నిధులిస్తాం, కానీ - ఏపీకి కేంద్రం కొత్త మెలిక..!!

కేంద్రం తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా ఏపీకి సంబంధించిన అంశాల్లో సానుకూలంగా స్పందిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పోలవరం నూతన డీపీఆర్ కు ఆమోద ముద్ర లభించింది. ఇదే సమయంలో కేంద్రం కొన్ని షరతులు విధించింది. ప్రాజెక్టు నిర్మాణం పైనా నిర్దేశించింది. 2027 ప్రారంభానికి ఈ పనులన్నీ పూర్తిచేస్తేనే తదుపరి నిధులు ఇస్తామని కేంద్రం షరతు విధించినట్లు సమాచారం.

పోలవరం కొత్త డీపీఆర్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ 30,436.95 కోట్లను తొలి దశ నిర్మాణ పనులు పూ్తి చేసేందుకు డీపీఆర్ ఆమోదించగా రాష్ట్రానికి రూ 12,157 కోట్లు దక్కనున్నాయి. ఈ సమయంలో కొన్ని షరుతులు విధించింది. 2026 మార్చి నాటికి తొలి దశలో నీళ్లు నిలబెట్టేలా పూర్తి చేయాలని నిర్దేశించింది. 2027 ప్రారంభానికి పనులు పూర్తి చేస్తేనే తదుపరి నిధులు ఇస్తామని కేంద్రం షరతు విధించింది. తాజా డీపీఆర్ మేరకు రెండేళ్లల్లోనే నిధులు ఇచ్చేందుకు కేంద్రం సంసిద్దత వ్యక్తం చేసింది.

తాజా డీపీఆర్ తో 41.15 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు తొలిదశను 2027 మార్చినాటికే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్రం నిధులు కేటాయించటం నిరాశ, నిస్పృహలో ఉన్న రాష్ట్రానికి ఇదొక భరోసాగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ఫేజ్-1 కు 30వేల 437 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు రాష్ట్రం తరపున 4 వేల 730 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగిలిన నిధులు కేంద్రం ఇచ్చేలా నిర్ణయించామని అన్నారు.

కేంద్రం నుంచి 25 వేల 706 కోట్లు రావాల్సి ఉంటే, ఇప్పటికే 15 వేల 146 కోట్లు విడుదల చేశారని సీఎం వెల్లడించారు. భూ సేకరణ, మిగిలిన 12 వేల 127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో 194 టీఎంసీల నీరు నిలబెట్టాలంటే మరో రూ 25 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో నిర్వాసితుల భూసేకరణ, పునరావాసానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో, మరో డీపీఆర్ ఆమోదం పొందాలంటే 2027 ప్రారంభానికి పనులు పూర్తి చేయాలని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

హైడ్రా మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు!

ఎఫ్‌టీఎల్, బఫర్‌‌జోన్‌లో ఆక్రమల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుకు అక్రమార్కులు వెన్నులో వణుకుపుడుతోంది. ఎప్పుడు ఎవరి భవనం ముందు బుల్డోజర్లు వస్తాయోనని షేకవుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్ని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఉన్న నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చివేస్తామని ఆయన తేల్చిచెప్పారు. 30 ఏళ్ల కిందట నిర్మించిన కట్టడాలైనా ఆక్రమణల్లో ఉన్నాయని తేలితే చర్యలు తప్పవన్నారు.

రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు. మాదాపూర్‌ అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. అందుకు 30 రోజుల గడువు ఇచ్చారు

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌/ తహసీల్దార్‌.. దుర్గంచెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్‌ కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, కావూరి హిల్స్‌, అమర్‌ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేయగా... ఆ మేరకు పలు ఇళ్లకు వాటిని అంటించారు. వీరికి కూడా నెల రోజుల గడువు ఇచ్చి, ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించిన కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలోని ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించడం గమనార్హం.

బుధవారం ఒక్కరోజే దుర్గం చెరువు పరిసరాల్లోని నాలుగు కాలనీల్లోని వందల ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్సులకు వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద తాఖీదులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. దీంతో ఆ కాలనీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.వాస్తవానికి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి జీహెచ్‌ఎంసీ వేసిన హద్దురాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ చెరువు సగం భాగంలోకి నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకొచ్చాయి. పదేళ్ల కిందట ప్రాథమిక నోటిఫికేషన్‌ ద్వారా ఎఫ్‌టీఎల్‌ను గుర్తించినా.. ఎటువంటి రక్షణ కల్పించలేదు. తొలుత గుట్టలు ఉన్న ప్రాంతంలో వంద ఎకరాలకుపైగా విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ, సర్వే తర్వాత దాని విస్తీర్ణం 84 ఎకరాల్లోనే ఉందని నిర్దారించారు.

హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు ‘సీక్రెట్‌ లేక్‌’గా గుర్తింపు ఉంది. అయితే.. హైటెక్‌సిటీ నిర్మాణం తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో.. క్షేత్రస్థాయి సిబ్బంది వాటి జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది.కాగా, మొదటగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై దృష్టి సారించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిట్‌చాట్‌లో హైడ్రా కూల్చివేతలపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. చెరువులపై అక్రమ నిర్మాణాలను తొలగించిన తరువాత బఫర్‌జోన్లు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

విజయసాయిరెడ్డి కూడానా..?!: క్లారిటీ

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మున్ముందు మరిన్ని షాకులు తప్పేలా లేవు. ఎన్నికల ముందు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన నాయకులు.. ఫలితాల తరువాత వెనుదిరుగుతున్నారు. పార్టీని వీడుతున్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లోనే ఇద్దరు సీనియర్ నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పని చేసి, ఆ తరువాత వైఎస్ఆర్సీపీలో చేరిన రావెల్ కిశోర్ బాబు, శిద్ధా రాఘవరావు.. బయటికెళ్లిపోయారు. పార్టీకి రాజీనామా చేశారు.

ఇప్పుడు అదే జాబితాలో వైఎస్ఆర్సీపీకే చెందిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణతో పాటు మరో ఎంపీ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారని, నేడో, రేపో రాజీనామా చేయనున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మనుగడ కష్టమౌతుందని భావించిన సీనియర్ నాయకులు ఎక్కువ రోజులు ఇక్కడ కొనసాగకూడదనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీలో చేరొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు వాళ్లకు హామీలు సైతం ఇచ్చారని అంటున్నారు.

వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటూ వస్తోన్న ఆయన ఎక్కువ కాలం కొనసాగదలచుకోలేదని, ప్రత్యామ్నాయ దారులను వెదుక్కుంటోన్నారనే వార్తలు వస్తోన్నాయి.దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఆ వార్తలను తోసిపుచ్చారు. తాను ఎక్కడికీ వెళ్లట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీకి విధేయుడినని పునరుద్ఘాటించారు. అంకితభావం, నిబద్ధత కలిగిన కార్యకర్తనని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తానని తేల్చి చెప్పారు..

వైఎస్సార్సీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరుతున్నానంటూ మీడియాలోని ఒక వర్గం నిరాధారమైన, ఊహాజనిత ప్రచారం సాగిస్తోందని సాయిరెడ్డి అన్నారు. తప్పుడు సమాచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా చేస్తోన్న ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు విశ్వసించవద్దని కోరారు.మొన్నటి ఎన్నికల్లో విజయసాయిరెడ్డి.. నెల్లూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో 2.45 లక్షలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత కూడా ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉంటోన్నారు.

మళ్లీ పెరిగిన బంగారం ధర..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70 వేల మార్క్ దాటింది. 10 గ్రాముల ధర రూ.73,260కి చేరింది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్ మాదిరిగా బంగారం ధరలు ఉన్నాయి.

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్నిరోజులుగా బంగారం ధర తగ్గిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం రోజు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బంగారం ధరల వివరాలు తెలుసుకుందాం.. పదండి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70 వేల మార్క్ దాటింది. 10 గ్రాముల ధర రూ.73,260కి చేరింది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్ మాదిరిగా బంగారం ధరలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,310గా ఉంది. మేలిమి బంగారం ధర రూ. 73,410గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.73,260గా ఉంది.

వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, పుణెలో కిలో వెండి ధర రూ.88,400గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.

తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. హైదరాబాద్ ఆర్ఎస్ బ్రదర్స్ కళ్లు చెదిరే మొత్తంలో చెక్కులు

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ ప్రముఖ వ్యాపార సంస్థ భారీగా విరాళం అందించారు. టీటీడీకి ఏకంగా రూ.3.70 కోట్ల భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ సంస్థ ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాద రావు, మాలతి లక్ష్మీకుమారి ఈ విరాళపు చెక్కులను శ్రీవారి ఆలయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అంతకముందు దాతలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఈ భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.3.70 కోట్ల భారీ విరాళాన్ని.. ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. టీటీడీ ట్రస్టుల ద్వారా హిందూ ధర్మ పరిరక్షణ, విద్య, వైద్యానికి చేస్తున్న సేవలకు చేయూతగా విరాళాన్ని అందించినట్లు దాతలు తెలిపారు.

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో సెప్టెంబరు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగనున్నాయి. ⁠సెప్టెంబరు 6, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. సెప్టెంబరు 04న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు ద‌ర్వ‌నం ఇవ్వ‌నున్నారు. సెప్టెంబరు 13న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు పత్రోత్సవాలు.. సెప్టెంబరు 18న శ్రీ గోవింద రాజస్వామివారి గరుడ సేవ ఉంటుంది. సెప్టెంబరు 23న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 29, 30వ తేదీల్లో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇందులో భాగంగా ఆగస్టు 29వ తేదీన ఉదయం ఆచార్య రుత్విక్‌వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 30వ తేదీన ఉదయం మూలవర్లకు తిరుమంజనం, పవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా బుధవారం సాయంత్రం వేడుకగా ఉట్లోత్సవం జరిగింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీక ష్ణస్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి వారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ఊరేగింపు సందర్భంగా ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రమేష్, సూపరింటెండెంట్‌ శేషగిరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ గణేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

నాపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేదు.. కోర్టులో ఖేడ్కర్ వాదన

యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ పై డిస్మిస్డ్ ఐఏఏస్ అధికారి పూజా ఖేడ్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్‌సీకి లేదన్నారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదని హైకోర్టుకు విన్నవించారు.

యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ (UPSC)పై డిస్మిస్డ్ ఐఏఏస్ అధికారి పూజా ఖేడ్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్‌సీకి లేదన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాల సమర్పణ వ్యవహారంలో యూపీఎస్‌సీ ఇటీవల ఆమె అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేసింది. భవిష్యత్తులో సర్వీస్ ఎగ్జామ్స్ రాయకుండా డిబార్ చేసింది. క్రిమినల్ కేసు సైతం నమోదు చేసింది. ప్రస్తుతం ఆమె కేసు ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉంది. యూపీఎస్‌సీ చేసిన వాదనను కోర్టు విచారణలో పూజ తోసిపుచ్చారు. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం యూపీఎస్‌సీకి లేదని తెలిపారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదని కోర్టుకు విన్నవించారు.

కాగా, మాజీ ఐఏఎస్ ప్రొబేషర్ పూజా ఖేడ్కర్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను యూపీఎస్‌సీ వ్యతిరేకించింది. కమిషన్‌కు, పబ్లిక్‌కు వ్యతిరేకంగా ఆమె ఫ్రాడ్ చేశారని పేర్కొంది. ఇతరుల సహాయం లేకుండా ఇలాంటి అవకతవకలు జరిగి ఉండవని, ఈ ఫ్రాడ్ ఎంత లోతుగా జరిగిందని తెలుసుకోవాలంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని పేర్కొంది. ఆ కారణంగా ముందస్తు బెయిల్‌ అభ్యర్థనను తోసిపుచ్చాలని కోర్టును కోరింది. ఢిల్లీ పోలీసులు సైతం పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చాలని కోర్టును కోరారు. కేసులో మరింత లోతైన దర్యాప్తునకు ముందస్తు బెయిలు అవరోధమవుతుందని వాదించారు.

పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని జూలై 31న యూపీఎస్‌సీ రద్దు చేయగా, ఐపీసీ, ఇన్‌పర్ఫేషన్ టెక్నాలజీ యాక్ట్, రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చేంత వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఖేడ్కర్ కోరారు. దాంతో ఆగస్టు 29 వరకూ ఖేడ్కర్‌కు హైకోర్టు అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించింది.

సీనియర్‌ ఐఏఎస్‌కు సుప్రీంకోర్టు షోకాజ్‌ నోటీసులు..!

మహారాష్ట్ర అటవీ, రెవెన్యూశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ మిశ్రా, జస్టిస్‌ కేజీ విశ్వనాథ్‌ ధర్మాసనం ధిక్కార వ్యాఖ్యలు చేసినందుకు.. ఎందుకు ధిక్కార చర్యలు చేపట్టకూడదని ప్రశ్నించింది.

మహారాష్ట్ర అటవీ, రెవెన్యూశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ మిశ్రా, జస్టిస్‌ కేజీ విశ్వనాథ్‌ ధర్మాసనం ధిక్కార వ్యాఖ్యలు చేసినందుకు.. ఎందుకు ధిక్కార చర్యలు చేపట్టకూడదని ప్రశ్నించింది. సీనియర్ ఐఏఎస్‌ అధికారి ఆయిన ఆయనను సెప్టెంబర్‌ 9న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని బెంచ్‌ ఆదేశించింది.

పరిహారం చెల్లింపునకు సంబంధించిన కేసులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రం ఎగవేత వ్యూహాన్ని అవలంభిస్తోందని.. అదే సమయంలో పరిహారం తిరిగి లెక్కించే నిర్దిష్ట ప్రయోజనం విషయంల సమయం కోరినప్పుడు పూర్తి చేయాలని బెంచ్‌ పేర్కొంది.

పరిహారం విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదని అఫిడవిట్‌ ద్వారా తెలుస్తోందని పేర్కొంది.

దేశ ఆర్థిక వ్యవస్థపై ఎస్బీఐ అంచనా

దేశీయ మొదటి త్రైమాసికంలో(2024-25(ఏప్రిల్ - జూన్‌లో)) భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదిక తెలిపింది. తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ(GDP) వృద్ధిని అంచనా వేసింది.

దేశీయ మొదటి త్రైమాసికంలో(2024-25(ఏప్రిల్ - జూన్‌లో)) భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదిక తెలిపింది. తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ(GDP) వృద్ధిని అంచనా వేసింది. ఆర్‌బీఐ తన తాజా ద్రవ్య విధాన సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని 7.1 శాతంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. కాగా.. మొదటి త్రైమాసిక జీడీపీ డేటా ఈ శుక్రవారం విడుదల కానుంది.

ఎస్‌బీఐ రీసెర్చ్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ తాజా ఎకోవ్రాప్‌ నివేదిక ప్రకారం... ఎన్నికల కారణంగా ప్రభుత్వ వ్యయం, లాభాల మార్జిన్లు తగ్గడం, పెరుగుతున్న ప్రపంచ సరకు రవాణా, సెమీకండక్టర్‌ కొరత, కంటైనర్‌ ఖర్చులు సహా అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఉండటంతో ఆర్థిక వృద్ధి మందగిస్తోందని తెలిపింది. జులైలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 2024 భారత వృద్ధి 7 శాతం కంటే తక్కువగా 6.7 - 6.8 శాతానికి పెంచింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కీలక ఆర్థిక వ్యవస్థలలో మాంద్యం గురించి ఆందోళనలు సహా ప్రపంచ ఆర్థిక అనిశ్చితులను కూడా నివేదిక హైలైట్ చేసింది. అయితే జులై ఆరంభం నుంచి నైరుతి రుతుపవనాలు పుంజుకోవడంతో దేశానికి సానుకూల వృద్ధి ఉంటుందని తెలిపింది. వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసింది.

కులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. ప్రభుత్వం, ప్రజలు నిర్ణయాలు తీసుకోవటానికి పరిగణనలోకి తీసుకునే కీలకమైన అంశాల్లో జీడీపీ కూడా ఒకటి. జీడీపీ వృద్ధి చెందుతోందంటే ఆర్థిక కార్యకలాపాల విషయంలో దేశం బాగా పనిచేస్తోందని.

ప్రభుత్వ విధానాలు క్షేత్ర స్థాయిలో ఫలిస్తున్నాయని, అవి సరైన దిశలో పయనిస్తున్నాయని. జీడీపీ మందగించటం, తిరోగమనంలోకి వెళ్తోందంటే.. ఆర్థికవ్యవస్థ పునరుత్తేజం చెందటానికి తోడ్పడేలా ప్రభుత్వం తన విధానాలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుందని దాని అర్థం.

జన్వాడ.. ఓవైసీ.. మల్లారెడ్డిలకు రిలీఫ్.. హైడ్రా కమిషనర్ తాజా క్లారిటీ!

హాట్ టాపిక్ గా మారిన హైడ్రా ఏం చేస్తుంది? ఎవరిని టార్గెట్ చేస్తోంది. ఎవరి ఆస్తులపైకి బుల్డోజర్ ను పంపుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన విశ్లేషణను వారు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు ఆస్తులిప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అందులో ఒకటి మాజీ మంత్రి కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్.. ఓవైసీలకు చెందిన విద్యాసంస్థ.. మల్లారెడ్డి వర్సిటీకి చెందిన భూముల విషయంలో హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చగా మారింది.

ఇందుకుతగ్గట్లే.. మంగళవారం హైడ్రా.. ఇరిగేషన్.. రెవెన్యూ అధికారులు ఆయా చోట్ల పర్యటించటంతో వాతావరణం వేడెక్కింది. ఏ క్షణంలో అయినా హైడ్రా బుల్డోజర్ రంగంలోకి దిగటం ఖాయమని.. ఏ తెల్లవారుజామునో కూల్చివేతలు షురూ కానున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఇదేమీ ఉండదన్న విషయంపై హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇవ్వటం గమనార్హం. రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు.

ఓవైసీ.. మల్లారెడ్డి అన్నది తాము చూడటం లేదని.. విద్యార్థుల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తామన్న ఆయన.. చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చని.. ఎఫ్ టీఎల్ అన్నది ముఖ్యమే అయినప్పటికీ దాని కంటే విద్యార్థుల ఫ్యూచర్ మరింత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

ఓవైసీ.. మల్లారెడ్డి లాంటి వ్యక్తుల విద్యాసంస్థలకు టైం ఇస్తామని.. పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయన్న ఆయన.. ధర్మసత్రమైనా ఎఫ్ టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేస్తామన్నారు. ఈ సందర్భంగా మరో కీలక వ్యాఖ్య చేశారు. హైడ్రా నోటీసు ఇవ్వదని.. కూల్చటమే చేస్తుందన్నారు. నగరంలోని పలు చెరువులు.. పార్కుల ఆక్రమణలపై పలువురు బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ ను కలిసి కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. జన్వాడలోని కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ మీద చర్యల మాటేమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

దీనిపైనా క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ ను ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యటించటం.. అక్కడి వాస్తవ పరిస్థితుల్ని మదింపు చేసిన దరిమిలా.. చర్యల బుల్డోజర్ వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. ఫామ్ హౌస్ కాంపౌండ్ గేటు మినహా.. ఫామ్ హౌస్ ఎఫ్ టీఎల్ పరిధిలో లేకపోవటం.. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి రావటమే కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎఫ్ టీఎల్ ను ఆక్రమించుకున్న కట్టడాలు.. నిర్మాణాల మీదనే బుల్డోజర్ పంపాలని భావిస్తున్నారు. ట్రిఫుల్ వన్ జీవో పరిధిలోని నిర్మాణాల మీద హైడ్రా ఫోకస్ చేయట్లేదు. ఒకవేళ.. జన్వాడ ఫామ్ హౌస్ మీద చర్యల కత్తి ఝుళిపించినా.. మహా అయితే ప్రహరీగోడ తప్పించి.. ముందుకు వెళ్లే అవకాశం లేదంటున్నారు. మొత్తంగా జన్వాడ ఫామ్ హౌస్.. ఓవైసీ.. మల్లారెడ్డిల విద్యాసంస్థలు బుల్డోజర్ కూల్చివేతల నుంచి సేఫ్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాక్షిపై ప‌రువున‌ష్టం కేసులో క్రాస్ ఎగ్జామిన్‌కు హాజరుకానున్న లోకేష్

సాక్షిపై ప‌రువున‌ష్టం కేసులో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌‌ క్రాస్ ఎగ్జామినేష‌న్‌‌కు హాజరుకానున్నారు. ఈ నెల 29న విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి లోకేష్ హాజ‌రు కానున్నారు. ‘చిన‌బాబు చిరుతిండి..25 ల‌క్షలండి’ పేరుతో సాక్షిలో అస‌త్య క‌థ‌నంపై లోకేష్ న్యాయ‌ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సాక్షిపై వేసిన ప‌రువున‌ష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో 29న జ‌ర‌గ‌నున్న క్రాస్ ఎగ్జామినేష‌న్‌కి మంత్రి నారా లోకేష్ హాజ‌రు కానున్నారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే టైటిల్‌తో 2019లో సాక్షిప‌త్రిక‌లో అస‌త్యాలు, క‌ల్పితాల‌తో ఓ స్టోరీ ప్రచురితమైంది. దీనిని అవాస్తవాల‌తో ఉద్దేశ‌పూర్వకంగా త‌న‌ను డ్యామేజ్ చేయాల‌ని ఈ స్టోరీ వేశార‌ని నారా లోకేష్ అప్పట్లో పేర్కొన్నారు.

అయితే దీనిపై సాక్షి ఎటువంటి వివ‌ర‌ణ వేయ‌క‌పోవ‌డం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. తాను విశాఖ‌లో ఉన్నాన‌ని ప్రచురించిన తేదీల్లో.. తానసలు విశాఖలోనే లేనని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖ‌ర్చుని త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ప్రతిష్టని మంట‌గ‌లిపేందుకు ప్రయ‌త్నించార‌ని లోకేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు. వివిధ కార‌ణాల‌తో చాలా రోజులుగా వాయిదాలు ప‌డిన ఈ కేసు మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్‌తో మ‌ళ్లీ మొద‌లైంది.

వాస్తవానికి వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్‌ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. ఇది సర్వసాధారణం. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నారా లోకేష్ సైతం విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి టీ, కాఫీ, స్నాక్స్‌ కోసం ఏకంగా పాతిక లక్షల రూపాయలు టీ, కాఫీ, స్నాక్స్‌ కోసం ఖర్చు చేశారని ఒక నిరాధార కథనాన్ని సాక్షి ప్రచురించింది. దీనిపై అప్పట్లోనే నారా లోకేష్ మండిపడ్డారు.

నీతి లేని కథనాలను సాక్షి ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సాక్షి స్పందించాలేదు. దీంతో సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈనెల 29వతేదీన సాక్షి పత్రికపై దాఖలుచేసిన పరువునష్టం దావా కేసులో వాయిదాకు నారా లోకేష్ హాజరుకానున్నారు.