ఏందయ్యా సీఐ.. ఏంటీ పని

సివిల్ వ్యవహారంలో విజయవాడ గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటికి వెళ్లి మరీ సీఐ దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సివిల్ వ్యవహారంలో విజయవాడ గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. గుణదలలో ఎస్‌ఎల్వీ కైలాస్ హైట్స్, రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

తమ గోడను కూలగొట్టారంటూ ఎస్‌ఎల్వీ యజమాని ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్ 23న దేవినేని శ్రీహరిపై గుణదలలో కేసు నమోదు చేశారు.

ఆ తరువాత సీఐ శ్రీనివాస్ ఏకంగా దేవినేని శ్రీహరి ఇంటికి వెళ్లి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యక్తిగత కక్షతోనే సీఐ దాడికి పాల్పడ్డారని, రౌడీ షీట్ తెరుస్తానని బెదిరించారని దేవినేని శ్రీహరి ఆరోపిస్తున్నారు.

సివిల్ వివాదంలో సీఐ తలదూర్చడంపై సర్వాత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో మాజీ సీపీ కాంతీరాణాకు నమ్మిన బంటుగా వ్యవహరించారని సీఐ శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి.

కొనసాగుతున్న ఈడీ విచారణ

భూదాన్ భూమి అన్యాక్రాంతం వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్, తహశీల్దార్ జ్యోతిని విచారించిన ఈడీ.. తాజాగా ఆర్డీవో వెంకటాచారిని విచారిస్తోంది. ఈ భూమి విషయంలో అధికారులు కోట్లు పొందారని ఈడీ అనుమానిస్తోంది.

రంగారెడ్డి జిల్లా నాగరంలోని 42 ఎకరాల భూదాన్ భూమి అన్యాక్రాంతంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆర్డీవో వెంకటాచారిని ఈడీ విచారిస్తోంది. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్, తహశీల్దార్ జ్యోతి విచారణ ఆధారంగా ఆర్డీవోను ఈడీ ప్రశ్నిస్తోంది. భూదాన్ బోర్డ్‌కు చెందిన భుమిని ఖాదురున్నీసా అనే మహిళకు అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయల విలువైన భూమిని ఆర్డీవో , తహశీల్దార్ కలిసి ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. దీని వలన అధికారులు కోట్లు రూపాయలు పొందినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీలపైన ఆర్డీవో వెంకటాచారిని ఈడీ ప్రశ్నిస్తోంది.

విజిలెన్స్ విచారణలో భూదాన్ భూముల భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇదే వ్యవహారంలో అప్పటి ఎమ్మార్వో జ్యోతిపై కేసు నమోదు అయింది. జ్యోతిపై కేసు నమోదు అయిన తరువాత విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరిపింది. దాదాపు 50 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ ఉండడంతో ఆయనను ఈడీ విచారించింది.

అయితే రంగారెడ్డి జిల్లా నాగరంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డ్‌కు చెందినదని బోర్డ్ వాదిస్తోంది. అయితే ఈ భూమి జబ్బార్దస్త ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. తరువాత కాలంలో జబ్బర్దస్తూ ఖాన్ కొడుకు హజీ ఖాన్ ఈ 50 ఎకరాలు ల్యాండ్‌ను భూదాన్ బోర్డ్‌కు దానం చేశారు.

అయితే 2021లో హజీఖాన్ వారుసరాలినంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా అనే మహిళ దరఖాస్తు చేసింది. దీంతో ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో , తహశీల్దార్, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఆమెకి అనుకూలంగా పని చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం ఈడీ విచారణలో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

కేసీఆర్, కేటీఆర్‌కు కాంగ్రెస్ సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేయనున్నారు. వలిగొండ టూ బీబీనగర్ 6కిలో మీటర్ల మేర మూసీ వెంట ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా పాదయాత్ర చేయనున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లనుంది.

ఈ నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం కాకముందే చెప్పిన కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు కాలయాపన చేశారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని నిప్పులు చెరిగారు.

డిపిఆర్ కూడా మొదలు కానీ ప్రాజెక్టులో కమీషన్ల కోసమని జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు ఎన్ జి టి మొట్టికాయలు వేస్తేనే నాలుగు ఎస్టీపీలు పెట్టారన్నారు. గంట సేపు మూసీలో నిలబడి కేసీఆర్, కేటీఆర్ ఒక గ్లాసు నీళ్లు తాగాలని సవాల్ విసిరారు. రేపు జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని తెలిపారు.

ప్రతిపక్షాలకు వాస్తవాలు తెలిపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీకి వస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి లక్షల కోట్ల అప్పులు చేసిందని మండిపడ్డారు. మూసి ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు.. పది నెలల కాంగ్రెస్ పాలనను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో పలువురు డీఎస్పీల బదిలీలు

తెలంగాణలో పలువురు డీఎస్పీ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ఇవాళ (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న అధికారి ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని అంబర్‌పేట్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ, డీసీఆర్‌బీగా ఉన్న జీ మహేశ్ బాబుని కరీంనగర్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు.

తెలంగాణలో పలువురు డీఎస్పీ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ఇవాళ (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న అధికారి ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని అంబర్‌పేట్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ, డీసీఆర్‌బీగా ఉన్న జీ మహేశ్ బాబుని కరీంనగర్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు.

ఇక కరీంనగర్ డీఎస్పీ, పీటీసీగా ఉన్న బీ.రామానుజంను కాగజ్‌నగర్ ఎస్‌డీపీవోగా ట్రాన్స్‌ఫర్ చేశారు. కాగజ్‌నగర్ ఎస్‌డీపీవోగా ఉన్న ఏ.కరుణాకర్‌ను అసిఫాబాద్ ఎస్‌డీపీవోగా బదిలీ చేశారు.

అసిఫాబాద్ ఎస్‌డీపీవోగా ఉన్న పీ.సదయ్యను బదిలీపై హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని డీజీపీ కోరారు. ప్రస్తుతం వనపర్తి డీఎస్పీ, డీసీఆర్‌బీగా ఉన్న కే.క్రిష్ణ కిశోర్‌ను తొర్రూర్ (మహబుబాబాద్) ఎస్‌డీపీవోగా బదిలీ చేశారు. ఇక తొర్రూర్ ఎస్‌డీపీవోగా ఉన్న వీ సురేశ్‌ను హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

నిర్మల్ డీఎస్పీ, డీసీఆర్‌బీగా ఉన్న పీ.రవీందర్ రెడ్డిని ఖమ్మం ఏసీపీ, సీసీఆర్‌బీగా బదిలీ చేశారు. ఖమ్మం ఏసీపీ, సీసీఆర్‌బీగా ఉన్న డీ.ప్రసన్న కుమార్‌ను మెదక్ ఎస్‌డీపీవోగా ట్రాన్స్‌పర్ చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు డీజీపీ ఉత్వర్వులు జారీ చేశారు. కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో తక్షణమే రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో బయటపడ్డ భారీ మోసం

ఈ మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలు కంపెనీలు డబ్బులు తీసుకుని బోర్డులు తిప్పేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం మాదాపూర్ లోని ఓ సాఫ్టే వేర్ కోచింగ్ కం సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అంతకు ముందు కూడా ఓ కంపెనీ ఇలానే చేసింది. తాజాగా విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగాలంటూ పలువురిని మోసం చేసిన నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు సంబంధించి వివరాలను సీఐడీ హెడ్ శిఖా గోయల్ వెల్లడించారు.

హైదరాబాద్బాచుపల్లి, కూకట్ పల్లి కి చెందిన చీకటి నవ్యశ్రీ, సునీల్ కుమార్ కేపీహెచ్ బీలో ఓ కన్సల్టెన్సీని ప్రారంభించారు. అబ్రాడ్‌ స్టడీ ప్లాన్ ఓవర్‌‌సీస్‌ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కొట్టు సాయిరవి తేజ, కొట్టు సాయి మనోజ్‌, శుభం, వంశీ సహా మరికొంత మందితో కలిసి విజయవాడ, ఢిల్లీలో కన్సల్టెన్సీలు ప్రారంభించారు. విదేశాల్లో చదువుతో పాటు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నారు. చాలా మందిని నమ్మించారు.

ఇది నమ్మిన తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా కన్సల్టెన్సీలో డబ్బులు కట్టారు. ఒక్కొక్కరు నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత డబ్బులిచ్చిన వారిని విదేశాలకు పంపేవారు. విదేశాలకు వెళ్లగానే.. అక్కడ ఉద్యోగం లేక ఇబ్బంది పడ్డారు. తీవ్ర ఇబ్బందులు పడి తిరిగి ఇండియాకు వచ్చారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో మోసం విషయం వెలుగులోకి వచ్చింది.

కరీంనగర్‌‌కు చెందిన సీహెచ్‌ కమలాకర్‌, అతని స్నేహితుడు అబ్రాడ్‌ స్టడీ ప్లాన్ ఓవర్‌‌సీస్‌ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ లో రూ.8 లక్షలు కట్టారు. కన్సల్టెన్సీ వీరిందరిని ఫేక్ డాక్యుమెంట్స్‌తో మల్టాకు పంపించింది. వీరికి అక్కడ ఎలాంటి ఉద్యోగం లేదని తెలిసింది. దీంతో వారు ఇండియా నుంచి డబ్బులు తెప్పించుకుని తిరిగి వచ్చారు. దీనిపై ఈ సంవత్సరం మార్చి 14న కరీంనగర్‌‌ వన్టౌన్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును సీఐడీలోని ఎకానిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కన్సల్టెన్సీ పై నిర్మల్ జిల్లా ఖానాపూర్, కేపీ హెచ్ బీలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో సీఐడీ పోలీసులు నిందితులు సునీల్‌కుమార్‌‌, చీకటి నవ్యశ్రీలను అరెస్ట్ చేశారు.

ఆయన బర్త్ డే షెడ్యూల్ ఇదే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఉదయం 8 గంటలకు కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 8 గంటలకు ఆయన తన కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 8:45 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఉదయం 10 గంటలకు YTDA అధికారులతో ఆలయ అభివృద్దిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మూసి పునరుజ్జీవ ప్రజా చైతన్య పాదయాత్ర ప్రారంభించనున్నారు.

మధ్యాహ్నం 1 గంటకు వలిగొండ మండలం సంగెం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా చైతన్య పాదయాత్ర చేపడుతారు. మూసీ పరివాహక ప్రాంతంలో 6కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శించనున్నారు.

అనంతరం మూసి పరివాహక ప్రాంత రైతులతో సమావేశం కానున్నారు. రైతుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకోనున్నారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ చామల కిరణ్ కుమార్, ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

ఫుడ్ సేఫ్టీ నాన్ స్టాప్ దాడులు

గ్రేటర్ హైదరాబాద్‌లో పలు హోటల్స్‌, రెస్టారెంట్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు నాన్ స్టాప్ దాడులు చేస్తున్నారు. ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించని పలు హోటల్స్ లైసెన్స్ లను రద్దు చేశారు.

హైదరాబాద్‌లో గ్రేటర్ హోటల్స్, రెస్టారెంట్స్ పై జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక బృందాలతో నాన్ స్టాప్ దాడులు దాడులు చేపట్టారు. ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి హోటల్స్ పై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించని పలు హోటల్స్ లైసెన్స్ లను రద్దు చేశారు. రెస్టారెంట్లపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీ సంతోష్ నగర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, సంతోష్ డాబా రెస్టారెంట్లపై దాడులు జరుగుతున్నాయి. హోటల్స్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. కిచెన్ లో అపరిశుభ్రమైన వాతావరణం ఉందని అధికారులు తెలిపారు. కుళ్లిపోయిన కూరగాయలతో హోటళ్ళ నిర్వాహకులు వంట చేయడం గుర్తించారు.

కిచెన్‌లో బొద్దింకలు, స్టోర్ రూమ్ లో ఫంగస్ వచ్చిన అల్లంను కనుగొన్నారు. ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగించడంపై హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

మూసాపేట్ కృతుంగ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా హోటల్ నిర్వాహకులు కుళ్లిన చికెన్‌ను రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లు వెల్లడించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు.

హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నం

ఇటీవలే కాలంలో హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులు చాలా బాధాకరం. ఇది ఒక చేతకాని పిరికి వాల చర్యగా మనం పరిగణించాలి.

ప్రతి హిందూ తమ బాధ్యతగా అందరితో ఏకంమై పరిరక్షణ కమిటీలలో భాగం కావాలి .

హిందువుగా పుట్టినందుకు మన బాధ్యతను స్వీకరించాలి.ప్రభుత్వం ఇటువంటి గట్టణలు మళ్ళీ పునరకృతం కాకుండా కట్టిన చర్యలు తీసుకోవాలని నా మనవి.

వైకాపా నేత గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఐటి అధికారుల దాడులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటి పై ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్  ఆధ్వర్యంలో ఈ దాడులు బుధవారం జరుగుతున్నాయి.

గ్రంధి శ్రీనివాస్ కి చెందిన రొయ్యల ఫ్యాక్టరీలపై ఏకకాలంలో దాడులు చేశారు.

కృష్ణాజిల్లా నాగాయలంక కార్యాలయంతో పాటు ఇతర వ్యాపార సముదా యాలపై ఏకకాలంలో దాడులు చేయటంతో పాటు నాగాయలంక లోని గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వామి ఇంటిపై కూడా దాడులు చేస్తున్నట్టు సమాచారం.

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ కేబినెట్ భేటీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లు, డ్రోన్ పాలసీ, ఏపీ జీఎస్టీ చట్ట సవరణ సహా పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా భూ ఆక్రమణలు, కబ్జాలను అరికట్టడానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును ఏపీ ప్రభుత్వం తీసుకువస్తోంది. గతంలో ఉన్న చట్టాన్ని రిపీల్ చేసిన ప్రభుత్వం.. కఠినమైన శిక్షలతో నూతన చట్టం తీసుకురానుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ భేటీ అనంతరం.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. వైసీపీ పాలనలో గత ఐదేళ్ల కాలంలో ఏపీలో భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయన్న మంత్రి పార్థసారథి.. ఈ నేపథ్యంలోనే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ను రిపీల్ చేసి కొత్త చట్టం తీసుకు రావడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

పాత చట్టం నగరీకరణ చెందుతున్న ప్రాంతాలకే పరిమితమై ఉండేదన్న మంత్రి.. శిక్షలు కూడా తక్కువగా ఉండేవన్నారు. ఐదేళ్ల నుంచి ఆరేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేదన్న మంత్రి.. కొత్తగా తీసుకు రానున్న చట్టం ప్రకారం భూ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడితే 10 నుంచీ 14 సంవత్సరాల‌ జైలు పడుతుందని హెచ్చరించారు. కొత్త చట్టం అమలుకు ప్రత్యేక కోర్టులు కూడా వస్తాయన్నారు. మంత్రివర్గ సమావేశంలో ఏపీ డ్రోన్ పాలసీకి ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పాలసీ రూపొందించినట్లు చెప్పారు. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు

ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్.. డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లును తీర్చిదిద్దుతామన్న మంత్రి పార్థసారథి.. ఇందులో భాగంగా 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్అండ్‌డీ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 25 వేల మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాలు, 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యాసంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు, చెట్టు పెండింగ్‌ బకాయిల చెల్లింపునకు కూడా ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే ఎక్సైజ్‌ చట్ట సవరణ ముసాయిదాకు ఆమోదం తెలిపారు. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యాల సాధనకు, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తూ.. పల్నాడు, బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి 154 గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయించింది. అలాగే జ్యుడిషియల్‌ అధికారుల రిటైర్‌మెంట్ వయసును 61కి పెంచే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.