తెలంగాణ బీజేపీలో ముసలం..!
తెలంగాణలో బీజేపీకి బలం పెరిగిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆ పార్టీ దూసుకెళ్తోన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు సాధించడం.. ఆ తర్వాత నిజామాబాద్, కరీంగనర్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపింది. హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి సత్తా చాటింది. మునుగోడులో కూడా గట్టి పోటీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నకల్లో కూడా
ప్రభావం చూపింది.
బీజేపీ నుంచి ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టి 8 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కాషాయ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి. దీంతో భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆశతో ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో విభేదాలు తలెత్తుతున్నాయి. బీజేఎల్బీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర నేతల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ బీజేపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించింది. రెండు బృందాలుగా ఏర్పాటు చేసి పర్యటనలు చేయాలని భావించింది. ఒక బృందానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మరో బృందానికి మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. బీజేఎల్పీ నేతగా ఉన్న తనకు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పకపోవడంపై ఏలేటి అలకబూనినట్లు తెలుస్తోంది. బృందంలో ఏలేటి ఉన్నా.. అయన బాధితుల పరామర్శకు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది.
ఈటల బృందంలో తనను సభ్యుడిగా చేర్చడంపై మహేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఫ్లోర్ లీడర్‌గా అసెంబ్లీలో గళమెత్తే బాధ్యత ఏలేటిపై ఉండగా ఆయనకు నేతృత్వం ఇవ్వకపోవడం ఏంటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. దీంతో కిందస్థాయి నేతలు పార్టీలోని పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారు.
Sep 07 2024, 16:18