యాదాద్రి థర్మల్‌లో నేడు మహత్తర ఘట్టం

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంలో బుధవారం ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తోన్న ఈ పవర్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్‌ను బుధవారం సింక్రనైజేషన్‌ చేయనున్నారు. దాదాపు 72 గంటల పాటు విద్యుత్‌ ఉత్పాదన చేసిన తర్వాత ప్లాంట్‌ కమిషన్‌ కానుంది.

ఆ తర్వాత గ్రిడ్‌కు ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి చేసిన కరెంట్‌ను అందించనున్నారు. ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పాదన సజావుగా జరుగుతుందని నిర్ధారించుకున్న తర్వాత వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయన్తున్నట్లు(సీవోడీ-కమర్షియల్‌ ఆపరేషన్‌ డేట్‌) ప్రకటించనున్నారు.

రాష్ట్రంలో ఒకేచోట 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ ఇక్కడే ఉంది.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు. రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌ అనంతరం ప్లాంట్‌ నిర్మాణంపై సమీక్ష చేయనున్నారు.

యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీకి గట్టి షాక్ ఇచ్చిన ఆర్బీఐ

దేశంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలపై RBI కొరడా ఝులిపించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ రూ.2.91 కోట్ల జరిమానా విధించింది. అయితే ఆర్బీఐ ఎందుకు చర్యలు తీసుకుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.

వినియోగదారులకు సేవల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలేది లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చెప్పకనే చెబుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలపై RBI కొరడా ఝులిపించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ రూ.2.91 కోట్ల జరిమానా విధించింది. ఇందులో యాక్సిస్ బ్యాంక్‌పై రూ.1.91 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీపై రూ.1 కోటి జరిమానా విధించారు. ఈ రెండు బ్యాంకులు వినియోగదారుల సేవలైన కేవైసీ, డిపాజిట్లపై వడ్డీ రేట్లు, వ్యవసాయ సంబంధిత రుణాల హామీ వంటి విషయాల్లో నిబంధనలను పాటించలేదని ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది.

అయితే డిపాజిట్‌లపై వడ్డీ రేట్లు, బ్యాంకుల్లో రికవరీ ఏజెంట్లు, బ్యాంకుల్లో కస్టమర్ సేవలపై పలు సూచనలను పాటించనందుకు HDFC బ్యాంక్‌కు కోటి రూపాయల జరిమానా విధించినట్లు మరో ప్రకటనలో తెలిపింది. ఈ జరిమానాలు చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతిలో లోపాలకు సంబంధించినవని వెల్లడించింది. ఈ క్రమంలో బ్యాంకులు తమ ఖాతాదారులతో కుదుర్చుకున్న లావాదేవీలు లేదా ఒప్పందాల చెల్లుబాటుకు ఎలాంటి ప్రభావితం చేయవని కూడా RBI స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు రుణ సేకరణ విషయంలో ఖాతాదారులతో గౌరవం పాటించాలి. అంతేకానీ వసూళ్ల ముసుగులో మితిమీరిన బలవంతపు చర్యలు లేదా వేధింపులకు గురిచేసే సంభాషణ చేయకూడదు. రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా మార్గదర్శకాలు పాటించాలి. ఒకవేళ వారు పాటించని యెడల కస్టమర్లు RBIకి ఫిర్యాదు చేయవచ్చు. అలా చేస్తే ఆయా బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. గతంలో కూడా లోన్స్ తీసుకున్న పలువురు కస్టమర్లు సమయానికి రుణం చెల్లించని క్రమంలో కొంత మంది బ్యాంకు రికవరీ ఏజెంట్లు కస్టమర్లతో అసభ్యంగా మాట్లాడిన సంఘటనలు వెలుగులోకి రావడం చుశాం. ఇలాంటి వాటికి కూడా ఫిర్యాదు చేయవచ్చు.బ్యాంకులు ఇచ్చే రుణాల వృద్ధి రేటు డిపాజిట్ల వృద్ధి కంటే ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇండస్ట్రీ బాడీ FICCI, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) సంయుక్త నివేదిక ప్రకారం డిపాజిట్లను పెంచడం, క్రెడిట్ ఖర్చులను తక్కువగా ఉంచడం అనేది బ్యాంకుల ఎజెండాలో అగ్రస్థానంలో ఉంది. నివేదిక ప్రకారం ప్రస్తుత రౌండ్‌లో మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ల వాటా తగ్గిందని 67 శాతం బ్యాంకులు తెలిపాయి.

పట్టణాలకు తరలుతున్నారు.. తెలంగాణలో ఊర్లు ఖాళీ!

పల్లెటూరు అంటేనే పచ్చని చెట్లు.. పచ్చని పొలాలు కనిపిస్తుంటాయి. వాటికితోడు పిల్ల, పెద్ద కాలువలు, కాలువ గట్లు కనిస్తాయి.

పల్లెటూరు అంటేనే పచ్చని చెట్లు.. పచ్చని పొలాలు కనిపిస్తుంటాయి. వాటికితోడు పిల్ల, పెద్ద కాలువలు, కాలువ గట్లు కనిస్తాయి. పలురకాల తోటలు, చల్లటి పైరగాలి, పెద్ద పెద్ద పెంకుటిళ్లు ఇలా బాపుగారి బొమ్మలా గ్రామాలు పలకరిస్తుంటాయి. పల్లెలు అంటేనే సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. మనుషుల మధ్య బంధాలూ అలానే ఉంటాయి. సాయం చేయడంలోనూ ఒకరకంటే ఒకరు ముందుకు వస్తుంటారనేది చెప్పుకుంటుంటం. బంగారం పండించే రైతులకూ పల్లెలే అడ్డా.

అలాంటి పల్లెటూరిలో ఉపాధి దొరికే మార్గం లేక ప్రజలు పట్నం బాటపడుతున్నారు. పట్నం వస్తే ఏదో ఒకటి చేసుకొని బతకవచ్చని పట్టణాలకు చేరుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో జనాభా రోజురోజుకూ తగ్గుతోంది. తాజాగా.. కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పల్లెల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

గ్రామాల్లోని ప్రజలు కొందరు ఉపాధి నిమిత్తం పట్టణాల బాట పడుతుండగా.. మరికొందరు తమ పిల్లల చదువుల కోసం అంటూ వసల వెళ్తున్నారు. ఆ సంఖ్య ఒకప్పుడు వందల్లో ఉంటే ఇప్పుడు లక్షలకు చేరుకుంది. గ్రామాల్లో ఉండలేక.. వీడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ ‘హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23’ని వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. 2011 నుంచి 23 మధ్య తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా -7.84శాతం తగ్గింది. పట్టణ జనాభా 34.05 శాతం పెరిగిందని వెల్లడించింది. జూలై 1, 2023 నాటికి రాష్ట్ర జనాభా 3,81,35,000కి చేరిందని పేర్కొంది. జనసాంద్రత అంశంలోనూ చదరపు కిలోమీటర్ పరిధిలో దేశంలో ఢిల్లీ 14,491తో టాప్‌లో ఉండగా.. తెలంగాణ 386తో 18వ స్థానంలో ఉందని వివరించింది. అదే పట్టణాలకు వచ్చే సరికి 4,885, గ్రామాలలో 210 ఉందని పేర్కొంది.

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడీపిక్కల లోడుతో ఓ మినిలారీ తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లకు బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రోడ్డులో.. దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకువెళ్లి బోల్తా పడింది. దీంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన జరిగిన సమయంలో వాహనంలో 9 మంది ఉన్నట్లు చెబుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే హైవేపై.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ బోల్తాపడటంతో ఏడుగురు చనిపోయారు.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో మినీలారీ బయల్దేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల సమీపంలో.. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో మినీ లారీ అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది.

ఈ ప్రమాదంలో.. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య, తమ్మిరెడ్డి సత్యనారాయణ, తాడి కృష్ణ, కత్తవ కృష్ణ , కత్తవ సత్తిపండు, పి.చినముసలయ్య.. నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌ చనిపోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో మినీ లారీలో 9మంది జట్టు సభ్యులు ఉన్నారు.. డ్రైవర్‌ తప్పించుకుని పరారయ్యాడు. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు చనిపోయారు.

గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధుగా గుర్తించారు.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఏడుగురి మరణంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.

అక్రమ హర్మ్యం

తొలుత 12 అంతస్తులకు అనుమతి తీసుకున్నారు! తర్వాత దానిని 20 అంతస్తులకు పెంచుకున్నారు! చివరకు, 30 అంతస్తులకు అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు! అక్కడ అన్ని అంతస్తులకు అనుమతి ఇవ్వడానికి నిబంధనలు అంగీకరిస్తాయా!? అంటే.. ‘లేదు’ అన్నదే జవాబు! అయినా.. నిర్మాణదారుడు అడిగితే.. జీహెచ్‌ఎంసీ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు! హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కుకు కూతవేటు దూరంలో.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45లోని నిర్మాణమిది! దీనిపై సర్కారుకు పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో, విజిలెన్స్‌ విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉన్నట్లు విజిలెన్స్‌ నిర్ధారించింది. నిర్మాణాన్ని నిలిపి వేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. బిల్డర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సూచించింది. వివరాల్లోకి వెళితే..

షేక్‌పేట్‌ మండల పరిధిలోని నందగిరి హిల్స్‌ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ నుంచి హుడా వేలంలో జి.అమరేందర్‌ రెడ్డి అనే వ్యక్తికి చెందిన నెట్‌ నెట్‌ వెంచర్స్‌ సంస్థ 4.748 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అక్కడ 12 అంతస్తుల (జీ+4, 7 సెల్లార్లు) నిర్మాణం చేపట్టేందుకు 2013లో జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందింది. తర్వాత 2015లో రోడ్డు నంబరు 45లోనే ఉన్న జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీలో 865.42 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసింది. దాని పక్కనే ఉన్న మరో 866 గజాల భూమిని 2021లో కొంది. ఈ రెండూ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 45కు ఆనుకునే ఉంటాయి. వీటి వెనక నెట్‌ నెట్‌ వెంచర్స్‌ స్థలం ఉంటుంది. నిజానికి, రోడ్డు నంబరు 45కు ఇరువైపులా ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు కొంత వెసులుబాటు కలిగిస్తూ 2017లో ప్రభుత్వం జీవో 305 విడుదల చేసింది. దాని ప్రకారం.. రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థలాల్లో 30 మీటర్ల వరకు నిర్మాణాలు చేసుకోవచ్చు. ఈ నిబంధన జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ లే అవుట్‌కు మాత్రమే వర్తిస్తుంది.

కానీ, దాని వెనక ఉన్న హుడా లే అవుట్‌ (హెచ్‌ఎండీఏ నుంచి కొనుగోలు చేసిన స్థలం)కు వర్తించదు. అయినా.. ఆ నిబంధనను అడ్డం పెట్టుకొని తమకు 30 మీటర్లలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ నెట్‌ నెట్‌ వెంచర్స్‌ దరఖాస్తు పెట్టుకుంది.

అధికారుల అండతో 30 మీటర్లకు అనుమతి సంపాదించింది. అక్కడితో ఆగలేదు. దశలవారీగా జీ+4 నుంచి జీ+5; ఆ తర్వాత జీ+12, చివరకు జీ+13 (20 అంతస్థులు.. వీటిలో జీ+13, ఒక సెల్లార్‌, 5 స్టిల్ట్‌లు ఉంటాయి)కు అనుమతి సంపాదించింది. మొత్తం 2,09,620 చదరపు అడుగుల్లో నిర్మాణం చేసుకునేలా అనుమతి పొందింది. పదేళ్ల కాలంలో జీ+4 నుంచి ఏకంగా జీ+13 అంతస్తుల వరకు నిర్మాణానికి అనుమతులు సంపాదించింది. ఇక్కడ సెవెన్‌ స్టార్‌ హోటల్‌, మల్టీప్లెక్స్‌, షాపింగ్‌ మాల్‌ నిర్మిస్తామని పేర్కొంది. ఇది హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పర్యావరణ నిబంధనలకు విరుద్ధం. అక్కడ అలాంటి భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు ఎలాంటి ఆస్కారం లేదు. ఇక జూబ్లీహిల్స్‌ సొసైటీ నుంచి కొనుగోలు చేసిన రెండు ప్లాట్లను కాంప్లెక్సుకు వెళ్లే దారిగా చూపించారు. సొసైటీ బైలాస్‌ ప్రకారం.. ఆయా ప్లాట్లలో నిర్మాణాలు చేయాలి.

కానీ, ఇతరత్రా అవసరాలకు మార్చే వీలులేదు. ఒకవేళ ఏవైనా మార్పులు చేయాలనుకుంటే సొసైటీ అనుమతి పొందాలి. కానీ సదరు సంస్థ అలాంటి అనుమతి ఏదీ పొందలేదు. ఈ వెంచర్‌లో మూడు టవర్లు నిర్మిస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. ఇక్కడ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌, హోటల్స్‌, మల్టీప్లెక్స్‌, షాపింగ్‌ మాల్‌ నిర్మించడానికి అనుమతి తీసుకున్నట్లు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ కాంప్లెక్సులో ఏకంగా 6,000 కార్లు, 2,000 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం ఉన్నట్లు గుర్తించారు. కేబీఆర్‌ పార్క్‌కి అత్యంత సమీపంలో వచ్చే ఈ భారీ నిర్మాణంతో పర్యావరణానికి తీవ్ర ఇబ్బంది కలగనుందని, వాహనాల శబ్ధాలు, హారన్లు, కాలుష్యం చుట్టుపక్కల ప్రజలతోపాటు పార్క్‌లో వన్య ప్రాణులకు ప్రమాదకరంగా మారతాయని పేర్కొన్నారు. 115 మీటర్ల ఎత్తులో వచ్చే ఈ నిర్మాణంతో చుట్టుపక్కల గాలి, వెలుతురు, శబ్ధం, ట్రాఫిక్‌ తీరుతెన్నులు పూర్తిగా మారిపోతాయని పేర్కొంది.నిర్మాణం కోసం 100 అడుగుల లోతు వరకు రాళ్లను బ్లాస్టింగ్‌ చేస్తున్నారని, అందుకు అనుమతులు లేవని పేర్కొంది.

రోడ్డు నంబరు 45 కమర్షియల్‌ రోడ్డు. ఇక్కడ 30 మీటర్ల వరకూ భవన నిర్మాణాలకు అనుమతిస్తారు. ఇంపాక్ట్‌ ఫీజు కడితే మరిన్ని అంతస్తులకు కొంతమేర అనుమతిస్తారు. కానీ, హుడా లే అవుట్లో మాత్రం 15 అంతస్తులకే అనుమతి ఉంది. ఇక్కడే జీహెచ్‌ఎంసీ అధికారులు తప్పుగా అన్వయించారు. జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీకి చెందిన ప్లాట్లలో 30 మీటర్ల వరకు నిర్మించుకునే మినహాయింపుతోపాటు ఇంపాక్ట్‌ ఫీజు సహాయంతో మరికొంత ఎత్తు పెంచుకునే వెసులుబాటును హుడా లే అవుట్‌కు వర్తింపజేశారు. ఏకంగా 45 మీటర్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేశారు. నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం.

ఆర్‌సీసీ శ్లాబులు 4.5 మీటర్ల ఎత్తులోనే ఉండాల్సి ఉండగా, 5 మీటర్ల వరకు ఉండొచ్చంటూ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతి ఇవ్వడం కూడా నిబంధనల ఉల్లంఘనే.జీహెచ్‌ఎంసీ అధికారులు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రత్యేక నిబంధనలను ఉల్లంఘించారు. జీవో 168 ప్రకారం భవనం ఎత్తును రోడ్డు నుంచి కొలవాలి. పిట్టగోడ, వాటర్‌ ట్యాంకు వంటి వాటిని ఎత్తు నుంచి మినహాయించాలి. కానీ, జీహెచ్‌ఎంసీ అధికారులు భవనం ఎత్తును తప్పుగా కొలిచారు.

వెంచర్‌లో 5 సెల్లార్లు నిర్మించారు. 2021లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సెల్లార్లను 5 స్టిల్టులుగా చూపించేశారు. ఇది పూర్తి అక్రమం. స్టిల్టులకు కనీసం 10 మీటర్ల మేర సెట్‌బ్యాక్‌లు ఉండాలి. కానీ, ఇక్కడి సెల్లార్లను సెట్‌బ్యాక్‌ లేకుండా కట్టేశారు.

కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, నిర్మిత ప్రాంతం 1.50 లక్షల చదరపు అడుగులలోపు ఉండే భవనాలకు పబ్లిక్‌ హియరింగ్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, ఈ భవనం 2,09,620 చదరపు అడుగులు. అందువల్ల పబ్లిక్‌ హియరింగ్‌ లేకుండా ఈసీ ఇవ్వడం పూర్తిగా చట్టాలను ఉల్లంఘించడమే.

అక్రమంగా అనుమతులు ఇలా..!

నెట్‌ నెట్‌ వెంచర్స్‌ సంస్థ అక్రమం ఎలా చేసింది.. దానికి అడ్డగోలుగా అధికారులు అనుమతి ఎలా ఇచ్చారనే విషయాన్ని వివరిస్తూ విజిలెన్స్‌ అధికారులు తమ నివేదికలో ఓ ఉపగ్రహ చిత్రాన్ని పేర్కొన్నారు. దాని ప్రకారం.. ఎరుపు రంగు సరిహద్దు ఉన్న ప్రాంతం హెచ్‌ఎండీఏ నుంచి కొనుగోలు చేసిన స్థలం. ఇది నందగిరి రెసిడెన్షియల్‌ లే అవుట్లో ఉంది. దానిని ఆనుకుని ఉన్న పసుపు రంగు సరిహద్దు ప్రాంతం జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ నుంచి కొన్న రెండు ప్లాట్లు! రోడ్డు నంబరు 45కు ఆనుకునే ఇవి ఉన్నాయి. వాటిలో మాత్రమే 30 అంతస్తులు నిర్మించుకోవచ్చు. కానీ, వాటిని అడ్డు పెట్టుకుని హుడా లే అవుట్‌లోని మొత్తం వెంచర్‌కు అనుమతులు పొందిందని నివేదికలో పేర్కొంది.

దటీజ్ పవన్ కళ్యాణ్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. వాళ్లు ఒక్కొక్కరికి రూ.లక్ష పంపిణీ

ఏపీలో వరద బాధితుల సహాయార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున తన వంతు సాయంగా.. వరద ప్రభావంతో దెబ్బతిన్న 400 పంచాయతీలకు ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇవాళ ఒక్కో గ్రామానికి రూ.లక్ష చొప్పున అందజేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామ స్వరాజ్యంపై ఉన్న ప్రేమ అపారమైనదని.. గ్రామాలకు అనుకోని కష్టం వస్తే వాటికి సహాయం చేయడం బాధ్యతగా ఆయన తీసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా చేయని విధంగా.. వరద విలయం ఎదుర్కొన్న పంచాయతీలకు, ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల వ్యక్తిగత సాయం అందించడం చరిత్రలో నిలిచిపోయే దాతృత్వం అన్నారు. దీన్ని ప్రతి పంచాయతీకి నేరుగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి, జనసేన పార్టీ నుంచి ఈ నెల 9వ తేదీ సాయంత్రం అందరి సమక్షంలో నిర్వహిస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 పంచాయతీలకు ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ ప్రతి పంచాయతికి రూ.లక్ష చొప్పున సాయం అందిస్తూ విరాళం ప్రకటించిన విషయాన్ని మనోహర్ గుర్తు చేశారు. ఈ విరాళం సొమ్మును నేరుగా పంచాయతీలకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ కేంద్రాలకు నష్టపోయిన ఆయా జిల్లాల్లోని పంచాయతి సర్పంచులు, కార్యదర్భులు వచ్చి విరాళం సొమ్మును అందుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో మనోహర్‌ టెలీ కాన్పరెన్స్‌ నిర్వహించారు.

పవన్‌ కళ్యాణ్‌ అందించే విరాళం పూర్తిగా ఆయా గ్రామాల అభివృద్ధికి, వరదలో నష్టపోయిన గ్రామ ఆస్తుల పరిరకక్షణకు, పారిశుద్ధ్యానికి, ఆరోగ్య శిబిరాలకు, ఇతర అవసరాలకు ఉపయోగపడాలన్నారు మంత్రి మనోహర్. గతంలో ఏ నాయకుడు ఇవ్వని విధంగా పవన్‌ కళ్యాణ్‌ విపత్తు వేళ సొంత నిధులను పంచాయతిలకు ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సాయం ఎంత విలువైనదో అందరం గ్రహించాలని.. ఈ నిధులు ఆయన స్వార్జితం అన్నారు. అవి గ్రామాలకు ఉపయోగపడాలన్నదే పవన్‌ కళ్యాణ్‌ ఉద్దేశమని.. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఆరు జిల్లాలకు సంబంధించి, 400 గ్రామ పంచాయతీలకు నిధులు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 20 చోట్ల ఈ కార్యక్రమాలు జరగనున్నాయని.. ప్రతి చోటా కూటమి నాయకులను ప్రొటోకాల్‌ ప్రకారం కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. అలాగే అధికారులకు సమాచారం ఇచ్చి కార్యక్రమం నిర్వహించాలి అన్నారు.జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ గ్రామ పంచాయతీలకు ఎంత నిజాయతీగా అండగా ఉన్నారనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది అన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పవన్‌ కళ్యాణ్‌ నిబద్ధత, పార్టీ సిద్దాంతాలను కూడా గ్రామాల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందన్నారు. దీన్ని ప్రభుత్వం కూడా నిర్వహిస్తున్నందున అధికారులు సైతం ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని.. అందర్ని కలుపుకొని, సమష్టిగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పార్టీ పటిష్టత, గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి అన్నారు. సాయాన్ని నేరుగా అందించే కార్యక్రమంలో సర్పంచులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.

చింతపల్లి - నర్సీపట్నం ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్

ఏపీని వర్షాలు వీడటం లేదు. మొన్నటి వరకు విజయవాడలో వర్ష బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వర్షాలు, వరదలకు గ్రామాలకు గ్రామాలు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడు బెజవాడ వాసులు వర్షాల నుంచి కాస్త కోలుకుంటున్నారు. మరోవైపు అల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల వర్షానికి పలుచోట్ల కొట్టుకుపోయిన కాజ్ వే లు కొట్టకుపోయాయి.

ఏపీని వర్షాలు వీడటం లేదు. మొన్నటి వరకు విజయవాడలో వర్ష బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వర్షాలు, వరదలకు గ్రామాలకు గ్రామాలు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడు బెజవాడ వాసులు వర్షాల నుంచి కాస్త కోలుకుంటున్నారు. మరోవైపు అల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల వర్షానికి పలుచోట్ల కొట్టుకుపోయిన కాజ్ వే లు కొట్టకుపోయాయి. చింతపల్లి నర్సీపట్నం ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్ అయ్యాయి

గిరిజన ప్రాంతంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చింతపల్లి - నర్సీపట్నం ప్రధాన రహదారిలో జాతీయ రహదారి నిర్మాణాల కోసం మడిగుంట, రాజుపాకలు గ్రామాల వద్ద వరద ఉధృతికి కాజ్ వే కొట్టుకొని పోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచి చింతపల్లి నర్సీపట్నం మార్గంలో నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. రింతాడ గ్రామం వద్దనున్న మరో కాజ్వే కూడా కొట్టుకొని పోవడంతో సీలేరు చింతపల్లి మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే జాతీయ రహదారి అధికారులు అక్కడకు చేరుకుని కాజ్ వేలు పునరుద్ధరణ చర్యలను ప్రారంభించారు.

మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి ఉత్తర ఒడిస్సాలో పూరి - పశ్చిమ బెంగాల్‌ ప్రాంతంలోని డేగ అల మధ్య వాయుగుండం తీరం దాటనుంది. వాయుగుండం కారణంగా గత రెండు రోజులుగా ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవనున్నాయి. కోస్తాలో తీరం వెంబడి 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం కాకినాడ రేవుల్లో మూడవ ప్రమాదక హెచ్చరిక జారీ చేయనున్నారు. ఈ నెల12 వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని అధికారులు సూచించారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.

విజయ్ పార్టీ కి గుడ్ న్యూస్... డీఎంకేతో ఢీకి రెడీ !

తమిళ నాట ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఈ మేరకు విజయ్ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చిందని అందులో పేర్కొన్నారు. అంతే కాదు ఇక మీదట ఎన్నికలలో విజయ్ పార్టీ తాము ఎంపిక చేసుకున్న గుర్తుతో పోటీ చేయవచ్చు. 2026 లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.

ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి విజయ్ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం అయిదు పదుల వయసులో ఉన్నారు. తన సినిమాలను ఆయన పూర్తి చేసి పూర్తిగా రాజకీయలా మీదనే ఫోకస్ పెడుతున్నారు.

తమిళనాడులో ద్రవిడవాదం వీక్ అవుతోందని ఆ వాదమే వేదంగా భావించి డీఎంకే అన్నా డీఎంకే దశాబ్దాల పాటు రాజ్యం చేశాయని విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ భావిస్తోంది. అవకాశ వాద రాజకీయా కోసం సిద్ధాంతాలను పక్కన పెడుతున్నారని కూడా భావిస్తోంది.

దాంతో బలమైన ద్రవిడ వాదాన్ని తాము భుజానికి ఎత్తుకోవడమే కాకుండా తమిళనాట అధిక సంఖ్యలో ఉన్న బడుగులు బహుజనుల గొంతుకగా తమ పార్టీని నిలబెట్టాలని కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో విజయ్ పార్టీ తమ పార్టీ జెండా మీద కూడా ఇరువైపులా రెండు ఏనుగుల తో పాటు ఎరుపు పసుపు రంగులను గుర్తులను పెట్టింది.

రానున్న రోజులలో మరింత విస్తృతంగా తిరిగి పర్టీని పటిష్టం చేసేందుకు విజయ్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది మొదట్లో పార్టీని ప్రకటించిన విజయ్ ఇటీవలే జెండాను అజెండాను కూడా ఖరారు చేశారు. తొలిసారి విసృత స్థాయిలో మీటింగ్ ని ఆయన నిర్వహించారు. రానున్న రోజూల్లో ప్రతీ జిల్లాలో సభలు నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని చూస్తున్నారు. మరో వైపు చూస్తే డీఎంకే మీద ఉన్న అసంతృప్తిని తమ పార్టీకి పూర్తిగా మళ్ళేలా చూసుకుంటున్నారు.

మరి విజయ్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో ఇక పార్టీలో చేరికలు జోరుగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా అన్నా డీఎంకే మీదనే విజయ్ పార్టీ కన్ను ఉందని అంటున్నారు. ఆ పార్టీలోని వారిని తమ వైపు తిప్పుకుంటే ఎన్నికల వేళ త్రిముఖ పోరు కాస్తా ద్విముఖ పోరుగా మారుతుందని అది తమకు భారీగా అడ్వాంటేజ్ అవుతుందని ఆయన భావిస్తున్నారని టాక్.

భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడిక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అరకులోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బొర్రా గుహాల పర్యాటక కేంద్రాన్ని మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాలు (Heavy Rains) జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడిక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అరకులోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బొర్రా గుహాల పర్యాటక కేంద్రాన్ని మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చాపరాయి, కటికి జలపాతాలు, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, గిరిజన మ్యూజియంలను మూసివేశారు. అలాగే అరకు ఘాట్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం అరకుకు పర్యాటకులు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు... మెగాద్రిగడ్డ రిజర్వాయర్ నీటి మట్టాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 61 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 57.4 అడుగులు చేరుకుందన్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాలలో వర్షం లేకపోవడంతో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగినట్లయితే 6 గేట్లలో 4 గేట్లు తెరవడానికి ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారన్నారు. డ్యాం దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేసి గేట్లు తెరిచే అవకాశం ఉందన్నారు. ప్రజల తాగునీటి కొరకు మేఘాద్రి గడ్డ డ్యామ్‌ను నింపుకోవడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో ఈ నీటిని మంచి నీరుగా పనికొస్తుందని తెలిపారు. రిజర్వాయర్లలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో ఈతలు కొట్టడానికి దిగవద్దని కలెక్టర్ సూచించారు.

కాగా.. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. అటు సీలేరు కాంప్లెక్స్‌లోని డొంక‌రాయి జ‌లాశ‌యంకు ఎగువ ప్రాంతం నుంచి అధిక‌సంఖ్య‌లో నీటినిల్వ‌లు వ‌స్తున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి డొంక‌రాయి జ‌లాశ‌యం నుంచి లక్ష 10వేలు క్యూసెక్కులు నీటిని దిగువ‌కు విడుద‌ల‌ చేశారు అధికారులు. డొంక‌రాయి జ‌ల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్ప‌త్తి అనంత‌రం ప‌వ‌ర్ కెనాల్ నుంచి 4వేల క్యూసెక్కులు నీటిని విడుద‌ల‌ చేశారు.డొంక‌రాయి జ‌లాశ‌యానికి లక్ష 10వేలు క్యూసెక్కులు నీటి నిల్వ‌లు ఇన్‌ఫ్లోగా వ‌స్తున్నాయి.

మరోవైపు రెండు రోజుల వర్షానికి ఏజెన్సీలో కొండ చరియలు విరిగిపడి ఆదివాసీల గృహాలు ధ్వంసమయ్యాయి. ఒక బాలిక వరదలో గల్లంతైంది. నలుగురు గిరిజనులకు గాయాలయ్యాయి. గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయితీ చట్రపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి కొండపై నుంచి కొండచరియలు జారిపడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గిరిజన గ్రామాల ప్రజలు మొర పెట్టుకుంటున్నారు.

మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయం.. ఎర్రబెల్లి హాట్ కామెంట్స్

మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్ చేశారు. జనగామ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై హై కోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలపై ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హై కోర్టు నాలుగు వారాలలో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.

నాలుగు వారాలలో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాల్సివస్తుందని హై కోర్టుక తెలిపిందన్నారు. మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేడు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్‌ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్‌ పూర్తి చేయాలన్న దానిపై షెడ్యూల్‌ విడుదలకు హైకోర్టు ఆదేశించింది.

నాలుగు వారాల్లో స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో షెడ్యూల్‌ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. పిటిషన్ల విచారణపై షెడ్యూల్‌ రిలీజ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, బీఆర్‌ఎస్ బీ-ఫారంపై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం వాదనలు ముగించింది. అయితే.. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది.