సరిహద్దుల్లో స్వీట్లు పంచుకున్న భారత్-చైనా
భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో రెండేళ్లుగా సాగుతున్న ప్రతిష్టంభనకు క్రమంగా తెరపడుతోంది. తాజాగా భారత్, చైనా దేశాధినేతల మధ్య బ్రిక్స్ సదస్సులో జరిగిన భేటీ తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
మోడీ, జిన్ పింగ్ చర్చల తర్వాత సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ కలహించుకున్న ఇరుదేశాల బలగాలు ఇవాళ స్వీట్లు పంచుకుని వేడుకలు చేసుకున్నాయి.
భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఐదు పాయింట్లలో ఇవాళ ఇలాంటి ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి.
ఇందులో లడఖ్ లోని రెండు పాయింట్లు కూడా ఉన్నాయి. తాజాగా ఇరుదేశాల మధ్య కుదిరిన అనధికార ఒప్పందంలో భాగంగా డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల నుంచి ఇరు బలగాలు వెనక్కి తగ్గాయి. ఈ పరిణామం జరిగిన రెండు రోజుల తర్వాత ఇవాళ భారత్, చైనా సైనికులు దీపావళి సందర్భంగా స్వీట్లు పంచుకున్నారు.
లడఖ్‌లోని చుషుల్ మాల్డో , దౌలత్ బేగ్ ఓల్డి, అరుణాచల్ ప్రదేశ్‌లోని బంచా , బుమ్లా , సిక్కింలోని నాథులాలో ఇరు దేశాల బలగాలు ఇవాళ స్వీట్లు పంచుకున్నాయి. పెట్రోలింగ్ ఒప్పందంలో డెప్సాంగ్ మైదానాలు , డెమ్‌చోక్ నుండి తాత్కాలిక శిబిరాలతో సహా సైనిక సిబ్బందిని , మౌలిక సదుపాయాలను తొలగించాలని అలాగే 2020 ఏప్రిల్ కు ముందున్న చోట్లకు ఆయా బలగాలు వెళ్లిపోవాలని నిర్ణయించారు.ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు.
Oct 31 2024, 20:01