ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

తెలంగాణలో రెండురోజులు వానలు కొనసాగుతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

తెలంగాణలో రెండురోజులు వానలు కొనసాగుతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఉరుములు మెరుపులతో వానలు పడే ఛాన్స్‌ ఉందని చెప్పింది.

శుక్రవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, నవంబర్‌ 4 వరకు రాష్ట్రంలో వానలు కొనసాగేందుకు అవకాశాలున్నాయని వివరించింది.

24 మందితో టీటీడీ బోర్డ్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు.

24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ఏర్పాటు కానుంది.

వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, తెలంగాణ నుంచి ఐదుగురు,

కర్ణాకటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి బోర్డు అవకాశం కల్పించింది

20 మంది అధికారులపై చర్యలకు సిద్ధం

కడప జిల్లాలోని కేసీ కెనాల్‌ భూముల పరాధీనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఐదేళ్లు జగన్‌ సర్కారు తొక్కిపెట్టిన విజిలెన్స్‌ నివేదికను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది.

కడప జిల్లాలోని కేసీ కెనాల్‌ భూముల పరాధీనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఐదేళ్లు జగన్‌ సర్కారు తొక్కిపెట్టిన విజిలెన్స్‌ నివేదికను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. భూములు పరాధీనం అవడానికి, ఆతర్వాత ఆ భూములను పరిరక్షించడంలో 20 మంది అధికారులు తీవ్ర వైఫల్యం చెందారని విజిలెన్స్‌ గుర్తించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఫారసుల మేరకు 20 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు (జీవో-241) జారీ చేశారు. నాలుగు శాఖల అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. కాబట్టి ఆయా శాఖలు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అభియోగాలు ఎదుర్కొంటున్నవారు 2019కు ముందు కడప జిల్లా పరిధిలో పని చేశారు. ప్రస్తుతం వీరంతా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.

కడప జిల్లాలో విలువైన కేసీ కెనాల్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వాటి పరిరక్షణలో ఆయా శాఖల అధికారులు విఫలమయ్యారు. దీంతో గత తె లుగుదేశం ప్రభుత్వ హయాంలో విచారణ జరిపింది. అధికారుల పాత్ర ఉందని అనుమానాలు రావడంతో విజిలెన్స్‌ విచారణ జరిపించింది. ఈమేరకు విజిలెన్స్‌ విచారణ జరిపి 2019 మే 20న సర్కారుకు నివేదిక ఇచ్చింది. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. జగన్‌ సర్కారు వచ్చాక ఈ ఫైలుపై ఐదేళ్లపాటు ఏ చర్యలూ తీసుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం పెండింగ్‌ ఫైళ్ల బూజు దులిపి పరిశీలిస్తోంది. ఈ కేసులో చర్యలు తీసుకుంటూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది.

మైలవరం, 2.మల్లికార్జున-ఈఈ, కెసీ కెనాల్‌ నంద్యాల, 3.కె.సుబ్బయ్య-ఈఈ, ధవళేశ్వరం, 4.ఎస్‌.జిలాని బాష-డీఈ, మైదుకూరు.

పురపాలకశాఖ: 5.బి.విజయభాస్కర్‌-అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌, గూడూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌, 6. టీఎం.రామ్మోహన్‌-టౌన్‌ ప్లానింగ్‌, కదిరి మున్సిపాలిటీ. 7.జి.నాగశివప్రసాద్‌-టౌన్‌ప్లానింగ్‌, కడప మున్సిపాలిటీ. 8.జి.శారదాంబ-ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌, రాజంపేట. 9.సీటీ కష్ణసింగ్‌-టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌, పులివెందుల మున్సిపాలిటీ. 10. ఎ.సలీమ్‌బాషా-కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌, 11.డి. జాన్‌శామ్‌సన్‌-కమిషనర్‌, రామగుండం మున్సిపాలిటీ(తెలంగాణ), 12.సి.ఓబులేసు-కమిషనర్‌, అనంతపురం మున్సిపాలిటి.

హోంశాఖ: 13. టి.రెడ్డప్ప-సీఐ, 14. ఎస్‌.రామకృష్ణుడు-సీఐ, 15.ఎస్‌.రామకృష్ణ-సీఐ, 16. వి.నారాయణస్వామిరెడ్డి-డీఎస్పీ.

రెవెన్యూ శాఖ: 17. ఎ.శ్రీనివా్‌స-తహసీల్దార్‌, వేంపల్లి, 18.ఎన్‌.రవిశంకర్‌రెడ్డి -తహసీల్దార్‌, దువ్వూరు, 19. ఎస్‌.ప్రేమానంతకుమార్‌, తహసీల్దార్‌.

పంచాయతీరాజ్‌ శాఖ: 20.ఎన్‌.శివరామిరెడ్డి-సూపరింటెండెంట్‌, కడప జెడ్‌పీ.

వరంగల్ లో దంచికొట్టిన వాన, ఈ జిల్లాలకు హెచ్చరికలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్, వరంగల్ నగరంలో చాలా సేపు వర్షం కురిసింది. అకాల వర్షానికి ఏనుమాముల మార్కెట్‌లో పత్తి తడిచిపోయింది.

నైరుతి బంగాళాఖాతంలో మరియు దక్షిణ ఏపీ తీరంలో మరో ఉపరితల ఆవర్తం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీటర్ల నుంచి 3.1 కిమీ మధ్య విస్తరించి ఉన్నట్లు తెలిపింది. దక్షిణ ఛత్తీస్ ఘట్ మరియు దానిని అనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఇది దక్షిణ దిశగా వంగి ఉందని వివరించింది. ఇది ఇవాళ్టికి బలహీనపడుతుందని అంచనా వేసింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ వాతావరణం మారిపోయింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్, వరంగల్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. వరంగల్ సిటీతో పాటు రూరల్ ఏరియాలో గంటకు పైగా వర్షం దంచికొట్టింది. ఈ అకాల వర్షం దాటికి ఏనుమాముల మార్కెట్‌లో పత్తి భారీ స్థాయిలో తడిచిపోయింది. పత్తిలో తేమ శాతం ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేయదని రైతన్నలు వాపోయారు. అకాల వర్షం దాటికి తమ కష్టం నీళ్లపాలు అయ్యిందని బాధపడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

నవంబర్ 6వ తేదీ వరకు తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‏పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‏పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. డా.బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో దామోదర రాజ నర్సింహా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోటళ్లలో తనిఖీలు, కల్తీ ఆహార పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి నియమించిన టాస్క్‌ఫోర్స్‌‌ కమిటీల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో మయోనైజ్‌ను తయారు చేస్తున్నారని అధికారులు మంత్రి దామోదరకు చెప్పారు.

అందులో కల్తీ, ఉడకబెట్టని గుడ్లను ఉపయోగిస్తున్నారని.. దీని వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడుతోందని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం మయోనైజ్ పై బ్యాన్ విధించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ మయోనైజ్ ను నిషేధం విధించాలని అధికారులు సూచించారు. సుదీర్ఘ చర్చల అనంతరం మయోనైజ్‌పై బ్యాన్ విధించాలని మంత్రి నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

ఫ్రాన్స్‌(France)లో పుట్టిన బర్గర్లు నుంచి శాండ్‌విచ్‌లు.. డిప్స్‌ నుంచి సలాడ్స్‌ వరకూ అన్నింట్లోనూ విరివిగా వాడేస్తోన్న ప్రధానమైన కాండిమెంట్స్‌లో ఒకటిగా నిలిచింది మయోనైజ్‌. మండీకి వెళ్లి బిర్యానీ తిన్నా, బార్బిక్యులో రోస్టెడ్‌ చికెన్‌ రుచి చూసినా, షవార్మ సెంటర్‌లో షవార్మ రోల్‌ తిన్నా, స్టార్‌ హోటల్స్‌లో కాక్‌టైల్‌ పార్టీలో స్నాక్స్‌తో పాటు మయోనైజ్‌ కామన్‌గా ఉంటుంది. అతి చిక్కగా ఉండే ఈ క్రీమీ సాస్‌ను పిల్లలు, పెద్దలూ ఇష్టంగానే తింటుంటారు. వెగన్‌ మయోనైజ్‌తో ఇబ్బందులు లేవుకానీ, ఎగ్‌ మయోనైజ్‌లో ప్రధానంగా వాడే గుడ్డు సొనలో ఉండే సాల్మొనెల్లా వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని న్యూట్రిషియనిస్ట్‏లు అంటున్నారు. హోటల్‌లో దీనిని తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలంటున్నారు.

ఇంట్లో తయారుచేసుకున్న మయోనైజ్‌ను త్వరగా వినియోగించాలనీ, ముఖ్యంగా కార్డియో, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు వాటి జోలికి వెళ్లకపోవడం మంచిదంటున్నారు. హోటళ్లలో అందుబాటులో ఉంచిన మయోనైజ్‌ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, దాన్ని నిషేధించాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి నివేదికలు పంపుతుండడంతో అందరి దృష్టి మయోనైజ్‌పై పడింది. కేరళలో ఎగ్‌ మయోనైజ్‌పై ఇప్పటికే నిషేధం విధించారు.

హరీష్ రావు హాట్ కామెంట్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునంటూ సీఎం చేసిన కామెంట్స్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునంటూ సీఎం చేసిన కామెంట్స్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న హరీష్ రావు.. రేవంత్‌ను ఎలా డీల్ చేయాలో రాసి పెట్టుకుంటున్నామన్నారు. తనను డీల్ చేయడానికంటే ముందు తన ముఖ్యమంత్రి పదవి చేజారకుండా కాపాడుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు చెప్పారు.

బాపూఘాట్‌లో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని హరీష్ రావు ప్రకటించారు. కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి దండం పెట్టరని సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు. అదీకాక.. ప్రజలు సందర్శించే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో తనపై కేసు పెట్టారని హరీష్ రావు ఆరోపించారు. అడ్డుకోబోము అంటూనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి తప్పిదాల వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దారుణ స్థితికి పడిపోయిందన్నారు. తాను ఫుట్ బాల్ ఆడనని.. క్రికెట్ ఆడుతానని చెప్పిన్న హరీష్ రావు.. వచ్చే ఎన్నికల్లో వికెట్ తీసేది తామేనని అన్నారు. రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో మూసీ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు హరీష్ రావు ప్రతిసవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌తో పాదయాత్రకు తాము రెడీ అని ప్రకటించారు. రేపా? ఎల్లుండా? టైమ్ చెప్తే కేటీఆర్, తాను.. ఇద్దరం వస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. గన్‌మెన్‌లు లేకుండా రేవంత్ రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలని మాజీ మంత్రి ప్రతి సవాల్ విసిరారు. ఇటీవల మూసీ ఒడ్డున మూడు నెలలు నివాసం ఉండాలని కూడా సీఎం సవాల్ విసిరారని.. దానికి సైతం తాము సిద్ధమని హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు.

పాడి కౌశిక్ రెడ్డి సంచలనం

సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డ్రగ్స్ పరీక్షకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు.

సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డ్రగ్స్ పరీక్షకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తన పంచాయితీ అనిల్‌ కుమార్‌తో కాదని, సీఎం రేవంత్‌ రెడ్డితోనే కౌశిక్ తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్స్ పరీక్షకు రావాలని నేను సవాల్‌ చేశాను.

కాంగ్రెస్‌ నేతలు మాకు చెప్పకుండా ఆసుపత్రికి వెళ్లి.. మమ్మల్ని రమ్మంటే ఎలా? డ్రగ్స్‌ కేసులో నన్ను ఇరికించాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా ఇలాగే ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా డ్రగ్స్‌ టెస్టుకు రావాలి. వీరి పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు’’ అని కౌశిక్‌ రెడ్డి విమర్శించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్‌ కేసు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఇరు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి.

బీఆర్ఎస్ నేతల సవాల్ ను కాంగ్రెస్‌ నేతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి ఆ పార్టీ ఎంపీ అనిల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లారు. అక్కడ రక్తనమూనాలు ఇచ్చారు. సవాల్‌ చేసిన బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి రక్త నమూనాలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మంత్రివర్గ విస్తరణపై రేవంత్ ప్రకటన

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. కొంత కాలంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతోంది. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతీ సమయంలోనూ ఈ చర్చ తెర మీదకు వచ్చింది. విస్తరణలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది పార్టీలో ఆసక్తి కరంగా మారింది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో వెల్లడించారు. అదే విధంగా పార్టీ నాయకత్వం ఆలోచనలను రేవంత్ స్పష్టం చేసారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ తన మంత్రివర్గ విస్తరణ పైన స్పష్టత ఇచ్చారు. రేవంత్ మంత్రివర్గం లో మరో ఆరుగురికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఒకరికి ఉద్వాసన తప్పదనే చర్చ సాగుతోంది. అదే విధంగా కొత్తగా అయిదుగురికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతీ సందర్భంలోనూ ఈ చర్చ తెర మీదకు వస్తోంది. అయితే, ఇప్పుడు స్వయంగా రవంత్ తన మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగేదీ తేల్చి చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వం బిజీగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తరువాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు.

డిసెంబర్ 7వ తేదీకి రేవంత్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఆ సమయం లోగానే తన మంత్రివర్గం ప్రక్షాళన పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తరువాత రేవంత్ పార్టీ నాయకత్వంతో సమావేశం కానున్నారు. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6న రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. అదే విధంగా పార్టీ నేత కేసీ వేణుగోపాల్ రేపు (గురువారం) హైదరాబాద్ వస్తున్నారు. రాహుల్ పర్యటనతో పాటుగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన చర్చించనున్నారు.

కొత్తగా మంత్రివర్గంలోకి సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అయిదుగురు ఎంపిక పైన తుది నిర్ణయం జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్‌ సాగర్ రావుతో పాటు, వివేక్‌, వినోద్‌ సోదరులు రేసులో ఉన్నారు. వీరిలో వివేక్ కు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు.

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తాజాగా మంత్రి పదవి రేసులో ముందుకు వచ్చారు. ఆయన సోదరుడు మంత్రిగా ఉండటంతో..రాజగోపాల్ కు ఇప్పడే ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ముదిరాజ్ వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మహబూబ్ నగర్ కు చెందిన శ్రీహరి పేరు రేసులో ఉంది.

మాజీసీఎంకు షాకిచ్చిన హైకోర్టు.

మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam)పై నమోదైన అక్రమాస్తుల కేసు మళ్లీ విచారించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 2001 నుంచి 2006 వవరకు అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన పన్నీర్‌సెల్వం, ఆదాయానికి మించి రూ.1.77 కోట్ల ఆస్తులు కూడబెట్టారంటూ డీఎంకే ప్రభుత్వంలో కేసు నమోదైంది.

మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam)పై నమోదైన అక్రమాస్తుల కేసు మళ్లీ విచారించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 2001 నుంచి 2006 వవరకు అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన పన్నీర్‌సెల్వం, ఆదాయానికి మించి రూ.1.77 కోట్ల ఆస్తులు కూడబెట్టారంటూ డీఎంకే ప్రభుత్వంలో కేసు నమోదైంది. హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులతో ఈ కేసు విచారణ మదురై జిల్లా కోర్టు నుంచి శివగంగ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు.

అనంతరం అధికారం బదిలీ జరిగి అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో, పన్నీర్‌సెల్వం, ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు నుంచి విడుదల చేస్తూ 2012లో శివగంగ జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసును మళ్లీ విచారించేలా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేశన్‌ సుమోటాగా స్వీకరించి విచారించారు. ఈ కేసు విచారణకు స్టే విధించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ తోసివేతకు గురైంది. ఈ నేపథ్యంలో, ఒ.పన్నీర్‌సెల్వంపై ఉన్న కేసును మళ్లీ విచారించాలంటూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

ఈ ఉత్తర్వుల్లో... కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తే జామీనును మదురై ప్రత్యేక కోర్టు రద్దు చేయవచ్చని, కేసుకు సంబంధించిన దస్తావేజులు మదురై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు నవంబరు 27వ తేదిలోపు బదిలీ చేయాలని, రోజు వారీ విచారణ చేపట్టి 2025 జూలై నెలలోపు మదురై ప్రత్యేక కోర్టు ముగించాలని పేర్కొన్నారు. ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న పన్నీర్‌సెల్వం సతీమణి సహా ఇద్దరు మృతిచెందడంతో వారిపై ఉన్న కేసులు ఉపసంహరించుకున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గోదావరి పుష్కరాల ముహూర్తం ఖరారు - ఈ సారి ప్రత్యేకత

కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. దీంతో, ప్రభుత్వం..స్థానిక నేతలు - యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు.

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగుల్చాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది. సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. పుష్కర ఏర్పాట్ల పైన కీలక కసరత్తు చేసారు.

అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేశారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిషికేషన్‌, ఐకానిక్‌ టూరిజం సైట్‌ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు.

ఈసారి గోదావరి పుష్కరాలకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తామని మంత్రులు చెబుతున్నారు. గోదావరి పుష్కరాలు 2047కు విజనరీతో ముందుకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన నిధులను సమీకరించుకుని, సమగ్ర అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించనునున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల పైన ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది.