50 గంటలకు కడపకు, రాత్రి 11 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్కు చేరుకుంటుంది.

నాందేడ్ నుంచి 07139 నంబర్ రైలు ఈ నెల 16న ఉదయం 8.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడపకు, రాత్రి 10 గంటల 30 నిమిషాలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 18న మరో రైలు (07140) తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయలుదేరి అదే రోజు రాత్రి 11 గంటలకు కడపకు, మరోసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలును సికింద్రాబాద్ వరకు మాత్రమే వేశారు.హైదరాబాద్‌లోని మౌలాలీలో ఈ నెల 23, 30న 07141 నంబరు గల రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాత రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడప, రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్ 2వ తేదీల్లో 07142 నంబర్ గల రైలు కొల్లాంలో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి, అదే రోజు రాత్రి 11 గంటలకు కడపకు, తర్వాతరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మౌలాలీకి చేరుకుంటుంది.శబరిమలకు మరో 8 ప్రత్యేక రైళ్లు

8 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి నుంచి కొల్లాంకు రైలు బయల్దేరగా ఈ నెల 24, డిసెంబర్ 1న కొల్లాం - మౌలాలికి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఈ నెల 18, 25వ తేదీల్లోనూ మచిలీపట్నం - కొల్లాంకు రైలు వెళ్లనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొల్లాం - మచిలీపట్నం తిరుగు ప్రయాణానికి ఈ నెల 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నపడనున్నట్లు వెల్లడించింది.

కావాలంటే మమ్మల్ని జైల్లో పెట్టురైతులను వదిలేయ్

లగచర్ల రైతులను సంగారెడ్డి జైల్లో కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో ఉన్నవాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉందన్నారు. సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారని విమర్శించారు. ఫార్మా విలేజ్ పేరుతో కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టే కుట్ర సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధితులను కలవటం జరిగిందనే కేటీఆర్ చెప్పారు. లగచర్లలో పేదల భూమి సేకరించే విషయంలో వాళ్లను సమిధలు చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడిన కేటీఆర్… లగచర్ల సహా భూమి కోల్పోతున్న రైతులు తీవ్రంగా రోదిస్తున్నారని చెప్పారు.

కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డియే ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

జైల్లో ఇప్పుడు మేము 16 మందిని కలిశాం. వాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉంది అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగిని సాయంత్రం దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారు ఇంకొక తమ్ముడు వనపర్తిలో చదువుకుంటున్నాడు. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చారు సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారు ముందు 60, 70 మందిని అరెస్ట్ చేశారు. దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారు దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. కానీ పోలీసులకు మాత్రం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫోన్‌లో డైరెక్షన్స్ ఇచ్చి వీళ్లను కొట్టించాడు. ముఖ్యమంత్రి సోదరుడున్న ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్‌లో రాజ్యంగేతర శక్తిగా మారాడు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లే విధంగా రారాజుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “కొడంగల్‌లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట. అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతదని చెబుతున్నారు. నిజానికి దాడి చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు. భూములు పోతాయని వాళ్లే దాడి చేశారు. కానీ అరెస్ట్ చేసిన 70 మందిలో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్లు గుర్తించి 21 మందిని మాత్రమే చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టారు. మిగతా కాంగ్రెస్ వాళ్లను వదిలేశారు. కానీ దాడి జరిగిన వీడియోల్లో కాంగ్రెస్ వాళ్లు కనబడుతున్నారు. ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్లు మాత్రమే చేశారని చెప్పాలని కుట్ర చేస్తున్నారు వాళ్ల చేతగానితనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారు అని కేటీఆర్ విమర్శించారు.

అరెస్ట్ అయిన 21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీలే అని కేటీఆర్ చెప్పారు. వికారాబాద్ ఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు వారిని చిత్ర హింసలు పెట్టారని, మూడు మూడు గంటలపాటు కొట్టారని అన్నారు. మెజిస్ట్రేట్ ముందు కొట్టారని చెబితే మళ్లీ కొడతామని అమానవీయంగా వ్యవహరించారని వాళ్లు మాకు చెప్పారు. తీవ్రవాదులను పట్టుకొనేందుకు వెళ్లినట్లు డోర్లను తంతు పోలీసులు ఊర్లో భయానక వాతావారణ సృష్టించారు . రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరుండేది ఐదేళ్లు మాత్రమే.. అధికారం శాశ్వతమని భావించకండి. నువ్వు చక్రవర్తివి కాదు. నీలాంటి చాలా మంది చూశాం. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే నీ పదవి ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల భూములు గుంజుకుంటా అంటే మేము ఊరుకోం అని కేటీఆర్ హెచ్చరించారు.

రేవంత్ రెడ్డిపై ఇవ్వాళ కొడంగల్ మర్లవడ్డదన్నారు కేటీఆర్. రేపు తెలంగాణ మొత్తం మర్లవడుతదని హెచ్చరించారు. “కావాలంటే మమ్మల్ని జైల్లో పెడితే పెట్టు. మేము అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తాం. కానీ రైతులను వదిలేయ్. నువ్వు అరెస్ట్ చేయించిన 21 మంది రైతుల కుటుంబాల ఉసురు నీకు, నీ పార్టీకి తాకుతది. ఏ పేద ప్రజల ఓట్లతో గెలిచావో ఆ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న నీకు వాళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. 21 మంది రైతులు బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ వారికి న్యాయసాయంతో పాటు అండగా ఉంటుందిఅని కేటీఆర్ స్పష్టం చేశారు.

దెబ్బతిన్న హైదరాబాద్ బ్రాండ్

కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది. సిటీలోని హోటల్స్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేలో వెల్లడైంది. 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ నిలిచింది.

సరదాగా బయటకు వెళ్లినప్పుడు స్ట్రీట్‌ ఫుడ్‌ తినడం కామన్. వారాంతరాల్లో కొందరూ అదే పనిగా బయటకు వెళ్లి మరీ స్ట్రీడ్‌ ఫుడ్‌ను తింటుంటారు. వారానికి ఒక్కసారైనా బయటఫుడ్ తినాలని ఆలోచించే వారు ఎంతోమంది ఉంటారు. అలాగే బిర్యానీ, పానీపూరీ, కబాబ్స్, బర్గర్లు, షవర్మా, బజ్జీలు ఇలా ఏదైనా కనిపిస్తే చాలు లొట్టలేసుకుని మరీ తింటారు. అయితే స్ట్రీట్‌ ఫుడ్ అంటే భయపడేలా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. వీరి నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింటుంది. భాగ్యనగరంలో ఫుడ్స్ సేఫ్టీ‌పై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఆందోళన కలిగిస్తోంది. ఈ సర్వేలో ఫుడ్ క్వాలిటీ‌లో హైదరాబాద్ చివరిగా నిలిచింది.

కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది. సిటీలోని హోటల్స్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేలో వెల్లడైంది. 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ నిలిచింది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84% ఫుడ్ పాయిజన్ కేసులు భాగ్యనగరంలో నమోదయ్యాయి. . 62% హోటల్స్, గడువుతీరిన పాడైపోయిన కుళ్లిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. బిర్యానీ శాంపిల్స్‌లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్ అయింది. హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగనున్నాయి.

కాగా ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకపై జనాభా ప్రాతిపదికన కాకుండా తెలంగాణలో ఉన్న హోటళ్ల సంఖ్య ఆధారంగా ఆహార తనిఖీ అధికారుల(ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని హోటళ్లు ఉన్నాయన్నదానిపై వైద్య ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది. హోటళ్ల సంఖ్య లెక్కతేలిన తర్వాత.. ఎన్ని హోటళ్లకు ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలన్నవిషయంపై నిర్ణయానికి రానున్నారు. దీనిపై ఒక కమిటీని వేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్‌ చివరికి హైదరాబాద్‌లో 74,807 రెస్టారెంట్లు ఉన్నాయి.

ఇవి కాకుండా తగిన అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన హోటళ్లు, రెస్టారెంట్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఏటా ఈ హోటళ్ల ద్వారా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఇంత భారీ స్థాయిలో ఫుడ్‌ బిజినెస్‌ జరుగుతున్నప్పటికీ హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించే విషయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం బాగా వెనుకబడింది. మానవ వనరుల కొరత కారణంగా పర్యవేక్షణ అసలే ఉండటం లేదు. హైదరాబాద్‌లో 74 వేల రెస్టారెంట్లు ఉంటే కేవలం 23 మందే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లున్నారు. అంటే ప్రతీ 3,552 రెస్టారెంట్లకు ఒక ఆహార తనిఖీ అధికారి ఉన్నారన్నమాట. దీన్ని బట్టి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల కొరత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ అధికారి సెలవు రోజులు మినహాయించి, రోజుకు 10 చొప్పున హోటళ్లు తనిఖీ చేసినా కూడా ఒక ఏడాదిలో అన్ని హోటళ్లను తనిఖీ చేయడం అసాధ్యం. కాగా, ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని చాలా హోటళ్లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు నిర్వహించగా దాదాపు అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార నాణ్యతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తేలింది.

బలహీనపడిన అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 12వ తేదీ ఏర్పడి స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. అయినప్పటికీ ఉత్తర తమిళనాడు కోస్తాతీరం నైరుతి బంగాళాఖాతంలో చెన్నై(Chennai)కి సమీపంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఈ కారణంగా తిరువళ్లూరు, వేలూరు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వర్షాలు కురుస్తాయనివాతావారణ కేంద్రం తెలిపింది.

నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 12వ తేదీ ఏర్పడి స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. అయినప్పటికీ ఉత్తర తమిళనాడు కోస్తాతీరం నైరుతి బంగాళాఖాతంలో చెన్నై(Chennai)కి సమీపంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఈ కారణంగా తిరువళ్లూరు, వేలూరు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వర్షాలు కురుస్తాయనివాతావారణ కేంద్రం తెలిపింది. కేరళ సముద్రతీర ప్రాంతానికి సమీపంలో ఆగ్నేయ అరేబియా సముద్రంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది.

దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌(Puducherry, Karaikal)లో తేలికపాటి వర్షాలు కురిశాయి. గురువారం చెంగల్పట్టు, కాంచీపురం, కళ్ళకుర్చి, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం, తంజావూరు, తిరువారూర్‌(Nagapattinam, Thanjavur, Thiruvarur), అరియలూరు, పెరంబలూరు, పుదుక్కోట, శివగంగై, మదురై, విరుదునగర్‌, తెన్‌కాశి, రామనాథపురం, తేని, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్నియాకుమారి, రామనాథపురం, శివగంగై, నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు తదితర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి.

ఈ నెల 15న పైన పేర్కొన్న జిలాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 16వ తేదీన నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, తేని, దిండిగల్‌ జిల్లాల సహా చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు.

భూదాన్ భూముల వ్యవహారంపై హైకోర్టు విస్మయం

భూదాన్ భూములుగా గుర్తించిన వాటికి.. మళ్లీ వారసత్వ హక్కు కల్పిస్తూ కలెక్టర్ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేయడం తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. దీనిపై విచారణ చేపట్టింది. ఈ భూములను కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్‌ నిజాం నవాబ్‌ను కూడా మించిపోయారని న్యాయస్థానం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పేదలకు పంచడం కోసం రామచంద్రారెడ్డి దాదాపు 300 ఎకరాలు ఇచ్చారని, అందినకాడికి నొక్కేసిన అధికారులు వాటి స్వాహాకు సహకరించారని చెప్పింది.

భూదాన్ భూముల విషయంలో రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ అమోయ్ కుమార్ వ్యవహరించిన తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ అథారిటీ హోదాలో ధ్రువీకరించిన అధికారే... జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంపై విస్తుపోయింది. రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్‌ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు మీడియాలో కథనాలు చూశామని.. నిజాం కూడా భూములను అలా కట్టబెట్టలేదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆనాడు భూములను దివానీ, సర్ఫేకాజ్, పట్టాలు అనే మూడు విభాగాలుగా గుర్తించిన నిజాంను అభినందించాలని పేర్కొంది.

ఆరోపణలు ఎదుర్కొన్నన్నప్పుడు అధికారులు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనంటూ గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్‌ యాకూబ్‌ కేసులో ఇచ్చిన తీర్పును హైకోర్టు ప్రస్తావించింది. భూదాన్‌ భూముల రక్షణ కోసం అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను వితరణ చేస్తే... గతంలో ఉన్న భూదాన్‌ బోర్డుతోసహా అధికారులు వాటిని స్వాహా చేశారని వ్యాఖ్యానించింది. తెలంగాణలో పేదలకు భూములను ఇచ్చిన ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారని, అగ్రికల్చరల్‌ సీలింగ్‌ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 500 ఎకరాలు ఇచ్చేశారని తెలిపింది.

భూదాన్‌ భూముల రక్షణలో గత బోర్డు సహా అధికారులు విఫలమయ్యారని మండిపడింది. ప్రస్తుత కేసులో 10 ఎకరాల భూమి భూదాన్‌ బోర్డుకు చెందినదని ధ్రువీకరించిన తర్వాత వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారు? అని ప్రశ్నించింది. దీనిపై కౌంటరు దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, భూదాన్‌ యజ్ఞబోర్డు, వ్యక్తిగత హోదాలో గత కలెక్టర్‌ డి.అమోయ్‌కుమార్, అప్పటి డీఆర్‌వో ఆర్పీ జ్యోతితోపాటు మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం.182లో 10.29 ఎకరాలకు సంబంధించి ఖాదర్‌ ఉన్నీసా బేగమ్‌కు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని నవాబ్‌ ఫరూక్‌ అలీఖాన్‌ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ గతంలో వీటిని భూదాన్‌ భూములుగా ఆర్డీవో ఉత్తర్వులు ఇస్తే, స్పెషల్‌ ట్రైబ్యునల్‌ సమర్థించిందని తెలిపారు. దీనికి విరుద్ధంగా అప్పట్లో ట్రైబ్యునల్‌కు నేతృత్వం వహించిన అధికారి.. కలెక్టర్‌ హోదాలో ఖాదర్‌ ఉన్నీసా బేగం పెట్టుకున్న అర్జీని ఆమోదించి పట్టాదారు పాస్‌బుక్‌ జారీ చేశారని వివరించారు.

అంతేకాదు, భూదాన్‌ భూములకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలంటూ హైకోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోలేదని వివరించారు. ఈ వాదనలను విన్న జస్టిస్ భాస్కరరెడ్డి.. భూములకు సంబంధించి వివాదం పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆలోచించకుండా పట్టాదారు పాస్‌ బుక్‌ జారీ చేయడం ఏంటి? అని విస్తుపోయారు. ఈ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 28కి వాయిదా వేశారు.

ప్రభుత్వం కీలక నిర్ణయం

నియోజకవర్గాల్లో మౌలిక సౌకర్యాలు ముఖ్యంగా రహదారులు నిర్మాణం.. పాతవి మరమ్మతు పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తి అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినగా.. కొన్నిచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ నష్టం విలువ రూ.2,346 కోట్ల అని కాంగ్రెస్ సర్కారు అంచనా వేసింది. ఈ నివేదికను కేంద్రానికి కూడా పంపింది. మరోవైపు, కేంద్రం నుంచి వచ్చి నిధులకు ప్రభుత్వం కొంత జోడించాలని నిర్ణయించింది.

రోడ్లు, భవనాల శాఖ పరిధిలో కొత్త రహదారుల నిర్మాణం, ఇతర పనులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. నియోజకవర్గాల్లో అవసరమైన చోట రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేల నుంచి ఆర్‌ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు కోరారు. ఈ అంచనాలు రూ.50 కోట్లు మించకూడదని ముందే స్పష్టం చేసినా.. పలువురు ఎమ్మెల్యేలు భారీ అంచనాలతో ప్రతిపాదనలు పంపుతున్నారు. కొందరివి ఏకంగా రూ.200 కోట్లు దాటడం గమనార్హం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రతిపాదనలు రూ.180 కోట్లకు పంపగా.. వాటిని రూ.50 కోట్లకు తగ్గించి పంపించాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన వాటిని సవరించి చివరకు రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.

సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఆర్‌ఐఎఫ్‌) కింద రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు కేంద్రం రూ.900 కోట్లు అందజేయనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక్కో ఎమ్మెల్యే రూ.50 కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపితే.. మొత్తం కలిపి రూ.5 వేల కోట్లు దాటేస్తాయి.. వాటికి కేంద్రం ఇచ్చే రూ.900 సీఆర్‌ఐఎఫ్‌ నిధులు ఏ మూలకూ సరిపోవు. పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖకు రూ.12 వేల కోట్లు మంజూరు చేయనున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో పంచాయతీరాజ్‌కు కేటాయించిన నిధులు పోనూ మిగిలిన వాటిని సీఆర్‌ఐఎఫ్‌తో కలిపి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన రహదారుల నిర్మాణానికి ఇవ్వాలని భావిస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై డీపీఆర్‌లు సిద్ధం చేసి.. టెండర్లు పిలవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, వంతెనలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. వరదల వల్ల మొత్తం రూ.2,362 కోట్ల విలువ చేసే రహదారులు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయినట్టు కేంద్రానికి రాష్ట్రం నివేదిక పంపించింది. తక్షణ సాయంగా ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రానికి రూ.416.80 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం గత నెలలో ప్రకటించింది. పూర్తిస్థాయిలో నివేదికలు అందిన తర్వాత వాటిని పరిశీలించి మిగతా నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందజేసింది. కానీ, ఈ వివరాలు సరిపోవని, నిబంధనల ప్రకారం ఐదు పట్టికల్లో వివరాలు పంపాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది.