నిధులిస్తాం, కానీ - ఏపీకి కేంద్రం కొత్త మెలిక..!!
కేంద్రం తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా ఏపీకి సంబంధించిన అంశాల్లో సానుకూలంగా స్పందిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పోలవరం నూతన డీపీఆర్ కు ఆమోద ముద్ర లభించింది. ఇదే సమయంలో కేంద్రం కొన్ని షరతులు విధించింది. ప్రాజెక్టు నిర్మాణం పైనా నిర్దేశించింది. 2027 ప్రారంభానికి ఈ పనులన్నీ పూర్తిచేస్తేనే తదుపరి నిధులు ఇస్తామని కేంద్రం షరతు విధించినట్లు సమాచారం.
పోలవరం కొత్త డీపీఆర్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ 30,436.95 కోట్లను తొలి దశ నిర్మాణ పనులు పూ్తి చేసేందుకు డీపీఆర్ ఆమోదించగా రాష్ట్రానికి రూ 12,157 కోట్లు దక్కనున్నాయి. ఈ సమయంలో కొన్ని షరుతులు విధించింది. 2026 మార్చి నాటికి తొలి దశలో నీళ్లు నిలబెట్టేలా పూర్తి చేయాలని నిర్దేశించింది. 2027 ప్రారంభానికి పనులు పూర్తి చేస్తేనే తదుపరి నిధులు ఇస్తామని కేంద్రం షరతు విధించింది. తాజా డీపీఆర్ మేరకు రెండేళ్లల్లోనే నిధులు ఇచ్చేందుకు కేంద్రం సంసిద్దత వ్యక్తం చేసింది.
తాజా డీపీఆర్ తో 41.15 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు తొలిదశను 2027 మార్చినాటికే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్రం నిధులు కేటాయించటం నిరాశ, నిస్పృహలో ఉన్న రాష్ట్రానికి ఇదొక భరోసాగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ఫేజ్-1 కు 30వేల 437 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు రాష్ట్రం తరపున 4 వేల 730 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగిలిన నిధులు కేంద్రం ఇచ్చేలా నిర్ణయించామని అన్నారు.
కేంద్రం నుంచి 25 వేల 706 కోట్లు రావాల్సి ఉంటే, ఇప్పటికే 15 వేల 146 కోట్లు విడుదల చేశారని సీఎం వెల్లడించారు. భూ సేకరణ, మిగిలిన 12 వేల 127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో 194 టీఎంసీల నీరు నిలబెట్టాలంటే మరో రూ 25 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో నిర్వాసితుల భూసేకరణ, పునరావాసానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో, మరో డీపీఆర్ ఆమోదం పొందాలంటే 2027 ప్రారంభానికి పనులు పూర్తి చేయాలని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Aug 29 2024, 13:13