గుజరాత్‌లో కొనసాగుతున్న వర్ష బీభత్సం.. నాలుగు రోజుల్లో 28 మంది మృతి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సొంత రాష్ట్రం గుజరాత్‌లో వర్ష బీభత్సం (Gujarat Rains) కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సౌరాష్ట్ర ప్రాంతం మొత్తం అతలాకుతలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఐదో రోజైన గురువారం కూడా వర్షాలు కొనసాగనున్నాయి. ఇక గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు
మోర్బి, వడోదర, బరూచ్, జామ్‌నగర్, ఆరావలి, పంచమహల్, ద్వారకా, డాంగ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఆనంద్‌లో ఆరుగురు, అహ్మదాబాద్‌లో నలుగురు మరణించారు. గాంధీనగర్, ఖేడా, మహిసాగర్, దహోద్, సురేంద్రనగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 18 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, రైలు మార్గాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. వరద పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్ ద్వారా సంభాషించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎంని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరోవైపు దేవభూమి ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ సహా వరద ప్రభావిత జిల్లాల్లో భారత వైమానిక దళం, భారత తీరగస్తీ దళాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Aug 29 2024, 13:15