తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 26 2024, 09:53

వంగవీటి రాధాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇవాళ తెల్లవారు జామున అస్వస్థతకు గురయ్యారు. ఉదయం తన ఇంట్లో ఉండగా స్వల్పంగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు టెస్టులు చేసి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాధాను వెంటనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయంలో తెలియడంతో అభిమానులు, కూటమి నేతలు పరామర్శించారు.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున స్వల్పంగా గుండెలో నొప్పి వచ్చింది.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడినట్లు తేల్చారు.. అసవరమైన వైద్యం అందించి వెంటనే డిశ్చార్జ్ చేశారు.

వంగవీటి రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. స్వల్పంగా నొప్పి స్వల్పంగా రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. రాధా అనారోగ్యంపై మరోవైపు కూటమి నేతలు రాధా ఆరోగ్యంపై ఆరా తీశారు.. కొందరు ఫోన్‌లు చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

వంగవీటి రాధా స్వల్పంగా నొప్పి వచ్చిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడ్డారని.. గుండెనొప్పి వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే డిశ్చార్జ్ చేయడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చారు.

వంగవీటి రాధా గత ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు.. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. చంద్రబాబు కూడా వంగవీటి రాధాకు కచ్చితంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని ప్రకటించారు. ఆయనకు ఎమ్మెల్సీ కానీ, ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే రెండు రోజుల క్రితమే నామినేటెడ్ పదవులు కొన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాధాకు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో కొనసాగారు. 2019 ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీలో చేరి.. అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో వంగవీటి రాధా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు.. అయితే అమరావతి రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. అలాగే ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను కలిశారు.. రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేదరనే చెప్పాలి. అయితే 2024 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్‌సీపీకి మళ్లీ వెళతారని ప్రచారం జరిగింది.. అలాగే జనసేన పార్టీలో చేరతారని కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన మాాత్రం రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. ఆ తర్వాత కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 26 2024, 06:38

కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కవితతోపాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ సీబీఐ జూన్‌ 7న సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేసింది.

జూలై 22న ఆ చార్జిషీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై ఇరుపక్షాల వాదనలు జరుగుతుండగా బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా చార్జిషీట్‌ పై విచారణ నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. అయితే.. చార్జిషీట్‌లో పేజీలు సరిగా లేవని, కొన్ని పేజీల్లో అక్షరాలు స్పష్టంగా లేవని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌ రావు న్యాయమూర్తికి తెలిపారు.

మోహిత్‌ రావుతో ఏకీభవించిన న్యాయమూర్తి.. చార్జిషీట్‌ ను సరైన పద్ధతిలో ఫైల్‌ చేసి కాపీని అందజేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబరు 4కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 12:59

మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ జల్ పల్లిలో ఉన్న సువిశాలమైన ఇంట్లో ఆయన నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.

ఆ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా గణేశ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ వ్యక్తే చోరీకి పాల్పడ్డాడు. మోహన్ బాబు వద్ద నమ్మకంగా ఉంటూనే చోరీ చేసేందుకు గణేశ్ స్కెచ్ వేశాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ. 10 లక్షల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత గణేశ్ కనిపించలేదు. అనుమానం వచ్చి చూడగా రూ. 10 లక్షలు మాయమైనట్టు గుర్తించారు. దీంతో పహాడిషరీఫ్ పోలీసులకు మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు... గణేశ్ కోసం గాలించారు. చివరకు తిరుపతిలో అరెస్ట్ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 12:53

దసరా లోగా రైతుల ఖాతాల్లో నిధుల జమ..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా లోగా నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీ అందని అర్హులైన వారికి నిధుల జమ పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది. వచ్చేనెల తొలి వారంలో నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో రైతు రుణమాఫీ మూడు విడతలు గా అమలు చేశారు. ఇంకా అర్హులైన కొందరు రైతులకు రుణమాఫీ పూర్తికాలేదు. దీంతో నాలుగో విడత రుణమాఫీగా వీరందరికీ నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవటం, ఆధార్ తప్పులు కారణంగా రుణమాఫీ పలువురికి నిలిచిపోయింది. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెలాఖరులోగా డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నారు.

దసరా పండుగలోగా 4.25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు నిధుల సర్దుబాటు పైన దృష్టి పెట్టింది. ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం దాదాపు 22 లక్షల మంది రైతులకు రూ 17,934 కోట్ల రుణమాఫీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4.28 లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతుల సంఖ్య 1. 26 లక్షల వరకు ఉంది. మొత్తం కలిపి 5.54 లక్షల మంది రైతుల ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయి.

దీనికి సంబంధించి ఆగస్టు 29 న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల నాలుగో తేదీ వరకు వీటిని స్వీకరించారు. ఏ బోలో క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని వివరాలను యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపు పోలికి వచ్చింది. 4.28 లక్షల మంది రైతుల్లో 3.10 లక్షల మంది రైతులకు సంబంధించి ఫ్యామిలీ గ్రూప్ ఇన్ పూర్తయింది. ఈ మొత్తం లెక్కల పైన కసరత్తు చేస్తున్న ప్రభుత్వం దసరా లోగా వీరికి నాలుగో విడత రుణమాఫీ చేయాలని ఆలోచన చేస్తుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 12:24

మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు

మూసీ నివాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్ళనున్నారు. మూసీ ఆక్రమణల వివరాల సేకరణను రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

హైడ్రా (Hydra) బుల్డోజర్లు (Bulldozers) ఈసారి మూసీ (Musi) వైపు దూసుకెళ్లనున్నాయి. ఈ వారాంతంలో మూసీ ఆక్రమణల కూల్చివేతలపై (Demolition) హైడ్రా ఫోకస్ పెట్టింది. శని, ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణలను కూల్చివేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు రోజుల్లో కూల్చివేతలు పూర్తి చేసేలా హైడ్రా టార్గెట్ (Target) నిర్దేశించుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్.. మూసి ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో 1,350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది. కాగా మూసీ నివాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లనున్నారు. మూసీ ఆక్రమణల వివరాల సేకరణను రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కాగా మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో భాగంగా అక్కడ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించిన క్రమంలో నిర్వాసితుల కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మూసీ పరీవాహక ప్రాంతంలో పదివేల కుటుంబాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింతగా ఉంటుందని.. సుమారు 16 వేల కుటుంబాలుండొచ్చని అంచనా వేస్తున్నారు. వీళ్లందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, అధికారుల బృందం బుధవారం నుంచి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతలో రివర్‌ బెడ్‌లోని 1600 ఇళ్లను తొలగించే ప్రక్రియ వెంటనే మొదలవుతుందని చెప్పారు. తర్వాత బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలను తొలగిస్తామన్నారు.

కాగా మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల ఇళ్లతో పాటు చెరువులు, నాలాల వద్ద ఉంటున్న పేద కుటుంబాల వివరాలను కూడా సేకరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఒక్క పేద కుటుంబం కూడా రోడ్డున పడకూడదని, అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌, హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఇందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కమాండ్‌ కంట్రో ల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న అన్ని చెరువులు, కుంటలు, నాలాలను గుర్తించి వాటి ఎఫ్టీఎల్‌, బఫర్‌ జోన్లను గుర్తించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా వీటికి సంబంధించిన నివేదికను తయారుచేయాలన్నారు. ప్రతి ఆక్రమణలో అర్హులైన పేదలకు విధిగా పరిహారం అందేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 11:34

బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలంగాణ లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 27 వరకు ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కామారెడ్డి,నిర్మల్‌ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది.

తెలంగాణ లోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కామారెడ్డి,నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ఈనెల 26, 27 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 వరకు వాతావరణశాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్‌ జిల్లా ఖిల్లా వరంగల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 9.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

అలాగే, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 8.53, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో 8.35, నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరులో 7.8, రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్‌ మండలం తాటివనంలో 7.78, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.95, మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేటలో 7.2 నిర్మల్‌ జిల్లా భైంసాలో 7.4 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. వరద నీరు ముంచెత్తడంతో మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ పట్టణంలోని జాతీయ రహదారిపై, ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో మంఖాల్‌, హర్షగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 11:30

బీఆర్ఎస్ దూకుడు.. ఇవాళ ఉదయం 9 గంటలకు..

బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇటీవల జోరు పెంచిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ (బుధవారం) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీలో పర్యటించనున్నారు.

బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇటీవల జోరు పెంచిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ (బుధవారం) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలతో కలసి ఫతేనగర్‌కు కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌టీపీ ప్లాంట్‌ను ఆయన పరిశీలించనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు ఆఫీస్‌లో జరగనున్న ప్రెస్ మీట్‌లో పాల్గొని మాట్లాడనున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘ఎత్తు కుర్చీల్లో కూర్చోవడం కాదు-కన్నేత్తి రైతుల గోస చూడు ముఖ్యమంత్రి’’ అని మండిపడ్డారు. ‘‘మాఫీ కాని రుణమాఫీ- పత్తా లేని పాల బిల్లులు. వేస్తావన్న భరోసా లేని రైతు భరోసా - బోనస్ పేరుతో బోగస్ మాటలు. ఒకటా రెండా అన్నింట్లో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

రైతు రోడ్డెక్కితే జంకిన మీరు రూ.150 కోట్ల పాల బిల్లుల బకాయిలకు రూ.50 కోట్లు విడుదల ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. మీ పుణ్యమా అని ఈ దసరా రైతులకు మునపటి దసరాలా ఉండేలా లేదు. బోగస్ హామీలతో రైతుల గొంతు నొక్కి గద్దెనెక్కి ఎత్తు కుర్చీల్లో రాచరిక దర్పాన్ని ప్రదర్శిస్తున్న మీరు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు’’ అని కేటీఆర్ విమర్శించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 11:25

రైలు విస్తరణ- ఈ రూట్‌లోమెట్రో

హైదరాబాద్‌లో మెట్రో రైలు మార్గాల విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి సారించింది. జంటనగరాలు శరవేగంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అనుగుణంగా మెట్రో రైలు సర్వీసులను కూడా ఆయా ప్రాంతాలకు చేరువ చేయడానికి చర్యలు చేపట్టింది.

కొత్తగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకుని రావాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధం చేయాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను ఆదేశించారు. దసరా నాటికి డీపీఆర్ సిద్ధం చేయాలని, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని అన్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, హైడ్రా కార్యకలాపాలపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలను జారీ చేశారు.

హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో రైలు మార్గాల విస్తరణకు సంబంధించిన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. విస్తరణకు సంబంధించి పనుల్లో జాప్యం ఉండకూడదని అన్నారు. అడ్డంకులు ఉంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్-చాంద్రాయణగుట్ట-ఫలక్‌నుమా మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ అలైన్‌మెంట్‌ రూపొందించాలంటూ గతంలో రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి లేదా, చాంద్రాయణగుట్ట, బార్కాస్‌, పహాడీ షరీఫ్‌, శ్రీశైలం రోడ్ మార్గంలో మెట్రో రైలును నడిపించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ అప్పట్లో ఆదేశించారు.

ఈ రెండింట్లో ఏ రూట్‌లో ఖర్చు తక్కువ అవుతుందో.. దాన్నే ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల అటు పాతబస్తీ ప్రజలకూ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. దీనికి పొడిగింపుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకుని రావాలని ఆయన నిర్ణయించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 09:42

2 రెమ్మలు.. 2 వేలు.. నాణ్యత, బరువులో తేడా రాకుండా సరఫరా

పార్సిల్‌ చూస్తే.. టిఫిన్‌ సెంటర్‌లో దోశ మాదిరిలా ఉంటుంది. విప్పితే రెండు గంజాయి రెమ్మలు ఉంటాయి. పోలీసుల తనిఖీల నేపథ్యంలో విక్రయదారులు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. కిలోల లెక్కన కాకుండా, 20 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్ముతున్నారు.

పార్సిల్‌ చూస్తే.. టిఫిన్‌ సెంటర్‌లో దోశ మాదిరిలా ఉంటుంది. విప్పితే రెండు గంజాయి రెమ్మలు ఉంటాయి. పోలీసుల తనిఖీల నేపథ్యంలో విక్రయదారులు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. కిలోల లెక్కన కాకుండా, 20 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్ముతున్నారు. ఈనెల 22న హెచ్‌న్యూ (హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌) పోలీసులకు చిక్కిన అనంతయ్య ఫ్యామిలీని పోలీసులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆటోడ్రైవర్‌ అనంతయ్య, అతని భార్య నీరజ, కొడుకు రవికాంత్‌, ఆదిలాబాద్‌(Adilabad) నుంచి గంజాయి సరుకు సరఫరా చేస్తున్న గంగన్నలను హెచ్‌న్యూ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆదిలాబాద్‌కు చెందిన గంగన్న మహారాష్ట్ర, చత్తీస్ ‏గఢ్‌(Maharashtra, Chhattisgarh) ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద మేలురకం గంజాయిని సేకరించి దాన్ని నగరంలోని ప్రధాన స్మగ్లర్లకు సరఫరా చేస్తున్నాడు. ధూల్‌పేటలో ఉంటున్న రజినీ చెల్లెలు, మరిది గంజాయి విక్రయాల్లో ఆరితేరారు. గంగన్న వారికి గంజాయి సరఫరా చేసేవాడు.

గంజాయి దందా లో సులభంగా డబ్బు సంపాదించొచ్చు అని చెల్లెలు ద్వారా గుర్తించిన రజినీ తాము కూడా అదే దందా చేయాలని నిర్ణయించుకుంది. అందుకు భర్త, ఇద్దరు కొడుకుల సహకారం తీసుకుంది. గంగన్న ఆదిలాబాద్‌ నుంచి సరుకు హైదరాబాద్‌కు తెచ్చిన వెంటనే గుట్టుచప్పుడు కాకుండా అనంతయ్య ఎంజీబీఎ్‌సకు వెళ్తాడు. ఆయన్ను ఒక చుట్టంలా ఇంటికి తీసుకెళ్తాడు. సరుకు లెక్క చూసుకొని గంగన్నకు డబ్బులిచ్చి, మర్యాద చేసి పంపిస్తారు. ఆ తర్వాత రజినీ గంజాయి రెమ్మలను జాగ్రత్తగా తీసుకొని రెండు మూడు రెమ్మలను కలిపి దోశ ప్యాకింగ్‌లా చేస్తుంది. గంజాయి రెమ్మ విరగకుండా, నలగకుండా జాగ్రత్త తీసుకుంటుంది

ఆ ప్యాకింగ్‌లను భర్త, ఇద్దరు కుమారులకు అందజేస్తుంది. పెద్ద కొడుకు క్యాబ్‌డ్రైవర్‌ కావడంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో(Software employees) మంచి పరిచయాలు ఉన్నాయి. తమ వద్ద మేలు రకం గంజాయి ఉందని చెప్పి గుట్టుగా విక్రయిస్తున్నారు. అలా తండ్రి, ఇద్దరు కొడుకులు నగరంలోని పలు ప్రాంతాల్లో కస్టమర్స్‌కు ఒక్కో పార్శిల్‌లో రెండు లేదా మూడు రెమ్మలు పెట్టి రెండు వేలకు విక్రయిస్తున్నారు. నాణ్యత, బరువులో తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ డిమాండ్‌ను బట్టి రూ. 3వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేజీ మేలు రకం గంజాయిని రూ.10వేల చొప్పున కొనుగోలు చేస్తున్న నిందితులు.. దాన్ని విక్రయించడం ద్వారా రూ.40వేలు సంపాదిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. రెండేళ్లుగా ఫ్యా మిలీ మొత్తం ఇదే దందా కొనసాగిస్తుండడం గమనార్హం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 17:53

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఓటుకు నోటు ఈడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు విచారణకు మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చేనెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు సీఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీపెన్ సన్‌కు రేవంత్ రెడ్డి డబ్బులు ఎర చూశారని ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన వద్ద ఉన్న బ్యాగులో రూ.50 లక్షల నగదు ఉంది. ఆ నగదు అక్రమంగా చలామణి జరిగిందని ఏసీబీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రిఫర్ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణతోపాటు ఈడీ విచారణ కూడా జరుగుతోంది. ఏసీబీ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించలేదు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం అయినందున కేసు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్య ఒక్కరే ఏసీబీ కేసు, ఈడీ కేసులో విచారణకు హాజరవుతున్నారు. మిగతా నిందితులు గైర్హాజరు అవుతున్నారు. విచారణ మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈడీ కేసులో నాంపల్లి కోర్టు తాజా ఆదేశాలతో అక్టోబర్ 16వ తేదీన ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.