మంత్రివర్గ విస్తరణపై రేవంత్ ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. కొంత కాలంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతోంది. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతీ సమయంలోనూ ఈ చర్చ తెర మీదకు వచ్చింది. విస్తరణలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది పార్టీలో ఆసక్తి కరంగా మారింది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో వెల్లడించారు. అదే విధంగా పార్టీ నాయకత్వం ఆలోచనలను రేవంత్ స్పష్టం చేసారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ తన మంత్రివర్గ విస్తరణ పైన స్పష్టత ఇచ్చారు. రేవంత్ మంత్రివర్గం లో మరో ఆరుగురికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఒకరికి ఉద్వాసన తప్పదనే చర్చ సాగుతోంది. అదే విధంగా కొత్తగా అయిదుగురికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతీ సందర్భంలోనూ ఈ చర్చ తెర మీదకు వస్తోంది. అయితే, ఇప్పుడు స్వయంగా రవంత్ తన మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగేదీ తేల్చి చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వం బిజీగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తరువాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు.
డిసెంబర్ 7వ తేదీకి రేవంత్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఆ సమయం లోగానే తన మంత్రివర్గం ప్రక్షాళన పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తరువాత రేవంత్ పార్టీ నాయకత్వంతో సమావేశం కానున్నారు. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6న రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. అదే విధంగా పార్టీ నేత కేసీ వేణుగోపాల్ రేపు (గురువారం) హైదరాబాద్ వస్తున్నారు. రాహుల్ పర్యటనతో పాటుగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన చర్చించనున్నారు.
కొత్తగా మంత్రివర్గంలోకి సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అయిదుగురు ఎంపిక పైన తుది నిర్ణయం జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుతో పాటు, వివేక్, వినోద్ సోదరులు రేసులో ఉన్నారు. వీరిలో వివేక్ కు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తాజాగా మంత్రి పదవి రేసులో ముందుకు వచ్చారు. ఆయన సోదరుడు మంత్రిగా ఉండటంతో..రాజగోపాల్ కు ఇప్పడే ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ముదిరాజ్ వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మహబూబ్ నగర్ కు చెందిన శ్రీహరి పేరు రేసులో ఉంది.
Oct 30 2024, 19:20