హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సులు

కురుమూర్తి జాత‌ర‌కు వెళ్లే భ‌క్తుల‌కు తెలంగాణ ఆర్‌టీసీ ఓ శుభ‌వార్త‌ను అందించింది. కురుమూర్తి జాత‌ర‌కు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డ‌పనున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలో కొలువైన శ్రీ కురుమూర్తి స్వామి వారి బ్రహోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ బ్ర‌హ్మోత్స‌వాల ఈనెల (నవంబ‌ర్‌) 18 వరకు ఎంతో వైభ‌వంగా జరగనున్నాయి. ఈ జాత‌రకు సుమారు 10 లక్షల మంది భ‌క్తులు పాల్గొన‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ గుడ్‌న్యూస్‌ను మోసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. పాలమూరు జిల్లాలోని వెల‌సిన కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లానుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోనేందుకు త‌ర‌లి రానున్నారు.

జాత‌రలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం న‌వంబ‌ర్ 8వ తేదిన ఉంటుంది. ఈ నెల 7వ తేది నుంచి 9వ తేది వ‌ర‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవకాశం ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

ఈక్ర‌మంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బ‌స్సులను హైద‌రాబాద్ నుంచి ఏర్పాటు చేయ‌నున‌ట్లు అధికారులు తెలిపారు. ఎమ్‌జిబిఎస్ నుంచి ఆరాంఘ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మీదుగా జాత‌ర‌కు బస్సులు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ స్పెష‌ల్ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ అవ‌కాశం కూడా ఉంది.

కురుమూర్తి స్వామివారి జాతరకు సుమారు 900 ఏళ్ల చరిత్ర ఉన్న‌ట్లు ఇక్క‌డివారు చెబుతున్నారు. అందుకే ఇక్క‌డ ప్ర‌తి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్ర‌గాఢ న‌మ్మ‌కం. దాదాపు 500 మంది పోలీసులతో జాతర ప్రాగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

నగరంలో మరో స్కైవాక్

హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు. నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ స్కైవ్ నిర్మించనున్నారు. ఆ ప్రాంతంలో మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో స్కైవాక్ నిర్మించనున్నారు. కాగా, ఇప్పటికే నగరంలో ఉప్పల్, ప్యారడైజ్ ప్రాంతాల్లో స్కైవాక్‌లు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక అంతర్జాతీయంగా నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మౌళిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. కొన్ని చోట్ల గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నగరంలో కొత్త అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు, రహదారులు నిర్మాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో భారీగా ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించింది. గత ప్రభుత్వ అభివృద్ధిని కొనసాగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమైంది.

అందులో భాగంగా నగరవాసులకు మరో శుభవార్త చెప్పింది. నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మెట్రోరైలు స్టేషన్ వద్ద కొత్తగా ఈ స్కైవాక్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెట్రో జంక్షన్‌గా ఈ స్టేషన్ నుంచి నిత్యం అధిక సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఫ్లైఓవర్ కారణంగా ప్రస్తుతం స్టేషన్ నుంచి కిందికి వచ్చి రద్దీగా ఉండే రోడ్డు దాటాల్సివస్తోంది. అక్కడ అత్యంత రద్దీ ప్రాంతం కావడం.. రెండోవైపు ఎల్అండ్ టీ మెట్రోకు కేటాయించిన భూములు ఉండటంతో కనెక్టివిటీ కోసం స్కైవాక్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

నగరంలో బ్రిడ్జిలు ఉన్నచోట మెట్రో స్టేషన్లను రోడ్డుకు ఒక వైపు నిర్మించారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్‌ను ఇలాగే సికింద్రాబాద్ పీజీ కాలేజీ వైపు నిర్మించారు. రోడ్డు దాటి రెండొవైపు రావాలంటే ప్రయాణికులకు చాలా కష్టంగా ఉండేది. ప్రయాణికుల ఇబ్బంది తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఇక్కడ స్కైవాక్ నిర్మించారు. ఇదే మాదిరి పరేడ్ గ్రౌండ్ స్టేషన్ వద్ద కూడా కొత్తగా మరో స్కైవాక్ నిర్మించబోతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులు ఈజీగా రోడ్డు దాటే అవకాశం ఉంటుంది.

నగరంలో తొలి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌ఇక హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజ‌లు, వాహ‌న‌దారుల ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో తొలి డబులు డెక్కర్ కారిడారి నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో మార్గం సైతం నిర్మించ‌నున్నారు. ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్‌ రోడ్డు వరకు 5.320 కి.మీ మేర ఈ కారిడార్ నిర్మించనున్నారు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కి.మీ. కాగా.. అండ‌ర్‌ గ్రౌండ్‌ ట‌న్నెల్ 0.600 కి.మీ ఉంటుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షం

కూకట్‌పల్లి, మియాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, బేగంపేటలో వర్షం దంచికొడుతోంది.ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, మలక్‌పేట్‌, చార్మినార్‌, ఓయూ, మణిక్‌కొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాహనదారులు..

ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మియాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, బేగంపేటలో వర్షం దంచికొడుతోంది.ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, మలక్‌పేట్‌, చార్మినార్‌, ఓయూ, మణిక్‌కొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది.

భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు రోడ్లపై నిలిచిపోయింది. బంజారాహిల్స్, పంజాగుట్టలో వాన దంచికొట్టడంతో నీరు రోడ్లపైకి చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా మూడు గంటల తర్వాత వాతావరణంలో భారీ మార్పు కనిపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. దీంతో చిరుజల్లులుగా ప్రారంభమైన వర్షం గంట పాటు ఎకధాటిగా కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతోంది.

వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024’గా కొత్త పదం ‘బ్రాట్

కాలిన్స్ డిక్షనరీ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024’గా కొత్త పదం ‘బ్రాట్’ (Brat) ఎంపికైంది. యూకేకి చెందిన ప్రముఖ గాయని, పాటల రచయిత చార్లీ ఎక్స్‌సీఎక్స్ ఈ పదాన్ని నిర్వచించారు.

బ్రాట్’ అనే పదం సింగర్ చార్లీ విడుదల చేసిన ఆరవ ఆల్బమ్ పేరు అని, విశ్వాసం, స్వతంత్రత, సుఖాలు కోరుకునే వైఖరి... అనే అర్థాలను ఇస్తుందని కాలిన్స్ డిక్షనరీ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడుతున్న కమలా హారిస్ మద్దతుదారులు ఈ పదాన్ని స్వీకరించి వినియోగిస్తున్నారని, దీంతో ‘బ్రాట్’ పదాన్ని కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైందని శుక్రవారం పేర్కొంది.

2024లో ఎక్కువగా మాట్లాతున్న పదాలలో ఒకటిగా బ్రాట్ పదం మారిందని కాలిన్స్ డిక్షనరీ తెలిపింది. విజయవంతమైన ఆల్బమ్ కంటే 'బ్రాట్' అనేది ఒక సాంస్కృతిక దృగ్విషయంగా మారిందని, ఈ పదం ప్రపంచవ్యాప్తంగా వినిపించిందని తెలిపింది.

కాగా యూకేకి చెందిన 32 ఏళ్ల పాప్ స్టార్ చార్లీ ఎక్స్‌సీఎక్స్ అసలు పేరు షార్లెట్ ఎమ్మా ఐచిసన్. ఒక సాధారణ ఆకతాయి అమ్మాయి (Brat Girl) కొంచెం తలతిక్కగా, పార్టీలను ఇష్టపడే వ్యక్తి అని ఆమె 'బ్రాట్' అనే పదం గురించి వివరించారు. తమని తాము తెలివి తక్కువ వాళ్లమని భావించే వ్యక్తులు అని కూడా భావించవచ్చని, అయితే ఆ తర్వాత వారి వైఖరి మారవచ్చని, అది కూడా పార్టీల ద్వారానే అని ఆమె వివరించారు.

ఈ ఏడాది జులైలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను ‘బ్రాట్’ అని పేర్కొంటూ షార్లెట్ ఎమ్మా ట్వీట్ చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో కమలాను ప్రమోట్ చేయడంలో భాగంగా తన ఆల్బమ్‌లోని ‘365’ పాటను ఉపయోగించి ‘కమల ఈజ్ బ్రాట్’ పేరిట ఒక టిక్ టాక్ వీడియో రిలీజ్ చేసింది. షార్లెట్ ఎమ్మా విడుదల చేసిన ‘బ్రాట్’ ఆల్బమ్ యూకేలో మొదటి స్థానంలో, అమెరికాలో మూడవ స్థానంలో నిలిచింది.

ఎమ్మెల్యే ఏలేటి సంచలన వ్యాఖ్యలు

త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడని బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడని బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. కేరళ వెళ్లినా కూడా రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని గుర్తు చేశారు. అక్కడ దూరం నుంచి చూసి వచ్చాడు తప్పా కలువలేదన్నారు.

మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బైట పడింది.. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదని, జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయమన్నారు. తాను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతానని స్పష్టం చేశారు. మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

యూపీఐ సరికొత్త రికార్డ్

భారత ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) డిజిటల్ పేమెంట్లలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. దీనిని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, వ్యక్తి నుంచి మర్చంట్‌కు ట్రాన్సాక్షన్స్ రూపంలో చేయొచ్చు. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్.. రోజురోజుకు పెరిగిపోతుండటం సహా వీటి విలువ కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు సరికొత్త రికార్డు కూడా నమోదైంది.

ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ల హవానే నడుస్తోంది. 10 రూపాయల ఛాయ్ దగ్గర్నుంచి.. వేల రూపాయల షాపింగ్ ఇలా ఏదైనా యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని చెప్పొచ్చు. చాలా వరకు క్యాష్ అసలు క్యారీ చేయట్లేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫోన్ తీసి స్కానర్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ చేయడమే. చిటికెలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. క్రమక్రమంగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. ఇంటర్నెట్ లేకున్నా.. పిన్ అవసరం లేకున్నా కూడా యూపీఐ పేమెంట్లు చేసేందుకు కొత్త కొత్త ఫీచర్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొస్తూనే ఉందని చెప్పొచ్చు. అయితే.. ఇప్పుడు దీపావళి పండగ సీజన్‌లో.. యూపీఐ పేమెంట్స్ ఊపందుకున్నాయి.

సంఖ్యా పరంగా మాత్రమే కాకుండా.. విలువ పరంగా కూడా యూపీఐ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూనే ఉంది. అక్టోబర్ నెలలో ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంఖ్య 1658 కోట్లకు చేరినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. ఈ ట్రాన్సాక్షన్స్ విలువ రూ. 23.5 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు వృద్ధి చెందినట్లు వెల్లడించింది.

వార్షిక ప్రాతిపదికన చూస్తే.. యూపీఐ లావాదేవీల్లో సంఖ్యా పరంగా 45 శాతం వృద్ధి కనిపించగా.. విలువ పరంగా 34 శాతం పెరిగాయి. సెప్టెంబర్ నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంఖ్య 1500 కోట్లుగా నమోదైంది. కాగా.. ఇప్పుడు అక్టోబర్ నెలలో ఆ సంఖ్యను దాటేసింది. రోజువారీగా సగటు లావాదేవీలు సెప్టెంబర్ నెలలో 5 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు అక్టోబర్ నెలలో చూస్తే ఆ సంఖ్య 5.35 కోట్లకు చేరింది.

మరోవైపు ఫాస్టాగ్, ఆటోమేటెడ్ టోల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ సంఖ్య 8 శాతం పెరిగి 34 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో IMPS, బ్యాంక్ ఆధారంగా జరిపే ఐఎంపీఎస్ లావాదేవీలు 5 శాతం తగ్గి 46 కోట్లుగా నమోదయ్యాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌వైపు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఎన్నో బ్యాంకులు ఈ సేవల్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. గతేడాదిలో యూపీఐ సేవల్ని అందిస్తున్న బ్యాంకుల సంఖ్య 492 గా ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 622 కు పెరిగింది.

TCS కీలక ప్రకటన

దేశీయ ఐటీ ఉద్యోగులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఇన్నాళ్లు సరైన ప్రాజెక్టుల లేక ఇబ్బందులు ఎదుర్కొన్న కంపెనీలకు పెద్ద పెద్ద డీల్స్ వస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ 2 బిగ్ డీల్స్‌పై సంతకాలు చేసినట్లు ప్రకటించింది. రెండు దేశాల్లో 15 ఏళ్ల పాటు ప్రత్యేక సేవలు అందించనున్నట్లు తెలిపింది. ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం.

దేశీయ ఐటీ రంగంలో పరిస్థితులు క్రమంగా చక్కపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే దిగ్గజ కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అందుకుంటున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. కొత్త వారిని కంపెనీలు నియమించుకునేందుకు ఈ ప్రాజెక్టులు దోహద పడనున్నాయి. తాజాగా టాటా గ్రూప్ ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండు పెద్ద ప్రాజెక్టులు దక్కించుకున్నట్లు ప్రకటించింది. ఐర్లాండ్‌కు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ సోషల్ ప్రొటెక్షన్ సహా బ్రెజిల్ నుంచి మరో డీల్ వచ్చినట్లు తెలిపింది. వీటి విలువ 250 మిలియన్ డాలర్లకుపైగా ఉంటుందని తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఐర్లాండ్‌కు చెందిన సామాజిక భద్రత విభాగం నుంచి 15 ఏళ్ల కాంట్రాక్ట్ దక్కించుకున్నట్లు టీసీఎస్ మంగళవారం ప్రకటించింది. మై ఫ్యూచర్ ఫండ్ అనే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్‌లో కొత్త ఆటో ఎన్‌రోల్మెంట్ విధానాన్ని అమలు చేయడం, నిర్వహించేందుకు ఈ డీల్ లభించినట్లు తెలిపింది. ఈ మేరకు బీఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వివరాలు వెల్లడించింది. ఐర్లాండ్‌లో మొత్తం 8 లక్షల మంది ఉద్యోగుల పేర్లను ఆటోమెటిక్‌గా రిటర్మెంట్ ఫండ్‌లో నమోదు చేసేందుకు ఎండ్ టూ ఎండ్ డిజిటల్ సొల్యూషన్స్ అందించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ డీల్ విలువను టీసీఎస్ వెల్లడించలేదు. కానీ, గత జూన్ నెలలోనే ఐరిష్ టైమ్స్ 10 ఏళ్ల కాలానికి 150 మిలియన్ ఐరిష్ కరెన్సీ డీల్ చేసుకున్నట్లు తెలిపింది. అయితే, ఈ కాంట్రాక్ట్ 15 ఏళ్ల పాటు ఉంటుందని టీసీఎస్ తెలిపింది. సుమారు 245 మిలియన్ డాలర్లు అంటే భారత దేశ కరెన్సీలో రూ.2 వేల కోట్లకుపైగా ఉంటుంది.

ఐర్లాండ్‌తో 15 ఏళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్న మరుసటి రోజునే మరో డీల్ పైనా టీసీఎస్ ప్రకటన చేసింది. బ్రెజిల్‌లోని ప్రముఖ ఉన్నత విద్యా, పరిశోధన సంస్థల్లో ఒకటైన ఇన్‌స్పెర్ (Insper)‌తో 10 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు బుధవారం ఓ ప్రకటన చేసింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా 8.6 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. అంటే భారత కరెన్సీలో రూ.72 కోట్లకుపైగా ఉంటుంది.

సౌత్ అమెరికా వ్యాప్తంగా సరికొత్త టెక్నాలజీని వేగవంతం చేయడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని తెలిపింది. ఏఐ, జెన్ ఏఐ, ఐఓటీ, స్పాషియల్ కంప్యూటింగ్ వంటి సరికొత్త టెక్నాలజీల ద్వారా దక్షిణ అమెరికాలోని టీసీఎస్ కస్టమర్లకు అధునాత ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అందించాలనే లక్ష్యాంగా ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీఎస్ఈ ఫైలింగ్‌లో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వివరాలను టీసీఎస్ వెల్లడించింది.

గూగుల్‌కు రష్యా బిగ్ షాక్

రష్యా ప్రభుత్వ మీడియాకు చెందిన కొన్ని ఛానళ్లను యూట్యూబ్‌లో బ్యాన్ చేయడంపై రష్యా ఆగ్రహించింది. దీంతో గూగుల్‌కు మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్‌ యాజమాన్యంలోని యూట్యూబ్‌కు ఏకంగా 20 డెసిలియన్‌ డాలర్ల జరిమాన విధిస్తూ రష్యా కోర్టు తీర్పునిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు అంటే 2 అంకె తర్వాత ఏకంగా 34 సున్నాలు ఉంటాయి.

రష్యా ప్రభుత్వ మీడియాకు చెందిన కొన్ని ఛానళ్లను యూట్యూబ్‌లో బ్యాన్ చేయడంపై రష్యా ఆగ్రహించింది. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ యాజమాన్యంలోని యూట్యూబ్‌కు ఏకంగా 20 డెసిలియన్‌ డాలర్ల జరిమానా విధిస్తూ రష్యా కోర్టు సంలచన తీర్పునిచ్చింది.

20 డెసిలియన్ డాలర్లు అంటే 2 అంకె తర్వాత ఏకంగా 34 సున్నాలు ఉంటాయి. ఈ స్థాయి నంబర్లను ఖగోళ శాస్త్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి. ఈ భారీ జరిమానాను భూమిపై జరిగే లావాదేవీలతో పోల్చలేం. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనేక రెట్లు ఉంటుంది. యూట్యూబ్‌లో రష్యా ప్రభుత్వ మద్దతున్న మీడియా ఛానళ్లను నియంత్రించి గూగుల్ తప్పు చేసిందని, రష్యా జాతీయ ప్రసార నిబంధనలను ఉల్లంఘించిందని రష్యన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాన్ చేసిన ఛానళ్లను పునరుద్ధరించాలని, 9 నెలల వ్యవధిలో తీర్పుని పునరుద్ధరించకపోతే జరిమానా ప్రతిరోజూ రెట్టింపు అవుతుందని న్యాయస్థానం హెచ్చరించింది.

కాగా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మీడియా ఛానెల్‌లను యూట్యూబ్ నియంత్రించింది. ఆర్‌టీ, స్పుత్నిక్‌తో పాటు పలు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఛానెళ్లపై అంతర్జాతీయంగా నిషేధం విధించింది. ఈ వివాదం మార్చి 2022లో మొదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టాక కంటెంట్ పాలసీలకు వ్యతిరేకంగా హింసాత్మక కంటెంట్‌ను చూపిస్తున్నారంటూ యూట్యూబ్ ఈ నిషేధం విధించింది. గైడ్‌లైన్స్ పాటించలేదంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1,000 యూట్యూబ్ ఛానళ్లు, 15,000 కంటే ఎక్కువ వీడియోలను తొలగించింది.

ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో రష్యాను సమర్థించే కథనాలను ప్రసారం చేసిన ఛానెళ్లకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంటుందని రష్యా ఆరోపించింది. యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఛానళ్లపై నిషేధం విధించడానికి ముందే రష్యన్ ప్రభుత్వ మీడియా ఛానళ్లపై ఆంక్షలు విధించిందని పేర్కొంది. యూట్యూబ్ చర్యలు తమ దేశ సెన్సార్‌షిప్, ప్రభుత్వ-ప్రాయోజిత మీడియా అణచివేతగా రష్యా అభివర్ణించింది.

యూట్యూబ్ ఆంక్షలపై రష్యాకు చెందిన 7 బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు ఉమ్మడిగా చట్టపరంగా కోర్టును ఆశ్రయించాయి. గూగుల్‌కి వ్యతిరేకంగా కోర్టులో దావాలు దాఖలు చేశాయి. తమ ఛానెళ్లను పునరుద్ధరించాలని బ్రాస్ట్ కాస్టర్లు డిమాండ్ చేశారు. కాగా గూగుల్ కంపెనీ 2020 నుంచి రష్యా జరిమానాలను ఎదుర్కుంటోంది. రష్యా ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలు త్సాన్‌గ్రాడ్, రియా ఫాన్‌లను యూట్యూబ్‌లో బ్లాక్ చేసినందుకుగానూ రోజుకు సుమారు 1,028 డాలర్ల చొప్పు జరిమానాను ఎదుర్కొంది.

2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టాక రష్యాలో కార్యకలాపాలను గూగుల్ గణనీయంగా తగ్గించింది. అయితే పూర్తిగా ఆ దేశం నుంచి నిష్క్రమించలేదు. యూట్యూబ్, గూగుల్ సెర్చింగ్ వంటి సేవలు కొనసాగుతున్నాయి. అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు రష్యాలో తమ కార్యాకలాపానలు పూర్తిగా ఉపసంహరించుకున్నప్పటికీ గూగుల్ మాత్రం పాక్షికంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

రష్యా ప్రభుత్వం తమ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసిన కొన్ని నెలల తర్వాత అక్కడి గూగుల్ విభాగం కోర్టులో దివాళా పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ కోర్టులో నడుస్తున్నప్పటికీ పాక్షిక సేవలను కొనసాగిస్తూనే ఉండడం గమనార్హం. ప్రస్తుతం రష్యాలో యూట్యూబ్ అందుబాటులో ఉన్నప్పటికీ రష్యన్ మీడియా ఛానెల్‌పై ఆంక్షలను కొనసాగిస్తే ప్లాట్‌ఫారమ్‌ను పూర్తిగా బ్లాక్ చేస్తామని రష్యా అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా ఉక్రెయిన్‌పై దాడి మొదలైన నాటి నుంచి రష్యా వ్యతిరేక లేదా ఉక్రెయిన్ అనుకూల కంటెంట్‌ని ప్రసారం చేసిన విదేశీ టెక్ ప్లాట్‌ఫామ్స్‌పై రష్యా అనేక రకాల జరిమానాలు విధించడం గమనార్హం.

కేటీఆర్ సంచలన నిర్ణయం.. తెలంగాణ వ్యాప్తంగా

మాజీ మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రజలతో సంభాషించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ప్రజలు, కార్యకర్తల ఆకాంక్ష మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Working President KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని మాజీ మంత్రి నిర్ణయించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రజలతో కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని చెప్పుకొచ్చారు. ప్రజల పక్షాన కోట్లాడడమే ప్రస్తుత తన ముందున్న బాధ్యత అని తెలిపారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తానని ప్రకటించారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రజలతో సంభాషించారు కేటీఆర్.

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కేటీఆర్ గట్టిగానే పోరాడుతున్నారు. కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రతీరోజు ఏదో ఒక అంశంపై ఎక్స్‌ వేదికగా పోస్టులు పెడుతూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా రుణమాఫీ, రైతు బంధు విషయంలో ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయాలని చూస్తున్నారంటూ మాజీ మంత్రి మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. ఆ ప్రాజెక్టు పేరుతో పేదలను ఖాళీ చేయించి కూల్చివేయడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌‌పై పోరాడేందుకు కేటీఆర్ మరో అడుగు ముందుకు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించిన ఆయన ప్రజల పక్షాన పోరాడటమే ప్రస్తుత బాధ్యత అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. వానాకాలం వరికోతలు సాగుతున్నాయని.. కానీ నేటి వరకు రైతుబంధు వేయలేదని.. రూ.15 వేల రైతు భరోసా ఊసే లేదని మండిపడ్డారు. కనీసం హార్వెస్ట్ చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదన్నారు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైందన్నారు. ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారని.. అక్టోబరు నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కానీ, అక్టోబర్ 28 నాటికి వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని... రైతన్న అంటే ఎంత నిర్ల్యక్షం చూడండి అంటూ వ్యాఖ్యలు చేశారు. దళారులతో కుమ్మక్కైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదని ఆరోపించారు. నేటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనేలేదన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక.. ప్రారంభించిన ఐకేపీ కేంద్రాల్లోను కొనుగోలు ప్రక్రియ నిలిచిందన్నారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టి నాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్నారంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఢిల్లీ తరహాలోనే

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగిపోతుండటం నగరవాసులను కలవరపెడుతోంది. హైదరాబాద్‌లో వాయు కాలుష్యం కారణంగా గత దశాబ్దకాలంలో 6000 మందికి పైగా మరణాలు సంభవించాయి. లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఒక్క 2023లోనే వాయు కాలుష్యానికి సంబంధించి మరణాల సంఖ్య 1,597గా ఉంది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న టాప్ -10 నగరాలలో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ నంబర్ వన్ స్థానంలో ఉండగా.. తరువాత స్థానాల్లో ముంబయి, బెంగళురు, పుణె, చెన్నై నగరాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని సనత్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కొంపల్లి, ఆబిడ్స్, గచ్చి బౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అధిక వాయు కాలుష్యం ఉంది. గత గంటల సమయంలో పీఎం 2.5 కాలుష్యాలు 60 పాయింట్లలోపు ఉండాల్సి ఉండగా సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలలో 99, హైదరాబా ద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ వద్ద 92, జూపార్క్‌ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్‌–2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లుగా నమోదు అయ్యింది. దీపావళి టపాసులతో వాయు నాణ్యతలో క్షీణత ఏ మేరకు జరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపనుంది. అప్పర్‌ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి వల్ల కేసులు పెరుగుతున్న పరిస్థితి.

మరోవైపు దేశరాజధాని ఢిల్లీలోనూ కాలుష్యం పెరిగిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 408 పాయింట్లుగా నమోదు అయ్యింది. సోని విహార్ లో 408 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అయ్యింది.

అలాగే మందిర్ మార్గ్ లో 375, మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం 371, ఐటీఓలో 335 పాయింట్లుగా నమోదు అయ్యింది. ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించినప్పటికీ నగరవాసులు అధిక సంఖ్యలో బాణాసంచాను వినియోగించారు. బాణాసంచా వినియోగంతో కాలుష్యం ఢిల్లీని కమ్మేసింది. కాళింది కుంజ్‌లోని యమునా నదిలో విషపూరిత నురుగు భారీగా చేరింది.