ప్రభుత్వం కీలక నిర్ణయం
నియోజకవర్గాల్లో మౌలిక సౌకర్యాలు ముఖ్యంగా రహదారులు నిర్మాణం.. పాతవి మరమ్మతు పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తి అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినగా.. కొన్నిచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ నష్టం విలువ రూ.2,346 కోట్ల అని కాంగ్రెస్ సర్కారు అంచనా వేసింది. ఈ నివేదికను కేంద్రానికి కూడా పంపింది. మరోవైపు, కేంద్రం నుంచి వచ్చి నిధులకు ప్రభుత్వం కొంత జోడించాలని నిర్ణయించింది.
రోడ్లు, భవనాల శాఖ పరిధిలో కొత్త రహదారుల నిర్మాణం, ఇతర పనులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. నియోజకవర్గాల్లో అవసరమైన చోట రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేల నుంచి ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు కోరారు. ఈ అంచనాలు రూ.50 కోట్లు మించకూడదని ముందే స్పష్టం చేసినా.. పలువురు ఎమ్మెల్యేలు భారీ అంచనాలతో ప్రతిపాదనలు పంపుతున్నారు. కొందరివి ఏకంగా రూ.200 కోట్లు దాటడం గమనార్హం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రతిపాదనలు రూ.180 కోట్లకు పంపగా.. వాటిని రూ.50 కోట్లకు తగ్గించి పంపించాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన వాటిని సవరించి చివరకు రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.
సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్‌ఐఎఫ్) కింద రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు కేంద్రం రూ.900 కోట్లు అందజేయనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక్కో ఎమ్మెల్యే రూ.50 కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపితే.. మొత్తం కలిపి రూ.5 వేల కోట్లు దాటేస్తాయి.. వాటికి కేంద్రం ఇచ్చే రూ.900 సీఆర్‌ఐఎఫ్ నిధులు ఏ మూలకూ సరిపోవు. పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖకు రూ.12 వేల కోట్లు మంజూరు చేయనున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో పంచాయతీరాజ్‌కు కేటాయించిన నిధులు పోనూ మిగిలిన వాటిని సీఆర్‌ఐఎఫ్‌తో కలిపి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన రహదారుల నిర్మాణానికి ఇవ్వాలని భావిస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై డీపీఆర్‌లు సిద్ధం చేసి.. టెండర్లు పిలవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, వంతెనలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. వరదల వల్ల మొత్తం రూ.2,362 కోట్ల విలువ చేసే రహదారులు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయినట్టు కేంద్రానికి రాష్ట్రం నివేదిక పంపించింది. తక్షణ సాయంగా ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ కింద రాష్ట్రానికి రూ.416.80 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం గత నెలలో ప్రకటించింది. పూర్తిస్థాయిలో నివేదికలు అందిన తర్వాత వాటిని పరిశీలించి మిగతా నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందజేసింది. కానీ, ఈ వివరాలు సరిపోవని, నిబంధనల ప్రకారం ఐదు పట్టికల్లో వివరాలు పంపాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది.
Nov 15 2024, 12:27