విజయసాయిరెడ్డి కూడానా..?!: క్లారిటీ
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మున్ముందు మరిన్ని షాకులు తప్పేలా లేవు. ఎన్నికల ముందు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన నాయకులు.. ఫలితాల తరువాత వెనుదిరుగుతున్నారు. పార్టీని వీడుతున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లోనే ఇద్దరు సీనియర్ నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పని చేసి, ఆ తరువాత వైఎస్ఆర్సీపీలో చేరిన రావెల్ కిశోర్ బాబు, శిద్ధా రాఘవరావు.. బయటికెళ్లిపోయారు. పార్టీకి రాజీనామా చేశారు.
ఇప్పుడు అదే జాబితాలో వైఎస్ఆర్సీపీకే చెందిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణతో పాటు మరో ఎంపీ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారని, నేడో, రేపో రాజీనామా చేయనున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మనుగడ కష్టమౌతుందని భావించిన సీనియర్ నాయకులు ఎక్కువ రోజులు ఇక్కడ కొనసాగకూడదనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీలో చేరొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు వాళ్లకు హామీలు సైతం ఇచ్చారని అంటున్నారు.
వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటూ వస్తోన్న ఆయన ఎక్కువ కాలం కొనసాగదలచుకోలేదని, ప్రత్యామ్నాయ దారులను వెదుక్కుంటోన్నారనే వార్తలు వస్తోన్నాయి.దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఆ వార్తలను తోసిపుచ్చారు. తాను ఎక్కడికీ వెళ్లట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీకి విధేయుడినని పునరుద్ఘాటించారు. అంకితభావం, నిబద్ధత కలిగిన కార్యకర్తనని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తానని తేల్చి చెప్పారు..
వైఎస్సార్సీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరుతున్నానంటూ మీడియాలోని ఒక వర్గం నిరాధారమైన, ఊహాజనిత ప్రచారం సాగిస్తోందని సాయిరెడ్డి అన్నారు. తప్పుడు సమాచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా చేస్తోన్న ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు విశ్వసించవద్దని కోరారు.మొన్నటి ఎన్నికల్లో విజయసాయిరెడ్డి.. నెల్లూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో 2.45 లక్షలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత కూడా ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉంటోన్నారు.
Aug 29 2024, 10:17