మండల పూజల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల
పశ్చిమ కనుమల్లోని పత్తనంతిట్టా జిల్లా ఉన్శ పవిత్ర పుణ్య క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలల పాటు సాగే మండల మకరు విళక్కు యాత్రా సీజన్ మొదలవుతోంది. ఈ సమయంలో స్వామి దర్శనం కోసం అయ్యప్ప దీక్షాదారులు వేలాదిగా తరలివస్తారు. గతేడాది భక్తుల సంఖ్య భారీగా ఉన్నా.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. చాలా మంది దర్శనాలు చేసుకోకుండానే వెనుదిరిగారు. దీంతో ప్రస్తుతం పక్కా ఏర్పాట్లు చేశారు.
రెండు నెలల పాటు సాగే మండల మకరవిళక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సర్వం సిద్దమైంది. శుక్రవారం (నవంబరు 15న) సాయంత్రం 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు. రోజుకు ఎంత మంది భక్తులను దర్శనాలకు అనుమతించేల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో 70 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 10 వేల మంది మొత్తం 80 వేల మందిని దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించారు
శబరిమల సహా పలు ఆలయాలను నిర్వహిస్తోన్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మధ్యాహ్నం 1 గంట నుంచి యాత్రికులకు ప్రవేశం కల్పిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఆలయ తలుపులు తెరిచిన తర్వాత పూజారుల మార్పు సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని తెలిపింది. కానీ, దర్శనాలు మాత్రం శనివారం ఉదయం మొదలవుతాయని, అప్పటి నుంచే మండల పూజల సీజన్ అధికారికంగా మొదలవుతుందని పేర్కొంది. మరోవైపు, వర్చువల్ క్యూ కోసం శుక్రవారం 30 వేల మంది భక్తులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేశారు. వారిని గురువారం 1 గంట తర్వాత పంబ నుంచి అనుమతిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనాల సమయం కూడా పెంచారు. రోజుకు 18 గంటల పాటు దర్శనాలు ఉంటాయని టీడీబీ ఇప్పటికే ప్రకటించింది. పశ్చిమ కనుమల్లో 914 మీటర్ల ఎత్తులో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి పంబ నుంచి 4 కిలోమీటర్ల కాలినడక చేరుకోవాల్సి ఉంటుంది.
ఇక 10 ఏళ్లు నిండి.. 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధం. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు మండల కాలం అంటే 41 రోజుల పాటు దీక్ష చేపట్టి.. ఇరుమడితో వస్తారు. పావన పదునెట్టాంబడి (18 మెట్లు) మీదుగా స్వామిని దర్శించుకుంటారు. ఇరుముడి ఉన్నవారికే పదునెట్టాంబడి ఎక్కేందుకు అనుమతి ఉంటుంది. సాధారణ భక్తులకు పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. వీరిని పక్కనే ఉన్న గేటు ద్వారా అనుమతిస్తారు.
ఇక మండల-మకర విళక్కు పూజల సీజన్ ఏర్పాట్లు, బందోబస్తుపై కేరళ డీజీపీ షేక్ దర్వైష్ సాహెబ్ గురువారం ఉన్నత న్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం 14 వేల మంది పోలీసులతో పాటు వాలంటీర్లను భద్రత విధులు, యాత్రికుల సేవల కోసం మోహరిస్తున్నట్టు తెలిపారు. అలాగే, భక్తుల వాహనాల పార్కింగ్ స్లాట్లను 10 వేలకు పెంచారు. అలాగే, రెస్టారెంట్లు, హోటళ్లపై ధరల వివరాలను దక్షిణాది అన్ని భాషల్లోనూ డిసిప్లే చేయాలని అధికారులు ఆదేశించారు.
Nov 15 2024, 10:23